Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

వ్యక్తి స్వేచ్ఛపై ఉగ్రనేత్రం

ఉగ్రవాద విషవృక్షఛ్చాయ ఉపఖండమంతా దట్టంగా పరచుకొన్నా దాని ఉసురుతీసే నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ఆ మహమ్మారిపై ఒంటరిపోరు చేస్తున్న దేశం మనది. ఏనాడో ఇందిర జమానా నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టానికి అవసరానుగుణంగా తాలింపులు పెడుతూ పదిహేనేళ్లుగా ఇండియా ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తోంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు మన దర్యాప్తు సంస్థల్ని శక్తిమంతం చేయాల్సి ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించిన సవరణబిల్లు మొన్న బుధవారం లోక్‌సభామోదం పొందింది. ఉగ్ర కార్యకలాపాల్లో పాల్పంచుకొనే వ్యక్తుల్ని, యువజనాన్ని రెచ్చగొట్టి ఆ రొంపిలో దింపేవారిని, ఉగ్రవాదులకు సహాయపడుతూ నిధులందించేవారిని ఉగ్రవాదులుగా గుర్తించాలన్న చట్టసవరణపై తీవ్రాందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌, ఐరోపా దేశాలతోపాటు పాకిస్థాన్‌లోనూ ఆ తరహా అధికరణలున్నాయని అమిత్‌ షా నచ్చజెప్పచూసినా, మానవ హక్కుల హననం ముప్పును ప్రస్తావిస్తూ సామాజికంగానూ వ్యతిరేక గళాలు దీర్ఘశ్రుతిలో వినిపిస్తున్నాయి. యాసిన్‌ భత్కల్‌ను ఉగ్రవాదిగా ముందే ప్రకటించి ఉంటే, 12 ఉగ్రదాడుల నుంచి దేశాన్ని రక్షించగలిగి ఉండేవారమంటున్న అమిత్‌ షా- ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా ప్రకటించే ముందు సవిస్తృత ప్రక్రియను పాటిస్తామని భరోసా ఇస్తున్నారు. తాజా బిల్లును దుర్వినియోగం చేసే ప్రసక్తి లేదంటూనే, అర్బన్‌ మావోయిస్టులు(పట్టణాల్లోని మావోయిస్టు సానుభూతిపరులు) సహా దేశ భద్రత సార్వభౌమత్వాలకు భంగకరంగా వ్యవహరించే ఎవరినీ దర్యాప్తు సంస్థలు ఉపేక్షించబోవనీ హెచ్చరించారు. నిర్బంధం, బెయిలు నిబంధనల్లో ఏ మార్పులూ చేయనందున ఏ వ్యక్తి ప్రాథమిక హక్కులకూ భంగం వాటిల్లబోదని మంత్రివర్యులు చెబుతున్నా కొన్ని మౌలిక ప్రశ్నలు తలెత్తక మానవు. కోర్టు నిర్ధారిస్తేగాని ఏ నిందితుడూ అపరాధి కాని దేశంలో వ్యక్తులపై దర్యాప్తు దశలో ప్రభుత్వమే ఉగ్రవాద ముద్ర వేయడం బేసబబు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటమే మహాపరాధమై వ్యక్తిస్వేచ్ఛ నెత్తిన కత్తిలా కరకుచట్టం వేలాడుతుండటాన్ని జనస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు!

ఇండియాను మోకరిల్లజేయడం ఎవరివల్లా కాదన్న ఊక దంపుడు ఉద్ఘోషలతో కాంగ్రెస్‌ పార్టీయే ఒకటి కాదు రెండుసార్లు- ఉగ్రవాద నిర్మూలన చట్టాలకు చాప చుట్టేసింది. ఉగ్ర నరవ్యాఘ్రాల కోరలు పెరికేలా ‘టాడా’ సమర్థ వినియోగంపై దృష్టి సారించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ 1995లో దాన్ని మురిగిపోనిచ్చింది. దాని స్థానే ‘పోటా’కు వాజ్‌పేయీ సర్కారు ప్రాణప్రతిష్ఠ చేసినా, 2004లో దానికీ కాంగ్రెస్‌ పార్టీయే చెల్లుకొట్టింది. ఉగ్రవాదాన్ని ఊడ్చేయడానికి తెచ్చిన చట్టాలు అమాయకుల ఉసురుపోసుకొంటున్నాయంటూ 1967నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టంలో ఉగ్ర నిబంధనలు చేర్చడం ద్వారా- నేరుగా సాగాల్సిన యుద్ధాన్ని నీరుగార్చింది. 2004, 2008, 2012 సంవత్సరాల్లో ముమ్మార్లు యూపీఏ ప్రభుత్వమే ఉగ్రనిబంధనలకు సవరణలు చేసినా, మన్మోహన్‌ సింగ్‌ జమానా అంతా నెత్తుటి కుంపట్ల సంతగానే తెల్లారిపోయింది. కేంద్రంలో ఎన్‌డీఏ రాక దరిమిలా సీమాంతర ఉగ్రవాదాన్ని గట్టిగా కట్టడి చెయ్యగలిగినా, దేశీయంగా మావోయిస్టు హింస సగం మాత్రమే తగ్గుముఖం పట్టింది. 2009-’18 నడుమ 13,751 ఘటనల్లో భద్రతా సిబ్బంది సహా 4,647 మంది ప్రజలు కడతేరిపోయారంటున్న కేంద్రం- అర్బన్‌ మావోయిస్టులను ఏ మాత్రం ఉపేక్షించేది లేదంటోంది. ఆర్థిక తోడ్పాటునూ ఉగ్రవాద పరిధిలోకి చేర్చడంతో- బయట నుంచి ఎవరైనా డబ్బులు పంపితే, అవి ఉగ్ర కార్యక్రమాల కోసమేనని వారికి తెలిసే ఉంటుందన్న సందేహంతో దర్యాప్తు బృందాలు వేటాడే ప్రమాదాన్ని మానవ హక్కుల సంఘాలు శంకిస్తున్నాయి. ఏడేళ్ల శిక్ష విధించే స్థాయిలో చట్టానికి పెట్టిన పదును వ్యక్తిస్వేచ్ఛను బలిపీఠం మీదకు నెట్టేయనుందన్న ఆందోళన కలవరకారకమవుతోంది!

అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, జాతిభద్రతకు సంబంధించిన దర్యాప్తుల్లో కొత్తపుంతలు తొక్కడమే తన ‘విజన్‌’ అని పేర్కొన్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 2009లో ఆవిర్భవించింది. పోనుపోను ఉగ్ర కేసుల దర్యాప్తు బాధ్యతలు పెరుగుతున్నా ఎన్‌ఐఏలో 57మంది డీఎస్పీలకు గాను 29మంది, 106మంది ఇన్‌స్పెక్టర్లకు 90మందే ఉండటం నిర్ఘాంతపరుస్తోంది. డీఎస్పీలపై కేసుల భారం దృష్ట్యా ఇన్‌స్పెక్టర్లకూ శిక్షణ ఇచ్చి వారిచేత కేసుల దర్యాప్తు సాగింపజేస్తామని సర్కారు చెబుతోంది. ఉగ్రవాదంతో ముడివడి ఉన్న ఆస్తుల్ని స్వాధీనపరచుకోవాలంటే, దర్యాప్తు అధికారి ఆయా రాష్ట్రాల పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనుమతి పొందాల్సి ఉండేది. తాజా సవరణతో ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ అనుమతి సరిపోతుందనడం- సమాఖ్య స్ఫూర్తిని కదలబార్చేలా ఎన్‌ఐఏ పరిధిని విస్తరించినట్లవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! కరకు నిబంధనలు కూర్చిన ఏ చట్టమైనా మానవ హక్కులను కర్కశంగా తొక్కిపట్టిన దృష్టాంతాలెన్నో పోగుపడిన దేశం మనది. ‘ఎప్పుడు ఏ పౌరుడి స్వాభిమానం గాయపడినా, నాగరికత వెనకడుగు వేసినట్లే... అలాంటి ప్రతి సందర్భంలోనూ మానవతా పతాకాన్ని అవనతం చెయ్యాల్సిందే’నని రెండు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం వంటివి ఎంతగా దుర్వినియోగం అవుతున్నదీ నడుస్తున్న చరిత్రే! ఉగ్రవాద మూలాలపై వేటు పడాలన్న దాంట్లో మరోమాట లేకపోయినా, తాజా నిబంధనలు దుర్వినియోగమైతే భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన మౌలిక హక్కులపై గునపం పోటు పడ్డట్లే! ఆ దుస్థితిని, నిబంధనల దుర్వినియోగాన్నీ అరికట్టే పటిష్ఠ యంత్రాంగానికీ చట్టంలో చోటుపెట్టడం నేటి అవసరం!


Posted on 27-07-2019