Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అడుగడుగునా క్రియాశీల దార్శనికత

* ప్రధాని మోదీ యాభై రోజుల పాలన

అభివృద్ధి పథంలో భారత్‌ను కొత్త మలుపు తిప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం విలక్షణ చర్యలతో పురోగమిస్తోంది. యాభై రోజుల మోదీ పాలన తీరును విశ్లేషిస్తే, జాతి నిర్మాణ క్రతువులో ఎన్డీయే-2 సర్కారు కనబరచిన తిరుగులేని చొరవ ప్రస్ఫుటమవుతుంది. పురోభివృద్ధి సాధనలో దేశాన్ని మరో మెట్టు ఎక్కించగల ప్రభుత్వ దార్శనికత తేటపడుతుంది. యాభై రోజుల వ్యవధిలోనే అనేక అంశాలపై వేగంగా స్పందించి వందలాది నిర్ణయాలు వెల్లడించిన ఘనత ఈ సర్కారుకు దక్కుతుంది. ‘కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన’ సూత్రానికి అడుగడుగున కట్టుబాటు చాటుతూ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మోదీ ప్రభుత్వం 2022, 2024 సంవత్సరాలను కీలకమైన మైలురాళ్లుగా నిర్దేశించుకొంది. భారత్‌ స్వాతంత్య్రం సాధించి 2022నాటికి 75 ఏళ్లు నిండుతాయి. 2024 అన్నది సార్వత్రిక ఎన్నికల్లో ప్రజావళి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన అయిదేళ్ల గడువు ముగిసే ఏడాది. భారతావని పురోభివృద్ధిలో అన్ని వర్గాలకూ సమధిక భాగస్వామ్యం కల్పించాలని, ఆ క్రమంలో వెల్లివిరిసే అవకాశాలను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. దేశంలోని పేదలు, రైతులు, కార్మికుల ఉద్ధరణ; యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ ద్వారా సామాజిక భద్రతకు అమిత ప్రాధాన్యమివ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. శాంతి భద్రతలను సవ్యపథంలో నడిపి; మధ్యతరగతి ప్రజలు, వ్యాపారుల జీవన స్థితిగతులను నాణ్యంగా తీర్చిదిద్ది- దేశాన్ని అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మోదీ ప్రభుత్వ సమున్నతాశయం యాభై రోజుల పాలన ప్రతి చర్యలోనూ ప్రతిఫలించింది.

రైతు అనుకూల విధానాలు
రైతు సంక్షేమమే తొలి ప్రాథమ్యంగా ఈ సర్కారు ముందుకు సాగుతోంది. అందుకే ఏటా ‘ఇన్‌పుట్‌ సబ్సిడీ’ కింద ఆరు వేల రూపాయలు మంజూరు చేసే ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ యోజన పరిధిలోకి 14 కోట్ల రైతులను తీసుకువచ్చారు. రైతులందరినీ పింఛను పథకం లబ్ధిదారులుగా తీర్మానించారు. ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర అందించాలన్నది నలభై ఏళ్లుగా రైతుల డిమాండ్‌. ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50శాతం జోడించి రైతులకు చెల్లించాలని స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు చేసింది. గడచిన రెండేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం ఈ విధానాన్ని సవ్యంగా పట్టాలకు ఎక్కించింది. 24 పంటల విషయంలో ఉత్పత్తి ఖర్చుకు అదనంగా యాభైశాతం మొత్తం రైతులకు గిట్టుబాటయ్యే విధంగా చర్యలు చేపట్టింది. ఖర్చుకు తగిన ఉత్పత్తిని సాధించే క్రమంలో అన్నదాతలకు తోడ్పాటుగా దేశవ్యాప్తంగా వచ్చే అయిదేళ్లలో పదివేల నూతన రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మత్స్యరంగ విస్తరణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర చర్యలతో 2022నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్నదే మోదీ సర్కారు లక్ష్యం. మరోవంక వచ్చే అయిదేళ్ల కాలావధిలో ఇంటింటికీ మంచినీటిని అందించాలన్నది ప్రధాని సంకల్పం. ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, పెద్దయెత్తున అవసరపడే పెట్టుబడుల సమీకరణకోసం ప్రత్యేకంగా జల్‌ శక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థలు రూపొందిస్తున్నారు.

అసంఘటిత రంగంలోని 40 కోట్లమంది కార్మికుల బాగోగులను దృష్టిలో పెట్టుకొని వందలాది కార్మిక చట్టాలను స్థూలంగా నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. సహేతుక వేతనాలు, సామాజిక భద్రతకు సంబంధించి కార్మిక వర్గానికి భరోసా ఇవ్వడమే ఈ సంస్కరణల ముఖ్యోద్దేశం. ప్రతి కార్మికుడికి నియామక ధ్రువపత్రంతోపాటు నిర్దిష్ట కాలావధిలో వేతనాలు అందాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఆ క్రమంలోనే ‘ఈఎస్‌ఐ’ విధానంలో సంస్కరణలు తీసుకువచ్చారు. చిన్నపాటి దుకాణాలు నిర్వహించేవారికి, వ్యాపారులను సైతం పింఛను పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అయిదు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న మధ్యతరగతి వర్గానికి అనామతు బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపులు ప్రకటించడం మరో కీలక చర్య. గృహ నిర్మాణ రంగ కార్యకలాపాలపై జీఎస్‌టీని తగ్గించడం, గృహ రుణాలపై వడ్డీకి కోతపెట్టడం వంటివి అత్యధికుల్లో హర్షామోదం నింపిన చర్యలు. భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పెద్దయెత్తున పెట్టుబడులు అవసరం. యాభై రోజుల మోదీ ప్రభుత్వ పాలన కాలంలో దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చెప్పుకోదగ్గ నిర్ణయాలు తీసుకున్నారు. దివాళా స్మృతిని పునర్‌నిర్వచించడం, 70 వేలకోట్ల రూపాయల పునరుద్ధరణ వ్యయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త ఊపిరులూదడం, మోయలేని భారంగా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత ద్వారా పెట్టుబడుల సహేతుక ఉపసంహరణకు తెరచాపలెత్తడం వంటివి దేశ వాణిజ్యానికి కొత్త ఊపునిచ్చే చర్యలు. దేశ రహదారులు, రైల్వే, నౌకా, విమాన, పారిశ్రామిక, సరకు రవాణా, జల్‌ మార్గ్‌ వికాస్‌, ఉడాన్‌, పీఎమ్‌జీఎస్‌వై-3 వంటి రంగాల్లో మరో అయిదేళ్లలో వంద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ‘బిమ్స్‌టెక్‌’ దేశాల నాయకులందరూ హాజరయ్యారు. ప్రభావాన్వితమైన జీ-20కి కొత్త దృక్పథాన్ని రచించడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. మాల్దీవులు, శ్రీలంకల్లో ఆయన పర్యటనలు ఆ దేశాలతో భారత్‌ బంధాన్ని సుదృఢంగా మార్చాయి. చంద్రయాన్‌-2 విజయవంతం కావడం- 2022లో ‘గగన్‌యాన్‌’ ప్రణాళికలు జోరందుకోవడం వంటివి రోదసి కార్యకలాపాల్లో భారత్‌ను ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన దేశంగా నిలుపుతున్నాయి. ఉగ్రవాదం, అవినీతిపై ఈ ప్రభుత్వం రాజీలేని పోరు కొనసాగిస్తోంది.

వృథా చట్టాలపై వేటు
జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదులకు అందుతున్న నిధుల ప్రవాహాన్ని మోదీ సర్కారు సమర్థంగా నిరోధించింది. అవినీతి ఆరోపణల కారణంగా దేశవ్యాప్తంగా 27మంది సీనియర్‌ అధికారులను శాశ్వతంగా ఉద్యోగాలనుంచి తొలగించారు. దాంతోపాటు వారి బినామీ ఆస్తులపై తీవ్ర చర్యలకు ఉపక్రమించారు. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు వంద రూపాయల మేర కోసుకుపోవడం మధ్యతరగతి వర్గానికి ఊరట కలిగించే పరిణామం. వినియోగదారుల హక్కుల బిల్లు ఆమోదానికి రంగం సిద్ధమైంది. సౌర ఇంధన అవసరాలు నెరవేర్చే క్రమంలో సంఘటిత కృషి ప్రాధాన్యం గుర్తించిన భారత ప్రభుత్వం 122 దేశాలతో ఏర్పాటు చేసిన సౌర కూటమి భేషుగ్గా పనిచేస్తోంది. కాలంచెల్లిన 58 చట్టాలను రద్దు చేశారు. తద్వారా రద్దయిన అక్కరకు రాని చట్టాల సంఖ్య వెయ్యి దాటింది. ఆ రకంగా మోదీ యాభై రోజుల పాలన ప్రభుత్వ క్రియాశీలతను, దార్శనికతను కళ్లకు కట్టిందన్నది వాస్తవం!


Posted on 27-07-2019