Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మేలిమి చట్టాలకు మేలు బాటలు

నూట ముప్ఫై అయిదు కోట్ల జనావళి భవిష్యత్తును నిర్దేశించే విధాన రచన వేదికగా భారత పార్లమెంటు ప్రాశస్త్యం ఎనలేనిది. వచ్చే అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియాను తీర్చిదిద్దేలా వడివడిగా సంస్కరణలు, వాటికి నిర్దిష్ట శాసనాల దన్నుతోపాటు అవి నిర్దుష్టంగా రూపొందేలా ముందస్తు సమీక్షలు ఉండితీరాలి. మోదీ సారథ్యంలో రెండో సారీ విజయ ఢంకా మోగించిన ఎన్డీయే సర్కారు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్ని ఆగస్టు ఏడో తేదీ దాకా పొడిగించింది. శాసన నిర్మాణ క్రతువును సత్వరం పూర్తి చెయ్యాలన్న లక్ష్యంతో పదిహేడో లోక్‌సభ తొలి భేటీలోనే కేంద్ర సర్కారు ఎకాయెకి 30 బిల్లుల్ని ప్రతిపాదిస్తోంది. అందులో 20 బిల్లులు ఇప్పటికే దిగువ సభ ఆమోదం పొందగా, ఉభయ సభల సమ్మతి చూరగొన్నవి 15 ఉన్నాయి. సాధారణంగా కొత్తగా కొలువుతీరే ఏ లోక్‌సభ తొలి భేటీ అయినా పక్షం రోజుల లోపే నిర్వహించడం, ఏడెనిమిది బిల్లుల్ని ప్రతిపాదించడం పరిపాటి అంటున్న విపక్ష శిబిరం- స్థాయీసంఘాల పరిశీలన లేకుండానే టోకున ఇలా బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవడం తగదని ఎలుగెత్తుతోంది! ఆయా మంత్రిత్వశాఖల బడ్జెట్‌ కేటాయింపుల్ని పార్లమెంటరీ స్థాయీసంఘాలు పరిశీలించాలని 272 నిబంధన చాటుతోంది. ఆ నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసే తీర్మానాన్ని రెండు వారాల నాడు రాజ్యసభ ఆమోదించింది. స్థాయీసంఘాల్ని శాశ్వతంగా తోసిరాజనడం సర్కారు అభిమతం కానేకాదని మంత్రివర్యులు అప్పుడే సెలవిచ్చినా- వాటిని ఇంకా కొలువు తీర్చకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్నది అదే. పద్నాలుగో లోక్‌సభలో 60శాతం బిల్లులు స్థాయీసంఘాల పరిశీలనకు నోచుకోగా, 15వ లోక్‌సభలో ఆ సంఖ్య 71శాతానికి చేరింది. గత లోక్‌సభలో కేవలం 26శాతం బిల్లులే స్థాయీసంఘాల సమీక్షకు వెళ్ళడం, ఈసారీ అదే తీరు కొనసాగే చిన్నెలు పొడగట్టడం విపక్షాల ఆందోళనకు ప్రధాన కారణం అవుతోంది. ‘సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌’ అంటున్న మోదీ ప్రభుత్వం జాతి వికాసంతో ముడివడిన శాసనాల నిర్మాణంలో స్థాయీసంఘాలను విశ్వాసంలోకి తీసుకోవడం- మేలిమి చట్టాలకు మేలు బాటలు పరుస్తుంది!

ఏనాడో బ్రిటిష్‌ జమానాలో 1922లోనే రెవిన్యూ, హోం, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య విభాగాలకు సంబంధించి నాలుగు స్టాండింగ్‌ కమిటీలను కేంద్ర చట్టసభ ఏర్పాటు చేసింది. వాటి పాత్ర పోషణ అసంతృప్తికరంగా ఉందని, నేరుగా కేంద్ర ప్రభుత్వమే లోక్‌సభకు జవాబుదారీగా ఉన్నప్పుడు కమిటీల యంత్రాంగాన్ని కొనసాగించడంలో ఔచిత్యం లేదంటూ తొలి ప్రధాని నెహ్రూ వాటికి మంగళం పాడారు. కాలక్రమంలో పార్లమెంటులో చర్చల స్థానాన్ని రాజకీయ రచ్చలు ఆక్రమించి, లక్షల కోట్ల రూపాయల వ్యయ పద్దులకూ ‘గిలిటెన్‌’ ప్రారబ్ధం దాపురిస్తున్న నేపథ్యంలో 1985లోనే అఖిల భారత సభాపతుల సదస్సు స్థాయీసంఘాల ఏర్పాటుకు ఓటేసింది. పిమ్మట ఎనిమిదేళ్లకు లోక్‌సభాపతిగా శివరాజ్‌ పాటిల్‌ చూపిన చొరవతో తిరిగి ప్రాణం పోసుకొన్న స్థాయీసంఘాలు- ‘మినీ పార్లమెంటు’గా నిర్వహించే పాత్ర బృహత్తరమైనది. ఆయా మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఏర్పాటయ్యే 24 స్థాయీసంఘాలు, ఒక్కొక్క దాంట్లో ఉభయ సభలకు చెందిన 31 మందితో విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తుంటాయి. వసేప, దివాలా స్మృతి, వినియోగదారుల పరిరక్షణ, మోటారు వాహనాల సవరణ చట్టం వంటివన్నీ గత లోక్‌సభ కాలంలో స్థాయీసంఘాల సంప్రతింపుల్లో నలిగి పటిష్ఠంగా రూపొందినవే. పార్లమెంటులో ఆవేశోద్రేక ప్రదర్శనలకు అతీతంగా పాలక ప్రతిపక్ష సభ్యులు ఆయా బిల్లుల గుణదోషాలపై హేతుబద్ధంగా తర్కించి ఇచ్చే సూచనలు, పటిష్ఠ చట్టాల రూపకల్పనకు ఎంతగానో దోహదపడేవే. అలాంటి సంఘాల్ని ముందరి కాళ్లకు బందాలుగా ప్రభుత్వం భావించడం సరికాదు. ఆయా సంఘాల సభ్యుల అవగాహన స్థాయి పెంచే చొరవ చూపితే అది దేశ ప్రజాస్వామ్యానికీ ఎంతో మేలు!

కార్యనిర్వాహక వర్గాన్ని సూటిగా జవాబుదారీ చేసేందుకు పార్లమెంటు చేతిలో పటుతర సాధనంగా స్థాయీసంఘాలు నిర్వహించే భూమిక విశిష్టమైనది. అమెరికా బ్రిటన్లు సహా పటిష్ఠ ప్రజాస్వామ్యం ఉన్న దేశాలన్నింటా స్థాయీసంఘాలు నిర్వహిస్తున్న పాత్రను ప్రత్యక్ష వీక్షణ ద్వారా పౌరులు బేరీజు వేసే అవకాశం ఉంది. కొన్నేళ్ల క్రితం మీడియా పెద్ద రూపర్డ్‌ మర్డోక్‌ను ఆయన కొడుకును బ్రిటిష్‌ పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించడం, అమెరికాలో ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామి సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం సంచలనం సృష్టించాయి. దేశీయంగా ఆర్‌బీఐ గవర్నర్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్థాయీసంఘం ఎదుట హాజరైన సందర్భాలూ ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం అంటేనే- శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండటం. గత లోక్‌సభా కాలంలో 133 బిల్లులు ఆమోదం పొందినా వాటిలో మూడోవంతే మూడు గంటలకుపైగా చర్చకు నోచుకోవడం, ఏకంగా 46 బిల్లులు మురిగిపోవడం- దిగ్భ్రాంతకరం. ఒక్కోసారి బిల్లుల్ని అడ్డుకోవడానికే స్థాయీసంఘాలు అక్కరకొస్తున్నాయన్న విమర్శల్నీ తోసిపుచ్చే వీల్లేదు. ఆ ప్రమాదాన్ని శంకించి వాటి అస్తిత్వాన్నే గుర్తించ నిరాకరించడం శాసన నిర్మాణ మహా క్రతువుకు ఏ మాత్రం శోభస్కరం కాదు. మాన్య సభ్యుల్లో విషయ పరిజ్ఞానం పెంచే ఏర్పాట్లతోపాటు, స్థాయీసంఘాల పరిశీలనకు నిర్దిష్ట కాలావధి నిర్ధారణ అవకాశాన్నీ పరిశీలించవచ్చు. స్థాయీసంఘాల ఏర్పాటులో జాప్య నివారణా ఎంతో కీలకం. స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా జన సంక్షేమం కోసం నిష్పక్షపాతంగా కలిసి పని చేద్దామన్న ప్రధాని మోదీ ఆడిన మాటకు కట్టుబడితే- ఇలాంటి వివాదాలు దూదిపింజలై తేలిపోవడం ఖాయం!Posted on 30-07-2019