Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

తలాక్‌ భూస్థాపితం

దేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతంగా ఉన్న ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ బిల్లు పెద్దల సభ అవరోధాన్నీ అధిగమించి చట్టరూపం దాల్చనుండటం చరిత్రాత్మకం. మధ్యయుగాలనాటి అనాగరిక దురాచారంగా భ్రష్టుపట్టిన ముమ్మారు తలాక్‌ ఎట్టకేలకు చరిత్ర చెత్తబుట్ట పాలుకావడం- అందుకోసమే నిరీక్షిస్తున్న స్త్రీమూర్తులందరికీ అమందానందదాయకం. ముమ్మారు తలాక్‌ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమంటూ ‘సుప్రీం’ రాజ్యాంగ ధర్మాసనంలోని మెజారిటీ తీర్పు 2017 ఆగస్టులో స్పష్టీకరించగా, తలాక్‌పై తగు చట్ట రూపకల్పనకు సమకట్టాలంటూ రాజ్యాంగంలోని 142 అధికరణ కింద కేంద్ర సర్కారును మైనారిటీ తీర్పు నిర్దేశించింది. ఆ మేరకు మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన బిల్లు అదే సంవత్సరం డిసెంబరులోనే లోక్‌సభలో నెగ్గినా, రాజ్యసభలో ఎన్‌డీఏకు మెజారిటీ లేక అది కాస్తా మురిగిపోయింది. ఈలోగా తలాక్‌ నిషేధంపై అత్యవసరాదేశం జారీ చేసిన మోదీ ప్రభుత్వం- కొత్తగా కొలువుతీరిన 17వ లోక్‌సభలో తొలి బిల్లుగా దాన్ని ప్రవేశపెట్టింది. 2017 జనవరి నుంచి మొన్న జులై 24 దాకా 574 తలాక్‌ దురాగతాలు నమోదు అయ్యాయని, ‘సుప్రీం’ తీర్పు తరవాతే 345 కేసులు వచ్చాయని, వాటిలో అత్యవసరాదేశం జారీ చేశాక వెలుగు చూసినవే 101 ఉన్నాయంటున్న కేంద్రమంత్రి- దెబ్బకు దెయ్యం వదలాలంటే తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా ప్రకటించాల్సిందేనని గట్టిగా వాదించారు. తలాక్‌ అనాచారాన్ని నేరంగా ప్రకటించడంపై విపక్ష శిబిరం అభ్యంతరాల నేపథ్యంలో- బాధిత మహిళతో సంప్రతించాక బెయిల్‌ మంజూరు, భార్యాభర్తలు రాజీకి వస్తే కేసును మూసెయ్యడం వంటి సవరణల్ని కేంద్రం తెచ్చినా- ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. నెల లేదా పక్షం రోజుల గడువుతో బిల్లును సంయుక్త ఎంపిక కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్‌ కోరినా కాదన్న మోదీ సర్కారు- 41మంది సభ్యుల గైర్హాజరైన రాజ్యసభలో కీలక బిల్లును నెగ్గించగలిగింది. దురాచారాన్ని సమాధి చెయ్యడం సరే- దానికి బలైపోతున్న అభాగ్యులకు చట్టబద్ధ ఆసరా ఏదీ?

ఒక హిందూ వారసత్వ వ్యాజ్యం విచారణ సందర్భంగా- ‘విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు దుర్విచక్షణను ఎదుర్కొంటున్నారా’ అన్న అంశాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం ఏర్పాటు కావాలని 2015 అక్టోబరులో ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. అలా ఏర్పాటైన ధర్మాసనం ఎదుట- ‘ప్రాచీన కాలంలో అరేబియా ప్రాంతంలో ఆడశిశువుల్ని సజీవంగా పాతిపెట్టే అనాచారానికి నకలుగా ముమ్మారు తలాక్‌ (తలాకే-బిద్దత్‌) కొనసాగుతోంది’ అంటూ అఖిల భారత ముస్లిం మహిళా పర్సనల్‌ లా బోర్డు పక్షాన ఇస్లామిక్‌ మేధావి ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వినిపించిన వాదన దిగ్భ్రాంతపరచింది. పొరుగున పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా ముస్లిం దేశాలు తలాక్‌ దురాచారానికి పాతర వేశాయన్న వాస్తవాల వెలుగులో- 33 ఏళ్ల క్రితం షాబానో కేసులో సాగిన వికృత రాజకీయం ఇక్కడి రాజ్యవ్యవస్థ దివాలాకోరుతనానికే దర్పణం పట్టింది. తలాక్‌ బాధితురాలి మనోవర్తికి భరోసా ఇచ్చేలా ఉన్న నాటి సుప్రీం తీర్పును తోసిరాజనడానికి రాజీవ్‌ ప్రభుత్వం తెచ్చిన బిల్లు, ముస్లిం మహిళల మౌలిక హక్కుల్నే తొక్కిపట్టింది. తలాక్‌తో జీవనాధారం కోల్పోయిన మహిళకు కోర్టుకెక్కే హక్కు ఉన్నప్పటికీ, అందుకు తనను కాదన్నవాడి అనుమతి ఉండాలన్న నాటి చట్టం బాధితుల పట్ల క్రూరపరిహాసంగా ఛీ కొట్టించుకొంది. నాటి మనోవర్తి చట్టం మేరకైనా తనకు జీవన భృతి దక్కించాలంటూ దాఖలైన షమీమ్‌ అరా కేసులో 2002 అక్టోబరులోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు- అడ్డగోలు తలాక్‌ను రద్దుచేసేసింది. దరిమిలా షయారా బానో సహా పలువురు బాధితుల వ్యాజ్యాల్లో- లింగ సమానత్వం, లౌకిక వాదమే ప్రాతిపదికగా తలాక్‌ దురాచారంపై న్యాయనిర్ణయం సాగాలంటూ మోదీ సర్కారు సమర్పించిన ప్రమాణపత్రం రెండేళ్లనాడు చారిత్రక తీర్పునకు బాటలు పరచింది. నాటి సుప్రీం తీర్పు తలాక్‌ చెల్లబోదన్నదే గాని, నేరమని నిర్ధారించలేదంటున్నవారి వాదన- తాజా బిల్లులో మోదీ ప్రభుత్వ ధోరణిని వేలెత్తి చూపుతోంది!

గణతంత్ర భారతావనికి డెబ్భయ్యోపడి ఇది. రాజ్యాంగ అవతారికలోనే పేర్కొన్న సమన్యాయ, సమధర్మ సూత్రాలకు గొడుగుపట్టే ఘనతర సంస్కరణగా తలాక్‌కు తలాక్‌ చెప్పే బిల్లును ప్రభుత్వం శ్లాఘిస్తున్నా కొన్ని ధర్మసందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముమ్మారు తలాక్‌ చెల్లదని స్పష్టీకరిస్తున్న చట్టం మేరకు వారి దాంపత్యం కొనసాగుతున్నట్లే; ఓ వంక వివాహబంధం కొనసాగుతుందంటున్న చట్టమే, తప్పు చేశాడంటూ భర్తకు జైలుశిక్ష ప్రతిపాదించడం అసంబద్ధం కాదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోపక్క గృహ హింస చట్టం వంటివి అందుబాటులో ఉన్నప్పుడు నేరన్యాయ వ్యవస్థలో మతపర కోణానికి చోటుపెట్టేలా మరో శాసనం ఎందుకన్న సందేహమూ దూసుకొస్తోంది. ‘బాల్య వివాహం, సతీసహగమనం వంటివాటిని నిషేధించినప్పుడు ముమ్మారు తలాక్‌పై వేటు ఎందుకు పడరా’దన్న ఇష్రత్‌ జహాన్‌ వంటి బాధితుల గుండె గోడు- క్షేత్రస్థాయి వేదనలకు ప్రతిరూపం. తలాక్‌ నేరమంటున్న చట్టం- మూడేళ్లపాటు పెనిమిటిని జైలుకు పంపి, భార్యాబిడ్డల పోషణపై మూగనోము పట్టడం ఏమిటని సమీనా బేగం అనే మరో బాధితురాలు వేస్తున్న ప్రశ్నకు ఏదీ సమాధానం? సామాజిక స్థితిగతుల్లో ఎంతో వెనకబాటుతనంలో మగ్గుతున్న ముస్లిం మహిళల్ని ఛాందసవాద పురుషాధిక్య అరాచక పోకడలనుంచి రక్షించాలన్న మహా సంకల్పానికి జతపడి వారి జీవన పరిస్థితుల బాగుసేత మీదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాలి. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన ఉమ్మడి పౌరస్మృతి ఆదర్శం సాకారమయ్యేలా ‘సబ్‌ కా విశ్వాస్‌’ సాధించి ‘సబ్‌ కా వికాస్‌’కు మేలుబాటలు పరవాలి!Posted on 01-08-2019