Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జలవివాదాలకిక చెల్లుచీటీ?

* అంతర్రాష్ట్ర నదీజలాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం
* సత్వర పరిష్కారాలకు ఏకైక ట్రైబ్యునల్‌
* స్వతంత్రంగా వ్యవహరిస్తేనే లక్ష్యసిద్ధి

అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి ఒకే ఒక్క ట్రైబ్యునల్‌ ఉండేందుకు కేంద్రప్రభుత్వం వారం క్రితం ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ నిన్న ఆమోదించింది. సంబంధిత రాష్ట్రాలను సంప్రతించకుండానే బిల్లును తీసుకొచ్చారంటూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తీకరించాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రతిస్పందిస్తూ, 2013లో అన్ని రాష్ట్రాలను అప్పటి కేంద్రప్రభుత్వం సంప్రతించిందని, ఆ మేరకు 2017లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. అప్పట్లో బిల్లును స్థాయీసంఘానికి పంపినా, లోక్‌సభ గడువు ముగిసిపోవడంతో ముసాయిదా బిల్లుకు కాలదోషం పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టమైతే, అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారానికి వివిధ ధర్మాసనాలతో కూడిన ఏకైక ట్రైబ్యునల్‌ ఏర్పాటవుతుంది. ఆయా ధర్మాసనాలు పరిమిత కాలంలోపు కచ్చితంగా సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ ట్రైబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు.

రాష్ట్రాలకు ఉపశమనం
దేశంలో రాష్ట్రాల మధ్య తలెత్తే నదీజల వివాదాలను గతంలో మాదిరిగా దశాబ్దాల తరబడి కొనసాగనివ్వరాదని, వివాదం ట్రైబ్యునల్‌ వద్దకు వెళ్ళిన తరవాత గరిష్ఠంగా నాలుగున్నర ఏళ్లలోపే వాటిని పరిష్కరించాలన్నది ప్రతిపాదిత బిల్లు లక్ష్యమని చెబుతున్నారు. ఒకసారి ట్రైబ్యునల్‌ తీర్పును వెలువరిస్తే సంబంధిత రాష్ట్రాలన్నీ తప్పనిసరిగా దాన్ని శిరసా వహించాల్సి వస్తుంది. ఇప్పటిలాగా తీర్పును అధికారిక రాజపత్రంలో ప్రచురించాల్సిన అవసరం ఉండదు. బిల్లు అమలులోకి వచ్చిన నాటినుంచి ప్రస్తుతం పనిచేస్తున్న ట్రైబ్యునళ్లన్నీ రద్దవుతాయి. వాటిముందున్న కేసులన్నీ కొత్త ట్రైబ్యునల్‌కు బదిలీ అవుతాయి. జలవివాదంపై విచారణ జరపడానికి ట్రైబ్యునల్‌లో బెంచి ఏర్పాటవుతుంది. ఆ బెంచ్‌ కేంద్రప్రభుత్వానికి రెండేళ్లలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి. కాలపరిమితిలోపు నివేదిక ఇవ్వడం సాధ్యంకాకపోతే మరో ఏడాది గడువు పొడిగిస్తారు. అప్పటికీ వీలుకాకపోతే, మరో ఆరు నెలలు సమయమిస్తారు. తుదితీర్పు వెలువడిన తరవాత ఇంకా ఏమైనా అభ్యంతరాలను లేదా కొత్త అంశాలను బెంచ్‌ దృష్టికి తీసుకువెళ్ళడానికి ఏడాది సమయం ఉంటుంది.

కొత్త ట్రైబ్యునల్‌లో ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, ఆరుగురు సభ్యులు ఉంటారు. సభ్యుల్లో ముగ్గురు న్యాయవ్యవస్థకు, ముగ్గురు జలవనరుల రంగానికి చెందిన నిపుణులు ఉంటారు. ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ల గరిష్ఠ పదవీకాలం అయిదేళ్లు. లేదా 75 ఏళ్ల వయసు వరకు ఉంటారు. మిగతా సభ్యులు 67 ఏళ్ల వయసు తరవాత కొనసాగడానికి వీల్లేదు. ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, సభ్యులను ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లేదా వారి ప్రతినిధులు, కేంద్ర న్యాయశాఖమంత్రి, జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలోని బృందం ఎంపిక చేస్తుంది. కేంద్రప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసినవారు, జాతీయ, అంతర్జాతీయ జలవివాదాల పరిష్కరణలో విశేషానుభవంగల వ్యక్తులను నైపుణ్య సభ్యులుగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో గతంలో ఏర్పాటైన జలవివాదాల ట్రైబ్యునళ్ల పనితీరును సమీక్షించుకోవాలి.

బ్రహ్మపుత్ర, గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద తదితర నదుల పరీవాహక ప్రాంతాలు రెండు, అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నందువల్ల వాటిని అంతర్రాష్ట్ర నదులుగా పరిగణిస్తారు. నదీజల విభజనకు సబంధించి తలెత్తే వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ, 1956లో పార్లమెంట్‌ ఒక చట్టాన్ని ఆమోదించింది. నదీజల వివాదాన్ని ఎదుర్కొంటున్న ఏ ఒక్క రాష్ట్రం అభ్యర్థించినా, ఈ చట్టం ప్రకారం కేంద్రం ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయవచ్చు. కృష్ణ, గోదావరి, నర్మద, కావేరి, రావి, బియాస్‌ నదీజలాల విభజనకు ఈ చట్టం వీలు కల్పించింది. ట్రైబ్యునల్‌ నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి తీర్పు ఇవ్వడంలో ట్రైబ్యునళ్లు జాప్యం చేస్తుండటంవల్ల, రాష్ట్రాలమధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. వివిధ ట్రైబ్యునళ్లు, వేర్వేరు ప్రమాణాలను అనుసరించడం వల్ల వాటి తీర్పుల్లో సారూపత్య లేకుండాపోయింది. తీర్పుల అమలులో కేంద్ర నిష్క్రియాపరత్వంవల్ల కొన్ని రాష్ట్రాలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. దాంతో వివాదాలు సమసిపోకుండా మరింత జటిలమవుతున్నాయి. రాష్ట్రాలు తరచుగా న్యాయస్థానాలను ఆశ్రయించడంవల్ల, సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి.

అధిక, అల్ప వార్షిక నదీప్రవాహ సరళిని కచ్చితంగా అంచనా వేసుకొని నికర జలాల్ని నిర్ధారించడానికి వీలైనంత ఎక్కువ కాలావధిని పరగణనలోకి తీసుకోవడం అవసరమని భావించిన బచావత్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా ట్రైబ్యునల్‌-1) కృష్ణా నదిలో 1894-95 నుంచి 1971-72 వరకు పూర్తిగా అందుబాటులో ఉన్న 78 సంవత్సరాల జల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంది. ఇరిగేషన్‌ మిషన్‌ 1972లో సూచించిన విధంగా 75 శాతం విశ్వసనీయతతో కృష్ణానదిలో వార్షిక నికర జలాల లభ్యతను 2060 శతకోటి ఘనపుటడుగులు(టీఎమ్‌సీలు)గా లెక్కించి, సంబంధిత రాష్ట్రాలకు కేటాయించింది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా ట్రైబ్యునల్‌-2) దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది. అప్పటికి కృష్ణానదిలో 114 సంవత్సరాల (1894-95 నుంచి 2007-08 వరకు వార్షిక ప్రవాహ వివరాలు అందుబాటులో ఉన్నా, అధిక ప్రవాహ లభ్యతగల 47 ఏళ్ల (1961-62 నుంచి 2007-08 వరకు)లో ఉన్న ప్రవాహ సరళిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అదీగాక 75 శాతానికి బదులు 65 శాతం విశ్వసనీయతతో వార్షిక నికర జలాలను లెక్కగట్టి రాష్ట్రాలకు విభజించడంవల్ల కృష్ణా నదీ జలాల వివాదం సమసిపోలేదు. పైపెచ్చు మరింత ఎక్కువైంది. ఇక కావేరీ ట్రైబ్యునల్‌ సైతం విశ్వసనీయతను 50 శాతంగా పరిగణించి, నికర జలాలను నిర్ధారించి, సంబంధిత రాష్ట్రాలకు విభజించింది. ఇలా వివిధ ట్రైబ్యునళ్లు నికరజలాల లభ్యతను నిర్ధారించడానికి వేర్వేరు విధానాలు అవలంబించడం వల్ల వాటి తీర్పుల్లోనూ సారూపత్య కొరవడి గందరగోళం ఏర్పడింది. అదీకాక 2002కి ముందు పరిష్కరించిన 75 శాతం విశ్వసనీయతను సమస్యాత్మకం చేసి, మరల తిరగదోడినట్లయింది.

అడుగడుగునా ఉల్లంఘనలు
కృష్ణా జలాల్లో సముచిత వాటా పొందే విషయంలో నది చిట్టచివరనున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను రక్షించాలంటే భీమ, తుంగభద్ర నదుల నుంచి కృష్ణానదికి జలప్రవాహం నిరంతరం కొనసాగాలని, అందుకోసం భీమ, తుంగభద్ర, వేదవతి నదుల బేసిన్లలో విచక్షణారహితంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించరాదని కృష్ణా-గోదావరి కమిషన్‌ 1961లోనే సూచించింది. ఈ సూచనను పరిగణనలోకి తీసుకొని బచావన్‌ ట్రైబ్యునల్‌ ఘటప్రభ, ఎగువభీమ సబ్‌బేసిన్లలో నీటి వినియోగానికి సంబంధించి, మహారాష్ట్రపై కొన్ని నియంత్రణలను విధించింది. తుంగభద్ర, వేదవతి, దిగువభీమ నదీజలాలను వినియోగించే విషయంలోనూ కొన్ని షరతులు విధించింది. వాటిని ఎగువ రాష్ట్రాలు బేఖాతరు చేస్తున్నాయి. మహారాష్ట్ర అధిక నిల్వ సామర్థ్యంతో భీమ నదిపై ఉజ్జయినీ డ్యాము తదితర ప్రాజెక్టులను నిర్మించింది. భీమా సబ్‌బేసిన్‌లో ట్రైబ్యునల్‌ కేటాయించిన 300 శ.కో.ఘ.లకంటే 40 శ.కో.ఘ.ల నీటిని ఎక్కువగా వినియోగించుకొంటోంది. అలాగే, ఎగువ కృష్ణా ప్రాజెక్టు పరిధిలో మరిన్ని ఎత్తిపోతల పథకాలను, భీమ, తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, కృష్ణానదిపై అధిక సంఖ్యలో బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టిన కర్ణాటక సైతం తమకు కేటాయించిన వాటాకంటే అధిక పరిమాణంలో నీటిని వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. గోదావరిపై శ్రీరాంసాగర్‌ జలాశయ పరిధిలో మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ డ్యామ్‌ నిర్మించినా, కేంద్రప్రభుత్వం అభ్యంతరం పెట్టకుండా మౌనం దాల్చింది. ఎగువ రాష్ట్రాల ఇష్టారాజ్యం వల్ల వివిధ ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులు ఆచరణలో నీరుగారిపోతున్నాయన్నది నిష్ఠుర సత్యం. కాబట్టి, ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పును విశేషాధికారాలతో అమలు చేసే పూర్తి బాధ్యత తమదేనన్న వాస్తవాన్ని కేంద్రం గుర్తించి ఆ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం అన్ని జల వివాదాల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికపై ఏకైక ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఆహ్వానించదగినదే. దానివల్ల, ఆ ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పుల్లో సారూప్యత ఉంటుంది. రాష్ట్రాల మధ్య సామరస్యత నెలకొనే అవకాశం ఉంటుంది. ట్రైబ్యునల్‌ తీర్పు వెలువడగానే, దాన్ని కచ్చితంగా అమలుపరచేందుకు సంబంధిత రాష్ట్రాలు తగు చర్యలను తీసుకోవాలి. ఏదైనా ఒక రాష్ట్రం తీర్పును ఉల్లంఘిస్తే, కేంద్రం తక్షణం రంగంలోకి దిగి దాన్ని సరిదిద్దాలి. అప్పుడే రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే నదీజల వివాదాలు సత్వరం పరిష్కారమవుతాయి. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అవరోధాలు తొలగుతాయి. ప్రజాసంక్షేమం దృష్టితో కాకుండా, రాజకీయ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, ట్రైబ్యునల్‌ తీర్పులను ఉల్లంఘించినవారిపై కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలి. ట్రైబ్యునల్‌ తీర్పుల అమలుకు ధర్మాసనాలను ఏర్పాటు చేసినా, అవి కేంద్రప్రభుత్వం అభిమతాలకు అనుగుణంగా కాక- స్వతంత్రంగా పనిచేయాలి. తీర్పులను కచ్చితంగా అమలు పరచగలగాలి. దుర్విచక్షణతో వ్యవహరిస్తే ఏకైక ట్రైబ్యునల్‌ ఏర్పాటు సైతం ఆచరణలో నిష్ఫలమయ్యే ప్రమాదముంది.

Posted on 01-08-2019