Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

వినియోగదారు రాజయ్యేది ఎప్పుడు?

కాలదోషం పట్టిన పాత చట్టం స్థానే మోదీ ప్రభుత్వం రూపొందించిన వినియోగదారుల రక్షణ బిల్లు లోక్‌సభామోదం పొందింది. ముప్ఫై మూడేళ్లనాటి శాసనాన్ని పక్కకు నెట్టి దేశంలో వినియోగ హక్కులకు ఇతోధికంగా పట్టం కట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు చట్టమైన దరిమిలా- జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో వివాదాల పరిష్కార కమిషన్లు, ఫోరాలు కొలువుతీరతాయంటున్నారు. వాస్తవానికి నిరుడు జనవరిలో ప్రవేశపెట్టిన బిల్లు గత డిసెంబరులో లోక్‌సభ ఆమోదం పొందినా రాజ్యసభలో ముందడుగు పడక మురిగిపోయినందువల్ల, కొత్త బిల్లు తేవాల్సి వచ్చింది. వినియోగదారుల చట్టాన్ని సంస్కరించే యత్నాలు నాలుగేళ్లుగా సఫలం కాలేదు. ఆ కసరత్తులో ఈసారి లక్ష్యం సాధించి తీరతామన్న ధీమా కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మాటల్లో ఉట్టిపడుతోంది. ఏ ఒక్కరు ఫిర్యాదు చేసినా తక్షణం చర్యలు చేపట్టే నిమిత్తం జాతీయ స్థాయిలో వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) ఏర్పాటుకు కొత్తబిల్లు వీలు కల్పిస్తోంది. సేవాలోపాలు లేదా వస్తువుల నాణ్యత లేమి కారణంగా వినియోగదారులకు హాని వాటిల్లినా, అనుచిత వాణిజ్య పోకడలవల్ల నష్టం సంభవించినా సీసీపీఏ విధిగా జోక్యం చేసుకుంటుందనడం వీనులవిందుగా ఉంది. 2015 లగాయతు దఫదఫాలుగా మార్పులు చేర్పులకు లోనైన వినియోగ హక్కుల రక్షణ బిల్లుకు తనవంతుగా పార్లమెంటరీ స్థాయీసంఘం కీలక సిఫార్సులు అందించింది. కనుకనే ఇ-కామర్స్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లకూ నూతన బిల్లు పరిధి విస్తరించింది. గతంతో పోలిస్తే మెరుగైన ప్రతిపాదనలున్నప్పటికీ ఆహారంలో కల్తీ, విద్యాబోధనపరంగా లోటుపాట్లు, ఆరోగ్య సేవల్లో లోపాలకు సంబంధించి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలన్న విపక్షం సూచనల విషయంలో యంత్రాంగం సానుకూలంగా స్పందించాల్సి ఉంది. కేంద్రం చెబుతున్నట్లు ‘వినియోగదారులకు మరింత రక్షణ’ ఒనగూడేదప్పుడే!

వస్తు సేవల విపణిలో ఏ వ్యక్తీ మోసపోయానని చింతించే పరిస్థితి తలెత్తకుండా, నష్టపోయిన వారికి వకీళ్ల సాయం అవసరం లేకుండానే పరిహారం ఇప్పించే లక్ష్యంతో 1986నాటి వినియోగదారుల రక్షణ చట్టం రూపుదాల్చింది. వినియోగదారుల వేదికల ముందుకు వెళ్ళిన కేసులు మూడు నెలల గడువులో ఒక కొలిక్కి రావాల్సి ఉన్నా, రెండు మూడేళ్లయినా అతీగతీ లేని ఉదంతాలు దేశంలో లెక్కకు మిక్కిలి. జిల్లా, రాష్ట్ర వేదికల్లో వందలాది ఖాళీలు పేరుకుపోయిన పర్యవసానంగా పెండింగ్‌ కేసుల సంఖ్య పోనుపోను ఇంతలంతలవుతోంది. ఉత్తర్వుల అమలులో జాప్యాన్ని వైఫల్యాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని రాష్ట్రాలకు కేంద్రమే సూచించినప్పటికీ, సాచివేత ధోరణుల పీడ విరగడ కాలేదు. యూపీలోని జిల్లా కమిషన్లలో రాజకీయ నియామకాల బాగోతాన్ని తూర్పారపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి స్థితిగతులు ఆరా తీసేందుకే జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌ కమిటీని కొలువుతీర్చింది. వినియోగదారుల వేదికల్లో అత్యధికం రోజుకు సుమారు రెండు గంటల పనికే పరిమితమవుతున్నాయన్న ఆ త్రిసభ్య సంఘం- నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని, యూపీ హరియాణా వంటి రాష్ట్రాల్లో ముఠాల సంస్కృతిని తీవ్రంగా ఆక్షేపించింది. చాలాచోట్ల దస్త్రాలకు చెదలు పట్టిపోతున్నా, పట్టించుకునే నాథుడు లేడని సూటిగా తప్పుపట్టింది. ఇన్నేళ్ల తరవాతా దేశంలో వినియోగదారు రాజు కాలేకపోయాడన్నది, అరిజిత్‌ పసాయత్‌ కమిటీ నివేదిక సారాంశం. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనీస వసతులు కొరవడ్డాయన్న కమిటీ నిర్ధారణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ పట్ల వ్యవస్థాగత అలసత్వాన్ని ఎలుగెత్తింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో రాష్ట్రాల్లో వినియోగదారుల వేదికల్ని పరిపుష్టీకరించి, మెరుగైన నష్టపరిహారం ఇప్పించేలా వాటిని శక్తిమంతం చేస్తామంటున్న కేంద్రం- కంతలన్నింటినీ వడివడిగా పూడ్చాలి!

గత మూడు దశాబ్దాల్లో విశ్వవ్యాప్తంగా వినియోగదారు అర్థతాత్పర్యాలు ఊహాతీతంగా మారిపోయాయి. చరవాణులు, ఇ-కామర్స్‌ ప్రవేశంతో వినిమయ సంస్కృతి రూపురేఖలు భారీగా పరివర్తన చెందాయి. ప్రస్తుతం భారత్‌లో అంతర్జాల వినియోగదారుల సంఖ్య సుమారు 49 కోట్లు. ఇది అమెరికా మొత్తం జనాభా కన్నా దాదాపు 16 కోట్లు ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధిక యువజన రాశికి నెలవైన ఇండియాలో 2020నాటికి వినియోగదారులు చేసే ఖర్చు 3.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ అధ్యయనాల అంచనా. ఈ విస్తృతికి అనుగుణంగా నాణ్యత లేమి, సేవా లోపాలపై ఫిర్యాదుల పరిష్కరణ వ్యవస్థా జవజీవాలు పుంజుకొని ఆధునికతను సంతరించుకోవాల్సిందే. సాధారణ లావాదేవీలతోపాటు అంతర్జాలం, టెలీషాపింగ్‌, మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ల ద్వారా కొనుగోళ్లకూ నూతన శాసనాన్ని వర్తింపజేయాలంటే తదనుగుణంగా పటిష్ఠ యంత్రాంగాన్ని అవతరింపజేయాలి! వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలోకి వచ్చే వైద్య సేవల్ని సమగ్రంగా నిర్వచిస్తూ సర్వోన్నత న్యాయస్థానం 1995 నవంబరులోనే విశిష్ట తీర్పు వెలువరించింది. వైద్యులపై వచ్చే ఫిర్యాదుల లోతుపాతుల విచారణకు సాంకేతిక అంశాల పరిజ్ఞానం కలిగినవారితో ఫోరాల్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వాల అలసత్వం, దేశం నలుమూలలా అసంఖ్యాక బాధితుల్ని కుంగదీస్తోంది. రోగులూ వినియోగదారులేనన్న సుప్రీంకోర్టు స్పష్టీకరణ తాలూకు మానవీయ స్ఫూర్తి ప్రస్తుత బిల్లులో ప్రతిఫలించి ఉంటే- అది ఎన్నదగ్గ సంస్కరణగా ఎల్లకాలం నిలిచిపోయేది. శాసన నిర్మాణం ఒకెత్తు; కార్యాచరణ ఎక్కడా గాడి తప్పకుండా తూనికలు కొలతల శాఖ మొదలు వినియోగదారుల ప్రయోజనాలతో ముడివడిన అన్ని విభాగాల్లో పర్యవేక్షణాధికారుల ఖాళీల్ని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం మరొకెత్తు. అందులో ప్రభుత్వాలు నెగ్గితేనే, దేశీయంగా వినియోగ హక్కులకు న్యాయం జరిగినట్లు!

Posted on 02-08-2019