Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

రాదారి భద్రత అందరి బాధ్యత

రహదారి ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన దేశాల జాబితాలో- ఏటా లక్షా 50 వేలమందికి పైగా మృతులతో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రెండు మూడు స్థానాల్లో నిలిచిన చైనా, బ్రెజిల్‌ దేశాల రోడ్డు ప్రమాద మృతుల్ని కలిపి గణించినా వారి సంఖ్య 97 వేల లోపే ఉండటం- ఇండియా సరిసాటి లేనితనాన్ని ఎలుగెత్తి చాటుతోంది. వేరొక వాహనం ఏదో వచ్చి ఢీ కొట్టడమే కాదు, నిర్వహణ సక్రమంగా లేని రోడ్లపై గుంతలూ ఏటా వేలమంది ఉసురుతీసేయడం- రహదారి ఉగ్రవాదంలో అంతర్భాగమే. గుంతలు పడి అధ్వానంగా ఉన్న రోడ్లు, పాదచారి మార్గాల వల్ల ఎవరికైనా ప్రాణనష్టం జరిగినా, గాయాలు తగిలినా దాన్ని రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగానే పరిగణించాలంటూ తాజాగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని సహర్షంగా స్వాగతించాల్సిందే. రహదారుల్ని సక్రమంగా నిర్వహించడం నగరపాలిక రాజ్యాంగబద్ధ విధి అని తీర్మానించిన హైకోర్టు- పౌరులెవరికైనా ప్రాణనష్టమో, శారీరక గాయాల కష్టమో వాటిల్లితే వారు ‘బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె’ నుంచి నష్టపరిహారం కోరవచ్చునని స్పష్టీకరించింది. ఒక్క బెంగళూరు అనేకాదు, గుంతల్ని పూడ్చడాన్ని అక్షరాలా గాలికొదిలేసిన స్థానిక సంస్థల నిష్క్రియాపరత్వం 2017లో దేశవ్యాప్తంగా దాదాపు 3,600 మంది ప్రాణాలు బలిగొంది. ఆ ఏడాది దేశంలో ఉగ్రవాదులు, మావోయిస్టుల దాడుల్లో 803 మంది మృత్యువాత పడటాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు- రహదారి ఉగ్రవాదం ఇంతగా జడలు విప్పడానికి కారకులెవరంటూ నిరుడు సూటిగా నిలదీసింది. నిర్మాణంలో ఉన్న రోడ్లు లేదా వాటి సమీపాన ప్రమాదాలకు గురై 2017లోనే 4,250మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతలే రోజుకు పదిమందిని పొట్టన పెట్టుకొంటున్న దేశంలో- రక్తదాహంతో తపిస్తున్న రోడ్డు రవాణా రంగ ముఖచిత్రాన్ని మార్చడానికి కంకణబద్ధమైన మోదీ ప్రభుత్వం- మోటారు వాహనాల బిల్లుకు మోక్షం దక్కించింది. జనజీవనాన్ని అది ఏ మేరకు తెరిపిన పడేయగలదో చూడాలి!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ రహదారి ప్రమాదాల్లో 3,700మంది మరణిస్తున్నారని, ఏటా అయిదు కోట్లమంది క్షతగాత్రులవుతున్నారంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- శోకసంద్ర ఘోష తీవ్రతను కళ్లకు కడుతోంది. విశ్వవ్యాప్త వాహనశ్రేణిలో కేవలం ఒక్క శాతం గల అల్పాదాయ దేశాల్లోనే 13 శాతం మృత్యుఘంటికలు మోగుతున్నాయన్న గణాంకాలు- ఇండియాలో రహదారుల రక్తాభిషేకాన్ని స్ఫురింపజేస్తున్నాయి. 2020 కల్లా రహదారి ప్రమాదాలు, మృతుల సంఖ్యను సగానికి తగ్గించాలన్న బ్రసీలియా ఒడంబడికపై సంతకం చేసిన ఇండియా, అవినీతి అరాచకాలకు చిరునామాగా మారిన రంగంలో సమూల క్షాళనకు ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది; బాలారిష్టాలు అధిగమించి సంబంధిత బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడానికి ఇంతకాలం పట్టింది. దేశీయంగా సమర్థ, సుభద్ర, అవినీతి రహిత రవాణా వ్యవస్థను రూపొందించడమే బిల్లు పరమోద్దేశమన్న కేంద్రమంత్రి గడ్కరీ- రాష్ట్రాల అధికారాలను కబళించే ప్రసక్తే లేదని భరోసా ఇస్తున్నారు. 19 రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులు సభ్యులుగా గల బృందం చేసిన సూచనల అనుసారం 2016లో తెచ్చిన మోటారు వాహనాల సవరణ బిల్లు- రాజ్యసభలో ఎంపిక కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఆ కమిటీ సూచనలు 2017 డిసెంబరులోనే వెలువడినా పెద్దల సభ అభ్యంతరాల నేపథ్యంలో నాటి బిల్లు మురిగిపోయింది. రాష్ట్రపతి ఆమోదమే తరువాయి కానున్న తాజా బిల్లు- నిబంధనలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వకుండా దూసుకుపోయే రహదారి ఉగ్రవాదుల భరతం పట్టేలా గూబ ‘గుయ్‌’మనిపించే జరిమానాలతో పరిపుష్టమైంది. ఉల్లంఘనుల్ని పసిగట్టడంలోనూ రవాణాశాఖల్లో అవినీతి పని పట్టడంలోనూ ఆధునిక సాంకేతికత అతిపెద్ద పాత్ర పోషించనుంది. వాహన సామర్థ్య నిర్ధారణ పరీక్షలూ ఇకపై యాంత్రికంగా సాగిపోనుండటం, లోపభూయిష్ఠ వాహనాల్ని ఆయా సంస్థలు ఉపసంహరించేలా ఆదేశించే అధికారం కేంద్రానికి దఖలుపడటం వంటివి- మౌలిక మార్పులకు సంకేతాలవుతున్నాయి!

దేశవ్యాప్తంగా పట్టుమని అయిదు శాతం ఉన్న జాతీయ రాష్ట్ర రహదారులపైనే 63 శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. చెల్లుబాటయ్యే లైసెన్సులు గల డ్రైవర్లే 82 శాతం ప్రమాదాలకు కారకులని, జనాభాలో పాతిక శాతానికి ఒకటి కన్నా ఎక్కువ లైసెన్సులున్నాయని, దాదాపు 60 శాతం ఎలాంటి పరీక్షా లేకుండానే లైసెన్సు తెచ్చుకొన్నారని, రహదారి నిబంధనలు కొద్దిమందికే తెలుసని సర్కారీ అధ్యయనాలే ఎలుగెత్తుతున్నాయి. రోజూ 32 వేల వాహన చోదక లైసెన్సులు జారీ అయ్యే ఇండియాలో ఆ ప్రక్రియను రానున్న చట్టం ఏ విధంగా హేతుబద్ధీకరించగలదో చూడాలి. రోడ్డు ప్రమాద మృతుల్లో 60 శాతం 18-35 ఏళ్ల మధ్యవయస్కులేనని, వారి కుటుంబానికి జీవనాధారమూ వారేనంటున్న వివరాలు కొత్తచట్టంలో మానవీయ నిబంధనలకు కారణమయ్యాయి. ప్రమాదం జరిగిన తొలిగంటలో క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించగలిగితే సగం మరణాల్ని తగ్గించగలమని న్యాయసంఘం నివేదిక సూచించింది. బాధితుల్ని ఆసుపత్రికి చేర్చే మానవతావాదులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోవాలంటున్న చట్టం- క్షతగాత్రుల తక్షణ వైద్యసేవలకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా నిబంధనలు కూర్చింది. జాతీయ రహదారి భద్రతా బోర్డు ఏర్పాటు, జాతీయ రవాణా విధానానికి అనుగుణంగా గ్రామసీమల దాకా సేవల విస్తృతి, ఓలా, ఉబర్‌ లాంటి వాహన సేవల సంస్థల దుందుడుకుతనానికీ కళ్ళెం వేసే నిబంధనలతో పరిపుష్టమైన కేంద్రం చొరవకు రాష్ట్రాల కార్యదక్షతా జతపడాలి. ప్రతి ప్రయాణం ప్రమోదం అయ్యే వాతావరణం నెలకొన్నప్పుడే జాతి తెరిపిన పడేది!


Posted on 03-08-2019