Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అక్రమ వలసదారుల ఏరివేత?

* అన్ని రాష్ట్రాల్లో పౌరపట్టికల తయారీ!
* ఎన్‌డియే ప్రభుత్వ యోచన
* దేశవ్యాప్తంగా అమలు సాధ్యమేనా?

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రసంగాలను వింటే అసోమ్‌లో అమలవుతున్న జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని దేశమంతటికీ విస్తరించే అవకాశమున్నట్లు తేలుతోంది. పౌరసత్వం లేకుండా ఈ దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిని గుర్తించి సాగనంపడానికి; వారందరిపై కాని, కొందరిపై కాని ఇతర శిక్షాత్మక చర్యలు తీసుకోవడానికి పౌరసత్వ చట్టం పరిధిలో జాతీయ పౌర పట్టికను రూపొందించారు. 2016 పౌరసత్వ సవరణ చట్టానికి ప్రతిపాదించిన సవరణల ప్రకారం, ఆరు మతవర్గాలకు చెందిన శరణార్థులకు పౌరసత్వమిచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ముస్లిం శరణార్థులు, వలసదారులకు మాత్రం పౌరసత్వం ఇవ్వకూడదని ఆ సవరణలు స్పష్టీకరిస్తున్నాయి. పార్లమెంటు ఆమోదం పొందక గడువు తీరిపోయిన ఈ చట్టాన్ని భాజపా గట్టిగా సమర్థిస్తోంది. అన్ని రాష్ట్రాలకూ ఎన్‌ఆర్‌సీలను రూపొందించబోయే ముందు, అసలు అసోం కోసం ఎన్‌ఆర్‌సీని ఎందుకు రూపొందించాల్సి వచ్చిందో సింహావలోకనం చేసుకోవాలి. ఎన్‌ఆర్‌సీలో మార్పుచేర్పులు చేయడానికి ఆ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను గమనించాలి. తుది ఎన్‌ఆర్‌సీని ప్రచురించడం వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో అంచనా వేయాలి. అన్నింటినీ మించి బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలసవచ్చినవారిని వెనక్కు పంపడం అసాధ్యమని గుర్తుకు తెచ్చుకోవాలి.

అసోమ్‌ అనుభవం
అసోమ్‌లో 2012-2014 మధ్య అక్రమ వలసలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున అల్లర్లు జరిగాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలను నివారించాలంటే 1951నాటి జాతీయ పౌర పట్టికకు కాలానుగుణమైన మార్పులు చేయాలి. ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలు కోరడం, సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించడంతో 2013లో ఎన్‌ఆర్‌సీకి మార్పులు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. 2016 జనవరి 31 కల్లా తుది పట్టికను ప్రచురించాల్సి ఉండగా, రకరకాల సమస్యల వల్ల అది అయిదుసార్లు వాయిదా పడింది. చివరగా 2019 జూలై 31 తేదీని ప్రచురణ తేదీగా ప్రకటించి, దాన్ని కూడా ఆగస్టు 31కి వాయిదా వేశారు. మరోవైపు ప్రభుత్వం మొదటి జాబితాను 2018 జనవరి ఒకటిన, రెండో జాబితాను జులై 23న, మూడో జాబితాను 2019 జూన్‌లో ప్రచురించింది. జాబితాల్లో పెద్ద సంఖ్యలో పేర్లు గల్లంతు కావడం- మరో సంక్షోభానికి అంటుకడుతోంది. వీరిని తుది జాబితా నుంచి తొలగిస్తే, వారు విదేశీయుల ట్రైబ్యునళ్ల ముందు హాజరు కావలసి ఉంటుంది. మరోవైపు అక్రమ వలసదారుల సమస్య అసోం సమాజంలో ఉద్రిక్తతలు పెంచుతోంది.

కొరకరాని కొయ్య
భారతదేశంలో తమ ప్రజలు అక్రమంగా నివసిస్తున్నారని బంగ్లాదేశ్‌ అసలు అంగీకరించడమే లేదు. బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడకముందు తూర్పు పాకిస్థాన్‌గా ఉండేది. అప్పట్లోనూ అక్కడి నుంచి అసోమ్‌కు అక్రమ వలసలు జోరుగా సాగేవి. వీరిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1950లోనే వలసదారుల (అసోం నుంచి బహిష్కరణ) చట్టం తీసుకొచ్చింది. 1951లో జన గణన జరుగుతున్నప్పుడు అసోమ్‌లోని ప్రతి గ్రామంలోని జనుల వివరాలతో జాతీయ పౌర పట్టిక తయారుచేయాలని నిర్ణయించారు. ప్రతి పల్లెలోని ప్రజలు, గృహాల సంఖ్య, ప్రజల పేర్లు, వారి వృత్తులను అందులో పొందుపరచి 1951 ఎన్‌ఆర్‌సీని రూపొందించారు. ఆపై వలసలు కొనసాగినా, 1972లో బంగ్లాదేశ్‌ ఆవిర్భవానికి ముందూ తరవాత మాత్రం అవి ఉద్ధృత రూపు దాల్చాయి. అంతకుముందు తూర్పు పాకిస్థాన్‌లో మానవ హక్కుల అణచివేత దీనికి ప్రధాన ప్రేరణ. అసోమ్‌లో సువిశాల వ్యవసాయ భూములు ఉన్నా జన సాంద్రత తక్కువ కావడం వల్ల వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు బాగా గిరాకీ ఉండేది. బంగ్లా వలసదారుల ప్రవాహానికి ఈ అంశమూ ప్రధాన హేతువే. 1972 మార్చి 24 తరవాత బంగ్లా నుంచి వలస వచ్చినవారిని వెనక్కు పంపడానికి భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, బంగ్లా అక్రమ వలసదారులను కొన్ని పార్టీలు ఓటు బ్యాంకుగా పరిగణించినందువల్ల వలస ప్రవాహం ఆగలేదు. వీరి రాకను వ్యతిరేకించే పార్టీలు నిరసనాందోళనలను వ్యక్తం చేయసాగాయి. 1980లో అఖిల అస్సాం విద్యార్థి సంఘం బంగ్లా అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి నిర్దిష్ట ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. ఈ సమస్యపై ఉద్రిక్తతలు 1983లో నెల్లీ ఊచకోతకు దారితీసి వేలమంది మరణించారు. కేంద్రం అక్రమ వలసదారుల (ట్రైబ్యునల్‌ ద్వారా నిర్ధారణ) చట్టం తెచ్చినా ఒరిగిందేమీ లేదు. సమస్య పరిష్కారానికి 1985 ఆగస్టు 15న భారత ప్రభుత్వం, అఖిల అస్సాం విద్యార్థి సంఘం, అస్సాం గణపరిషత్‌ల మధ్య ఒప్పందం కుదిరింది అక్రమ వలసదారులను గుర్తించి ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడానికి 1966 జనవరి ఒకటో తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని అస్సాం ఒప్పందంలోని 5.1 క్లాజు నిర్దేశించింది. ఆ తేదీకి ముందు వలసవచ్చినవారిని అస్సాం పౌరులుగా క్రమబద్ధీకరించాలని, 1966 జనవరి ఒకటి నుంచి 1971 మార్చి 24 వరకు వలసవచ్చినవారిని విదేశీయులుగా గుర్తించి, ఓటరు జాబితాలనుంచి తొలగించాలని ఆ క్లాజు పేర్కొంది. ఆ కాలంలో వలస వచ్చినవారు భారతదేశంలో పదేళ్లపాటు నివసించిన తరవాత, వారిని ఓటరు జాబితాలో చేర్చాలన్నది. ఈ అంశాలను పౌరసత్వ చట్టంలోని 6ఏ సెక్షన్‌ కింద చేర్చడానికి 1985లో సవరణ తీసుకొచ్చారు. 6ఏ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమా అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. అక్రమ వలసదారులను గుర్తించి నిర్బంధించి వెనక్కు పంపడానికి 1983-2003 మధ్య 21 ట్రైబ్యునళ్లను నెలకొల్పినా, వాటి పనితీరు మహా నిరాశాజనకం. అక్రమ వలసదారులను నిర్ధారించడానికి మొత్తం 3.11 లక్షల కేసుల్లో విచారణలు చేపట్టినా కేవలం 10,015 కేసుల్లో మాత్రమే దోష నిరూపణ జరిగింది. చివరకు 1,481 మందిని మాత్రమే అక్రమ వలసదారులుగా ప్రకటించి బహిష్కరించారు. 2000-2012 మధ్య 32 విదేశీయుల నిర్ధారణ ట్రైబ్యునళ్లను నెలకొల్పినా, అవి కూడా ఫలితాలు చూపలేకపోయాయి. ఈ ట్రైబ్యునళ్లు మొత్తం 1.10 లక్షల కేసుల విచారణలు చేపట్టి కేవలం 895 మందిని మాత్రమే బహిష్కరించగలిగాయి. ట్రైబ్యునళ్ల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. ఈ వైఫల్యానికి అనేక కారణాలున్నా, ప్రధాన కారణం- భాష, జాతి సంబంధమైనది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వలస వచ్చినవారి మాతృభాష బెంగాలీ. అసోమ్‌లో ఆ భాష మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. స్థానికుల నుంచి వారికి లోపాయికారీ మద్దతూ లభిస్తోంది. అందువల్ల విదేశీయులెవరో, స్వదేశీయులెవరో గుర్తించడం దాదాపు అసాధ్యమవుతోంది.

దేశమంతటికీ పాకిన విదేశీయులు
భారత్‌లో 2001 డిసెంబరునాటికి 1.20 కోట్లమంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులు ఉన్నారని 2004 జూలై 14న కేంద్రం లోక్‌సభకు తెలిపింది. వారిలో 50 లక్షలమంది అసోమ్‌లోనే ఉన్నారు. వాస్తవమిలా ఉంటే 2012 డిసెంబరు రెండో తేదీనాటికి అసోమ్‌లో ఒక్క బంగ్లాదేశ్‌ జాతీయుడూ లేడని అప్పటి సీఎం తరుణ్‌ గొగోయ్‌ ఒక సభలో బహిరంగంగా ప్రకటించారు. అసలు దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు ఎందరనేది ప్రభుత్వం నిగ్గుతేల్చకపోతే అయోమయం కొనసాగుతుంది. అసోమ్‌లో విదేశీయుల సమస్యను సమర్థంగా పరిష్కరించిన తరవాత మిగతా దేశంలోని అక్రమ వలసదారుల సంగతి తేల్చవచ్చు. కానీ, అసోమ్‌లో వ్యవహారం సజావుగా జరగడం లేదు. అక్కడి అధికారులు 1971 సంవత్సరానికి ముందునాటి లిఖిత పూర్వక ధ్రువీకరణ పత్రాలను డిమాండ్‌ చేయడం చిక్కులకు దారితీస్తోంది. గ్రామ ప్రజలు, పట్టణ పేదలవద్ద అలాంటి పత్రాలు ఉండవు. కనుక దేశమంతటికీ జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని సిద్ధంచేయడం అనుకున్నంత సులువు కాదు.

భారత్‌లో శరణార్థులు, విదేశీయులు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పౌరేతరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. శరణార్థులను భారత్‌ చట్టబద్ధంగా గుర్తించడం లేదు కాబట్టి వారికి పౌరసత్వం లభించదు. అందుకే వారిని పౌరేతరులు అనడం సబబు. భారతదేశానికి శరణార్థుల చట్టమే లేదు. స్వాతంత్య్రానికి ముందు పార్సీలు, కొందరు యూదులు భారత్‌కు వలసవచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక బంగ్లాదేశీయులు భారీగా తరలివచ్చారు. 1959 తరవాత 1.20 లక్షల మంది వరకు టిబెటన్లు వలస వచ్చి వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. వారిలో చాలామంది కర్ణాటకలో కేంద్రీకృతమయ్యారు. టిబెటన్లకు భారత ప్రభుత్వమిచ్చే రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఏటా పునరుద్ధరించుకోవలసిందే. భారత్‌కు నేటికీ నేపాలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 1950 మైత్రీ ఒప్పందం కింద నేపాలీలు భారత పౌరుల్లానే దేశంలో ఆస్తులు కొనవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా సంచరించవచ్చు. కానీ, వారు పూర్తిస్థాయి భారత పౌరులు కారు. 1979-89 మధ్య సోవియట్‌-అఫ్ఘాన్‌ యుద్ధకాలంలో దాదాపు 60వేలమంది అఫ్గాన్‌ శరణార్థులు భారత్‌కు వచ్చినా, వారికీ సాధికార శరణార్థి హోదా ఇవ్వలేదు. మూడు దశాబ్దాల నుంచి లక్షమందికి పైగా శ్రీలంక తమిళ శరణార్థులు తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోని 112 శిబిరాల్లో నివసిస్తున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి 15 వేలమంది బౌద్ధ చక్మాలు, హిందూ హజోంగ్స్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో నివసిస్తున్నారు. ప్రభుత్వం వీరికి పౌరసత్వం ఇద్దామనుకున్నా స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. 2012 తరవాత మియన్మార్‌ నుంచి తరలివచ్చిన రోహింగ్యాలు దిల్లీ, హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌, పశ్చిమ్‌ బంగ, ఈశాన్య భారత రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. 14 వేలమంది రోహింగ్యాలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి కింద నమోదు చేశారు. అంతర్జాతీయ శరణార్థి చట్టం ప్రకారం అక్రమ వలసదారులను, విదేశీయులను బహిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. 1951నాటి అంతర్జాతీయ శరణార్థి ఒప్పందంపై భారత్‌ అసలు సంతకమే చేయలేదు. అలాంటప్పుడు ముస్లిం, ముస్లిమేతర శరణార్థులకు అంతర్జాతీయ శరణార్థి చట్టాన్ని ఎలా వర్తింపజేస్తారన్నది ప్రశ్న!


Posted on 05-08-2019