Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జల విలయానికి అడ్డుకట్ట

* ఆనకట్టల భద్రత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు భారీ సంఖ్యలో నదులపై ఆనకట్టలు నిర్మించాయి. నదీజలాల అంశం పూర్తిగా రాష్ట్రాలకే వర్తిస్తున్నందువల్ల వాటిని రాష్ట్రాలే నిర్వహిస్తున్నాయి. ఇందులో ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో విధానం. నిర్మాణ నిర్వహణల్లో లోపాలవల్ల ఎన్నో వైఫల్యాలు పెను విపత్తులై ప్రజల ప్రాణాలను, ఆస్తులను హరించాయి. పర్యావరణానికీ నష్టం కలిగించాయి. 1979లో నిండుకుండలా ఉన్న గుజరాత్‌లోని మచ్చు ఆనకట్ట తెగిపోవడంతో నీరు ఉప్పెనలా జనావాసాలను ముంచెత్తింది. వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఏడాది జులై మూడున మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో రత్నగిరి వద్ద టివేర్‌ ఆనకట్ట తెగిపోయిన ఉదంతంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆనకట్ట పగుళ్లకు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని స్థానికులు ఆరోపించారు. ఇలాంటి వైఫల్యాలు భారత్‌లో ఇప్పటివరకూ 36కు పైనే చోటుచేసుకున్నట్లు అంచనా. నిర్మాణంలో నాణ్యత లేకపోయినా, నిర్వహణలో విఫలమైనా డ్యామ్‌లు బద్దలైతే జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరిది?

సార్వత్రిక వ్యవస్థ దిశగా...
తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆనకట్టల భద్రతకు జాతీయస్థాయిలో ఓ సార్వత్రిక వ్యవస్థను తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా గల అన్ని ఆనకట్టలకూ ఒకే రకమైన భద్రత, నిర్వహణ ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆనకట్టల భద్రత బిల్లు’ను లోక్‌సభ ఆమోదించింది. దేశంలో మొత్తంగా 5,264 ఆనకట్టలు ఉన్నాయి. ఇందులో 293 వందేళ్లకు ముందే నిర్మించినవి. 1,041 (20 శాతం) ఆనకట్టలు 50 నుంచి వందేళ్ల మధ్య ఏర్పాటైనవి. మరో 437 ఆనకట్టలు నిర్మాణదశలో ఉన్నాయి. 92 శాతం ఆనకట్టలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న నదులపై నిర్మితమయ్యాయి. ‘ఆనకట్టల నిర్వహణ విషయంలో దేశవ్యాప్తంగా ఒక సార్వత్రిక విధానం ఉండటానికి’ బిల్లును తెచ్చామంటూ కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చెప్పడం ద్వారా అంతిమ నిర్ణయాలు ఇక కేంద్రానికే ఉంటాయనే విషయాన్ని తేటతెల్లం చేశారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం లేదని విపక్షాల ఆరోపణలకు బదులిస్తూ చెప్పారు. నిర్వహణ సరిగ్గాలేక ఎదురయ్యే విపత్తులను నివారించడానికి, ఆనకట్టల పర్యవేక్షణకు, తనిఖీకి, భద్రతకు భరోసా ఇవ్వడానికి అవసరమైన సంస్థాగత యంత్రాంగాల రూపకల్పనకు బిల్లులో నిబంధనలు పొందుపరచారు. 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న దేశంలోని అన్ని ఆనకట్టలకు ఈ బిల్లు వర్తిస్తుంది. ఆనకట్ట భద్రతా ప్రమాణాలకు సంబంధించి, విధానాలు, నిబంధనలను రూపొందించడానికి భద్రతా పద్ధతుల్లో మార్పులు సూచించడానికి, వైఫల్యాలను విశ్లేషించడానికి, ఆనకట్ట భద్రతపై జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. జాతీయ స్థాయిలో ఆనకట్టల భద్రతా ప్రమాణాల్లో ఏకరూపత ఉండటంవల్ల, నిర్వహణపై నిఘా, వైఫల్యాలు ఎదురైనప్పుడు తక్షణ స్పందన ఉంటాయని ఆశించవచ్చు. ఆనకట్టలకు సంబంధించిన అన్ని సమస్యలనూ ఈ వ్యవస్థ పరిష్కరించే అవకాశం ఉంది. సమగ్ర సమీక్షలకు, అత్యవసర భద్రతా ప్రణాళికలు రూపొందించేందుకు, వేగవంతమైన చర్యలకు వీలు కలుగుతుంది. విపత్తులు రాకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించడంవల్ల మానవులు, పశుపక్ష్యాదుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ సాధ్యమవుతుంది. పర్యావరణ పరిరక్షణ కూడా ఇందులో కీలకమైన మరో అంశం.

గత 50 ఏళ్ళుగా భారత్‌లో ఆనకట్టల నిర్మాణాలకు లక్షల కోట్ల రూపాయలు వ్యయపరచారు. వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధిని పాదుకొల్పేందుకు ఆనకట్టలు నిర్వహించే పాత్ర అమోఘమైనది. అందుకే కేంద్రం ఆనకట్టల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఆధ్వర్యంలో జాతీయ ఆనకట్టల భద్రత సంఘం ఏర్పాటవుతుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. బిల్లు చట్టంగా రూపొందిన రెండు నెలల్లో జాతీయ ప్రాధికార సంస్థ ఏర్పాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కమిటీలూ ఇందులో భాగస్వాములవుతాయి. ఆనకట్టల రక్షణను పర్యవేక్షించే అధికారుల విధులకు అడ్డు తగిలినవారికి జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష ఉంటాయి. రాష్ట్రాలు రూపొందించిన భద్రతా ప్రమాణాలను ఉల్లఘించి, తద్వారా నష్టానికి లేదా విపత్తులకు కారణమయ్యేవారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.

అభ్యంతరాలేమిటి?
నదీజలాల అంశం రాష్ట్రాలకు సంబంధించినదని, ఇందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరం లేదని పేర్కొంటూ ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేడీ, డీఎమ్‌కే, టీఎమ్‌సీ పక్షాలు నదీజలాలపై రాష్ట్రాలకు ఉన్న నియంత్రణ అధికారాలను కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకుంటోందని ధ్వజమెత్తాయి. బిల్లులో ‘స్టేక్‌ హోల్డర్స్‌’ ప్రస్తావన ఉన్నప్పటికీ, ఆనకట్టల వాటాదారులు ఎవరనే విషయమై స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదనేది మరో ఆక్షేపణ. ఆనకట్టలకు విపత్తు సంభవిస్తే జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలకు ఇచ్చే పరిహారం గురించీ స్పష్టత కొరవడిందన్నది విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు. రాజ్యాంగం పేర్కొన్న ‘సమాఖ్య స్ఫూర్తి’కి విరుద్ధంగా ఈ బిల్లు ఉందని ధ్వజమెత్తారు. తమిళనాడు కొన్నేళ్లుగా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు చట్టంగా రూపొందితే తమ రాష్ట్రానికి చెందిన నాలుగు ఆనకట్టల సమాచారాన్ని అది కేరళతో పంచుకోవలసి ఉంటుంది. బిల్లులోని సెక్షన్‌ 23(1) ప్రకారం ఒక రాష్ట్రం ఆనకట్టలు మరోరాష్ట్రం భూభాగంలోకి విస్తరించి ఉన్నప్పుడు, ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కారానికి రంగంలోకి దిగే జాతీయ ఆనకట్ట భద్రత ప్రాధికార సంస్థ రాష్ట్ర ఆనకట్ట భద్రత సంస్థ పాత్ర పోషిస్తుంది. అప్పుడు అంతర్రాష్ట్ర వివాదాలకు అసలైన కారణాలు పక్కదారి పడతాయన్నది తమిళనాడు ఆందోళన. ఆ రాష్ట్రంలోని ముళ్ళపెరియార్‌, పరంబికులం, తునక్కదవు, పెరువరిపళ్ళం ఆనకట్టలు కేరళ భూభాగంలోకి విస్తరించి ఉన్నాయి. ఆ రాష్ట్రాల మధ్య ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల మేరకు ఈ ఆనకట్టల మీద హక్కులు ఎవరివనేదీ ఆధారపడి ఉంటుంది. బిల్లులోని నిబంధనలు అమలులోకివస్తే ఆనకట్ట యజమాని అయిన రాష్ట్రానికి ఇతర రాష్ట్ర భూభాగంలో ఉన్న ఆనకట్ట నిర్వహణ, భద్రతలకు సంబంధించిన హక్కులుండవు. కర్ణాటక, కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాలూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. భద్రత సమస్య ముసుగులో రాష్ట్రాల నియంత్రణను తగ్గించే ప్రయత్నంలో కేంద్రం ఉందని అవి స్పష్టీకరిస్తున్నాయి. ఆనకట్టల నిర్వహణపరమైన భద్రతకంటే, నిర్మాణ పరమైన భద్రతమీదే బిల్లు ఎక్కువగా దృష్టి సారించిందని వాదిస్తున్నాయి. చట్టం అమలులో రాష్ట్రాల హక్కులను, ఆనకట్టల భద్రతా ప్రమాణాలను వేర్వేరుగా కేంద్రం చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ అమలవుతున్న రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవహరించడం ముఖ్యం. రాష్ట్రాల అభ్యంతరాలు, వాదనలను పరిగణనలోకి తీసుకుని భద్రత ప్రమాణాల పరిరక్షణకే పరిమితం కావాలి. అప్పుడే చట్టాన్ని స్ఫూర్తిదాయకంగా అమలు చేసేందుకు రాష్ట్రాలూ కలిసివస్తాయి!


- నీలి వేణుగోపాల్‌రావు
Posted on 05-08-2019