Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఇదెక్కడి న్యాయం?

అపరిష్కృత వ్యాజ్యరాశి కింద పడి సంవత్సరాల తరబడి నలిగిపోతున్న అసంఖ్యాక కక్షిదారుల దురవస్థ దేశంలో న్యాయ అవ్యవస్థను కళ్లకు కడుతోంది. న్యాయస్థానాల్లో ఏళ్లూపూళ్లూ కొనసాగుతున్న విచారణ తంతు ముగిసి కేసులు ఒక కొలిక్కి వచ్చేసరికి తరాలే మారిపోతున్న పర్యవసానంగా- ఈ గడ్డమీద సత్వర న్యాయం ఎండమావేనన్న నిరాశానిస్పృహలు జనబాహుళ్యంలో గూడు కట్టుకుంటున్నాయి. పెండింగ్‌ కేసుల తీవ్రత ఎంత దుస్సహ స్థితికి చేరిందో సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తాజాగా ప్రస్తావించిన గణాంకాలు తెలియజెబుతున్నాయి. ఎకాయెకి రెండుకోట్ల పదిలక్షల మేర క్రిమినల్‌ వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్న దేశం మనది. కోటికిపైగా కేసులలో సమన్లే జారీ కాలేదంటున్న జస్టిస్‌ గొగోయ్‌, ఇరవై అయిదు సంవత్సరాలుగా మోక్షం దక్కనివి రెండు లక్షలకు మించాయని, సుమారు వెయ్యి దావాలు యాభై ఏళ్లుగా కోర్టుల్లో గిరికీలు కొడుతూనే ఉన్నాయని నిష్ఠుర సత్యం వెల్లడించారు. మూడున్నర దశాబ్దాలుగా శ్లేష్మంలో పడ్డ ఈగల్లా గిజగిజలాడుతున్న కేసుల సంఖ్య 51వేల పైమాటేనన్న గణాంక విశ్లేషణ ఆరు నెలల కిందట వెలుగుచూసింది. జాతీయ న్యాయ సమాచార గ్రిడ్‌ క్రోడీకరించిన వివరాల ప్రకారం, ఒక్క సుప్రీంకోర్టులోనే పెండింగ్‌ కేసులు 58వేలకు పైబడగా- దిగువన జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో రెండుకోట్ల 70లక్షలదాకా అపరిష్కృత వ్యాజ్యాలు పోగుపడి ఉన్నాయి. పదేళ్లకుపైగా పెద్దయెత్తున పెండింగ్‌ కేసులు పేరుకుపోయిన జాబితాలో అలహాబాద్‌, బాంబే, పంజాబ్‌-హరియాణా, కలకత్తా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టులు ముందున్నాయి. దిద్దుబాటు చర్యలు చురుకందుకొనకపోతే ఇంకో రెండు దశాబ్దాల్లో దేశీయంగా పెండింగ్‌ కేసుల సంఖ్య 15కోట్లకు పెచ్చరిల్లుతుందంటున్నా- న్యాయసంస్కరణల ప్రక్రియ పడకేయడం... ఇదెక్కడి న్యాయం?

భారత రాజ్యాంగంలోని 39 ఏ అధికరణ ‘ఏ కారణంగానైనా ప్రజానీకానికి న్యాయం దుర్లభం కాకుండా ప్రభుత్వమే కాచుకోవా’లని స్పష్టీకరిస్తోంది. దురదృష్టవశాత్తు, జనబాహుళ్యానికి సత్వర న్యాయం దక్కనివ్వకుండా ప్రధానంగా సర్కారీ యంత్రాంగమే సైంధవ పాత్ర పోషిస్తోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లు న్యాయమూర్తులు, కోర్టుల సంఖ్య ఎప్పటికప్పుడు విస్తరించేలా వ్యవస్థాగత ఏర్పాట్లు కొరవడటం లక్షలాది కక్షిదారుల కుటుంబాల్లో ఆరని వేదనాగ్నులు రగిలిస్తోంది. ప్రతి పది లక్షల జనాభాకు ఫ్రాన్స్‌లో 124మంది, అమెరికాలో 108 మంది న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పది లక్షల భారతీయులకు 50మంది చొప్పున న్యాయాధీశులు కొలువు తీరాలని లా కమిషన్‌ 1987లోనే సిఫార్సు చేసినా, ఇప్పటికీ ఆ నిష్పత్తి 20 లోపే తచ్చాడుతోంది. మున్సిఫ్‌ జడ్జి మొదలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఏటా సగటున తలా రెండున్నర వేలకుపైగా తీర్పులిస్తున్నా కరగని పెండింగ్‌ కొండల పని పట్టడానికి- 70వేల మంది వరకు న్యాయాధీశులు అవసరమవుతారన్నది, జస్టిస్‌ టీఎస్‌ ఠాకుర్‌ మూడేళ్లక్రితం చెప్పిన లెక్క. సర్వోన్నత న్యాయస్థానం నుంచి దిగువ కోర్టు దాకా మంజూరైన కొలువులే దాదాపు 24 వేలు. అందులోనూ ఖాళీలు భర్తీ కాకపోవడం, దేశంలో పెను న్యాయ సంక్షోభ మూలాల ఆనవాళ్లను పట్టిస్తోంది. న్యాయమూర్తులు, ఇతరత్రా సిబ్బంది నియామకాలు తగినంతగా వేగం పుంజుకొనకపోవడంతోపాటు మరో రెండు కీలకాంశాలకు సంబంధించిన వైఫల్యాలూ న్యాయార్థుల్ని మానసికంగా, ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి.

కోర్టు గుమ్మం తొక్కకముందే సామరస్యపూర్వకంగా వివాద పరిష్కరణ యత్నాలు; కేసు నమోదయ్యాక దర్యాప్తు, విచారణ వేగిరం పూర్తయ్యేలా పకడ్బందీ విధివిధానాల కూర్పు, అమలు- అన్నింటా వైఫల్యం మూలాన దేశంలో పెండింగ్‌ కొండలు ఇంతలంతలవుతున్నాయి. అమెరికాలో 90శాతం మేర సివిల్‌ కేసుల్ని మధ్యవర్తిత్వ మార్గంలోనే చక్కబెడుతున్నారు. వివిధ కోర్టుల కంప్యూటరీకరణ, వాటి అనుసంధానం చేపట్టిన జన చైనా మూడు నెలల గడువులో విచారణ, శిక్షల ఖరారు తెమిలిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే ఇక్కడ, వకీళ్లు కోరడమే తడవుగా కేసులు వాయిదాలపై వాయిదాలు పడటం పరిపాటిగా మారింది. రాజకీయ కక్షతో, పన్నులూ రుణాల ఎగవేతే లక్ష్యంగా ఎడాపెడా దాఖలయ్యే వ్యాజ్యాల వడపోత అధికారాన్ని కోర్టులకు కట్టబెట్టాలని దశాబ్దం క్రితమే న్యాయ సంఘం సూచించినా ఒరిగిందేముంది? రకరకాల కారణాలతో కొన్నేళ్లపాటు కేసులు అపరిష్కృతంగా ఉండిపోకుండా ప్రతి హైకోర్టులోనూ ప్రత్యేక విభాగం నెలకొల్పాలన్న మలీమత్‌ కమిటీ సిఫార్సుల స్ఫూర్తీ ఆచరణలో కొల్లబోతోంది. ప్రభుత్వం బాధ్యతాయుత కక్షిదారుగా మెలగేలా ఆస్ట్రేలియా రూపొందించిన విస్తృత మార్గదర్శకాల సరళి ఎవరికైనా శిరోధార్యం. మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహించి, వాయిదాల సంస్కృతిపై వేటు వేసి; బ్రిటన్‌ తరహాలో పౌర న్యాయ ప్రక్రియ నిబంధనల్ని సరళీకరించి, కేసుల నిర్వహణలో మార్గదర్శకాలు క్రోడీకరించి అమలుపరచడమే- ఇప్పుడు దేశీయంగా అనుసరణీయ మార్గం. అందుకు ప్రజాప్రభుత్వాలు తు.చ. తప్పక కట్టుబాటు చాటి, నిబద్ధ కృషి సాగిస్తేనే- వ్యాజ్యాల పరిష్కరణ కాలావధి గణనీయంగా తగ్గుతుంది. కక్షిదారులపై వ్యయభారమూ కనిష్ఠ స్థాయికి దిగివస్తుంది. కొరగాని చట్టాల్ని మూసిపెట్టి, కాలం చెల్లిన విచారణ పద్ధతులకు చెల్లుకొట్టే సమగ్ర సంస్కరణలే కక్షిదారులకు సంపూర్ణంగా న్యాయం ప్రసాదించగలిగేది!


Posted on 06-08-2019