Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

రక్షణలో ఒకరికి ఒకరం!

భారత-అమెరికాల బంధం ఒకప్పటితో పోలిస్తే గత దశాబ్ద కాలంలో అనూహ్యంగా పురోగమించిన మాట వాస్తవం. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాల మధ్య ప్రస్తుతం నెలకొన్న స్నేహబంధాన్ని చూస్తే.. ఈ కొద్ది నెలల సమయంలోనే మైత్రీబంధం మరొక మెట్టుపైకి ఎక్కిందని చెప్పచ్చు. ప్రధాని మోదీ ఇటీవలి అమెరికా పర్యటనలో భాగంగా ఒబామాను భారత్‌కు రమ్మని ఆహ్వానించటం.. మరో ఆలోచన లేకుండా, ఇప్పటికే ఒకసారి భారత్‌ వెళ్లొచ్చామని కూడా చూడకుండా సంప్రదాయాలను పక్కనబెట్టి మరీ ఒబామా వెంటనే సంసిద్ధత వ్యక్తం చెయ్యటం.. వెంటనే ఇది కార్యరూపం దాల్చి.. ఈ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా భారత గడ్డపై కాలుమోపుతుండటం.. చకచకా జరిగిపోయిన ఈ పరిణామాలన్నీ వీరిద్దరి మధ్య కుదిరిన మైత్రికి అద్దం పడుతున్నాయని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మోదీ-ఒబామాల మధ్య జరిగే చర్చల్లో అణు, వాణిజ్య వ్యవహారాలతో పాటు రక్షణ అంశాలు కూడా కీలకంగా నిలవబోతున్నాయి.

రష్యా నుంచి అమెరికా వైపు!

ఒకప్పుడు మనకు రక్షణ ఆయుధ సామగ్రి అంటే.. దాదాపుగా అన్నీ రష్యా నుంచే వచ్చేవి. లేదంటే ఇజ్రాయెల్‌ నుంచి కొనుక్కునేవాళ్లం. అయితే గత దశాబ్ద కాలంగా భారత-అమెరికాలు దగ్గరైన కొద్దీ ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనకు అమెరికానే అతిపెద్ద ఆయుధ సరఫరాదారు! ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రభుత్వమే గత ఆగస్టులో వెల్లడించింది. నిజానికి గణాంకాలు చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు భారత్‌, అలాగే అతిపెద్ద ఎగుమతిదారు అమెరికా! అందుకే మన రెండు దేశాలకూ రక్షణ రంగం అత్యంత కీలకంగా నిలుస్తోంది. 2005లో రెండు దేశాలూ కుదుర్చుకున్న నూతన రక్షణ భూమిక ఒప్పందం (న్యూ ఫ్రేమ్‌వర్క్‌ అగ్రిమెంట్‌) రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలకు బలమైన పునాది వేసింది. రక్షణ రంగంలో ఇరుదేశాలకూ లబ్ధిచేకూర్చే అన్ని అంశాల్లోనూ చొరవ చూపించాలన్నదే ఈ ఒప్పంద సారాంశం. తరచుగా ద్వైపాక్షిక రక్షణ చర్చలు జరపాలనీ, సర్వీసుల స్థాయిలో తరచూ నిపుణుల మార్పిడులను ప్రోత్సహించాలనీ, రక్షణ పరికరాలు-పరిజ్ఞానాల విషయంలో సహకరించుకోవాలని.. ఈ ఒప్పందం బలమైన భూమిక వేసింది. దీంతో 2005 నుంచీ రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో సరికొత్త వూపు స్పష్టంగా కనబడుతోంది. రెండు దేశాల మధ్యా రక్షణ వాణిజ్యం అనూహ్యంగా పెరిగింది. అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లు సగటున 10,00 కోట్ల డాలర్లు దాటిపోయాయి. మార్చి 2009లో ఒబామా ప్రభుత్వం కీలకమైన నౌకాదళ యుద్ధ విమానాలను భారత్‌కు విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. 210 కోట్ల అమెరికా డాలర్ల భారీ ఒప్పందం ఇది. దీనికింద పి-8 పోసిడన్‌ విమానాలను భారత్‌కు విక్రయిస్తారు. అటు నీటిలోని జలాంతర్గాములనూ, ఇటు ఉపరితలం మీది దళాలతో కూడా యుద్ధం చేసే అరుదైన సామర్థ్యం గల ఈ అత్యాధునిక విమానాలను అమెరికా నౌకాదళమే రూపొందించింది. వీటితో పాటు బోయింగ్‌ సి-17 సైనిక రవాణా బోయింగ్‌ విమానాలను, జనరల్‌ ఎలక్ట్రిక్‌ ఎఫ్‌414 ఇంజిన్లను కూడా విక్రయించేందుకు 500 కోట్ల అమెరికా డాలర్ల ఒప్పందం కూడా కుదిరింది. ఈ రెంటినీ 2010లో భారత్‌ వచ్చినప్పుడు స్వయంగా ఒబామానే ప్రకటించారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ను అత్యంత కీలకమైన భాగస్వామిగా భావిస్తున్న నేపథ్యంలో భారత్‌కు రక్షణ సహకారం కూడా చాలా అవసరమని ఒబామా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

బలపరిచే పనిలో ఎన్నో బృందాలు!

రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరుదేశాలూ కూడా నానాటికీ విధానాలను మరింతగా సరళీకరించుకుంటూ వస్తున్నాయి. బలపడుతున్న బంధాన్ని మరింత వ్యవస్థీకృతం చేసేందుకు 2013లో రక్షణ సహకారం కోసం ఒక సంయుక్త ప్రకటన కూడా చేశారు. దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఒక స్పష్టమైన దిశానిర్దేశనం చేసేందుకు రక్షణ విధాన బృందం (డీపీజీ) ఒకటి ఏర్పాటైంది. ఇక రకరకాల స్థాయుల్లో చర్చలు జరిపేందుకు, పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించేందుకు రక్షణ సంయుక్త కార్యాచరణ బృందం (డీజేడబ్ల్యూజీ), రక్షణ సమీకరణ, ఉత్పాదన బృందం (డీపీపీజీ), ఉన్నతస్థాయి సాంకేతిక రక్షణ బృందం (ఎస్‌టీఎస్‌జీ), సంయుక్త సాంకేతిక బృందం (జేటీజీ), సైనిక సహకార బృందం (ఎంసీజీ) వంటి ఎన్నో బృందాలు విస్తృతంగా కృషి చేస్తున్నాయి. రక్షణ సంబంధాలను- ప్రస్తుతం పరికరాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేసే వరకూ తీసుకువెళ్లాలని, ఉమ్మడిగా పరిశోధనలు కూడా సాగించాలని కృత నిశ్చయంతో పని చేస్తున్నారు.

ఇబ్బందులూ పెద్దవే!

రక్షణ సహకారం విషయంలో ప్రధానంగా రెండు అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. 1. రక్షణ తయారీ రంగంలో విదేశీ కంపెనీల ప్రమేయాన్ని భారత్‌ అంతగా ఇష్టపడటం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రక్షణ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు మెజారిటీ వాటా ఉండటానికి వీల్లేదు. ఇది అమెరికా కంపెనీలకు ఇబ్బందిగా తయారైంది. 2. అమెరికా ప్రభుత్వం కూడా కొన్ని రకాల రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను ఎగుమతి చెయ్యటానికి వీల్లేదని నిబంధనలు విధించింది. ఈ రెండూ ప్రతిబంధకాలుగానే ఉన్నాయి. దీన్ని ఎలాగైనా అధిగమించి రక్షణ బంధాన్ని పటిష్ఠపరచాలని ఒబామా-మోదీ ఇద్దరూ గట్టిగా భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా రక్షణ వాణిజ్య, సాంకేతిక కార్యక్రమం (డీటీటీఐ) కింద సంయుక్త కృషిని విస్తరించాలని రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా ఒప్పందానికి తుదిరూపం ఇస్తున్నట్టు సమాచారం. శిఖరాగ్ర చర్చల అనంతరం ఆదివారం ఒబామా-మోదీలు ఇద్దరూ దీని గురించి ఒక ప్రకటన చెయ్యొచ్చని భావిస్తున్నారు. ఈ ఒప్పందం కింద సంయుక్తంగా రక్షణ పరికరాల అభివృద్ధి, ఉత్పత్తి.. రెండూ చేపట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక కాలంలో దాడులకు కీలకంగా ఆవిర్భవించిన డ్రోన్ల తయారీలో ఇరుదేశాలూ కలిసి కృషి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రెండోది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, ఆపదల్లో కూడా రక్షణ పరికరాలను, సహాయ సామగ్రిని మోసుకుపోయేందుకు ఉపయోగపడే అత్యాధునికమైన సి-130 యుద్ధవాహక విమానాల తయారీకి అవసరమైన పరికరాలను కూడా సంయుక్తంగా తయారు చేసేందుకు కూడా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

(ఈనాడు ప్రత్యేక విభాగం)
Posted on 24-01-2015