Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కశ్మీరుపై పులి స్వారీ!

‘కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కార సాధనలో భాగంగా మనం గతంలో మాటిమాటికీ అనుసరించిన మూస పద్ధతుల్ని ఆశ్రయించకూడదు... యావత్‌ దక్షిణాసియా ప్రాంతానికీ శాంతి సౌభాగ్య రూపశిల్పులుగా మనం సాహసోపేతమైన వినూత్న చర్యలు తీసుకోవాలి’- 2001 జనవరి ఒకటిన స్వీయ మనోగతానికి భారత ప్రధానిగా వాజ్‌పేయీ ఇచ్చిన అక్షర రూపమది. ‘ఏక్‌ దేశ్‌ మే దో విధాన్‌, దో ప్రధాన్‌, ఔర్‌ దో నిశాన్‌ నహీ చలేగా!’ అన్నది జనసంఘ్‌ కాలం నుంచి భాజపా మౌలిక సిద్ధాంతమైనా- కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిపై కంటే అక్కడి శాంతిభద్రతల మీదే వాజ్‌పేయీ ఏలుబడి దృష్టి పెట్టింది. ఉగ్రవాదుల పీచమణచడంలో ఇండియా మరేమాత్రం మెతక దేశం కాదన్న స్పష్టమైన సంకేతాలిస్తూ సరిహద్దులు దాటి మెరుపుదాడులు జరిపించిన మోదీ తొలి జమానా- రెండో విడత పాలన తొలి అంకంలోనే కశ్మీర్‌పై పార్టీ అజెండా అమలుకు యుద్ధప్రాతిపదికన పావులు కదిపింది. కీలక సరిహద్దు రాష్ట్రంలో పది రోజుల నుంచి జోరందుకొన్న కేంద్ర బలగాల మోహరింపు, అమర్‌నాథ్‌ యాత్ర అర్ధాంతర ముగింపు, కర్ఫ్యూ విధింపు వంటి చర్యలు ఎందుకోసమో తెలియక పార్లమెంటు సభ్యులే కిందుమీదులైన నేపథ్యంలో- 370వ అధికరణ కింద కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి, 35 (ఏ) నిబంధనల రద్దు, రాష్ట్ర విభజన ప్రతిపాదనలు యావద్దేశాన్నీ దిగ్భ్రాంతపరచాయి. 370 అధికరణ ద్వారా జమ్మూకశ్మీరుకు సంక్రమించిన ప్రత్యేక హోదాను బుట్టదాఖలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులూ జారీ అయిపోయాయి. ఇండియాలో కశ్మీర్‌ విలీనానికి, అనుసంధానానికి అసలు ప్రాతిపదికే 370 అధికరణ అని స్థానిక నేతలు ఆక్రోశిస్తుంటే, దాన్ని తొలగించడం ద్వారానే నిజమైన అనుసంధానం సాధ్యపడనుందని కేంద్ర ప్రభుత్వం తీర్మానిస్తోంది. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ఎవరి ఊహకూ అందనిది. స్థానికుల ఆకాంక్షలకు గొడుగు పడుతున్నామంటూ లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రభుత్వం- జమ్మూ కశ్మీర్‌ను చట్టసభ గల కేంద్రపాలిత ప్రాంతంగా నిర్దేశించడంలో- రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఏ మాత్రం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. తూటాలు నిందారోపణల (గోలీ యా గాలీ)తో కశ్మీర్‌ సమస్య పరిష్కారం కాదని, కశ్మీరీలను అక్కున చేర్చుకోవడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలమని 2017 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఎలుగెత్తి చాటారు. చేతల్లో ఆ స్ఫూర్తి కొడిగట్టిపోవడమే తీవ్ర ఆందోళనలకు తావిస్తోందిప్పుడు!

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను వల్లెవేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణలతో- నేడు కశ్మీర్‌ ప్రత్యేక హోదా, రాష్ట్రప్రతిపత్తితో పాటు ప్రాదేశిక సమగ్రతనూ కోల్పోయింది. ఉగ్రవాదం నుంచి అవినీతి దాకా, పేదరికం, అభివృద్ధిలేమి, ప్రజాస్వామ్యం కొరవడటం వంటి సమస్యలన్నీ కశ్మీరులో వెర్రితలలు వెయ్యడానికి 370 అధికరణే కారణమన్న కేంద్రం- అయిదేళ్లలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా జమ్మూకశ్మీరును తీర్చిదిద్దుతామంటోంది. పరిస్థితులు కుదుటపడ్డాక రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని హోంమంత్రిగా అమిత్‌ షా హామీ ఇస్తున్నా- ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘జమ్మూకశ్మీరుకు సంబంధించిన రాజ్యాంగ సభ 1956లోనే రద్దయిపోయినందువల్ల 370 అధికరణ శాశ్వతత్వాన్ని పొందింది’ అని 2016లో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఇప్పుడా అధికరణను నిష్ప్రయోజకం చేయడానికి దాని ద్వారానే దఖలుపడ్డ అధికారాన్ని ఉపయోగించి- 367 అధికరణ కింద పాత హోదాలకు కొత్త సమానార్థకాలను పేర్కొనడం ద్వారా కేంద్రప్రభుత్వం రాజ్యాంగానికి అక్షరాలా ‘బైపాస్‌ సర్జరీ’ చేసింది. ఆ మేరకు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం అంటే ఇప్పుడు గవర్నర్‌, ‘సదారి రియాసత్‌’ అన్నా గవర్నరే; కాలం చెల్లిన రాజ్యాంగసభ స్థానే రాష్ట్ర శాసనసభగా కేంద్రం చేసిన చట్టసవరణలు- ఏ మేరకు న్యాయసమీక్షకు నిలబడతాయన్నది ప్రశ్నార్థకం. కేంద్రప్రభుత్వ సలహా సూచనల అనుసారమే అటు రాష్ట్ర గవర్నర్‌, ఇటు రాష్ట్రపతి వ్యవహరించేటప్పుడు కేంద్ర సర్కారు ‘సొంత పెత్తనం’తోనే 370 అధికరణలో మార్పులకు సమకట్టినట్లయిందన్న న్యాయకోవిదుల అభ్యంతరాల్లో- సమాఖ్య స్ఫూర్తినే కదలబార్చేలా పొడగడుతోంది ప్రమాదకర కోణం! జమ్మూకశ్మీరులో చట్టసభ రద్దు జరిగి రాష్ట్రపతి పాలన అమలులో ఉండటం, పార్లమెంటు కొనసాగుతుండటం, ఉభయ సభల్లోనూ పాలక కూటమికి అనుకూల వాతావరణం- ఈ మూడూ ఉన్నపళంగా భాజపా చిరకాల అభీష్ట కార్యసిద్ధికి దోహదపడ్డాయి. మరోవంక 370 అధికరణ దన్నుతోనే దాన్ని నిస్సారం చెయ్యడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో కేసులు పడుతున్నాయి!

కశ్మీరులో స్థిరాస్తుల్ని కశ్మీరీలే కొనాలంటున్న 35(ఏ) నిబంధనను పరోక్షంగా తోసిపుచ్చేలా 2016 డిసెంబరులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కశ్మీరీల ‘ప్రత్యేక’ అస్తిత్వానికి పట్టుగొమ్మలాంటి ఆ నిబంధనకు సంబంధించిన కేసులో- భారత రాజ్యాంగ పరిధికి ఆవల జమ్మూ కశ్మీర్‌ రాజ్యాంగానికి ఏపాటి సార్వభౌమాధికారమూ లేదని, రాష్ట్ర రాజ్యాంగమైనా భారత రాజ్యాంగానికి లోబడిందేనని న్యాయపాలిక స్పష్టం చేసింది. తాజాగా 35(ఏ) నిబంధన రద్దుతో కీలక సరిహద్దు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ వాతావరణమే పెను మార్పులకు లోను కానుంది. దశాబ్దాలుగా భారతావని నుదుట రక్త సిందూరంలా ఉన్న కశ్మీర్‌ సమస్యను ఇన్సానియత్‌ (మానవత్వం), జమ్‌హురియత్‌ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్‌ (మతసామరస్యానికి పాదుచేస్తున్న కశ్మీరీ సంస్కృతి) సూత్రాల ఆధారంగా పరిష్కరించగలమని 2003లో వాజ్‌పేయీ సూచించారు. దురదృష్టం ఏమిటంటే, లోయలో ఉగ్రవాదం సెలవేసిన దరిమిలా పుట్టిన వారు- బతుకు తెరువు అవకాశాల్లేక భారత వ్యతిరేకతను జీర్ణించుకొని ఇండియాపై ఉరుముతున్నారు. ‘కరుణ, సమాచార మార్పిడి, సహజీవనం, విశ్వాస పరికల్పన, విధానాల్లో స్థిరత్వం’ అనే అయిదు సూత్రాలతో చిరశాంతికి పాదుచేస్తామని మోదీ ప్రభుత్వం రెండేళ్లనాడు చెప్పినా క్షేత్రస్థాయిలో మార్పేమీ లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలను, వారి ప్రతినిధుల్ని ఏ మాత్రం విశ్వాసంలోకి తీసుకోకుండా కేంద్రం చేపట్టిన చర్యలు- ‘కొండ నాలుక్కి మందేస్తే...’ చందంగా వికటిస్తాయేమోనన్న భయాందోళనలు తోసిపుచ్చలేనివి. ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం స్వతంత్ర భారత చరిత్రలోనే లేదు. అదీ రాష్ట్ర చట్టసభ లేనప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా సంప్రతింపుల ప్రక్రియ చేపట్టకుండా కేంద్రం తీసుకొన్న నిర్ణయం- ఓ చెడు సంప్రదాయంగా మిగిలే ప్రమాదమూ లేకపోలేదు! దిల్లీ మాదిరిగా జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో, శాంతిభద్రతలు నేరుగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. లోయలో ప్రజాస్వామ్యవాదుల అసంతృప్తి, రెట్టించిన ఆవేశోద్రేకాలతో ఉగ్రమూకల అలజడి తక్షణ జంట సవాళ్ళుగా కళ్లకు కడుతున్నాయి. తాజా చర్యలతో మోదీ ప్రభుత్వం చేస్తున్నది- అక్షరాలా పులి స్వారీ!


Posted on 07-08-2019