Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

నైపుణ్య శిక్షణ గాడిన పడేనా?

కొత్త సహస్రాబ్దిలో రోజుకో తీరుగా సరికొత్త హంగులద్దుకొంటున్న సాంకేతికత మనిషి జీవితంలో ప్రతి పార్శ్వాన్నీ ప్రభావితం చేస్తున్న వేళ, వృత్తి నైపుణ్యాలకు నిరంతరం సానపట్టుకొంటేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలిగేది. దేశ జనాభాలో 54 శాతానికి పైగా పాతికేళ్లలోపు యువజనంతో పరవళ్లెత్తుతున్న భారతావని వచ్చే రెండున్నర దశాబ్దాలపాటు యువ కెరటాలతో ఎగసిపడనుంది. ప్రస్తుత, భావి అవసరాలకు దీటైన నిపుణ మానవ వనరులుగా ఈ తరాన్ని తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్డు సవాలుగా మారింది. బట్టీయం చదువుల పట్టాలు నాలుక గీసుకోవడానికీ పనికిరాక కోట్లాది యువజనం ఉపాధి వేటలో నీరసించిపోతుంటే, వృత్తి నైపుణ్యాలను వారికి ఒంటబట్టించాల్సిన ఆవశ్యకతను కేంద్రం తొలిసారిగా గుర్తించి పదేళ్లయింది. 2009నాటి జాతీయ నైపుణ్యాభివృద్ధి విధానం స్థానే 2015లో మోదీ ప్రభుత్వం కొత్తగా పట్టాలకెక్కించిన పాలసీ- 2022నాటికి ఎకాయెకి 40కోట్ల మందిని నిపుణ శక్తులుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. విస్తృత ప్రాతిపదికన దేశ ప్రజలందరికీ సుస్థిర జీవనోపాధికి భరోసా ఇచ్చేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలను వేగవంతంగా అందించి, కొత్త ఆవిష్కరణల నయా పారిశ్రామిక సంస్కృతికి పాదు చెయ్యాలన్న ఘనతర సంకల్పం వెలుగు చూసి నాలుగేళ్లు దాటింది. ‘కౌశల్‌ వికాస్‌ యోజన’ తొలి దశలో 19.85 లక్షలమందికి శిక్షణ ఇస్తే 2.62 లక్షల (13.23శాతం) మందే ఉపాధి పొందగలిగారన్న కేంద్ర ప్రభుత్వం- 2016 అక్టోబరునుంచి జూన్‌ 2019 మధ్య నైపుణ్య శిక్షణ పొందిన 52.12 లక్షల మందిలో 12.6 లక్షలమందికి జీవనోపాధి లభించిందని ఇటీవలే వెల్లడించింది. ‘నైపుణ్య భారత్‌’ లక్ష్యాలు ఇంత దారుణంగా గురితప్పుతున్న నేపథ్యంలో- భిన్న మంత్రిత్వశాఖల్లో అమలవుతున్న నైపుణ్య కార్యక్రమాలన్నింటినీ ఒకే గూటికి చేర్చి, రాష్ట్రాలకూ గురుతర బాధ్యత కట్టబెట్టి 2021-’25 నడుమ అమలయ్యే మలివిడతలో ఉట్టి కొట్టాలని కేంద్రం తలపోస్తోంది. గట్టి సంకల్పాన్ని వెన్నంటి పటిష్ఠ వ్యూహ రచన, దాని అమలులో పారదర్శకత జవాబుదారీతనాలకు చోటు పెడితేనే సత్ఫలితాలు సాకారమవుతాయి.

సేద్య రంగమే పెను సమస్యల పద్మవ్యూహమైన ఇండియాలో విస్తృత శ్రామిక శక్తికి వ్యవసాయం అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఉపాధి అవకాశాలు పారిశ్రామిక సేవా రంగాల్లో మెండుగా ఉన్నా వాటిలో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు యువజనానికి లేవు. దక్షిణ కొరియాలో 96శాతం, జపాన్‌లో 80 శాతం, జర్మనీలో 75శాతం, యూకేలో 68శాతం కార్మికులు వృత్తి నైపుణ్యాల ఆలంబనతో రాణిస్తుంటే, ఇండియాలో ఆ సంఖ్య పట్టుమని అయిదు శాతమైనా లేకపోవడమే బాధాకరం. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం తైవాన్‌ స్థూల దేశీయోత్పత్తిలో 85శాతం వాటా కలిగి ఉంటే, చైనాలో అది 60శాతం, సింగపూర్‌లో 50శాతంగా నమోదవుతోంది. భారత్‌ జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 30శాతానికి లోపే ఉండటం- ఎవరి కాళ్లమీద వాళ్లు బతికే నైపుణ్యాలు లేని శ్రామిక శక్తి బలహీనతకే అద్దంపడుతోంది. ‘దేశీయ పరిశ్రమల మానవ వనరుల గిరాకీని తీర్చడానికే కాదు... అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ కార్యక్రమాలను రూపుదిద్దడం ద్వారా అమెరికా, రష్యా, చైనా, జపాన్‌, పశ్చిమాసియాతో పాటు స్పెయిన్‌కూ నిపుణ శ్రామిక శక్తిని అందించే ప్రణాళిక’ను 2014 సెప్టెంబరులో కేంద్ర సర్కారు ప్రస్తావించింది. దురదృష్టం ఏమిటంటే 70శాతం యువ జనానికి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలున్నాయన్న సంగతే తెలియదని నిరుడు ఓ అధ్యయనం స్పష్టీకరించింది. నైపుణ్య శిక్షణ పొందిన వారిలోనూ 75శాతానికి పైగా నిరుద్యోగం కోరల్లోనే విలవిల్లాడుతున్న దుస్థితి- శిక్షణ ప్రమాణాల డొల్లతనాన్నే ఎండగడుతోంది. ప్రైవేటు నైపుణ్య శిక్షణ కేంద్రాలు అధ్వాన స్థితిలో ఉన్నాయని పక్షం రోజులనాడు స్పష్టీకరించిన సంబంధిత శాఖ కార్యదర్శి- జాతీయ వృత్తి శిక్షణ మండలికి అనుబంధంగా గల 14 వేల పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో 84 శాతం ప్రైవేటువేనని కుండబద్దలు కొట్టారు. సమున్నత లక్ష్యం చిల్లుకుండతో నీళ్లు మోసిన చందం అవుతోందనడానికి అదే రుజువు!

నాలుగున్నర దశాబ్దాల్లోనే అత్యధిక నిరుద్యోగిత దేశీయంగా గుడ్లురుముతోంది. యూపీఏ ప్రభుత్వం 2004-’14 మధ్య విద్యారంగంలో సంస్కరణలు చేపట్టకపోవడంతో నైపుణ్యాలు లేని యువజనం ఉద్యోగ మార్కెట్లను ముంచెత్తడమే పెను సంక్షోభంగా మారింది. పట్టాలకంటే నైపుణ్యాలు ముఖ్యమని, ఉద్యోగాలున్నా వాటికి తగ్గ నిపుణులే కొరవడ్డారన్న దిగ్గజ సంస్థ ఐబీఎమ్‌ అధిపతి గిన్నీ రొమెట్టీ- ఈ విషయంలో పరిశ్రమలు, ప్రభుత్వం కలసి పని చెయ్యాలని సూచిస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఉపాధి రంగంలో కొన్ని కోట్ల ఉద్యోగాలను ఊడ్చేసినా, మరెన్నో కోట్ల ఉపాధి అవకాశాలకు తలుపులు తెరవనుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖనే పెట్టి, భారత్‌లో తయారీకి దానితో అంటుకట్టి ఆవిష్కరించిన ప్రణాళిక గురికి బారెడు దూరంగా తెల్లమొగమేయడానికి- కర్ణుని చావుకు ఉన్నన్ని కారణాలున్నాయి. తొలి విధానం దరిమిలా పదేళ్ల అనుభవాలనుంచి పాఠాలు నేర్చి సరైన దిద్దుబాట్లతో చకచకా సిద్ధమైతేనే 2020-’25 కార్యాచరణ సత్ఫలితాలు అందించగలుగుతుంది. కొత్తతరం ఉద్యోగాలపై దృష్టిసారిస్తామంటున్న కేంద్రం- ఆయా శిక్షణ సంస్థల్ని నేరుగా సంబంధిత పరిశ్రమలతో అనుసంధానించడం ప్రయోజనకరమవుతుంది. ఉపాధి విపణి అవసరాలు, అవకాశాల్ని నిరంతరం మదింపు వేస్తూ ఉద్యోగార్హ నైపుణ్యాల్ని, నయా ఆవిష్కరణల కౌశలాన్ని యువజనంలో నింపేలా యుద్ధ ప్రాతిపదికన కదిలితేనే- దేశం ధీమాగా పురోగమించగలిగేది!


Posted on 09-08-2019