Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

వైద్యరంగానికి చికిత్స

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవల నాణ్యత, అందుబాటు పరంగా 145వ స్థానాన అంగలారుస్తున్న దేశం మనది. ఇరుగుపొరుగున చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్లతో పోల్చినా ఇండియా వెనకబాటు- దేశారోగ్య రంగంలో నెలకొన్న సంక్షోభానికి అద్దంపడుతోంది. వైద్యవిద్యలో సర్వశ్రేష్ఠ ప్రమాణాలు, భారతీయులందరికీ నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యమంటూ ఆవిర్భవించిన భారతీయ వైద్యమండలి (ఎమ్‌సీఐ) దశాబ్దాల సర్వభ్రష్ట నిర్వాకాల ఫలితమే ఇది. ఇరవై ఒకటో శతాబ్దిలో వైద్య విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా కాచుకోవాలంటే, సమూల సంస్కరణల్ని సత్వరం పట్టాలకెక్కించాల్సిందేనని సర్వోన్నత న్యాయపాలిక కొన్నేళ్ల క్రితమే స్పష్టీకరించింది. అందుకు అనుగుణంగా ఎమ్‌సీఐ స్థానే జాతీయ వైద్యసంఘం (ఎన్‌ఎమ్‌సీ) ఏర్పాటుకు ఎన్‌డీఏ తొలి జమానాలో జరిగిన యత్నాలు విఫలమైపోగా- కొత్త లోక్‌సభ తొలి భేటీలోనే ఎన్‌ఎమ్‌సీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. రాష్ట్రపతి చేవ్రాలూ పూర్తికావడంతో త్వరలో గెజెట్‌ నోటిఫికేషన్‌ వెలువరించి, దరిమిలా ఆరు నెలల్లో నిబంధనలు క్రోడీకరిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ చెబుతున్నారు. ఎన్‌ఎమ్‌సీ చట్టాన్ని ప్రగతిశీల శాసనంగా శ్లాఘిస్తూ- విద్యార్థులపై భారం తగ్గింపు, వైద్యవిద్యలో నిజాయతీ పెంపు, ఖర్చు కుదింపు, నిబంధనల సరళీకరణ ద్వారా దేశవ్యాప్తంగా వైద్యకళాశాలలో సీట్ల పెంపు, నాణ్యమైన చదువుల ద్వారా విస్తృత జనావళికి మెరుగైన వైద్యసేవలు ఇకమీదట అందుబాటులోకి వస్తాయని ఆయన భరోసా ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు సమ్మె సైరన్‌ మోగించి ఆందోళన బాటపట్టడానికి అనవసర భయాందోళనలే కారణమంటూ, బిల్లులో వివాదాస్పద అంశాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరణ దయచేసింది. రుసుముల నియంత్రణ, నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌) పేరిట ఎమ్‌బీబీఎస్‌ కోర్సు అనంతర పరీక్ష, మధ్యస్థాయిలో సామాజిక ఆరోగ్య ప్రదాతల పేరిట పరిమిత లైసెన్సుల మంజూరు వంటి వివాదాస్పద అంశాల్లో పార్లమెంటు స్థాయీసంఘం సూచనల్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శల నేపథ్యంలో- కొత్తచట్టం ఎంత ప్రగతిశీలం కానుందో చూడాలి!

ఇండియాలో అల్లోపతి వైద్యసేవలందిస్తున్న వారిలో ఎకాయెకి 57.3 శాతానికి ప్రామాణిక అర్హతలూ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన 2016 నాటి నివేదిక ఎలుగెత్తి చాటింది. ఆ నివేదిక తప్పులతడక అని నిరుడు జనవరిలో లోక్‌సభాముఖంగా నాటి ఆరోగ్యమంత్రి నడ్డా తోసిపుచ్చినా- అది నిజమేనన్న వాస్తవానికి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజా వివరణే అద్దం పట్టింది. ప్రతి వెయ్యి మంది రోగులకు ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు దేశీయంగా డాక్టర్లు లేరని, ఉన్నవాళ్లలోనూ నగరాలు గ్రామాల మధ్య వైద్యుల నిష్పత్తి 3.8:1గా ఉండటంతో గ్రామీణులు, పేదలకు నాణ్యమైన సేవలు అందడం లేదంటూ- వైద్యపరమైన అర్హత లేకుండానే 57.3 శాతం అల్లోపతిలో సేవలందిస్తున్నారని సర్కార్‌ అంగీకరించింది! వచ్చే మూడేళ్లలో మధ్యస్థాయిలో లక్షన్నర మంది ఆరోగ్య సంరక్షకుల అవసరం ఉందని గత్యంతరం లేనిస్థితిలో తాత్కాలిక ప్రాతిపదికన ఆరోగ్య స్వాస్థ్య కేంద్రాల బాధ్యుల్ని కొంత శిక్షణ ఇచ్చి తీసుకోవాల్సి వస్తోందని వివరించింది. థాయ్‌లాండ్‌, యూకే, చైనాలతోపాటు న్యూయార్క్‌లోనూ ఆ తరహా ప్రయోగాలు సఫలమయ్యాయని కేంద్రం చెబుతున్నా- స్థానికావసరాల మేరకు ఆయా రాష్ట్రాలే ఆ నియామకాలు చేపట్టే వెసులుబాటు ఉండాలని ప్రొఫెసర్‌ రామ్‌గోపాల్‌ యాదవ్‌ సారథ్యంలోని స్థాయీ సంఘం నిరుడు మార్చిలో సూచించింది. లక్షలాది నకిలీ డాక్టర్లు పుట్టుకొచ్చే ప్రమాదంపై వ్యక్తమవుతున్న ఆందోళనల్ని ఎన్‌ఎమ్‌సీ చట్టం ఏ ప్రమాణాల అమలు ద్వారా దూరం చెయ్యగలుగుతుందో చూడాలి. ఎమ్‌బీబీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షతో జాతీయ అర్హత పరీక్షను అనుసంధానించాలన్న స్థాయీసంఘం సూచనను మన్నించిన కేంద్రం- దాన్ని రాష్ట్రస్థాయికే పరిమితం చేయాలని, పీజీ ప్రవేశ పరీక్ష మెరిట్‌ ర్యాంకులకు దాన్ని వినియోగించరాదన్న సిఫార్సుల్ని తోసిపుచ్చింది. ఒక్క పరీక్షతో మూడు లక్ష్యాలు సాధించాలన్న సర్కారు సంకల్పం ఏ మేరకు ప్రయోజనకరమో అనుభవంలోనే నిగ్గుతేలనుంది!

సకాలంలో సరైన వైద్యం అందితే ప్రాణాంతకం కాని 32 రకాల వ్యాధులు, గాయాల పాలబడి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభాగ్యులు కడతేరిపోతున్నారో అధ్యయనం చేస్తే, ఆ సూచీలో ఇండియా 154వ స్థానంలో అలమటిస్తోంది. దేశంలో 20లక్షలమంది వైద్యులు, 40లక్షల మంది నర్సులకు కొరత ఉందని ఆరోగ్య భారత్‌ నివేదిక లోగడే వివరించింది. ఈ దయనీయ వాతావరణంలో- నకిలీ నాటు వైద్యుల తాకిడి నుంచి బయటపడి గ్రామీణ వైద్యరంగం తేరుకునేలా వ్యూహాలు పట్టాలకెక్కాల్సిందే. సరైన వైద్యుల సేవల్ని పల్లెల దాకా విస్తరించడానికి మరో ఏడెనిమిదేళ్లు పడుతుందన్న అంచనాల్నిబట్టి- తాత్కాలిక ఏర్పాట్లలోనూ ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం లేకుండా కాచుకోవాల్సిందే! వైద్య విద్యారంగం సమూల క్షాళనలో భాగంగా కొలువుతీరనున్న నాలుగు స్వతంత్ర బోర్డుల కార్యకలాపాల సమన్వయం విధానాల రూపకల్పన చేసే అత్యున్నతాధికార సంస్థగా ఎన్‌ఎమ్‌సీ విశిష్ట పాత్ర పోషించనుంది. నాలుగింటిలో ఒకటైన ఎథిక్స్‌ అండ్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డును ఎన్‌ఎమ్‌సీ పరిధి నుంచి తప్పించాలని, దానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సారథ్యం వహించేలా చూడాలన్న స్థాయీసంఘం సూచనను కేంద్రం మన్నించాల్సింది. ఎన్‌ఎమ్‌సీ నిర్ణయాలపై వివాద పరిష్కర్తగా కేంద్రప్రభుత్వమే ఉండటం రాజ్యాంగబద్ధం కాదన్న సిఫార్సుకూ మన్నన దక్కిఉంటే భేషుగ్గా ఉండేది. వైద్యవిద్యలో రుసుముల నియంత్రణకూ అన్ని జాగ్రత్తలూ తీసుకొంటామన్న కేంద్రం- ఆరోగ్య రంగంలో పెట్టుబడుల పెంపుపై దృష్టి సారించాలి. జనారోగ్యమే జాతికి మహాభాగ్యమని గుర్తించాలి!

Posted on 10-08-2019