Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కేదసకు స్వాతంత్య్రం ఎప్పుడు?

సారథ్య స్థానాల్లోని వ్యక్తుల సచ్ఛీలత సామర్థ్యాలపైనే వ్యవస్థల రాణింపు ఆధారపడి ఉంటుందన్న భారతరత్న అంబేడ్కర్‌ మాట అక్షర సత్యం. సంకుచిత రాజకీయమే రాహువై సమున్నత వ్యవస్థలకూ గ్రహణం పట్టిస్తే జాతి ప్రయోజనాలు ఎంతగా తెగటారిపోతాయన్న దానికి దశాబ్దాల చరిత్రే తిరుగులేని సాక్ష్యం. నేర న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన దర్యాప్తు ప్రక్రియలో తిరుగులేని జాతీయ సంస్థగా రాజిల్లాల్సిన కేదస (సీబీఐ)- కేంద్ర సర్కారు ‘పంజరంలో చిలుక’లా భ్రష్టు పట్టిన తీరే ఆలోచనాపరుల్ని కలచి వేస్తోంది. ఈ నేపథ్యంలో కేదస వ్యవస్థాపక సంచాలకులు ధరమ్‌నాథ్‌ ప్రసాద్‌ కోహ్లీ స్మారకోపన్యాసం చేస్తూ- కీలక దర్యాప్తు సంస్థ బలాలూ బలహీనతల్ని వివరంగా ప్రస్తావించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతనూ వివరించడం భేషుగ్గా ఉంది. నిజాయతీ, పరిశ్రమ, నిష్పక్షపాతం- ఈ మూడూ తనకు దారి దీపాలని చెప్పుకొనే కేదస, రాజకీయ బాసుల అడుగులకు మడుగులొత్తే పెడదారి తొక్కినప్పటినుంచే న్యాయ పాలిక తీవ్ర ఆక్షేపణలకు అక్షింతలకు తలవంచాల్సి వస్తోంది. సాధారణ కేసుల్లో మంచి పనితీరు కనబరుస్తున్న కేదస రాజకీయ ప్రభావంగల కేసుల్లో న్యాయ సమీక్షా ప్రమాణాలకు తగినట్లుగా రాణించలేక పోతోందని జస్టిస్‌ గొగోయ్‌ చేసిన విశ్లేషణ పూర్తిగా అర్థవంతం. కేదస చేపట్టిన కేసుల్లో శిక్షల శాతం 2014లో 69.2 కాగా 2016 నాటికి 66.8కి పడిపోయిందని రెండేళ్లనాడు ఎన్‌డీఏ ప్రభుత్వమే అంగీకరించినా- కీలక నేరాలకు సంబంధించి అది కేవలం 3.96 శాతంగా ఉందన్నది బాధాకర వాస్తవం. దిద్దుబాటు చర్యల బాటలో- ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో చట్టమే అత్యున్నతమైనదని, చట్టబద్ధ హక్కులున్న పౌరులతో మనం వ్యవహరించాలన్న మౌలిక సూత్రాల్ని గుర్తుంచుకొని ముందడుగేయాలన్నది జస్టిస్‌ గొగోయ్‌ సూచన. కేదస కన్నా మిన్నగా దాన్ని చెవికెక్కించుకోవాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కదా?

యాభై ఆరేళ్ల క్రితం ఆల్‌ ఫూల్స్‌ డే (ఏప్రిల్‌ 1) నాడు కేదసగా కొత్త రూపుదాల్చిన దర్యాప్తు సంస్థ ఇందిర జమానాలో పెంపుడు జాగిలంలా ఎలా మారిపోయిందో కళ్లకు కట్టే రుజువులు బిఎన్‌ టాండన్‌ రచించిన ‘పీఎంవో డైరీ’లో చాలా పోగుపడ్డాయి. సీబీఐని ‘కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’గా స్థిరీకరించే పోకడలు అనంతర కాలంలో సంస్థాగతమైపోయాయి. హస్తవాసి మసకబారి సంకీర్ణ సర్కార్లు కొలువుతీరడంలో ‘ఏ రోటి దగ్గర ఆ పాట’ కేదసకు కొట్టిన పిండిలా మారింది! మూడు దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్నే కుదిపేసిన రూ.64 కోట్ల బోఫోర్స్‌ ముడుపుల మేత కేసులో అంతకు నాలుగింతలు దర్యాప్తు కోసం ఖర్చు చేసి ఇదమిత్థంగా ఏమీ తేల్చలేక కేదస చేతులెత్తేసింది. రాజకీయ మేరువులనదగ్గ జయలలిత, ములాయం, మాయావతి అక్రమార్జన కేసుల్లో కేంద్రంలో మారిన ప్రభుత్వాల బాణీకి అనుగుణంగా కేదస ఎన్ని పిల్లి మొగ్గలు వేసిందీ ఇటీవలి చరిత్ర చాటుతోంది. దేశీయంగా కుంభకోణాలకే కొత్త ఒరవడి దిద్ది, ఖజానాకు లక్షా 76వేల కోట్ల రూపాయల రాబడి నష్టానికి కారణమైన 2జీ కేసులో కేదస నిష్ప్రయోజకత్వం నిశ్చేష్టపరచింది. సంకుచిత రాజకీయాల భల్లూకపు పట్టునుంచి కేదసను విముక్తం చేస్తే తప్ప జాతి విశాల హితానికి భరోసా దక్కదన్న దూరాలోచనతో 1997 డిసెంబరులో సుప్రీంకోర్టు తానుగా చొరవ చూపి- సంయుక్త కార్యదర్శి ఆపై అధికారుల మీద దర్యాప్తునకు సంబంధిత శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్న ‘సింగిల్‌ డైరెక్టివ్‌’ను కొట్టేసింది. మరో 45 ఆదేశాలతో నిఘా దర్యాప్తు సంస్థలపై కేంద్ర సర్కారు పట్టు సడలించి, వాటిలో పారదర్శకత జవాబుదారీతనాలు పెంచేలా విధి విధానాలు రూపొందించింది. ‘సుప్రీం’ ఆదేశాల స్ఫూర్తికి గోరీ కట్టేలా తదనంతరకాలంలో ఆయా ప్రభుత్వాలు చేసిన సవరణలు- హెచ్‌ఎంవీ (హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌)గా కేదసను కేంద్రం పెరట్లో కట్టేశాయి. నేరగ్రస్త నేతా గణాలకు దేశ ప్రయోజనాల్ని తాకట్టుపెట్టేశాయి!

కాలానుగుణంగా కొత్త రూపు దాలుస్తూ బహుముఖంగా విరుచుకుపడుతున్న నేరం దేశహితాన్ని కబళిస్తున్న వేళ- సంస్థాగత బలహీనతలతో దర్యాప్తు సంస్థలు కునారిల్లడం పెను ప్రమాదకరం. కేదస స్వయం ప్రతిపత్తిని కాపాడేలా చట్టబద్ధమైన దన్ను కొరవడటం, కీలక పదవుల్లో సిబ్బంది కొరత, మేలిమి ప్రమాణాల పరిశోధన శిక్షణాలయాలు లేకపోవడం, జవాబుదారీతనం లోపించడం వంటివన్నీ తక్షణం దృష్టి సారించాల్సినవేనని జస్టిస్‌ గొగోయ్‌ స్పష్టీకరిస్తున్నారు. ప్రభుత్వ పరిపాలన పరిధినుంచి కేదసకు చెందిన కొన్ని కీలకాంశాలను మినహాయించి, ‘కాగ్‌’ మాదిరిగా చట్ట ప్రతిపత్తి ఇవ్వాలనీ సూచిస్తున్నారు. అగ్ర రాజ్యమైన అమెరికా తన భద్రతను కంటికి రెప్పలా కాచుకొనే ఎఫ్‌బీఐ, సీఐఏలను ప్రత్యేక చట్ట నిబంధనల మేరకు నియంత్రిస్తోంది. రష్యా, జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లోనూ నిఘా దర్యాప్తు సంస్థలు నిర్దిష్ట శాసనాలకు లోబడే పనిచేస్తున్నాయి. అదే ఇక్కడ- వ్యవస్థ పరువు మాసేలా కేదస సంచాలకులు వీధుల కెక్కి వీరంగమాడిన జాతరను ఈ మధ్యే యావద్దేశం విస్తుపోయి పరికించింది. కీలక సంస్థల్లో అయినవాళ్లకు చోటు పెట్టాలన్న దుర్రాజకీయ ధోరణుల పర్యవసానమది. అవినీతినుంచి ఉగ్రవాదం దాకా ఎన్నో నేరాల గుట్టుమట్లను కూపీలాగాల్సిన సంస్థకు రాజకీయ శృంఖలాలు తెగిపడాలి. ఏ రాజకీయాలూ చొరబడని విధంగా కేదసను సమూలంగా సంస్కరించి, మెరికల్లాంటి సిబ్బంది, మేలిమి సాంకేతికతలతో పరిపుష్టీకరించి- దాన్ని నేరుగా పార్లమెంటుకే జవాబుదారీ చేస్తే నేర న్యాయ వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవమే ఆ మహా సంకల్పానికి నాంది కావాలి!

Posted on 15-08-2019