Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పాఠాలు నేర్చుకుంటేనే ప్రగతి

* ఏడు దశాబ్దాల భారతావని...

అయిదువేల ఏళ్ల చరిత్రగల ఒక జాతి జీవనంలో 72 సంవత్సరాలు అంత ఎక్కువ కాలం కాకపోవచ్చు. ఆర్థిక, సాంకేతిక, సామాజిక మార్పులు ప్రపంచమంతటా శరవేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో 72 ఏళ్లు అన్నది సుదీర్ఘ కాలమే! స్వతంత్ర ఫలాలను క్లుప్తంగా సమీక్షించడానికి, జాతి భవిష్యత్తుకు బాటలు వేయడానికి, అనుభవ పాఠాలు ఆచరణలో పెట్టేందుకు ఇది సరైన అదను. రోజువారీ సమస్యలతో సతమతమవుతున్న మనం గడచిన ఏడు దశాబ్దాల్లో ఒక దేశంగా సాధించిన విజయాలను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. పాశ్చాత్య ప్రజాస్వామ్యాలతో పోలిస్తే భారత్‌ ఎన్నో సవాళ్లు అధిగమించి కొద్దికాలంలోనే ఉత్తమ ఫలితాలు సాధించింది.

భిన్న భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులు, వీటన్నింటినీ మించిన కటిక పేదరికం- 1947లో ఇవీ భారత్‌కు దఖలుపడిన వారసత్వాలు. సరిగ్గా వందేళ్ల కిందట 1919లో జలియన్‌ వాలాబాగ్‌ దారుణ మారణకాండ జరిగేదాకా, దేశ నాయకత్వంగానీ సమాజంగానీ బ్రిటిష్‌వారి నుంచి స్వతంత్రం కావాలని గట్టిగా అనుకోలేదు. అంటే మన జాతి నిర్మాణం, స్వతంత్ర పిపాస, ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగ వ్యవస్థలు- ఇవన్నీ కేవలం ఒక శతాబ్ద కాలావధిలో జరిగాయి. ఈ స్వల్పకాలంలోనే చాలా గర్వించదగ్గ విజయాలు సాధించాం. హింస, రక్తపాతం లేకుండా ప్రపంచంలో ఎక్కడా చూడని రీతిలో 500కి పైగా సంస్థానాలను అనతికాలంలోనే స్వతంత్ర భారతంలో విలీనం చేయగలిగాం. దేశ విభజన సమయంలో చెలరేగిన అరాచకత్వాన్ని వేగంగా అదుపు చేసి ప్రశాంత పరిస్థితులను, సామరస్య వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగాం. బీదరికం, నిరక్షరాస్యత తాండవిస్తున్న దేశంలో వయోజన ఓటుహక్కును, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి- స్వేచ్ఛను, మానవ హక్కులను, ప్రజల స్వపరిపాలనను కాపాడుకోగలిగాం. అధికారలాలస తరచు అదుపు తప్పినా, క్రమబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా శాంతియుతంగా అధికార మార్పిడిని ప్రజల అభీష్టం ప్రకారం సాధించగలుగుతున్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ద్వారా; అన్ని భాషలకు, మతాలకు, సంస్కృతులకు సమగౌరవం, స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా- ఐక్యతను, స్వేచ్ఛను కలపగలిగాం. మతం కారణంగా ముక్కలైన దేశంలో మత స్వేచ్ఛను, సామరస్యాన్ని కాపాడగలిగాం. దేశ విభజన నేపథ్యంలో అధికార కేంద్రీకరణతో మొదలైన రాజ్యవ్యవస్థలో కొంతమేరకైనా వికేంద్రీకృత సమాఖ్య వ్యవస్థ నిలదొక్కుకుంది. చారిత్రక అవగాహన ఉన్నవారికి, ప్రపంచ ప్రజాస్వామ్య పరిణామాలను నిశితంగా పరిశీలించేవారికి, భారత్‌ సాధించిన ఈ విజయాలు ఎంత అసాధారణమో, అపురూపమో బోధపడతాయి.

విద్యారంగంలో వైఫల్యం
ఇదంతా గత వైభవ కీర్తన కాదు. భారత్‌ వంటి సంక్లిష్ట సమాజంలోను, ప్రతికూల పరిస్థితులలోనూ సరైన నాయకత్వం, వ్యవస్థాగత ఏర్పాట్లు, హేతుబద్ధ విధానాలు, ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు ఎన్ని మంచి ఫలితాలు సాధించవచ్చో ఈ విజయాలు రుజువు చేస్తాయి. నిజానికి భారత్‌ వంటి సమాజంలో సామాన్య ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే దేశ ఐక్యతను, బీదరికం నిర్మూలనను, అందరికీ అవకాశాలను, అభివృద్ధిని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించగలం. ఆహార ధాన్యాలు, పాలు, గుడ్లు, పత్తి వగైరా వ్యవసాయోత్పత్తులలో దేశం సాధించిన విజయాలు సామాన్య రైతుల భాగస్వామ్యంతో, ప్రజల కృషితో మంచి విధానాలు తోడవడం వల్ల వచ్చాయి. ఈ విజయాలు కేంద్రీకరణ వల్లో, తమను తాము దైవదూతలుగా భావించే నాయకుల వల్లో సాధ్యం కాలేదు. అవిద్య, అనారోగ్యం తాండవిస్తున్న దేశంలో చాలా ప్రాంతాల్లో జననాల రేటు తగ్గి, జనాభా పెరుగుదల అదుపులోకి వస్తున్నదంటే, అది బీద కుటుంబాల ముందుచూపువల్ల, తమ సంతానం తమకంటే ఉన్నతులు కావాలనే తపనవల్ల జరుగుతోందిగానీ- నియంతృత్వంవల్ల, కేంద్రీకరణవల్ల కాదు. ప్రభుత్వం మంచి విద్యనందించడంలో ఘోరంగా విఫలమైనా, లక్షలాది మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఆధునిక సాంకేతిక రంగాలలో నిష్ణాతులై ప్రపంచమంతటా గౌరవాన్ని, దేశంలో అభివృద్ధిని సాధిస్తున్నారంటే, అది మన సమాజంలోని ఆర్తివల్ల, బలమైన మన కుటుంబ వ్యవస్థవల్ల, తరవాత తరానికి అన్ని అవకాశాలను అందించాలనే తల్లిదండ్రుల తపనవల్ల సాధ్యమవుతోందికానీ- నాయకుల హుకుంవల్ల, అధికారుల చలవ వల్ల కాదు.

మన ముందున్న మొదటి సవాలు పేదరికం, కులపరమైన దుర్విచక్షణవల్ల పెరుగుతున్న అసమానతలను తొలగించడం. అందరికీ పుట్టుకతో సంబంధం లేకుండా ఎదిగే అవకాశాలు కల్పించి, వారి ఆదాయాలను పెంచడమే సిసలైన సవాలు. ఈ లక్ష్యాల సాధనకు ఆధునిక యుగంలో ప్రపంచమంతటా అనుసరిస్తున్న, ఫలితాలనిస్తున్న మార్గాలు మూడున్నాయి. మొదటి మార్గం: ప్రతి బిడ్డకు మంచి ప్రమాణాల విద్యను, ఉపాధికి పనికివచ్చే నైపుణ్యాన్ని ఆర్థికభారం లేకుండా అందించటం; ప్రతి కుటుంబానికి అన్ని స్థాయుల్లో ఖర్చు లేకుండా మంచి ఆరోగ్య సేవలనందించడం. ఈ విషయాల్లో భారత్‌ పరిస్థితి చాలా పేలవంగా, బాధాకరంగా ఉంది. విద్య, నైపుణ్యాల రంగంలో ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతున్నా నూటికి 80 మంది పిల్లలకు కనీస ప్రమాణాల విద్య అందడం లేదు. ఇక ఆరోగ్యానికి ప్రభుత్వ ఖర్చు జాతీయాదాయంలో ఒక శాతం మాత్రమే. అంటే ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఆరోగ్య వ్యవస్థలను బాగుచేసి ప్రజలందరికి ఖర్చులేకుండా మంచి ఆరోగ్యం అందించాలంటే అదనంగా కనీసం ఒక శాతం (జాతీయాదాయంలో) నిధులు కేటాయించాలి.

వసతుల కల్పనలో వెనకబాటు
పేదరికం తొలగించటానికి రెండో కీలక మార్గం మౌలిక సదుపాయాల కల్పన. దాదాపు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనలో 49 పెద్ద దేశాలతో పోలిస్తే భారత్‌ అట్టడుగున అయిదు స్థానాల్లో మగ్గుతోంది. మంచినీరు, వరదనీటి పారుదల, మురుగునీటి పారుదల, పారిశుద్ధ్యం, విద్యుత్తు, రోడ్లు, రవాణా- వీటన్నింటినీ మెరుగుపరచడం అవసరం. కానీ, మన చేతలు ఆ అవసరాలను ప్రతిబింబించడంలేదు. పేరుకు ప్రజాస్వామ్యం ఉన్నా అధికారాన్ని చెలాయించే తీరు, స్థాయి చాలా మేరకు అప్రజాస్వామికంగా, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండటం భారత్‌ ఎదుర్కొంటున్న రెండో పెద్ద సవాలు! చట్టబద్ధ పాలన, అధికార కేంద్రీకరణతో ముడివడిన అంశమిది. మొదటి అంశం- చట్టం అధికారంలో ఉన్నవారి బందీగా మారిపోవడం. పేరుకు మన వ్యవస్థలో చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. ప్రతి ఒక్కరూ- ప్రధానమంత్రి మొదలు బంట్రోతు వరకు- చట్టానికి లొంగి ఉండాలి. అంటే మన వ్యవస్థలను చట్టం పాలిస్తుంది కాని వ్యక్తులు కాదు. కాని వాస్తవానికి చట్టం అధికారంలో ఉన్నవాళ్లకు, కండబలం ఉన్నవాళ్లకు, డబ్బున్నవాళ్లకు బందీ అయిపోయింది. పోలీసు యంత్రాంగం చట్టానికి కాక, అధికారానికి లోబడి పనిచేయాల్సి వస్తోంది. న్యాయస్థానాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నా న్యాయమూర్తుల కొరతవల్ల, కోట్లాది కేసులు పేరుకుపోవడంవల్ల, సామర్థ్యాన్ని, జవాబుదారీతనాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, న్యాయం అందే పద్ధతిని నిర్దేశించే చట్టాలు (ప్రొసీజరల్‌ లాస్‌)- సీఆర్‌పీసీ, సీపీసీ; ఎవిడెన్స్‌ చట్టం- లోపభూయిష్ఠం కావడంవల్ల సామాన్యులకు న్యాయం దుర్లభమవుతోంది.

మరో మూడేళ్లలో స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు నిండుతాయి. ఇతర దేశాలతో పోలిస్తే మనం కొన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించాం. అలాగే మరెన్నో రంగాలలో తీవ్ర వైఫల్యాలనూ చవిచూశాం. పాశ్చాత్య దేశాల మాదిరిగా కొన్ని వందల ఏళ్లు ఓపిక పట్టి, కాలక్రమేణ ప్రజాస్వామ్యాన్ని బాగుపరచుకోవడం అన్నది ఆత్మహత్యాసదృశమే! కాలం మనకు పెద్ద శత్రువు. ప్రపంచీకరణ నేపథ్యంలో మన వైఫల్యాల వల్ల వచ్చిన అవకాశాలను అందుకుని పరిగెడుతున్న ఇతర వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలలో పెరుగుతున్న అసహనం, పక్కలో బల్లెంగా మారిన చైనా... ఇవన్నీ మన ప్రమేయం లేకుండా జరుగుతున్న ప్రపంచ పరిణామాలు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని పొరపాట్లను సరిదిద్దుకుంటేనే- ఒక దేశంగా గౌరవాన్ని పొందగలం. మన యువతకు, తరవాతి తరానికి న్యాయం చేయగలం. చిత్తశుద్ధి, నిజమైన దేశభక్తి ఉంటే 75వ స్వతంత్ర దినోత్సవం నాటికి ఈ మార్పులకు శ్రీకారం చుట్టి, జాతి భవిష్యత్తుకు రహదారి వేయగలం!

ప్రజాస్వామ్యం... నేతిబీరకాయ చందం
కేంద్రీకృత పాలనలో ప్రజాస్వామ్యం నేతి బీరకాయలో నెయ్యి లాంటిది. నిజమైన ప్రజాస్వామ్యం అంటే పౌరులకు అతి దగ్గరగా, వారికి అర్థమయ్యే రీతిలో, వారి ప్రమేయంతో, వారి జీవితాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు వాటి అమలు సైతం సక్రమంగా జరగాలి. ప్రజల ఓటుకు, వారి దైనందిన జీవితానికి; మనం కట్టే పన్నులకు- మనకందే సేవలకు; అధికారానికి- బాధ్యతకు మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పుడే ఓటు సార్థకమవుతుంది. ప్రజల ఒత్తిళ్ల కారణంగా చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. పన్నుల డబ్బుతో సేవలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కేంద్రీకృత పాలనలో పరిపాలన మేడిపండులాంటిది. దాని పొట్టవిప్పి చూస్తే పురుగులుంటాయి. ఓటుకు డబ్బు లేదా దీర్ఘకాల ప్రయోజనాలను తాకట్టు పెడితే తాత్కాలిక తాయిలాలు రాజ్యమేలతాయి. ధన రాజకీయం, దోపిడీ రాజకీయం, అధికార క్రీడే సర్వస్వంగా మారడం స్వతంత్ర భారతంలో మనమెదుర్కొంటున్న మూడో కీలక సవాలు. ఓట్ల కొనుగోలు, తాయిలాలు, కుల, మత, ప్రాంతీయ విభజనలతో ఓటు బ్యాంకులు, అవినీతి, పౌర సేవల వైఫల్యం- ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్య్రాన్ని అపహాస్యం చేస్తున్నాయి.


Posted on 15-08-2019