Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

'సహస్రాబ్ది' అలక్ష్యం

ఆకలిపై అదుపు, పేదరికంపైన గెలుపు... ఎంతటి మహత్తర ఆశయాలివి! ప్రపంచవ్యాప్తంగా ఆకలిని, పేదరికాన్ని సగానికి తగ్గించడానికి పదిహేనేళ్ల క్రితం 189 దేశాలు విధించుకున్న గడువు ఈ సంవత్సరంతో ముగిసిపోనుంది. అప్పట్లో అవి విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితరాలపైనా నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. వాటినే 'సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు'గా వ్యవహరిస్తున్నారు. అవి మొత్తం ఎనిమిది. వ్యాధుల ప్రజ్వలనాన్ని అడ్డుకోవడం, సార్వత్రిక ప్రాథమిక విద్యావకాశాలు కల్పించడం సైతం వాటిలో అంతర్భాగాలే. ఆమధ్య తీవ్ర మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుంగదీయడంతోపాటు సహస్రాబ్ది లక్ష్యాల సాధననూ గాడి తప్పించింది. క్లిష్ట పరిస్థితులకు, ద్రవ్యపరమైన సవాళ్లకు, ఇతరత్రా పరిమితులకు ఎదురొడ్డి ప్రపంచ దేశాలు గణనీయ ఫలితాలే నమోదు చేయగలిగాయంటున్నారు. 1990నాటితో పోలిస్తే తరవాతి రెండు దశాబ్దాల్లో విశ్వవ్యాప్తంగా నిరుపేదల సంఖ్యలో 70కోట్ల మేర తగ్గుదల సాధ్యపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రాథమిక విద్యాస్థాయి ప్రవేశాలు (2000లో) 83శాతం నుంచి (2011లో) 90శాతానికి విస్తరించాయి. బడి వెలుపలి పిల్లల సంఖ్య 10.20కోట్ల నుంచి అయిదు కోట్ల 70లక్షలకు దిగివచ్చింది. ఫలితాల సాధనలో భారత్‌ ఎక్కడుందన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అంకెల రీత్యా పేదరికాన్ని తగ్గించడంలో, భయానక వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో మెరుగనిపించుకుంటున్న ఇండియా- మహిళా సాధికారతలో వెనకబడే ఉంది. అభివృద్ధి సాధించామంటున్న రంగాల్లోనూ వాస్తవిక స్థితిగతులు ఆందోళనకరంగా ఉన్నాయి.

మనం ఎక్కడున్నాం?

ఒక్కోసారి గణాంక విశ్లేషణలకు, క్షేత్రస్థాయి నిరూపణలకు పొంతన కుదరదు. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి పదిహేనేళ్లుగా భారత్‌ సాధించిందంటున్న ప్రగతిని లోతుగా విశ్లేషించడంలో, ఈ దృక్కోణం విస్మరించరానిది. దారిద్య్రరేఖ దిగువన మగ్గుతున్న అభాగ్యుల సంఖ్యను దేశ జనాభాలో 23.9శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. అంతకన్నా మిన్నగా 21.9శాతానికి పేదరికం కట్టడి, స్థూల దృష్టికి వూహించని విజయంగా అబ్బురపరుస్తుంది. పేదరికాన్ని నిర్ధారించేందుకు ఇన్నేళ్లూ ప్రణాళిక సంఘం అనుసరించిన ప్రాతిపదికలను సర్వోన్నత న్యాయస్థానమే సూటిగా తప్పుపట్టింది. కథ ముగిసిపోయిన ప్రణాళిక సంఘం స్థానే కొత్తగా తెరపైకి వచ్చిన 'నీతి ఆయోగ్‌' ప్రాథమిక కసరత్తులు, సర్దుబాట్ల దరిమిలా ఇదమిత్థంగా స్పష్టీకరించేదాకా నికర గణాంకాలు పైకి తేలే వీల్లేదు. దేశీయ కాకిలెక్కలతో నిమిత్తం లేకుండా, రోజుకు 1.25డాలర్ల (రూ.77)లోపు వెచ్చించేవారంతా పేదలేనని; భారత జనాభాలో 42శాతం అటువంటివారేనని ప్రపంచబ్యాంకు అధ్యయనం వెల్లడిస్తోంది. ఈ లెక్కన, ఇన్నాళ్లూ పేదరికాన్ని తగ్గించి చూపడంలోనే విశేష అభివృద్ధి సాధించామన్నది- చేదునిజం! దేశంలో సార్వత్రిక ప్రాథమిక విద్యాలక్ష్యమూ అదే బాపతు. బడిలో చేరుతున్నవారి సంఖ్యలో ఇబ్బడి ముబ్బడిగా పెంపుదల చూపుతున్నా, ఇప్పటికీ పాఠశాల ముఖం చూడని పిల్లల సంఖ్య కోట్లలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక తప్పుపడుతోంది. చదువుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందన్న మాటే గాని, వారికి ఒంటపడుతున్నది అంతంత మాత్రమేనని 'అసర్‌' నివేదికలు మొత్తుకుంటున్నాయి! సహస్రాబ్ది లక్ష్యాల్లో- లింగ విచక్షణను నియంత్రించి మహిళా సాధికారతను పెంపొందించాలన్నది మూడోది. ప్రాథమిక స్థాయి విద్యాప్రవేశాల్లో లైంగిక సమానత్వ సాధనను రికార్డులు చాటుతున్నాయి. 'లింగ విచక్షణ' మీద పైచేయి అంతవరకే. ఉపాధి పొందడంలో, రాజకీయాధికారం ఒడిసిపట్టడంలో 'సమానత్వం' నేటికీ ఎండమావే. భారత పార్లమెంట్లో మహిళల సంఖ్య సుమారు 11శాతానికే పరిమితం కావడం- 189 దేశాల జాబితాలో ఇండియాను నూట పదకొండో స్థానాన నిలబెట్టింది! ప్రతి వెయ్యి జననాల్లో శిశుమరణాలను 42కు తగ్గించాలన్న లక్ష్యసాధనలో ఏళ్లతరబడి వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి.

తల్లుల ఆరోగ్య పరిరక్షణలో సైతం అదే వ్యధ. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, క్షయ, మలేరియా, పోలియో తదితరాల నియంత్రణలో దేశం చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందంటున్నా- విషజ్వరాలు, అంటురోగాల విజృంభణ అంతులేని కథగా కొనసాగుతూనే ఉంది! 1990నాటికి దేశంలో రక్షిత జలాల సరఫరాకు నోచని కుటుంబాల సంఖ్య 34శాతం మేర ఉండేది. ఇప్పుడు దాన్ని 17శాతానికి కుదించినట్లు చెబుతున్నా, పారిశుద్ధ్య పరిరక్షణలో మందభాగ్యాన్ని అధికారిక గణాంకాలే ప్రస్ఫుటీకరిస్తున్నాయి. నేటికీ 62కోట్లమంది భారతీయులు ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకోవడం, 'స్వచ్ఛభారత్‌' లాంటి విశిష్ట కార్యక్రమాల ఆవశ్యకతను ఇనుమడింపజేస్తోంది. అత్యంత అపరిశుభ్ర దేశమన్న అప్రతిష్ఠ, అటవీ ఛాయను పెంపొందించడంలో మందకొడితనం, పర్యావరణ పరిరక్షణ కృషిలోనూ లోటుపాట్లు... ఇవన్నీ సహస్రాబ్ది లక్ష్యాల్లో ఏడో అంశాన ఇండియా వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. నికరాభివృద్ధిని లక్షించి అంతర్జాతీయ భాగస్వామ్యం పరిపుష్టీకరించాలన్న ఎనిమిదో లక్ష్యసాధనలోనూ ఇండియా చేరాల్సిన గమ్యం నేటికీ సుదూరమే. ఇంధన, ఆహార భద్రత, ప్రాంతీయ వాణిజ్య రంగాలకు కొత్త వూపు తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా పటిష్ఠ చర్యలు చేపడితేనే తప్ప- మార్పు సాధ్యపడదు. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో రాష్ట్రాలవారీగా పురోగతిని సమీక్షిస్తే- అధికాదాయం కలిగిన తమిళనాడు, గుజరాత్‌ లాంటివి మెరుగ్గా రాణించడం స్థానికాంశాల ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. వెరసి, బృహత్తర లక్ష్యాల సాధనలో దేశం సాధించింది ఏపాటి అంటే- గ్లాసు సగం నిండింది, సగం ఖాళీగానే ఉంది!

తక్కినవి చురుగ్గా...

ఒక్కొక్క లక్ష్య సాధనలో సాఫల్య వైఫల్యాలను సాకల్యంగా ఆకళించుకోవడానికి ఇతర దేశాల ప్రగతితో సరిపోల్చి చూడటంవల్ల, నడక తీరు ఇట్టే బోధపడుతుంది. 66ఏళ్ల సగటు ఆయుర్దాయాన్ని ఇండియా 2012లో నమోదు చేయగలిగింది. మనకన్నా పదేళ్ల ముందే బంగ్లాదేశ్‌ ఆ ఘనత సాధించింది. చైనా ఏనాడో 1977లోనే ఆ మైలురాయి చేరుకుంది. దక్షిణ కొరియా, బ్రెజిల్‌, ఇండొనేసియా సైతం మనకన్నా ముందే ఉన్నాయి. శిశుమరణాల నియంత్రణలోనూ అటువంటి పోలికనే ఉదాహరించగల వీలుంది. ప్రతి వెయ్యి జననాల్లో శిశుమరణాలను 41కి తగ్గించడంలో దక్షిణ కొరియాను ప్రత్యేకంగా పేర్కోవాలి. 1970లోనే కొరియన్లు ఆ రికార్డు అందిపుచ్చుకోగా; చైనా, బ్రెజిల్‌, ఇండొనేసియా లాంటివీ చురుగ్గా ఆ బాట పట్టాయి. దక్షిణ కొరియా నాలుగున్నర దశాబ్దాల క్రితం, చైనా 23ఏళ్లక్రితం, భారత తలసరి ఆదాయంలో సగమే కలిగిన బంగ్లాదేశ్‌ ఆరేళ్లక్రితమే ఆ రికార్డు సాధించగలిగాయి. ప్రపంచబ్యాంకు అధ్యయనం మేరకు, ఇండియా ముక్కుతూ మూలుగుతూ 2013లో అక్కడికి చేరగలిగింది! ఆయుర్దాయం, విద్య, ఆదాయాల ప్రాతిపదికన దేశాలకిచ్చిన ర్యాంకుల్లో మనకు దక్కింది కేవలం 135వ స్థానం. శ్రీలంక(73) ఇండియా కన్నా ఎంతో ముందుంది! పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తాయన్న అవగాహనతో నేపాల్‌ వంటి దేశాలూ చొరవగా ముందడుగేస్తున్నాయి.

శుభ్రమైన తాగునీటిని అందించడానికీ విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపాలు, కలుషిత జలాల సేవనం వల్ల దాపురించే అంటురోగాలను, పర్యవసానంగా సంభవించే మరణాలను సాధ్యమైనంతగా అదుపు చేయడానికి శ్రమిస్తున్నాయి. ఇండియాలో ఇప్పటికీ నీళ్ల విరేచనాల (డయేరియా) మూలాన ఏటా రెండు లక్షల మందికి పైగా చిన్నపిల్లలు చనిపోతున్నారు. అయిదేళ్లలోపు పిల్లల్లో ప్రతి సంవత్సరం 20లక్షల మందిని న్యుమోనియా, డయేరియా కర్కశంగా కబళిస్తున్నాయి. రక్తహీనత, మందుల కొరత, పోషకాహార లోపాలు, దుర్భర కుటుంబ వాతావరణం, పేదరికం లాంటివన్నీ కలిసికట్టుగా మాతాశిశు మారణహోమాన్ని యథేచ్ఛగా ప్రజ్వరిల్లజేస్తున్నాయి. ఆరోగ్య విధానాలను, వ్యవస్థను సవ్యంగా పరిపుష్టీకరిస్తే- శిశుమరణాల నియంత్రణ, తల్లులకు మెరుగైన స్వస్థత, వ్యాధుల నిరోధం- ఏకకాలంలో సాధ్యపడతాయి. ప్రజారోగ్యమే దేశ ఆర్థికాభ్యున్నతికి వెన్నుదన్ను. ఈ యథార్థం గ్రహించిన గుజరాత్‌ ప్రభుత్వం- మహిళా సాధికారత, బాలికా ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల శిక్షణలపై ప్రధానంగా దృష్టిపెట్టి ఇప్పటికే పదకొండు ప్రత్యేక పథకాలను పట్టాలకు ఎక్కించింది. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో తడబడుతున్న ఇండియా, జాతీయ స్థాయిలో సత్వరం గుజరాత్‌ నమూనాకు మళ్ళడం ఎంతో మేలు!

కిం కర్తవ్యం?

సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో దేశదేశాల ప్రగతిని సమీక్షించి, వచ్చే సెప్టెంబరులో సుస్థిరాభివృద్ధి ప్రణాళికను ఖరారు చేసేందుకు వడివడిగా రంగం సిద్ధమవుతోంది. రానున్న పదిహేనేళ్లపాటు విద్య, మహిళల హక్కులు, హరితాభివృద్ధి, నీరు- ఇంధన- పర్యావరణ పరిరక్షణ కేంద్ర బిందువులుగా ప్రగతి వ్యూహాల క్రోడీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. సహస్రాబ్ది లక్ష్యాలకు, సుస్థిరాభివృద్ధి ప్రణాళికలకు మధ్య ప్రాథమ్యక్రమంలో వ్యత్యాసాలు ఉండవచ్చుగాక- పోషకాహారం, శిశు సంరక్షణల ప్రాముఖ్యం తగ్గించే వీల్లేదంటూ నిపుణుల సూచనలూ వెలుగు చూస్తున్నాయి. టీకాలు, మందుల సరఫరా, పోషకాహార పంపిణీలతో పాటు రక్షిత జలాలు, ఆరోగ్యకర పరిసరాలు, సుశిక్షిత మానవ వనరుల నిర్మాణం... ఏ జాతి ప్రగతికైనా, ఏ దేశ అభ్యున్నతికైనా ప్రాణాధారాలు. విద్యార్జన, అవకాశాలు, ఉపాధి కల్పనలో సమానత్వానికి వూతమిచ్చే సమాజాలు ప్రగతి బాటలో స్థిరంగా సాగుతుండటం సమకాలీన సత్యం. సహస్రాబ్ది లక్ష్యాల సాధనలో చతికిలపాటుకు దారితీసిన వ్యవస్థాగత లోటుపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతూ, సుస్థిరాభివృద్ధి ప్రణాళికల అమలులో దిలాసాగా పురోగమించడమే భారత్‌ ఎదుట ఉన్న గడ్డుసవాలు. ఆ మేరకు సరైన మార్గనిర్దేశకత్వంతో దీటైన సత్ఫలితాలు సాధించడంలో 'నీతి ఆయోగ్‌' సరికొత్త ఒరవడి సృష్టించాల్సి ఉంది!

(రచయిత - వై.ఆర్‌.బి.సత్యమూర్తి)
Posted on 11-02-2015