Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

‘నయా భారత్‌’ నిర్మాణం దిశగా...

* జాతికి ప్రధాని దిశానిర్దేశం

స్వాతంత్య్ర ఉత్సవ శుభవేళ చరిత్రాత్మక ఎర్రకోట వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం జాతికి సరికొత్త అజెండా నిర్దేశించింది. బంగరు భవిష్యత్తు దిశగా దేశానికి సముజ్జ్వల మార్గనిర్దేశం చేసింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న మూల సమస్యలను ప్రజలకు వివరించి, వాటికి పరిష్కారాలు ఎరుకపరచి, నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించడంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థత సాటిలేనిది. 2014లో ప్రధానిగా మొట్టమొదటి ప్రసంగంలోనే ‘స్వచ్ఛభారత్‌’ ఆవశ్యకతను ఆయన జాతి జనులకు విదితం చేశారు. ఆ నినాదాన్ని వినిపించిన అనంతరం అయిదేళ్ల కాలావధిలోనే ఆరోగ్యకర జీవనం, పరిశుభ్రత పట్ల దేశ ప్రజల్లో ఏ స్థాయిలో అవగాహన విస్తరించిందో అందరికీ తెలుసు. నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, వాటిని అమలుపరచడంలో తమ ప్రభుత్వ సమర్థతను 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు. మలి దశలో అధికారం చేపట్టిన పది వారాల స్వల్ప వ్యవధిలోనే ముమ్మారు తలాక్‌ను రద్దు చేస్తూ చట్టం తేవడం; రైతులు, వ్యాపారుల సంక్షేమానికి అక్కరకొచ్చే రాయితీలను పెద్దయెత్తున ప్రకటించడం... వంటివాటి గురించి ఆయన ఘనంగా చెప్పుకొన్నారు. ఏడు దశాబ్దాలుగా అధికరణ-370 రూపంలో కశ్మీర్‌ చుట్టూ ఉన్న అడ్డుతెరను తొలగిస్తూ పార్లమెంటు వేదికగా చట్టం తేవడం, దానితోపాటే 35-ఏ అధికరణ మురిగిపోవడం వంటివి చరిత్రాత్మక నిర్ణయాలు!

ఈ అధికరణలు తొలగించి మోదీ తప్పు చేశారని విమర్శిస్తున్నవారు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంది. ఆ అధికరణలను ఎవరూ కదిలించరాదని, వాటిని అలా శాశ్వతంగానే కొనసాగించాలని విమర్శకులు వాదిస్తున్నారు. నిజంగానే ఆ అధికరణలు శాశ్వతంగా ఉంచదగినవైతే- వాటిని తాత్కాలిక ప్రాతిపదికన ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ అధికరణలను ఎప్పుడైనా తీసివేయడానికి అనుగుణమైన వెసులుబాట్లను వాటి రూపకర్తలే ఎందుకు ఉంచారు? ఏడు దశాబ్దాల కాలం నిజానికి చిన్నదేమీ కాదు. తాత్కాలిక ప్రాతిపదికన అమలులోకి వచ్చిన కొన్ని అధికరణలను ఏడు పదుల కాలం కొనసాగించడమే ఒక విశేషం. ‘ఒక దేశం-ఒక రాజ్యాంగం’ పేరిట కేంద్ర ప్రభుత్వం ‘జమ్మూకశ్మీర్‌’లో తీసుకువచ్చిన మార్పులు పూర్తిగా తమ మంచికే అన్న విషయాన్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది. దాన్ని కశ్మీరీలకు అర్థవంతంగా చెప్పి ఒప్పించడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ అంటూ సర్దార్‌ పటేల్‌ మహోన్నత నినాదం వినిపించి దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు. నాటి నినాదం ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణలోకి రాలేదన్నది చేదు నిజం. మోదీ ప్రభుత్వం ఆ దిశగా సరైన అడుగులే వేస్తోందని చెప్పక తప్పదు!

త్రివిధ దళాలను సమన్వయపరచి, సంఘటితం చేసేందుకు అనువుగా రక్షణ బలగాల అధిపతి (సీడీఎస్‌)ని నియమించాలన్న డిమాండు ఈనాటిది కాదు. దశాబ్దాలుగా అనేక నిపుణుల కమిటీలు సిఫార్సులు చేశాయి. అధికారస్వామ్యంలోని లుకలుకలు, ఇతర స్వార్థపూరిత అవసరాలమేరకు ఆ డిమాండును ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పక్కనపెడుతూ వచ్చాయి. మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పం కారణంగా దశాబ్దాల కల నెరవేరింది. రక్షణ బలగాల అధిపతి పదవి సాకారమైంది. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో సీడీఎస్‌ పదవి ఉంది. రక్షణ బలగాలకు సంబంధించిన వివిధ విభాగాలను ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, వాటిని మరింత బలోపేతంగా తీర్చిదిద్దుతూ ‘సీడీఎస్‌’ వ్యవస్థ అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తోంది. ఉమ్మడిగా ప్రణాళికలు రచించడం, వ్యూహాలు రూపొందించడం, శిక్షణ, సాయుధ సామగ్రిని సమకూర్చడం వంటివి ఆధునిక యుద్ధతంత్రంలో అవిభాజ్యాలు. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఏ విభాగానికి ఆ విభాగం ఒకదానితో మరొకటి సంబంధం లేదన్నట్లుగా పనిచేసుకుపోవడం పూర్తిగా పాతచింతకాయ పచ్చడి పద్ధతి. త్రివిధ దళాలను ఏకంచేసి- భూమి, ఆకాశం, జలాల్లో కళ్లు చెదిరే యుద్ధపాటవంతో ప్రత్యర్థిని కకావికలం చేయడం నేటి సమరతంత్రం! ఈ క్రమంలో ‘సీడీఎస్‌’ ఏర్పాటు అత్యద్భుతమైన ముందడుగు అని చెప్పక తప్పదు.

జాతి అభివృద్ధి పథంలో కార్పొరెట్‌ వర్గానిది కీలక పాత్ర అన్న విషయాన్ని మోదీ నొక్కి చెప్పారు. వ్యాపార వర్గాలను అనుమానంగా చూడటం మన దేశంలో చాలామందికి ఒక దురలవాటుగా ఉంది. సంపదను సృష్టించి, ఉపాధిని కల్పిస్తున్న వర్గంపట్ల ఆ తరహా వైఖరి క్షంతవ్యం కాదు. ‘ఎవరైతే సంపదను సృష్టిస్తున్నారో... వారంతా భారతదేశపు ఆస్తి’ అని సగర్వంగా ప్రకటించడం ద్వారా సంప్రదాయ మూఢ భావాలను తుత్తునీయలు చేసేందుకు మోదీ ప్రయత్నించారు. దేశంలోని వ్యాపార వర్గానికి భరోసా పలికిన మాటలవి. ఈ నేపథ్యంలో ‘వ్యాపార వర్గాలకు స్నేహితుడి’గా ఆయనపై ముద్ర వేసేందుకు విపక్షాలు ప్రయత్నం చేసినా చేయవచ్చు. జాతి నిర్మాణంలో కీలక ధాతువులుగా ఉన్న వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ నిజంగా గర్వించదగిన పనే చేశారనడంలో అనుమానం లేదు. మనదేశంలో సామ్యవాదం ముసుగులో రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాల మధ్య చాలాకాలంపాటు రహస్య పొత్తు కొనసాగింది. ఆ రోజులకు కాలం చెల్లింది. సృజనాత్మక ఆలోచనలే పెట్టుబడిగా, పట్టుదలతో కృషి చేసి వ్యాపారవేత్తలుగా తమను తాము నిరూపించుకునేందుకు తగిన అవకాశాలున్న స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం మనం ప్రస్థానిస్తున్నాం. ఇండియాలోనూ బిల్‌ గేట్లు, మార్క్‌ జుకెర్‌బర్గ్‌లు ఉద్భవించడానికి తగిన నేపథ్యం నెలకొంటోంది. జాతి నిర్మాణంలో కార్పొరెట్ల పాత్రను గుర్తించి గౌరవించడమన్నది శ్లాఘనీయమైన పని. ప్రధాని తమ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ దేశ కార్పొరెట్లపై ఉంది. స్వాతంత్య్రోత్సవ ప్రసంగంలో నరేంద్ర మోదీ- ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌పైనా యుద్ధం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇంటింటికీ మంచినీటిని అందించడాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ లక్ష్యాలు సాకారమైతే నిజంగా దేశానికి అంతకుమించి కావలసిందేముంది!

- వీరు.కె
Posted on 17-08-2019