Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

త్రివిక్రమావతారం!

కీలక రక్షణ రంగానికి సంబంధించి దేశ చరిత్రలోనే అతి పెద్ద సంస్కరణగా నిలిచిపోయే ముఖ్య నిర్ణయం ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ నోట వెలువడింది. సైన్యం, వైమానిక, నౌకాదళాల మధ్య మెరుగైన సమన్వయ సాధనను లక్షించి మూడు బలగాలకు ఉమ్మడిగా మహాదళపతి (చీఫ్‌ ఆఫ్‌ ద డిఫెన్స్‌- సీడీఎస్‌) పదవిని కొలువుతీర్చనుండటం ఎన్నో విధాల విశేష ప్రభావాన్వితం కానుంది. వాస్తవానికిది, రెండు దశాబ్దాలుగా మోక్షం దక్కక నిరీక్షిస్తున్న ప్రతిపాదన! పాకిస్థాన్‌ కుహకాన్ని మొగ్గదశలోనే పసిగట్టి ఉంటే కార్గిల్‌ దుస్సాహసాన్ని సమర్థంగా, ఆట్టే నష్టం లేకుండా తిప్పికొట్టగలిగేవారమన్న విమర్శల నేపథ్యంలో నాటి వాజ్‌పేయీ సర్కారు- నిఘా లోటుపాట్లపై సమగ్ర అధ్యయనం నిర్వహింపజేసింది. అలా ఏర్పాటైన సుబ్రహ్మణ్యం కమిటీ ఐబీ (ఇంటెలిజెన్స్‌ బ్యూరో), ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌)ల నడుమ సమన్వయరాహిత్యమే ముప్పు తెచ్చిపెట్టిందంటూ చేసిన పలు దిద్దుబాటు సూచనల్లో సీడీఎస్‌ ఏర్పాటూ ఒకటి. ఆపై ఎల్‌కే అడ్వాణీ నేతృత్వంలోని మంత్రుల బృందం, దరిమిలా షెకాత్కర్‌ కమిటీ వంటివి అందుకు గట్టిగా ఓటేసినా విధానపరమైన చొరవ ఎండమావినే తలపించింది. జాతీయ భద్రతపై 2012లో నెలకొల్పిన నరేశ్‌ చంద్ర కార్యదళం సైనిక దళ కమిటీ (సీఓఎస్‌సీ)కి శాశ్వత ఛైర్మన్‌ నియామకాన్ని సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రివిధ దళపతుల్లో అందరికన్నా సీనియర్ని ఆ బృంద సారథిగా పరిగణిస్తున్నా, రక్షణ మంత్రిగా మనోహర్‌ పారికర్‌ లోగడ ఈసడించినట్లు- ‘అది వట్టి అలంకారప్రాయ పదవి’. ఏళ్ల తరబడి దస్త్రాలకే పరిమితమైన సీడీఎస్‌ నియామకంలో అనుసరించదగ్గ విధివిధానాల్ని ఉన్నతస్థాయి సంఘం మూడు నెలల గడువులో క్రోడీకరించాక, తొలి మహాదళపతి పేరు ఖరారు కావాల్సిఉంది!

కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న భారత సైనికులకు ఘన నీరాజనాలు అర్పించిన సుబ్రహ్మణ్యం కమిటీ- ఐబీ, ‘రా’ల అనర్థదాయక పంతాల్ని, సకాలంలో సరైన చర్య తీసుకోవడంలో 121(1) ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌ కమాండర్‌ వైఫల్యాన్ని సూటిగా తప్పుపట్టింది. వేరే మాటల్లో, వివిధ విభాగాల మధ్య విస్తృత సమాచార వారధి కొరవడ్డ పర్యవసానంగా జాతి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 1971నాటి భారత్‌-పాక్‌ యుద్ధసమయానికి సైన్యాధిపతి శామ్‌ మానెక్‌ షాతో నౌకాదళ, వాయుసేన అధిపతుల సన్నిహిత బంధం దేశానికి ఘనవిజయం సాధించిపెట్టింది. ఆ తరహా సమన్వయం లేకుండాపోయిన కార్గిల్‌ పోరులో తొలుత కంగుతిన్న భారత్‌- సైన్యం, వైమానిక దళం పటిష్ఠ జట్టుగా ఎదురుదాడి ఆరంభించాకనే పుంజుకొని పాక్‌ చొరబాటుదారుల్ని చావుదెబ్బ తీసింది. వారానికి రెండుసార్లు నిఘా విభాగాలు భద్రతాంశాలపై ప్రధానికి తాజా సమాచారం అందించాల్సి ఉన్నప్పటికీ ‘పనుల ఒత్తిడి’ కారణంగా ఆ కార్యక్రమం తరచూ రద్దవుతున్న యథార్థం అప్పట్లో బట్టబయలై నిశ్చేష్టపరచింది. ఇటువంటి కంతలన్నింటినీ పూడుస్తూ సమాచార లోపాలపై వేటువేస్తూ సీడీఎస్‌ పదవిని సృష్టించడంతోపాటు అమలుపరచాల్సిందిగా వాజ్‌పేయీ సర్కారుకు అరుణ్‌ సింగ్‌ కమిటీ చేసిన సిఫార్సులేవీ ఆచరణకు నోచుకోలేదు. దక్షిణ కొరియా, తైవాన్ల వంటి దేశాలతో పోల్చినా భారత బలగాల ఆయుధ సంపత్తి, యుద్ధ సన్నద్ధత ఆందోళనకరమని అంతర్జాతీయ అధ్యయనాలు తప్పుపట్టిన తరవాతా ఏళ్ల తరబడి అలసత్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. త్రివిధ దళాల పునరుత్తేజీకరణకై 99 సిఫార్సులందించిన షెకాత్కర్‌ కమిటీ వాటిమధ్య అర్థవంతమైన సంధానానికి ప్రత్యేకంగా 34 సూచనలు చేసింది. త్రివిధ దళాలకు పైయెత్తున కొత్తగా సమన్వయ బాధ్యతలు చేపట్టనున్న సీడీఎస్‌కు వాటి స్ఫూర్తి దారిదీపం కావాలి!

భూ, సముద్ర, గగన తలాల్లో శత్రుభీకర శక్తిగా దూసుకుపోవడానికి నిష్ఠగా పావులు కదుపుతున్న చైనా సమీకృత సంయుక్త కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా తన కమాండ్‌ వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేపట్టింది. విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ సతీశ్‌ దువా మాటల్లో- ‘దళాల శక్తిని గరిష్ఠ ప్రాతిపదికన సద్వినియోగపరచుకునేందుకు 66 దేశాలు సంయుక్త అధిపతిని నియమించుకున్నాయి’! సైనికదళ మాజీ అధిపతి జనరల్‌ బిక్రమ్‌ సింగ్‌, నౌకాదళ మాజీ సారథి అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌ ప్రభృతులెందరో త్రివిధ దళాల్ని ఏకతాటిపై నడిపించాల్సిన ఆవశ్యకతపై బలమైన వాదనలు వినిపిస్తున్నారు. శత్రుపక్షాన్ని కకావికలం చేసేలా పరిస్థితులకు తగ్గట్లు బలగాల మోహరింపు, రేపటి అవసరాలకు దీటుగా ఆధునికీకరణ, శిక్షణ, ఉమ్మడి నిఘా, సంయుక్త దాడులు... వీటన్నింటికీ కేంద్రబిందువు కావాల్సిన సీడీఎస్‌- వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన వేళ కేంద్రానికి తలలో నాలుక కావాలని ప్రధానమంత్రి అభిలషిస్తున్నారు. ‘భారతరత్న’ వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా నిన్న పోఖ్రాన్‌లో మాజీ ప్రధానికి నివాళులు అర్పిస్తూ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దశాబ్దాలుగా భారత్‌ తొలుత తాను అణ్వస్త్రం ప్రయోగించబోనన్న బాణీకి కట్టుబాటు చాటుతోంది. ఆ విధానాన్ని ఎప్పుడైనా మార్చుకునే స్వేచ్ఛ ఇండియాకు ఉందన్న రాజ్‌నాథ్‌ మాటల్లో దేశం ఏ క్షణాన ఎంతటి విపత్తుకైనా సిద్ధం కావాలన్న జాగ్రత్త ధ్వనిస్తోంది. అటువంటి పరిస్థితే ఉత్పన్నమైతే రక్షణపై మీనమేషాలు లెక్కించే వ్యవధి ఉండదు. ఆర్మీ, వైమానిక దళాల్లో ఏడేసి, నౌకాదళాన మూడు మొత్తం పదిహేడు సర్వీస్‌ కమాండ్లు కలిగిన భారత్‌ను శత్రువుపై ఏకోన్ముఖంగా కదం తొక్కించడానికి మెరుపువేగంతో స్పందించే నిర్ణయ కేంద్రం అవతరించాలి. ఆ పాత్ర పోషణలో సీడీఎస్‌ నెగ్గుకొచ్చేలా విధినిషేధాలు కూర్చి, అకుంఠిత దీక్షాదక్షుడికే ప్రాధాన్య పదవి అప్పగించినప్పుడే- దేశ రక్షణ వ్యవస్థ రాటుతేలుతుంది!


Posted on 17-08-2019