Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సుందర కశ్మీరం... సంపూర్ణ భారతీయం

* అభివృద్ధివైపే ఇక పయనం

జమ్మూకశ్మీర్‌లోని సామాన్య ప్రజల ప్రయోజనంకోసం 370 అధికరణను రద్దు చేయవలసి వచ్చింది. ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు, అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో పరిష్కారం తలపెట్టి చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యాన్ని, హోం మంత్రి అమిత్‌ షా సంకల్పాన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అన్యాయమైన పరిస్థితుల్లో 370 అధికరణను భారత రాజ్యాంగంలో ఒక తాత్కాలిక నిబంధనగా చేర్చారు. 560కిపైగా రాచరిక రాజ్యాలు 370 అధికరణ వంటి తాత్కాలిక ఏర్పాట్లు ఏవీ లేకుండానే భారత్‌లో విలీనమయ్యాయి. ఆ రాజ్యాల్లో భిన్న సంస్కృతీ సంప్రదాయాలుగల అన్ని సమాజాల ప్రజలు నివసించేవారు. అయినప్పటికీ గొప్పజ్ఞానం, దూరదృష్టి కలిగిన భారత రాజ్యాంగ వ్యవస్థాపకులు ఆ రాజ్యాలకు 370 అధికరణ వంటి ఏ ప్రత్యేక నిబంధనలనూ అంగీకరించలేదు. 560కిపైగా రాచరిక రాజ్యాల్లో జమ్మూకశ్మీర్‌ తప్ప మిగిలిన అన్ని రాజ్యాల విలీనం సర్దార్‌ పటేల్‌ ఆధ్వర్యంలో సాకారమైంది. ఆ ప్రాంతాలు ఇవాళ భారతావనిలో అంతర్భాగమని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితి ఉంది. ఉపప్రధానమంత్రి పదవితో పాటు రాచరిక రాజ్యాల విలీనం అంశాన్నీ సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. అయితే ఆయన కర్తవ్యాన్ని సంక్లిష్టంగా మారుస్తూ, సంకట పరిస్థితులు సృష్టిస్తూ జమ్మూకశ్మీర్‌ అంశంపై జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యవహరించారు.

ఎట్టకేలకు దిద్దుబాటు
ఏడు దశాబ్దాల జమ్మూకశ్మీర్‌ సమస్యను ఎదుర్కొనే క్రమంలో సుమారు 42 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీరీ పండిట్ల తలలకు తుపాకీలు ఎక్కుపెట్టి, వారు బలవంతంగా తమ ఇళ్లను వదిలి బతుకు జీవుడా అంటూ మరో ప్రాంతానికి వలసపోవాల్సిన దురవస్థను తీసుకువచ్చారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే నిబంధనను తీసుకొచ్చారు. అక్కడ వేర్పాటువాదాన్ని, భారత వ్యతిరేకతను ప్రోత్సహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం- షేక్‌ అబ్దుల్లాకు జైలుశిక్ష విధించి ఆయనను పదకొండేళ్లు కారాగారంలో ఉంచింది. 1990-1996 మధ్యకాలంలో ఏడాదికి సరాసరిన 200 రోజులు కశ్మీర్‌ లోయలో కర్ఫ్యూ ఉండేది. జమ్మూకశ్మీర్‌పై నెహ్రూకు భావోద్వేగంతో కూడిన ప్రేమాభిమానాలున్నాయి. ఆ ప్రత్యేక ప్రేమే ఆ రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతినడానికి కారణమైంది. 370 అధికరణ వల్ల ఎవరు ప్రయోజనం పొందారు? స్వాతంత్య్రం వచ్చిన 73 ఏళ్ల తరవాత మనందరం తప్పక అడగవలసిన అత్యంత చట్టబద్ధమైన ప్రశ్న ఇది. దీనివల్ల జమ్మూకశ్మీర్‌ ప్రజలు ఎలాంటి ప్రయోజనమూ పొందలేదు. పహాడీలు, షియా సమాజం, గుజ్జర్లు, బక్కర్‌ వాలాలు, గడ్డీలు, ఇతర షెడ్యూల్డ్‌ జాతులు, షెడ్యూల్డ్‌ కులాలు, లద్దాఖ్‌, కార్గిల్‌లో నివసించే ప్రజలు ఈ అధికరణ ద్వారా ఏర్పాటైన నిబంధన నుంచి ఎటువంటి గణనీయమైన ప్రయోజనం పొందలేదు. ప్రభుత్వాల లోపభూయిష్ఠ విధానాలవల్ల జమ్మూకశ్మీర్‌ ప్రజలు అనుభవించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ రాష్ట్రానికి చెందిన కొన్ని కులీన కుటుంబాలకు మేలు చేస్తే, మొత్తం రాష్ట్ర సమస్యలన్నీ తీర్చినట్లే అన్న ఆలోచనలో దిల్లీ ప్రభుత్వం ఉండేది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, నియంత్రణను బలపరచుకోవడానికి, అవినీతి కార్యకలాపాల కోసం- కొన్ని కుటుంబాలు 370 అధికరణను వేదికగా ఉపయోగించుకున్నాయి. 370 అధికరణ నీడలో వారు ఆశ్రయం పొందారు. అధికారులు, రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా, వారి వైఖరిని నిలదీయడానికి రూపొందిన అవినీతి నిరోధక చట్టం- జమ్మూకశ్మీర్లో ఎందుకు అమలు కావడం లేదు? దీన్ని ఎవరైనా ఎలా సమర్థిస్తారు? విద్యాహక్కు చట్టం, బాల్యవివాహ నిషేధ చట్టం, సమాచార హక్కు చట్టం, చేతితో పారిశుద్ధ్య పని చేయడాన్ని నిషేధించే చట్టం వంటివాటిని ఆ రాష్ట్రంలో ఎందుకు వర్తింపజేయలేదు? ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి వీలులేకుండా 370 అధికరణను దుర్వినియోగపరచారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో చాలా కాలం తరవాత ఓ ఎన్నిక సజావుగా జరిగింది. ఆ విషయం ఇప్పటికీ జన స్మృతిపథంలో ఉంది.

సైనికాధికారి ఉమర్‌ ఫయాజ్‌, రైఫిల్‌ మ్యాన్‌ ఔరంగజేబ్‌ సహా ధైర్యంగా ముందుకు వచ్చిన ఎందరో కశ్మీరీ ముస్లిములు ఉగ్రవాదుల కిరాతకానికి బలైపోవడం గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. దాంతో 370 అధికరణకు వ్యతిరేకంగా ఎంతో ఆవేశంగా మాట్లాడినవారూ మౌనంలోకి జారుకున్నారు. రాష్ట్రానికి చెందిన అపారమైన సహజ వనరులపై పట్టు సాధించి ఆకస్మిక లాభాలు పొందేందుకు 370 అధికరణను కొన్ని కుటుంబాలు ఉపయోగించుకున్న విషయాన్ని- జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ జగ్‌మోహన్‌ రచించిన ‘మై ఫ్రోజెన్‌ టర్బులెన్స్‌’ అనే పుస్తకంలో విస్తృతంగా చర్చించారు. వాటన్నింటివల్ల ఆరోగ్య పరిరక్షణ, విద్యాభివృద్ధికి అక్కరకొచ్చే ఆదాయాన్ని ఆ రాష్ట్రం గణనీయంగా కోల్పోయింది. జమ్మూకశ్మీర్‌లో 1956లో రాజ్యాంగసభ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే రాష్ట్రానికి రాజ్యాంగం రూపొందిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ‘జమ్మూకశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం’ అన్న విషయాన్ని రెండో భాగంలోని, మూడో అధికరణలో ప్రత్యేకంగా పొందుపరచారు. ఆ రాజ్యాంగానికి సవరణగా, పన్నెండో భాగంలోని 147వ అధికరణను తీసుకువచ్చారు. అందులో మూడో సెక్షన్‌లో ‘భారత్‌లో జమ్మూకశ్మీర్‌ అంతర్భాగం’ అని పేర్కొన్న విషయంపై మార్పులు చేయడానికి వీలుగా ఎలాంటి బిల్లుకాని, సవరణ కాని రాష్ట్ర చట్టసభలు దేనిలోనూ ప్రవేశపెట్టడానికి లేదా చర్చ చేపట్టడానికి వీలులేదు’ అనే విషయం స్పష్టంగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమంటూ ఆ రాష్ట్రానికి చెందిన రాజ్యాంగసభ ఒకసారి రాజ్యాంగం రూపొందించాక దాన్ని ఇక ఎవరూ మార్చలేరన్నారు. ఆ సందర్భంలో 370 అధికరణ దాని ఔచిత్యాన్ని కోల్పోతుంది.

ఉద్దేశపూర్వకంగానే 370 అధికరణను తాత్కాలిక నిబంధనగా ఉంచారు. దాన్ని సమర్థించేవారు ఆ నిబంధనను శాశ్వతంగా మార్చేందుకు ఎప్పుడూ ఎందుకు ధైర్యం చేయలేదన్న విషయాన్ని ప్రధాని సరిగ్గా గమనించారు. రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని రూపొందించగానే, ఆ అధికరణ దాని ప్రయోజనాన్ని అందించిందన్న విషయం గమనించడం చాలా ముఖ్యం. రాష్ట్ర రాజ్యాంగంలోని 147వ అధికరణ కింద ఇంకా ఏమైనా సవరణలు చేయాలంటే ఆ అధికారం రాష్ట్ర శాసనసభకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రకటన ద్వారా దాన్ని ప్రకటించడం పూర్తిగా సమర్థనీయం. 370(3) అధికరణ కింద రాజ్యాంగసభ అంటే రాష్ట్ర శాసనసభ అని చదువుకోవాలి. అదేవిధంగా రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది కాబట్టి, భారత రాజ్యాంగంలోని 356(1)(బి) అధికరణ కింద ఆ అధికారాన్ని రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు నిర్వహించింది. పార్లమెంటు ఉభయసభల్లో జరిగిన చర్చల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన అన్ని ప్రాంతాల వాదనలు విన్నారు. 370 అధికరణను తొలగిస్తామన్న హామీపై భాజపాకు భారత ప్రజలనుంచి అనూహ్య మద్దతు లభించిందన్న వాస్తవాన్ని సైతం నొక్కి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈశాన్య, గిరిజన ప్రాంతాల సంక్షేమానికి సంబంధించి అధికరణ 370 వంటి ప్రత్యేక నిబంధనలను సైతం తొలగించాలన్న వాదన పూర్తిగా తప్పు. 371 (ఎ) నుంచి (జె) వరకు ఉన్న అధికరణలు ప్రత్యేక నిబంధనలు. అవి తాత్కాలికమైన నిబంధనలు కావు. కాబట్టి అవి కొనసాగుతాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తరవాత, ఒక ప్రత్యేక ప్రాంతం లేదా ప్రత్యేక తెగల అభివృద్ధికోసం ప్రత్యేక నిబంధనలు పొందుపరచారు. అవి ప్రత్యేక నిబంధనలు కాబట్టి శాశ్వతమైనవి!

ముందున్నాయి మంచిరోజులు
కశ్మీర్‌ లోయకు చెందిన ముస్లిం బాలికలు ఆ రాష్ట్రానికి వెలుపలి యువకులను వివాహం చేసుకోవడంవల్ల వారు తమ హక్కులన్నింటినీ కోల్పోయారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల జమ్మూనుంచి వచ్చిన అఖిల భారత సర్వీసులకు చెందిన ఒక యువ అధికారిని కలిశాను. ఆమె హిందూ వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రానికి వెలుపల ఉండే ఒక సివిల్‌ సర్వెంటును వివాహం చేసుకోవడం వల్ల జమ్మూలో తన హక్కులన్నింటినీ కోల్పోయినట్లు ఆమె వెల్లడించారు. 370 అధికరణ రద్దు చేయడం ద్వారా తనకు గొప్ప న్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి చెమ్మగిల్లిన నయనాలతో ఆమె కృతజ్ఞతాభివందనాలు తెలియపరచారు. భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. సర్కారు తీసుకుంటున్న సానుకూల చర్యల కారణంగా శ్రీనగర్‌, సోపోర్‌, బద్గామ్‌, భాదేర్వా, జమ్ము వంటి ప్రాంతాలనుంచి నేడు ఎన్నో బీపీఓలు పనిచేస్తున్నాయి. పౌరులకు డిజిటల్‌ సేవలు అందించేందుకు అక్కడ 3,158 సాధారణ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆ ప్రాంతానికి నేనెప్పుడు వెళ్ళినా అక్కడి సేవా కేంద్రాల ఉద్యోగుల కళ్లలో ఆనందాన్ని చూడగలుగుతున్నాను. ఉజ్జ్వల భవిష్యత్తు దిశగా తమ నైపుణ్యాలకు సానపట్టేందుకు ఈ అవకాశాలు ఉపకరిస్తున్నాయని ఆ బాలబాలికల్లో కొందరు నాతో చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి ప్రస్థానంలో ఇది ఓ నూతన ఉషోదయం. 370 అధికరణ రద్దుతో ఆస్తులు కోల్పోయినవారికి, అణచివేతకు గురైనవారికి అద్భుత అవకాశం అందివచ్చినట్లయింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్య ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు రుచించలేదు. ఆ శక్తులకు భారత్‌లో ఇకమీదట స్థానం లభించదు!


Posted on 19-08-2019