Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఆచితూచి వేయాలి అడుగు

* ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ

ఆయుధ ఉత్పత్తుల్లో దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట వేయాల్సిన అవసరాన్ని పదహారో లోక్‌సభ చివర్లో రక్షణ రంగంపై నియమితమైన పార్లమెంటరీ స్థాయీసంఘం నొక్కిచెప్పింది. ఆయుధోత్పత్తి కర్మాగారాలు(ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు) సుదీర్ఘకాలంగా భారతీయ సేనావాహినికి సేవలందిస్తున్నాయి. ఇతర రక్షణోత్పత్తి సంస్థలతో పోలిస్తే భారతీయ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల్లో దేశీయ పరిజ్ఞానానికే ప్రాధాన్యం దక్కుతోంది. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల ఉత్పత్తి అవసరాలకోసం 2016-17లో విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న దిగుమతుల పరిమాణం 11.79 శాతం. 2013-14లో అది 15.15శాతం. ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకోసం చేసుకుంటున్న విదేశీ దిగుమతుల పరిమాణం క్రమంగా తగ్గుతోందనడానికి ఇది నిదర్శనం. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లేదా భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలతో పోలిస్తే ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకోసం చేసుకుంటున్న విదేశీ దిగుమతులు బాగా తక్కువ. చాలావరకు దేశీయ పరిజ్ఞానంతోనే ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల్లో ఆయుధోత్పత్తులు చేస్తున్నారు. ప్రధాన యుద్ధట్యాంకులు, పదాతిదళ పోరాట వాహనాలు, ప్రత్యేక సాయుధ వాహనాలు, ఫిరంగి తుపాకులు, వాయు రక్షణ తుపాకులు, రాకెట్‌ లాంచర్లు వంటివి ఈ ఫ్యాక్టరీల్లో తయారవుతాయి. భారత్‌ 1947, 1962, 1965, 1999ల్లో యుద్ధాల్లో పాల్గొంది. ఆయా సందర్భాల్లో దేశీయ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు భారత సైన్యానికి అద్భుతమైన తోడ్పాటు అందించాయి. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఏ వ్యవస్థలతో పోల్చినా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకే అతి తక్కువ నిధుల తోడ్పాటు అందుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలకు ఇచ్చింది రూ.50.58 కోట్లు మాత్రమే. అవి తమ ఉత్పత్తులను ఆర్మీ, నౌకా, వైమానిక దళాలకు సరఫరా చేస్తున్నాయి. తద్వారా తమ నిర్వహణకు అవసరమైన మేర ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. కార్గిల్‌ యుద్ధంలో సైన్యానికి అవసరమైన ఆయుధాలను సకాలంలో సరఫరా చేయడం ద్వారా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు దేశ రక్షణకు చేసిన కృషి మరువలేనిదని భారత ఆర్మీ ఒకప్పటి అధిపతి జనరల్‌ వీపీ మాలిక్‌ వ్యాఖ్యానించారు. మరోవంక విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న సరకు అవసరానికి అందుబాటులోకి రాలేదని, తద్వారా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ ఆయన చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.

మలిదశ ఎన్డీయే తొలి వంద రోజుల పాలనలో పీఎస్‌యూల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి మోదీ సర్కారు ఎన్నో ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఆ క్రమంలోనే ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు వంటివాటి కార్పొరేటీకరణ దిశగా అడుగులు పడుతున్నట్లు ‘నీతి ఆయోగ్‌’ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ ఇటీవల వెల్లడించారు. ఆయుధోత్పత్తి కర్మాగార బోర్డు ఒక్కదానికే 60వేల ఎకరాలమేర స్థలం ఉంది. దేశంలోని 40కిపైగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడమో లేదా వాటిని పూర్తిగా మూసివేసే దిశగానో వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గరిష్ఠ పరిమితిని ఎత్తివేసే సూచనలూ కనిపిస్తున్నాయి. గడచిన అయిదేళ్ల కాలంలో ‘ఎయిర్‌ ఇండియా’ వంటివి పతనావస్థలోకి జారుకున్నాయి. యుద్ధ సమయాల్లో సైన్యానికి సరిపడా ఆయుధ సామగ్రిని అందించేందుకు ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు నిత్యం సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం ఖాళీ సమయాల్లో ఆ ఫ్యాక్టరీల సామర్థ్యానికి పదునుపెడుతూ ఉండాలి. ఆ రకంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా పీఎస్‌యూలను పరిరక్షించుకోవడం చాలా అవసరం.

కార్గిల్‌ యుద్ధ సమయంలో రూ.2,150 కోట్ల విలువైన ఆయుధ సరఫరాలకోసం దేశీయ, ప్రైవేటు కంపెనీలకు ఆర్డర్లు పెట్టగా- అందులో రూ.1,762 కోట్ల విలువైన సరఫరాలు 1999 జులై నాటికి సంఘర్షణలు సద్దుమణిగాక గాని అందుబాటులోకి రాలేదని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. అత్యవసరం కాబట్టి ఆ సమయంలో ఆయుధాలు, ఇతర సామగ్రి నాణ్యతపై కొంత రాజీపడాల్సిన పరిస్థితులూ తలెత్తాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ఆ నివేదిక స్పష్టీకరించింది. మరోవంక- ఆ సందర్భంలో సుమారు రూ.350 కోట్ల మేర అవసరమైన దానికన్నా అధికంగా కొనుగోళ్లు జరిపారు. బయటినుంచి వచ్చిన ఆ సామగ్రి అంతా దేశీయ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల్లో బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నదే కావడం గమనించాల్సిన విషయం. నాణ్యత, సామర్థ్యాలపరంగా ప్రైవేటు రంగాన్ని నెత్తికెత్తుకునేవారు గమనించాల్సిన విషయాలివి. ఈ ఏడాది మొదట్లో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ తన ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సైతం అప్పులు చేయాల్సిన దుస్థితిని చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎదుర్కొంది. దేశీయ బీమా రంగంలో మూడింట రెండొంతుల మార్కెట్‌ వాటా ఉన్న ‘ఎల్‌ఐసీ’పై ఒత్తిడి తీసుకువచ్చి- 28 శాతం అప్పుల్లో మునిగి నిండా కష్టాల్లో ఉన్న ఐడీబీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకును దానిచేత కొనుగోలు చేయించారు. ఫలితంగా ‘ఎల్‌ఐసీ’పై ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగింది. ఫలితంగా పెట్టుబడులను ఆకర్షించి ఆర్థిక సత్తువ పెంచుకునే క్రమంలో ఆ సంస్థ షేర్‌ మార్కెట్లోకి కాలుమోపింది. ప్రైవేటు పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రానిపక్షంలో పీఎస్‌యూలపై భారం పెంచడం సరికాదు. ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణపై సహేతుక విధానాలను అందిపుచ్చుకోవాల్సిన తరుణమిది.


- సందీప్‌ పాండే
(రచయిత - రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)
Posted on 28-08-2019