Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

నిబంధనల సరళీకరణతో సాంత్వన

* సంక్లిష్టతలను తొలగించే వేతన చట్టం

అమలులో లేని చట్టాలను రద్దు చేసేందుకు మోదీ సర్కారు నడుంకట్టింది. గత అయిదేళ్లలో 250కి పైగా వ్యర్థ చట్టాలను రద్దు చేసింది. అదే సమయంలో చట్టాల్లోని సంక్లిష్టతలను తొలగించి, వాటిని సులభతరం చేసే ప్రక్రియనూ ప్రారంభించింది. శ్రమజీవులకు మేలు చేసే కార్మిక చట్టాలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి నాలుగు చట్టాల స్థానంలో ఒకే చట్టాన్ని తీసుకువచ్చింది. వేతనాల చట్టం-1936, కనీస వేతనాల చెల్లింపుల చట్టం-1948, బోనస్‌ చెల్లింపుల చట్టం-1965, సమాన ప్రతిఫలం చెల్లింపుల చట్టం-1976 స్థానంలో వేతనాల కోడ్‌- 2019ను రూపొందించింది. దీనికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక చట్టాలు సాలెగూళ్ళలా తయారయ్యాయి. కేంద్రానికి చెందిన 40 కార్మిక చట్టాలు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినవి వందకుపైగా ఉన్నాయి. దీంతో ఏ చట్టం కింద తమకు న్యాయం దక్కుతుందో తెలియక దిక్కుతోచని పరిస్థితిని కార్మికులు ఎదుర్కొంటున్నారు. వాజ్‌పేయీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే చట్టాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగాయి. దేశంలోని అన్ని కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్‌లుగా తీసుకురావాలని నాటి ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి రెండో జాతీయ కార్మిక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. రష్యా, జర్మనీ, హంగేరి, పోలండ్‌, కెనడాల్లో మాదిరిగా ఒకే చట్టాన్ని తీసుకురావాలని 2002కు ముందే కేంద్రానికి జాతీయ కార్మిక కమిషన్‌ సూచించింది. అప్పట్లో ఈ సూచన అటకెక్కింది. సుదీర్ఘకాలం తరవాత నాటి సూచన నేడు కార్యరూపం దాల్చింది.

ప్రయోజనాలెన్నో...
నాలుగు చట్టాలను రద్దుచేస్తూ తీసుకువచ్చిన కొత్త చట్టంవల్ల అటు యాజమాన్యాలకు, ఇటు కార్మికులకు ప్రయోజనం కలగనుంది. దేశంలో అసంఘటిత రంగానికి చెందిన కార్మికులే ఎక్కువమంది ఉన్నారు. గతంలో ఉన్న కనీస వేతనాల చట్టం పరిధిలోకి 60 శాతం కార్మికులైనా వచ్చేవారు కారు. కొత్త చట్టంతో సుమారు 50 కోట్ల మంది కార్మికులు కనీస వేతనాల ప్రయోజనాలు పొందనున్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి కేంద్రం పరిధిలో వ్యవసాయం, గనుల తవ్వకాలతో కలిపి 45, రాష్ట్రాల పరిధిలో 1,709 రంగాలు ఉన్నాయి. గతంలో 33 శాతం కార్మికులకు 2009-10లో నిర్ణయించిన జాతీయ కనీస వేతనం కంటే తక్కువగా చెల్లింపులు జరిగేవి. కనీస వేతనాల చట్టం పరిధిలో షెడ్యూల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కింద నిర్వచనంలోకి రావడం క్లిష్టంగా ఉండేది. కార్మికులు పనిచేసే సంస్థ నోటిఫై అయి ఉండాలి. ప్రతి కొత్త సంస్థను నోటిఫై చేయడానికి ఆచరణలో ఇబ్బందులు ఉండేవి. కొత్త చట్టంలో అలాంటి ఇబ్బందులు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఫ్యాక్టరీ, సంస్థ, ఇతరత్రా ఎక్కడ పనిచేసే కార్మికులకైనా కొత్త వేతన చట్టం కింద కనీస వేతనం వర్తిస్తుంది. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారికి వర్తించదు. గతంలో ఉన్న చట్టాల ఆధారంగా వృత్తి, నైపుణ్యస్థాయి, అక్కడున్న భౌగోళిక పరిస్థితుల ఆధారంగా కనీస వేతన నిర్ణయం జరిగేది. కొత్త చట్టం ద్వారా నైపుణ్యం, భౌగోళిక పరిస్థితులను, కష్టాన్ని అంచనా వేసి నిర్ణయం జరుగుతుంది. గతంలో ఉన్న పని రకాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించే విధానం రద్దయింది. అనుభవాన్ని ఆధారంగా తీసుకుని కనీస వేతన నిర్ణయం జరుగుతుంది. ఈ చట్టం కింద స్వతంత్ర వ్యక్తులతో కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో కమిటీ ఏర్పాటవుతుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కమిటీలను ఏర్పాటు చేయవచ్చు. వీటిలో యాజమాన్య, కార్మిక వర్గాలకు చెందినవారితోపాటు స్వతంత్ర వ్యక్తులూ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు అధ్యయనం, విచారణ చేపట్టి కనీస వేతనం ప్రతిపాదనలను సిద్ధం చేయవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రకటించి, ఎవరైతే ప్రభావితులవుతారో వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించవచ్చు. అన్నింటినీ పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ఒక వ్యక్తి కనీస జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని నిర్ణయించే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే కనీస వేతనం, కేంద్రం నిర్ణయించిన దానికంటే తక్కువ ఉండరాదు. జాతీయ కనీస వేతనాలను నిర్ణయించే అధికారం కేంద్రానికి ఉంది. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వేతనాలను నిర్ణయించవచ్చు. జీవన వ్యయం ప్రాతిపదికన ప్రభుత్వాలు అయిదేళ్ల వ్యవధిలో కనీస వేతనాన్ని సవరించవచ్చు. ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ వేతనాన్ని ఏ యజమానీ చెల్లించరాదు. వేతన చెల్లింపుల్లో లింగ దుర్విచక్షణను కొత్త చట్టం నిషేధించింది. స్త్రీ, పురుషులతోపాటు ట్రాన్స్‌జెండర్లకు ఒకే రకమైన వేతనం చెల్లించాల్సిందే. పని కల్పించడంలో యజమాని లింగ దుర్విచక్షణ చూపరాదు. ప్రత్యేకంగా ప్రభుత్వం మహిళలను ఏదైనా చట్టం కింద నియంత్రించినా, నిషేధిస్తే తప్ప అందరికీ సమానంగా పనిలో అవకాశాలు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కేంద్ర సలహా బోర్డును ఏర్పాటు చేయడానికి చట్టం అవకాశం కల్పించింది. యజమానులు, ఉద్యోగులు, స్వతంత్ర అభ్యర్థులతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారినీ కేంద్రం ఈ బోర్డుకు నామినేట్‌ చేయవచ్చు. బోర్డులో మూడో వంతు సభ్యులుగా మహిళలకు అవకాశం కల్పించాలి. బోర్డు ఛైర్మన్‌ను కేంద్రం నియమిస్తుంది. నిర్దిష్ట కాలపరిమితిలో వేతనాల నిర్ణయానికి, సవరణకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర అంశాల్లో సలహాలు ఇవ్వడానికి ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సలహా బోర్డులను ఏర్పాటు చేయవచ్చు. భిన్నమైన అంశాలపై అధ్యయనం చేయడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బోర్డులనూ ఏర్పాటు చేయవచ్చు.

కార్మికులకు రక్షణలు
పాత చట్టాల్లో కార్మికులకు గల రక్షణలు కొత్త చట్టంలోనూ ఉన్నాయి. నైపుణ్యం, నైపుణ్యంలేని, సాంకేతిక, నిర్వహణ, గుమస్తా, పాలన వ్యవహారాలు చూసే మేనేజర్లు, సూపర్‌వైజరుసహా కార్మికులకు నిర్వచనం ఇచ్చింది. అప్రెంటిస్‌ చట్టం 1961 సెక్షన్‌ 2(ఎఎ) నిర్వచనం కింద వచ్చేవారిని మినహాయించింది. కాంట్రాక్టరు, సబ్‌ కాంట్రాక్టర్లనూ యజమాని పరిధిలోకి తీసుకువచ్చింది. కార్మికుల విభాగంలోకి వచ్చే అంశానికి సంబంధించి కేంద్రం సవరణ తీసుకువచ్చింది. మేనేజర్లు, సూపర్‌వైజర్లు కార్మికుల విభాగంలోకి రారు. వివాదాల పరిష్కారానికి గెజిటెడ్‌ స్థాయి అధికారికి తగ్గకుండా ఒకటి లేదా ఎక్కువ అథారిటీలను ఏర్పాటు చేయవచ్చు. బోనస్‌ చెల్లింపుపై యాజమాన్యానికి, సిబ్బందికి మధ్య వచ్చే వివాదంలో అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే సెక్షన్‌ 45 కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పిలెట్‌ అథారిటీలో 90 రోజుల్లో అప్పీలు చేసుకోవచ్చు. దీన్ని మూడు నెలల్లో పరిష్కరించాలి. పరిహారం చెల్లించడానికి అథారిటీ ఆదేశాలు ఇవ్వవచ్చు. కనీస వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లింపు ఆదేశాలు వెలువరించాలి. ఈ చట్టం కింద ‘ఇన్‌స్పెక్టర్‌ కమ్‌ ఫెసిలిటేటర్‌’ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. వేతన చట్టం, అందులోని నిబంధనల గురించి యాజమాన్యం, కార్మికులకు అవగాహన కల్పించే బాధ్యతను ‘ఫెసిలిటేటర్‌’ తీసుకుంటారు. కార్మికులు తమకు ఎదురయ్యే ఇబ్బందులపై ఆయనను ఆశ్రయించవచ్చు. ‘ఫెసిలిటేటర్‌’ ఆయా సంస్థల యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సోదాలు, తనిఖీలు, ఈ-తనిఖీలు నిర్వహించవచ్చు. రికార్డులను స్తంభింపజేసే అధికారమూ ‘ఫెసిలిటేటర్‌’కు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కంటే తక్కువ చెల్లిస్తున్నట్లయితే రూ.50 వేల వరకు జరిమానా ఉంటుంది. అయిదేళ్లలో తిరిగి ఇదే నేరానికి పాల్పడితే మూడు నెలల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. చట్టంలోని ఇతర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రూ.20 వేల వరకు జరిమానా, రెండోసారి పాల్పడితే నెల జైలుశిక్ష, రూ.40 వేల జరిమానా విధించవచ్చు. కనీస వేతనాన్ని ఏ రకంగా లెక్కించాలనే అంశంపై చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. ఆర్థికంగా గిట్టుబాటు కాని కొన్నింటిలో ‘యూనిట్‌ రేట్‌’ ప్రకారం చెల్లింపులు ఉంటాయి. గతంలో సమస్యల పరిష్కారానికి ఉమ్మడి సంప్రతింపులు ఉండేవి. ప్రస్తుత చట్టం కింద ఆ అవకాశం లేదు. దీంతో కార్మిక సంఘాల పాత్ర పరిమితంగానే ఉంటుంది. యాజమాన్యమే చట్టప్రకారం సమస్యను పరిష్కరించాల్సి ఉండటంతో కార్మిక సంఘాల జోక్యం తక్కువేనన్న అభిప్రాయం ఉంది. మొత్తం మీద కొత్త చట్టంతో కార్మికులకు కొంత వెసులుబాటు లభించనుంది!


- దండు నారాయణరెడ్డి
Posted on 28-08-2019