Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అసోం చిక్కుముడి

* నేడు జాతీయ పౌర పట్టిక విడుదల

* ఆందోళనలో 40 లక్షల మంది ప్రజలు

అసోం ఓ చరిత్రాత్మక ఘటన ముంగిట నిలబడింది. నేడు ఆ రాష్ట్ర జాతీయ జనాభా రిజిస్టర్‌ వెల్లడి కానుంది. దీనివల్ల అక్కడున్న దాదాపు 40 లక్షల మంది విదేశీయులుగా మారబోతున్నారని అంచనా. ఈ పరిణామంవల్ల శాంతిభద్రతలు ప్రమాదంలో పడతాయని, దాదాపు 200 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని అసోం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర సర్కారును కోరింది. ఒకవైపు కశ్మీర్‌ ఉద్రిక్తతలు చల్లారక ముందే, అసోమ్‌లో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉంటాయోనని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నేళ్ల అస్సామీయుల సమస్యకు పరిష్కారం లభించిందని సంతోషపడాలో, ఒకేసారి రెండు అతి సున్నితమైన సమస్యలు ఎదురవుతున్నందుకు కలత చెందాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఉనికి ప్రశ్నార్థకమైన వేళ...
‘యాండబో’ ఒప్పందంతో 1826లో అసోం ప్రాంతం బ్రిటిష్‌ అధీనంలోకి వెళ్ళింది. అక్కడి తేయాకు తోటల్లో పనిచేయడానికి తూర్పు, మధ్య భారతదేశం నుంచి ప్రజల్ని అసోమ్‌కు తరలించారు. మరోవైపు 1905లో బెంగాల్‌ విభజన సమయంలో మొదలైన బెంగాలీల వలసలు మొన్న మొన్నటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే దాదాపు 28 శాతం బెంగాలీ భాష మాట్లాడేవారు ఉన్నారు. మతపరంగానూ జనాభాలో తీవ్ర మార్పులు జరిగాయి. అసోమ్‌లో 1901లో 12 శాతంగా ఉన్న ముస్లిములు 2011కి 35 శాతానికి పెరిగారు. మొత్తం జనాభాలో అస్సామీ మాట్లాడేవారి సంఖ్య 50 శాతంకంటే తక్కువకు పడిపోయింది. ఇది అస్సామీయులను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేసింది. వారి భాష, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు ఉనికి కోల్పోయే ప్రమాదమేర్పడిందని భావించారు. దాని పర్యవసానంగా కేంద్రం 1950లోనే అసోం వలసదారుల చట్టం తెచ్చింది. అయినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ఎక్కడా లేనివిధంగా 1951 జనాభా లెక్కల ఆధారంగా 1951 అసోం జాతీయ జనాభా రిజిస్టర్‌ను తయారు చేశారు. కానీ, వలసల ప్రవాహం ఆగలేదు. 1947 విభజనతో వేధింపులకు గురైన హిందువులు తూర్పు పాకిస్థాన్‌ నుంచి శరణారులుగా అసోం, పశ్చిమ్‌బంగలకు రావడం మొదలైంది. పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి ఒకేసారి ఉప్పెనలా కాకుండా అంచెలంచెలుగా వస్తూనే ఉన్నారు. 1971 బంగ్లాదేశ్‌ విమోచన పోరాటం ఈ ఉద్ధృతిని మరింత పెంచింది. వీటన్నింటి ఫలితంగా 1977లో ‘ఆల్‌ అసోం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆసు)’ నాయకత్వాన విద్యార్థి పోరాటం మొదలై, పోనుపోను ప్రజాందోళనగా మారింది. 1980లో ఇందిరా గాంధీ హయాములో సుదీర్ఘ చర్చలు జరిగినా, పరిష్కారం లభించలేదు. చివరకు 1985 ఆగస్టు 15న ‘అసోం ఒప్పందం’ కుదిరింది. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ దిల్లీ ఎర్రకోట పైనుంచి ఈ విషయాన్ని ప్రకటించారు. అంతటితో సమస్యకు పరిష్కారం దొరికిందని అందరూ అనుకున్నారు.

అసోం ఒప్పందం ప్రకారం 1966 జనవరి ఒకటో తేదీని నిర్ణీత గడువు (కట్‌ ఆఫ్‌ డేట్‌)గా తీసుకున్నారు. అయినా 1971 మార్చి 24వ తేదీ అర్ధరాత్రి వరకు వచ్చినవారినీ కొన్ని షరతులతో పౌరులుగా కొనసాగించడానికి సమ్మతించారు. ఆపై అంటే బంగ్లాదేశ్‌ విమోచనను ప్రకటించిన తేదీనుంచి వచ్చినవారిని విదేశీయులుగా పరిగణిస్తారు. భారత్‌-బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దును పటిష్ఠపరచాలనీ ఆ ఒప్పందంలో ఉంది. అది అమలుకు నోచుకోలేదు. 2005లో అందుకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆ తరవాత మూడేళ్లకు 2009లో పౌరసత్వ నిబంధనల చట్టానికి సవరణ చేయగలిగారు. అంటే ఒప్పందం అమలుకు 24 సంవత్సరాల వరకు అడ్డంకులు తొలగలేదు. ఇది అన్నాళ్లూ అసోం ప్రజల సహనానికి పరీక్ష పెట్టినట్లే. వారికి కేంద్రం మీద ఆగ్రహం కలగడానికి ఇంతకన్నా సహేతుకమైన కారణం ఏం కావాలి?

చివరికి సమస్య సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2009లో దీనిపై వేసిన పిటిషన్‌ 2013లో విచారణకు వచ్చింది. 2013 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు సుప్రీంకోర్టు విచారణ సాగింది. మొత్తం 59 ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుత అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ రెండుసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం పరుగులు పెట్టించింది. విశేషమేమంటే 2013లో ఈ కేసు విచారణ బెంచ్‌లో ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రధాన న్యాయమూర్తిగా ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అసోమ్‌కి చెందిన వ్యక్తి కావడంతో సమస్య మూలాలను మరింత లోతుగా అర్థం చేసుకోగలరని భావించవచ్చు.

ఈ ప్రక్రియ కోసం ఇప్పటివరకు రూ.1,200 కోట్ల వరకు ఖర్చయినట్లు అంచనా. 50 వేలమంది ఉద్యోగులు, ఎనిమిది వేలమంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, 1,200 మంది వ్యక్తిగత సిబ్బంది, 2,500 సేవాకేంద్రాల సిబ్బంది కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. చివరి ముసాయిదా ప్రతిని 2018 జూన్‌ 30న ప్రచురించారు. దీనిప్రకారం మొత్తం 3.29 కోట్ల జనాభాలో 2.9 కోట్ల మందికి మాత్రమే జాబితాలో చోటుదక్కింది. అంటే సుమారు 40 లక్షల మంది సాంకేతికంగా విదేశీయులన్నమాట. అందువల్లే నేడు వెల్లడించబోయే తుది జాబితాకోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే జాతీయ జనాభా రిజిస్టర్‌ ముసాయిదాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమూ ఈ ప్రక్రియపై పెదవి విరుస్తోంది. ఇందులో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకోరాదని 2017 జులైలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్రియపై పూర్తి అసంతృప్తితో ఉంది. బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో అక్రమ వలసదారులు అతితక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనేకమంది బంగ్లాదేశీయులు జాబితాలో చేరారని, ఎంతోమంది అమాయకులైన స్థానికులకు జాబితాలో చోటుదక్కలేదని ఆరోపిస్తున్నారు. జాబితా తప్పుల తడకగా తయారైందని ప్రజలూ వాపోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోసారి తనిఖీకి అనుమతి ఇవ్వాలని కోరింది. అందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలా స్పందిస్తారోనని రాష్ట్రప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

కలగూరగంప జాబితా
జాతీయ జనాభా రిజిస్టర్‌లో అసోం ఒప్పందానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు (అప్‌డేషన్‌) ఎలా చేశారనేదే ఈ మొత్తం ప్రక్రియలో కీలకం. ముందుగా దీనికి 1951 జాతీయ జనాభా రిజిస్టర్‌ను ఆధారంగా తీసుకున్నారు. ఆ తరవాత ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 వరకు ఏదైనా ఓటర్ల జాబితాలో పేరు ఉంటే దాన్ని ఆమోదించారు. ఆపై ఈ రెండింటి ప్రకారం జాబితాలో పేర్లు ఉన్నవారి రక్త సంబంధీకులను చేర్చారు. ఇవేమీ లేనివారు 1971 మార్చికి ముందు ఇంకేవైనా పత్రాలు చూపగలిగితే వారినీ జాబితాలో చేర్చారు. విశేషమేమంటే 1951 జాతీయ జనాభా రిజిస్టర్‌లో లేనివారంతా పైన చెప్పిన ప్రక్రియ ద్వారా నమోదు చేసుకొని వారి పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. నిరక్షరాస్యులు, నామమాత్రపు చదువు ఉన్నవారు అధికంగా ఉన్న దేశంలో ఇదెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

ఉపశమన చర్యలు
శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రబలగాలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు జాబితాలో లేనివారి కోసం ఉపశమన చర్యలూ చేపట్టింది. జాబితాలో లేకపోయినా ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించబోమని ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టీకరించింది. ఎవరినీ నిర్బంధించబోమంటూ హామీ ఇచ్చింది. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాలనుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని, వారి పిల్లలకు విద్య, పౌరసత్వం తదితర అంశాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండవని ప్రకటించింది.

జాబితాలో లేనివారు ట్రైబ్యునల్‌లో, తరవాతి దశలో హైకోర్టులో అప్పీలు చేసుకుని న్యాయం పొందడానికి అవసరమయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 200 ట్రైబ్యునళ్లను నియమించింది. మరో 200 ట్రైబ్యునళ్లను నియమించడానికి సిద్ధపడుతోంది. ట్రైబ్యునల్‌లో అప్పీలు సమయాన్ని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచడంతోపాటు జిల్లా న్యాయ సహాయ సంఘాలను సంఘటితపరచింది. ప్రభుత్వం ఇన్ని ఉపశమన చర్యలు ప్రకటించినా ఉద్రిక్తతల విషయంలో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. దాదాపు 40 లక్షల మందిని ఒక్కసారి విదేశీయులుగా ప్రకటించడం అసోం ఒప్పందం ప్రకారం జరిగినా- ఈ చర్య సహజంగానే ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఇంత భారీప్రక్రియలో తప్పులు చోటు చేసుకోవడం సహజమే. అవే ఇప్పుడు ప్రజలపాలిట శాపాలుగా మారే ప్రమాదముంది. భవిష్యత్తులో రాబోయే పౌరసత్వ సవరణ బిల్లుపైనా పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. ఆ బిల్లు తాజా జాబితాలో లేనివారిని రెండురకాలుగా విభజిస్తుంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో దుర్విచక్షణకు, వేధింపులకు గురై పారిపోయి వచ్చిన ముస్లిమేతర వలసదారులను శరణార్థులుగా, మెరుగైన ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన పొరుగు దేశ ముస్లిములను అక్రమ వలసదారులుగా ఇది వర్గీకరిస్తుంది. దేశవ్యాప్తంగా వివాదాలు రేకెత్తడానికి అవకాశమున్న అంశమిది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావచ్చని భావిస్తున్నారు. అటు కశ్మీర్‌, ఇటు అసోమ్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు చివరకు ఎలా పరిణమిస్తాయోనన్న ఆందోళనే దేశ ప్రజల్లో వ్యక్తమవుతోందిప్పుడు!


Posted on 31-08-2019