Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

అవకాశాల్లో సగమేదీ?

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లయినా భారతీయ మహిళలు ఇప్పటికీ వివక్ష, అసమానతలకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళాభివృద్ధికీ, స్త్రీలకు శక్తిప్రదానానికీ తోడ్పడే విధానాలను అనుసరించాలని ఆలోచనాపరులు కోరుకుంటున్నారు. వారి ఆశలను నెరవేర్చాలంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవలసిన సమస్యలు చాలానే ఉన్నాయి. భారతదేశం పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17)ను అమలు చేస్తున్నా, మహిళలకు సంబంధించి పలు సామాజిక అభివృద్ధి సూచికలు నిరాశాజనకంగా ఉన్నాయి. 2011 జనగణన ప్రకారం ఏడేళ్లు, అంతకు పైబడిన మహిళల్లో అక్షరాస్యత రేటు 65.50 శాతం. 2007-08 మధ్యకాలంలో 15-19 ఏళ్ళ మధ్య వయసు అమ్మాయిలలో ఎనిమిదేళ్లపాటు పాఠశాల విద్యను పూర్తిచేసినవారి శాతం 55.90 శాతం మాత్రమే. అదే పురుషుల్లో అక్షరాస్యత రేటు 82 శాతంగా ఉంది. భారతీయ సమాజం స్త్రీల పట్ల ఇప్పటికీ పాతకాలపు మూస దృక్పథాలనే అనుసరిస్తోంది.

వయసు వచ్చిన ఆడపిల్లలు గడప దాటకూడదనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. ఇది చాలదన్నట్లు మన విద్యా సంస్థల్లో బాలికలకు మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం, బాలికల్లో అక్షరాస్యత వ్యాప్తికి పెద్ద అడ్డంకిగా ఉంది. 2014 గణాంకాల ప్రకారం దేశంలోని 10,78,361 పాఠశాలల్లో 1,89,427 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. ఈ పూర్వరంగంలో 2009 విద్యా హక్కు చట్టాన్ని తక్షణం అమలు చేయడం అవసరం. బాలబాలికలకు విద్య ఒక ప్రాథమిక హక్కు అని ప్రకటించే ఈ చట్టం, పాఠశాలలు పాటించవలసిన కనీస ప్రమాణాలను నిర్దేశిస్తోంది. దేశంలో మాతా ఆరోగ్య సంరక్షణ సేవలు అధ్వానంగా ఉన్నాయి. వీటిని తక్షణం గాడిన పెట్టాలి. 2009లో జరిగిన మహిళల ప్రసవాలలో 23.6 శాతం ప్రసవాలు మాత్రమే సుశిక్షిత మంత్రసానుల చేతుల మీదుగా జరిగాయి. 26.5 శాతం మహిళలకు మాత్రమే ప్రసవానికి పూర్వం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు జరిగాయి. పరిస్థితి ఇంత తీసికట్టుగా ఉండబట్టి 2009-10 మధ్యకాలంలో జాతీయ స్థాయిలో ప్రతి లక్ష జననాలకు 200 మాతా మరణాలు సంభవించాయి.

శ్రామికుల్లో ఎంతమంది?

చైనాలో 70 శాతం మహిళలు శ్రామిక, ఉద్యోగి బలగంలో సభ్యులుకాగా, భారతదేశంలో వీరు 24 శాతం మాత్రమే. ప్రతి ముగ్గురు భారతీయ మహిళల్లో ఇద్దరు ఏవిధమైన వృత్తి ఉద్యోగాలు చేయడంలేదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. స్త్రీలు పూర్తిస్థాయిలో వృత్తి ఉద్యోగాల్లో పాల్గొనకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. స్త్రీల ఆరోగ్య విద్యా సూచికలు ప్రోత్సాహకరంగా లేకపోతే వారు పనులలో పూర్తిస్థాయిలో పాల్గొనలేరు. 2004-05లో 37 శాతం మంది మహిళలు పనిచేస్తోంటే, 2009-10 నాటికి అది 29 శాతానికి తగ్గింది. నిజానికి ఈ కాలంలో భారతదేశం అధిక వృద్ధి రేట్లను నమోదు చేసినా, వృత్తి ఉద్యోగాలలో స్త్రీల వాటా తగ్గడం శోచనీయం. 2013 అంతర్జాతీయ లింగపరమైన అంతరాల సూచికలో 136 దేశాలను పరిశీలించగా, వాటిలో భారత్‌ 124వ స్థానంలో ఉంది. మహిళలకు విద్యా అవకాశాల కల్పనలో 120వ స్థానంతో సరిపెట్టుకొంది. స్త్రీలు పురుషులతో సమానంగా పనిచేసినా, వారికి పురుషుల వేతనంలో 62 శాతమే లభిస్తోంది.

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో వ్యవసాయ రంగం వాటా 14 శాతమే. దేశంలోని మొత్తం మహిళా శ్రామిక బలగంలో 69 శాతం వ్యవసాయ రంగంలోనే పనిచేస్తున్నారు. 2001లో 10.3 కోట్లుగా ఉన్న రైతుల సంఖ్య 2011 నాటికి 9.58 కోట్లకు తగ్గింది. వ్యవసాయం రోజురోజుకీ కష్టదాయకంగా మారడమే దీనికి కారణం. అందువల్ల నిరుద్యోగ సంక్షోభం ఈ రంగంలో ఎక్కువగా కనబడుతోంది. ఇన్ని కడగండ్ల మధ్య కూడా వ్యవసాయాన్నే అంటిపెట్టుకొనే వనితలకు మహిళా రైతుల హక్కుల బిల్లు లబ్ది చేకూరుస్తుంది. 2011 మేలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందవలసి ఉంది. ఈ బిల్లు మహిళా రైతుల ప్రత్యేక అవసరాల గురించి పట్టించుకొంటోంది. భూమి, నీరు,రుణాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తి సాధనాల సరఫరాలో సమాన హక్కులు కల్పిస్తుంది. మహిళా రైతులకు ధృవీకరణ పత్రాల జారీ, మద్దతు సేవల కల్పనకు ప్రత్యేక నిధి వంటి ప్రతిపాదనలు కూడా ఈ బిల్లులో పొందుపరిచి ఉన్నాయి.

సమగ్ర శిశు సంక్షేమ పథకం (ఐసిడిఎస్‌) కింద పనిచేసే అంగన్‌వాడీ కార్యకర్తలకు, జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద పనిచేసే ఆశా (ఎక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్స్‌) కార్యకర్తలకు, కనీస వేతనాలు కానీ, జీతంతో కూడిన సెలవులు, పెన్షన్లు కానీ ఇవ్వకపోవడం సమర్థనీయం కాదు. దీనివల్ల దేశవ్యాప్తంగా కోటిమంది మహిళలకు అన్యాయం జరుగుతోంది. 2004-05 జాతీయ నమూనా సర్వే (ఎన్‌.ఎస్‌.ఎస్‌) ప్రకారం దేశంలో 42 లక్షల మంది ఇంటిపని చేసే మహిళలు ఉండగా, 2009-10 నాటికి వారి సంఖ్య 25 లక్షలకు తగ్గింది. ఈ పనిమనుషులకు హక్కులు, సౌకర్యాలు కల్పించడానికి ఇంతవరకు ఎటువంటి చట్టం చేయలేదు. పని మనుషుల స్థితిగతులను మెరుగుపరచడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనలకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం ఒక ముసాయిదా విధానం రూపొందించే విషయమై చర్చలు జరిపింది కానీ, ఈ విధానం ఇంకా రూపుదిద్దుకోవలసి ఉంది.

చట్టసభల్లో మహిళలకు నిజమైన, న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయితే, ప్రస్తుతం ధన బలం, కండబలం ప్రధాన పాత్ర వహిస్తున్న మన ఎన్నికల రాజకీయాల తీరుతెన్నులు మారిపోవడం తథ్యం. పంచాయతీరాజ్‌ సంస్థల్లో మహిళలకు ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నందువల్ల ప్రాథమిక స్థాయిలో విధాన నిర్ణయ ప్రక్రియలో స్త్రీలు ఇప్పటికే పాల్గొంటున్నారు. కానీ, ఎన్నికైన దళిత మహిళా ప్రతినిధులు మరింత స్వతంత్రంగా విధి నిర్వహణ చేసేట్లు చర్యలు తీసుకోవాలి. వారికి ఎదురవుతున్న కులపరమైన వివక్షను రూపుమాపాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా)పథకం కింద కూడా మహిళలకు ప్రత్యేక రక్షణలు కల్పించాలి. జాతీయ స్థాయిలో మాత్రం సవాళ్లు తీవ్రంగా ఉన్నాయి. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఇంతవరకు ఆమోదం పొందలేదు. పార్లమెంటు ఉభయ సభల్లో మహిళా సభ్యులు ఏనాడూ పది శాతానికి మించలేదు.

ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు

మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేసినట్లయితే మహిళల జీవితాలు ఖాయంగా మారిపోతాయి. అయితే, ఈ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించి, సక్రమంగా ఖర్చు చేయడం అవసరం. 11వ పంచవర్ష ప్రణాళికలో అనేక మహిళాభివృద్ధి కార్యక్రమాలను పొందుపరచినా, లబ్ధిదారుల సంఖ్యకు దీటుగా నిధులను కేటాయించలేదు. 12వ పంచవర్ష ప్రణాళికలో ఇంతవరకు మూడేళ్లు గడచిపోయినా చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. 2013 ఆగస్టులో పార్లమెంటుకు సమర్పించిన కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక, మహిళా శిశుసంక్షేమ శాఖ 2009-12 మధ్యకాలంలో నిధుల కేటాయింపులకు తగినట్లు వ్యయం చేయలేదని తప్పుపట్టింది.

మహిళా వాణినీ, సమాజానికి వారు చేస్తున్న సేవలనూ గుర్తించాలి. వాటికి విలువ ఇవ్వాలి. దీనికోసం మహిళా శక్తిప్రదాన పథకాలను సక్రమంగా అమలు చేయాలి. పెండింగులో ఉన్న పలు కీలక బిల్లులను త్వరగా ఆమోదించాలి. అన్నింటినీ మించి చట్టాన్ని పకడ్బందీగా, నిష్పాక్షికంగా అమలు చేయాలి. ఇటీవలి కాలంలో మహిళల పట్ల పెరిగిపోయిన హింసాదౌర్జన్య కాండను చూస్తే, చట్టాలు ఎంత బలహీనంగా అమలవుతున్నాయో తెలిసివస్తుంది. పూర్వ ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ కమిషన్‌ లైంగిక హింసకు గురైన మహిళలకు న్యాయం జరగాలంటే చట్టాలకు తగు మార్పులు చేయాలనీ, న్యాయ వ్యవస్థలో, పోలీసు శాఖలో ముఖ్య సంస్కరణలు తీసుకురావాలని సిఫార్సు చేసింది. కొత్త ప్రభుత్వం ఈ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి.

(రచయిత - పీవీ రావు )
Posted on 18-02-2015