Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

జలమేజయ యజ్ఞం!

* అనుసంధానం శ్రేయోదాయకం
నదుల అనుసంధానం దశాబ్దాలుగా చర్చల్లో నలుగుతోంది. అసమతుల వర్షపాతం కారణంగా, అయితే కరవు లేకపోతే వరద అన్నట్లుగా తయారైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన బృహత్తర కార్యక్రమమిది. సమృద్ధిగా జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలనుంచి తక్కువ నీరున్న చోట్లకు నీటిని తరలించి జాతీయస్థాయిలో అసమానతలు తొలగించడమే ముందున్న పరిష్కారం. ఆ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని కెన్‌ నదిని ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బెట్వా నదితో అనుసంధానించడం ద్వారా దేశంలోనే తొట్టతొలి జాతీయ నదుల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలకెక్కించే దిశగా ఎన్‌డీఏ సర్కారు అడుగులు కదపడం హర్షణీయం. మరోవంక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ ఆవైపు చురుగ్గానే కదులుతోంది. గోదావరి జలాలను కృష్ణానదికి తరలించే కార్యక్రమాన్ని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించడం ముదావహం. వివిధ ప్రాంతాల సాగునీటి అవసరాలు సమర్థంగా తీర్చే మహదాశయంతో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని ఆచితూచి అమలు చేయాల్సి ఉంది. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 2.26కోట్ల హెక్టార్లు. పదకొండో పంచవర్ష ప్రణాళికనాటికి అది 11.3కోట్ల హెక్టార్లకు పెరిగింది. అవసరాలతో పోలిస్తే సాగు విస్తీర్ణంలో పెరుగుదల ఏ మూలకూ సరిపోదు. దేశం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు సృజనాత్మక పరిష్కారంగా తెరమీదకు వచ్చిన నదుల అనుసంధాన కార్యక్రమాన్ని సవ్యంగా పట్టాలకు ఎక్కిస్తే అంతకుమించి కావలసింది లేదు.

అన్నదాతకు వరం...

దేశంలోని వివిధ నదీవ్యవస్థల నుంచి లభిస్తున్న సగటు వార్షిక ప్రవాహ పరిమాణాన్ని 1,869 శతకోటి ఘనపు మీటర్లుగా అంచనా వేశారు. ద్వీపకల్ప నదుల వార్షిక ప్రవాహంలో 90శాతం, హిమాలయ ప్రాంత నదుల వార్షిక ప్రవాహ పరిమాణంలో 80శాతం కేవలం నాలుగు వర్షపు నెలల్లోనే లభిస్తున్నాయి. వివిధ సాంకేతిక ప్రతిబంధకాలవల్ల ఆ నీటిలో చాలా తక్కువ భాగమే అక్కరకు వస్తోంది. కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం- నదుల్లో ప్రవహించే భూతల జలం ద్వారా 690శ.కో.ఘనపు మీటర్లు, భూగర్భజలం ద్వారా 433శ.కో.ఘనపు మీటర్లు- అంటే మొత్తం 1,123శ.కో.ఘనపు మీటర్ల నీరు వినియోగానికి అందుబాటులో ఉంటోంది. దాదాపు 128కోట్లుగా ఉన్న దేశ జనాభా 2050నాటికి 164కోట్లకు పెరగవచ్చని, 23కోట్ల టన్నులుగా ఉన్న ఆహార ధాన్యావసరాలు అప్పటికి 45కోట్ల టన్నులకు పెరగవచ్చని ఓ అంచనా. అందుకే భవిష్యత్తులో పెరిగే జనాభాకు తాగునీరు, కూడు, గుడ్డ అవసరాలు తీర్చడానికి అందుబాటులో ఉన్న అన్ని జలవనరులనూ పూర్తిస్థాయిలో వాడుకోవాలి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని జలాశయాల్లో తలసరి నీటి నిల్వ సామర్థ్యం 5,000ఘనపు మీటర్లు. భారత్‌లో అది కేవలం 500ఘనపు మీటర్లు. అందువల్లే జల, ఆహార భద్రతకు విస్తృత కృషి కొనసాగాల్సి ఉంది. పరీవాహక ప్రాంత జలవనరుల అభివృద్ధివల్ల, ఒక నిర్దిష్ట పరిమితికి మించి సాగుభూమి విస్తీర్ణాన్ని పెంచడం సాధ్యపడదు. మిగులు జలాలున్న ఇతర పరీవాహక ప్రాంతాలనుంచీ నీటిని మళ్లించి ఉపయోగించుకోవాలి. అంతిమంగా దేశంలో లభ్యమయ్యే సాగు భూమి సంభావ్యతను 14కోట్ల హెక్టార్లుగా అంచనా వేశారు. సాగునీటి అవసరాలతోపాటు- దేశంలోని ప్రజలకు, పశుగణానికి తాగడానికి నీరు కావాలి. ఇప్పటికే దేశ రాజధానితోపాటు హైదరాబాద్‌, ముంబయి, చెన్నై వంటి పెద్ద నగరాలకు దూరప్రాంతాల నుంచి నీరు తరలించి, తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. జల, థర్మల్‌ విద్యుదుత్పాదనకు; ఇతర పరిశ్రమలకు నీటి అవసరాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా నీటి కొరత మున్ముందు మరింత ముమ్మరించవచ్చు.

ఎంతో క్లిష్టమైన అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చాలంటే, సంబంధిత రాష్ట్రాలు పెద్దమనసుతో సహకరించాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వం మరికొన్ని కీలక చర్యలు చేపట్టక తప్పదు. ముందుగా నేపాల్‌ భూభాగంలో గంగ ఉపనదులపై జలాశయాలు నిర్మించాలి. దేశంలో జలపంపిణీని క్రమబద్ధం చేయాలి. బంగ్లాదేశ్‌తో సంప్రతింపులు జరిపి, బ్రహ్మపుత్ర నీటిని గంగకు మళ్లించేలా అనుసంధాన కాలువ తవ్వాలి. అప్పుడే దక్షిణ ప్రాంతానికి అందించేందుకు గంగలో తగిన నీరుంటుందని విశ్వసించి సంబంధిత రాష్ట్రాలు సహకారం అందజేస్తాయి. వీలైనచోట్ల చిన్నపాటి అనుసంధాన కాలువలను తవ్వడం ద్వారా ఈ బృహత్పథకానికి నాంది పలకాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే! గోదావరి-కృష్ణ-పెన్న నదులను అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పోలవరం కుడి కాలువ, ఉత్తర భారతంలో చేపట్టిన కెన్‌-బెట్వా నదుల అనుసంధాన ప్రక్రియలు ఈ చిన్న అనుసంధానాలకు ఉదాహరణలు. కేంద్రం చిత్తశుద్ధి, రాష్ట్రాల మధ్య సహకారం ఈ భగీరథ యత్నం సాఫల్యానికి అత్యవసరం.

నానాటికీ పెరుగుతున్న జనాభా కూడు, గుడ్డ అవసరాలను తీర్చాలంటే, లభ్యమయ్యే నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. అందుకు అనేక స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. వర్షపునీటి సంరక్షణ, జల వినియోగ సామర్థ్యం పెంపుదల, భూతల- భూగర్భ జలాల సంయుక్త వినియోగం, సముద్ర జలాల క్షారరహిత ప్రక్రియ వంటివి కొన్ని స్వల్పకాలిక చర్యలు. భూగర్భజల కృత్రిమాభివృద్ధి, మేలైన నీటి నిర్వాహక చర్యలు, భారీ-మధ్యతరహా జలాశయాల నిర్మాణం, నదుల అనుసంధానం మొదలైన వాటిని దీర్ఘకాలిక చర్యలుగా పరిగణిస్తారు. వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి వనరుల్లోని అసమానతలను క్రమక్రమంగా తగ్గించడం ముఖ్యం. అందుకు మిగులు జలాలున్న నదీ పరీవాహక ప్రాంతాల నుంచి తరుగు జలాలున్న పరీవాహక ప్రాంతాలకు నీటిని మళ్లించాలన్నదే ప్రస్తుత ప్రక్రియ. దీనిపై కేంద్రం, పలు రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి.

మిగులు నుంచి తరుగు ప్రాంతాలకు నీటి తరలింపుకోసం జలవనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం 1980లోనే జాతీయ దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాయి. అందులోని రెండు విభాగాల్లో ఒకటి హిమాలయ ప్రాంత నదుల అభివృద్ధి విభాగం, మరొకటి ద్వీపకల్ప నదుల అభివృద్ధి విభాగం. హిమాలయ సంబంధిత విభాగంలో ముఖ్యమైన అంశాలు: భారత్‌, నేపాల్‌లోని గంగ, బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనదులపై జలాశయాలను నిర్మించి; గంగ తూర్పు ఉపనదుల మిగులు జలాలను పశ్చిమ ఉపనదులకు మళ్లించడం. బ్రహ్మపుత్ర నదిని గంగానదితో, గంగానదిని మహానదితో అనుసంధానించడం. దీనివల్ల 2.2కోట్ల హెక్టార్లకు సాగునీటి సౌకర్యంతో పాటు మూడువేల మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పాదన లభిస్తుంది. ద్వీపకల్ప నదుల అభివృద్ధి విభాగంలో అంశాలు: మహానది-గోదావరి-కృష్ణ-పెన్నారు-కావేరీ నదుల అనుసంధానం. ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లో అనువైన చోట్ల జలాశయాల నిర్మాణం. ముంబయికి దక్షిణాన, తాపీకి ఉత్తరాన పశ్చిమ దిశలో ప్రవహిస్తున్న నదుల అనుసంధానం. కెన్‌-చాంబల్‌ నదుల అనుసంధానం. పశ్చిమ దిశగా పారే ఇతర నదుల మళ్లింపు. ఇందువల్ల అదనంగా 1.3కోట్ల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యంతో పాటు 400మెగావాట్ల జలవిద్యుదుత్పాదన లభిస్తుందని అంచనా. జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రవాహం ఎక్కువగా ఉన్న 14హిమాలయ నదులను, ప్రవాహం తక్కువగా ఉన్న 16ద్వీపకల్ప నదులతో అనుసంధానించడానికి జాతీయ ప్రణాళిక రూపొందించింది. అంతర్‌ రాష్ట్ర నదుల అనుసంధాన ప్రక్రియ క్లిష్టమైనది. దీనికి సంబంధిత రాష్ట్రాలు సుహృద్భావంతో సహకరించాల్సి ఉంటుంది. మహానదిలో తమ రాష్ట్రావసరాలకు మించి మిగులు జాలాలు లేవని; బ్రహ్మపుత్ర, గంగ నదుల నుంచి మహానదికి నీటిని మళ్లించిన తరవాతనే గోదావరికి నీటి మళ్లింపు సాధ్యమవుతుందని ఒడిశా ప్రభుత్వం చెబుతోంది. మహానది నుంచి నీరందిన తరవాతనే దిగువకు నీటి మళ్లింపు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది.

పొరుగు దేశాలతో సమస్యలు

గంగా నదీజలాలను దక్షిణానికి తరలించాలంటే సహలబ్ధి దేశాలైన నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ల అనుమతి అవసరం. నదీజలాల పంపకానికి సంబంధించి 1996లో ఇండియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన నీరు ఇప్పటికీ పూర్తిగా అందడం లేదని, గంగా జలాలను దక్షిణానికి తరలిస్తే తమ దేశం ఎడారిగా మారుతుందని బంగ్లాదేశ్‌ ఆందోళన వెలిబుచ్చుతోంది. ఈ మేరకు 2003 ఆగస్టులో భారత ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసింది. గంగానది ఉపనదులైన కోసి, గండక్‌, కర్నాలి, మహాకాళీల నీటిని ఇతర ప్రాంతాలకు తరలించాలంటే- నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీ జలాశయాలు నిర్మించాలి. దీనికోసం భారత ప్రభుత్వం నేపాల్‌తో ఒడంబడిక కుదుర్చుకోవాలి. బ్రహ్మపుత్ర నుంచి గంగానదికి అనుసంధాన కాలువను తవ్వడానికి బంగ్లాదేశ్‌ అనుమతి అత్యవసరం. భారత జనాభా 2050నాటికి 164కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. అప్పుడు ఎదురయ్యే నీటిసమస్య తీవ్రతను అధిగమించడానికి నదుల అనుసంధానమే తరుణోపాయం. దీనివల్ల, వరదల నియంత్రణ వంటి అదనపు ప్రయోజనం సమకూరుతుంది. భూములు కోల్పోయేవారికి సరైన నష్టపరిహారం అందజేయడంతోపాటు, నిర్వాసితులకు సకాలంలో పునరావాసం కల్పించడం ప్రధానం.

- చెరుకూరి వీర‌య్య (ర‌చ‌యిత - సాగునీటి పారుద‌ల రంగ నిపుణులు)
Posted on 30-10-2015