Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

జలసిరి నిక్షిప్తమయ్యేలా...

* ప్రమాదకరంగా భూగర్భ జలాల పతనం

* వానబొట్టును ఒడిసిపడితే నీటిమట్టాలు పైపైకి

* వినియోగంలో పొదుపు ప్రజల బాధ్యత

దేశంలో వరదలు వచ్చి నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అదే సమయంలో భూగర్భ జలవనరులు వేగంగా అడుగంటుతున్న పరిస్థితి నిన్నమొన్నటి వరకు చూశాం. వరుణుడు కరుణించడంతో వెల్లువెత్తిన జలసంపద భూగర్భ జలమట్టాలను పెంచడానికి దోహదపడుతుంది. అదే సమయంలో జలాలు దీర్ఘకాలం నిలిచిఉండేలా ఎక్కడికక్కడ చెరువులు, జలాశయాలను నింపి ఉంచడం ఎంతో అవసరం. భూగర్భ జలాల విచ్చలవిడిగా వాడకం వల్ల పెరుగుతున్న ఒత్తిడి మున్ముందు పెను సంక్షోభానికి దారితీస్తుంది. కేంద్ర జలశక్తిశాఖ తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2001లో ఏడాదికి సగటున తలసరి నీటి లభ్యత 1,820 ఘనపుమీటర్లు. 2011లో అది 1545 ఘనపుమీటర్లకు చేరింది. 2021 నాటికి 1,341 ఘనపు మీటర్లకు చేరుకుంటుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అంచనా. 1951లో ఏడాది సగటున తలసరి నీటి లభ్యత 5,177 ఘనపుమీటర్లు ఉండగా 1991 నాటికి 2,209 ఘనపుమీటర్లకు చేరింది. 1951-2001 యాభై ఏళ్ల మధ్య తలసరి నీటి లభ్యతలో 51.77 శాతం తరుగుదల నమోదైతే 2001-2021 మధ్య అది 18.2 శాతం కావడం గమనార్హం. జలసంరక్షణలో పేలవమైన పనితీరు కనబరుస్తున్న దేశాల జాబితాలో భారత దేశం ఒకటి. ఈ విషయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, ఇజ్రాయెల్‌, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, బ్రిటన్‌ మంచి అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే జలసంరక్షణ కోసం జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి విడత కార్యక్రమం ఈ నెల 15న ముగిసింది. రెండోవిడత అక్టోబరు ఒకటి నుంచి మొదలవుతుంది. నీటిఎద్దడి ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతి పౌరుడూ జలసంరక్షణకు నడుంకట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

గణనీయంగా తగ్గిన లభ్యత
దేశంలో తలసరి నీటి లభ్యత గణనీయంగా పడిపోవడమే కాక, వాన నీటిని సంరక్షించుకోవడంలో విఫలమవుతున్న కారణంగానే నీటి ఎద్దడి ఎదురవుతుందన్నది కఠోర వాస్తవం. ఏటా కురుస్తున్న వాన నీటిలో ఎనిమిది శాతాన్నే సంరక్షించుకోగలుగుతున్నాం. ఫలితంగా భూగర్భజలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. దేశంలోనే అత్యంత జనాభా కలిగిన ఆరో నగరంగా ప్రసిద్ధిగాంచిన చెన్నైలో ఈ వేసవిలోనే మంచినీటి సమస్య పెనుసంక్షోభంగా మారింది. 2020 నాటికి దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ సహా 21 ప్రధాన నగరాల్లో భూగర్భజలాలు సున్నా స్థాయికి చేరుకుంటాయని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. భూగర్భజలాల లభ్యత సమస్య తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణం- మితిమీరిన వినియోగమే. పట్టణాల్లో నానాటికీ పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ అనివార్యంగానే భూగర్భజలాలపై ఒత్తిడి పెంచుతోంది. పట్టణీకరణ, వలసలు పెరుగుతుండటం వల్ల చిన్న నీటి వనరులు అంతరించిపోతున్నాయి. సంప్రదాయక జలసంరక్షణ చర్యలు మృగ్యమై భూగర్భజలాల పునరుద్ధరణకు వీలులేని పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుబాటులో ఉన్న వనరులు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చలేకపోతున్నాయన్నది వాస్తవం. గ్రామీణ భారతంలో అత్యధికంగా భూగర్భ జలాలను వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. రుతుపవనాల వైఫల్యం, సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల దేశంలో సేద్యానికి, పంటలకు భూగర్భజలాలే దిక్కవుతున్నాయి. భూగర్భజలాల్లో ఆరు శాతం గృహావసరాలకు, అయిదు శాతం పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు. తక్కిన 89 శాతాన్ని వ్యవసాయానికి వాడుతున్నారు. ఇందులో 60 శాతం వరి, చెరకు పంటలకోసమే వినియోగిస్తుండటం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో 17.80 కోట్ల గృహసముదాయాలు ఉండగా వాటిలో 32.70 కోట్ల గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా సదుపాయం ఉంది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో నేటికీ రక్షిత మంచినీటి సౌకర్యానికి నోచుకోనివారు కోట్లమంది ఉన్నారన్నది చేదు నిజం. తాజా ఆర్థిక సర్వే ప్రకారం 2050 నాటికల్లా భారత్‌లో నీటివనరుల కొరత మరింత తీవ్రం కానుంది. పట్టణ ప్రాంతాల్లో గృహావసరాలు, పారిశ్రామికావసరాల కోసం విచ్చలవిడిగా బోర్లు తవ్వుతున్నారు. నీటి వనరులు అత్యధికంగా అవసరమయ్యే వరి, చెరకు పండించడానికి రైతాంగం మొగ్గు చూపుతుండటంతో భూగర్భ జలవనరులు శరవేగంగా అడుగంటుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం- భారత్‌లో కిలో వరి ధాన్యాన్ని పండించడానికి 5,600 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. చైనాలో అది 330 నుంచి 340 లీటర్లకే పరిమితం. ప్రపంచవ్యాపంగా పండిస్తున్న వరిలో యాభై శాతం ఈ రెండు దేశాల నుంచే ఉత్పత్తి అవుతోంది. భారత్‌లో సగటున ఒక్క ఘనపుమీటరు నీటిని వినియోగించి 5.2 కిలోల చెరకు పండిస్తున్నారు. ప్రపంచ సగటు చెరకు ఉత్పత్తి ఘనపుమీటరు నీటికి 4.80 కిలోలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉంది. దక్షిణాఫ్రికాలో ఘనపుమీటరు నీటితో 7.8 కిలోలు, థాయ్‌లాండ్‌లో 5.8 నుంచి 6.5 కిలోల చెరకు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రైతాంగం భూసారం, పంటల దిగుబడి, ఉత్పాదకతకు బదులు సేద్యపు నీటి సద్వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కార్యదర్శుల స్థాయి కమిటీ తక్కువ నీటితో పండించే పంటలపై రైతాంగం దృష్టి కేంద్రీకరించాలని సూచించింది.

ఉద్యమస్ఫూర్తిగా సాగాలి
ప్రస్తుత పరిస్థితుల్లో యావత్‌ జాతి జలవనరుల సంరక్షణకు నడుం బిగించాలి. కర్తవ్యదీక్షతో కార్యోన్ముఖులు కావాలి. భూగర్భ జలాల విచక్షణ రహిత వినియోగానికి అడ్డుకట్టవేయడం, వ్యర్థజలాలను శుద్ధిచేసి పునర్వినియోగించడం, వర్షపునీరు వృథా కాకుండా ఒడిసిపట్టడం అవసరం. నీటి వనరుల ఎద్దడిని అధిగమించడానికి వాననీటి సంరక్షణే అత్యుత్తమమైన మార్గం. అందువల్ల జలసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మురుగు నీటిని, సముద్ర జలాలను శుద్ధి చేసి సాగునీటికి, తాగునీటికి వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ ఈ దిశగా ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. చెరువులు, కుంటల్లో పూడికతీత, వాననీటి సంరక్షణ వంటి కార్యక్రమాల్లో పెద్దయెత్తున ప్రజలను భాగస్వాములను చేయాలి. రైతాంగం సైతం భూగర్భ జలాలపై పూర్తిగా ఆధారపడరాదు. తక్కువ నీరు అవసరమయ్యే పంటలపై దృష్టి సారించాలి. ప్రపంచవ్యాప్తంగా సేద్యానికి అవసరమైన నీటి వనరుల్లో 34 నుంచి 43 శాతం వరిపంటకే అవసరమవుతాయి. తక్కువ నీటిని వినియోగించి చైనా తరహాలో వరి పండించడంలోని మెలకువలను అనుసరించాలి. రైతులు వ్యవసాయక్షేత్రాల్లో ‘ఫీల్డ్‌ఛానెళ్ల’ను ఏర్పాటు చేయడం ద్వారా, పొలాలకు వినియోగించుకునే నీటి పరిమాణాన్ని తగ్గించవచ్చు. నాటు వేయడానికి పొలాన్నంతా నీటితో నింపి తడపడానికి ముందుగా, పైపైన నీటిని చల్లడం ద్వారా భూమిపై పొరల్లోకి బొరియలు, పగుళ్లలోకి నీరు చేరుకుని తక్కువ నీటితోనే పొలమంతా తడుస్తుంది. రైతులు వ్యవసాయక్షేత్రాలను, పొలాలను చదును చేయడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల దాదాపుగా పంట పెరిగి చేతికందడానికి అవసరమయ్యే నీటిలో 10 శాతాన్ని తగ్గించవచ్చు. పంట పొలాల చుట్టూ ఎత్తయిన కట్టలు నిర్మించడం ద్వారా భారీ వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో నుంచి నీరు బయటకు పోకుండా నియంత్రించవచ్చు. ఈ విధమైన జలసôరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలవనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించవచ్చు. స్థానిక చిన్ననీటి వనరులను పరిరక్షించుకోవడం ద్వారా కురిసిన వాననీటిని ఒడిసి పట్టవచ్చు. తద్వారా భూగర్భ జలాలను కొంతమేరకైనా పునరుద్ధరించవచ్చు. అదే సమయంలో పునర్వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అప్పుడే అంతరించిపోతున్న జలవనరులను నిలువరించగలం!

ఇజ్రాయెల్‌ స్ఫూర్తి
జలవనరుల సంరక్షణలో ఇజ్రాయెల్‌ యావత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దాదాపుగా 94 శాతం వ్యర్థ, మురుగు జలాలను శుద్ధిచేసి, అందులో 85 శాతం నీటిని ఆ దేశం పునర్వినియోగిస్తోంది. రానున్న అయిదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో 90 శాతం నీటిని పునర్వినియోగించే దిశగా ప్రయత్నం చేస్తోంది. ఇజ్రాయెల్‌ వినియోగిస్తున్న నీటి వనరుల్లో యాభైశాతం మానవ సృష్టియే. వ్యర్థ జలాలను శుద్ధిచేయడం, పునర్వినియోగించడం, ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం, తద్వారా ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకుంటోంది. సూక్ష్మసేద్యాన్ని వ్యవసాయ క్షేత్రాలకు మాత్రమే పరిమితం చేయడం లేదు. పచ్చిక మైదానాలు, ప్రజోపయోగ ఉద్యానవనాలు, ఆఖరికి ఇళ్ల పెరటి మొక్కల పెంపకానికి సైతం సూక్ష్మ, బిందుసేద్య విధానాలను అనుసరిస్తున్నారు. తద్వారా జలసంరక్షణలో యావత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది ఇజ్రాయెల్‌!


Posted on 19-09-2019