Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

దేశంపై మాదక పంజా!

మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకోని రాష్ట్రం ఏదైనా ఇండియాలో ఉందా?- సామాజిక స్పృహకల వారందరినీ దీర్ఘకాలంగా తొలిచేస్తున్న ప్రశ్న ఇది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రధాన కూడలిగా భారత్‌ మారిపోయిందన్న చేదు నిజాన్ని పదే పదే రుజువు చేసేలా పోగుపడుతున్న సాక్ష్యాలు, దేశీయంగానే వెలుగు చూస్తున్న ‘డ్రగ్స్‌’ తయారీ యూనిట్లు- భయానక వాతావరణాన్ని కళ్లకుకడుతున్నాయి. గత నెల తొలి రెండు వారాల్లోనే 200 కిలోల మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకొన్నట్లు వాటి నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) వెల్లడించింది. మే నెల రెండోవారంలో గ్రేటర్‌ నొయిడాలోని ఓ ఇంటినుంచి స్వాధీనం చేసుకొన్న సరకు 1818 కిలోలు, విపణిలో దాని ఖరీదు వెయ్యి కోట్ల రూపాయలు. ఆగస్టు చివరి వారంలో మణిపూర్‌లో పట్టుబడిన పార్టీ డ్రగ్స్‌ విలువ రూ.400 కోట్లు! మహారాష్ట్రలోని పాన్‌వెల్‌ ప్రాంతంలో మెఫెడ్రోన్‌ అనే మాదక ద్రవ్య తయారీ ఫ్యాక్టరీనుంచి రూ.51 కోట్ల విలువైన సరకు ఉగ్రవాద నిర్మూలన దళం చేజిక్కింది. పోర్ట్‌ బ్లెయిర్‌ సమీపంలో తీర ప్రాంత గస్తీ దళం మియన్మార్‌నుంచి వస్తున్న పడవను అటకాయించి 1155 కిలోల కేటమైన్‌ (విలువ రూ.300 కోట్లు) అక్రమ రవాణా గుట్టు రట్టు చెయ్యడంతోపాటు, మలేసియాకు చేరాల్సి ఉన్న ఆ సరకులో కొంత భాగం కోల్‌కతాకు మళ్ళించాల్సి ఉందనీ గుర్తించింది. కాందహార్‌నుంచి వస్తున్న విమాన ప్రయాణికుల్లోని అయిదుగురి కడుపుల్లో రూ.15 కోట్ల విలువైన 370 హెరాయిన్‌ బిళ్లలు కనిపించాయి. ఈ వారంలోనే వారణాసిలో ఓ అంతర్రాష్ట్ర ముఠానుంచి 700 కిలోల గంజాయి పోలీసుల చేజిక్కింది. ఉత్తరాంధ్రే ప్రధాన ఉత్పత్తిదారుగా వివిధ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అడపాదడపా దాడుల్లో పట్టుబడుతున్న ‘డ్రగ్స్‌’ పరిమాణమే అంతంత ఉంటోందంటే, చాపకింద నీరులా చొచ్చుకుపోయి యువజనం భవితకు చిచ్చుపెడుతున్న మాదక ద్రవ్యాల దుష్ప్రభావం భీతిల్లచేస్తోంది!

‘మాదక ద్రవ్యాలకోసం నానాటికీ పెరుగుతున్న గిరాకీ సరఫరాను పెంచుతోంది. విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్న మాదక ద్రవ్యాలు వ్యసనపరుల సంఖ్యను పెంచి డిమాండును ఎగదోస్తున్నాయి’- అని అంతర్జాతీయ డ్రగ్స్‌ నియంత్రణ సంస్థ మాదక విషవలయం ఎలా విస్తరించేదీ ఏనాడో విశ్లేషించింది. మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలకు బానిసలై రోజుకు పదిమంది అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైపరీత్యం- ఉరుముతున్న సామాజిక సంక్షోభాన్నే ప్రస్ఫుటీకరిస్తోంది. మాదక ద్రవ్యాల కారణంగా త్రీడీ సమస్యలు- అంధకారం (డార్క్‌నెస్‌), విధ్వంసం (డిస్ట్రక్షన్‌), వినాశం (డివాస్టేషన్‌) దాపురిస్తున్నాయని ప్రధాని మోదీ సమస్య తీవ్రతను సరిగ్గానే ప్రస్తావించినా- జాతీయ స్థాయిలో అందుకు తగ్గ సమగ్ర, సమర్థ కార్యాచరణ ప్రణాళికే కొరవడటం, అక్రమ సరఫరాలకు లాకులెత్తుతోంది! అఫ్గానిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే నల్లమందు ద్వారానే వెయ్యి టన్నుల దాకా హెరాయిన్‌, మార్ఫిన్‌ వంటి మాదక ద్రవ్యాలు తయారవుతున్నాయి. స్థానికంగా వినిమయం పోను తక్కిన సరకంతా మూడు మార్గాల గుండా దేశదేశాలకు రవాణా అవుతోంది. భారత ఉపఖండంలో ఈ మధ్య 1100 కిలోల హెరాయిన్‌ చేజిక్కడంపై నిఘావర్గాల పరిశోధన- పాకిస్థాన్‌లోని మాదక ద్రవ్య సిండికేట్ల ప్రమేయాన్ని పట్టించింది. నేరుగా యుద్ధంలో ఇండియాను గెలవలేని పాకిస్థాన్‌, ఉగ్రవాదంతోపాటు మాదక ఉగ్రవాదాన్నీ ఎగదోస్తూ ఎక్కడికక్కడ సంక్షోభాగ్నుల్ని రగిలిస్తోంది. మాదక మహమ్మారి విష పంజాకు చిక్కి పంజాబ్‌ విలవిల్లాడిపోతుంటే, ఆ ఉపద్రవం పొరుగున హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకూ పాకిపోతోంది. త్రివిధ మార్గాల్లోనూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తాకిడి వ్యసనపరుల సంఖ్యను ఇంతలంతలు చేసి జాతి భవితనే ఖర్చు రాసేస్తున్నా- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన కదలకపోవడం ఆత్మహత్యా సదృశమవుతుంది!

ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మత్తు పానీయాలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు ‘చిత్తశుద్ధి’తో ప్రయత్నిస్తుంటే, మాదక ద్రవ్యాల విషయంలోనూ అదే కట్టుబాటు ప్రదర్శిస్తూ మాఫియా శక్తులు రెచ్చిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో స్వాధీనం చేసుకొన్న అక్రమ మద్యం విలువకు నాలుగింతల ఖరీదైన మాదక ద్రవ్యాలూ పట్టుబడటం- పతనాభిముఖ పయనానికి నిదర్శనగా నిలుస్తోంది! నోబెల్‌ పురస్కార గ్రహీత కైలాశ్‌ సత్యార్థికి చెందిన ‘బచపన్‌ బచావో ఆందోళన్‌’ వ్యాజ్యం సందర్భంగా సుప్రీంకోర్టు 2016 చివర్లో విపుల సూచనలు చేసింది. దురలవాట్లకు లోనుకాకుండా పిల్లలకు పాఠశాల స్థాయినుంచే నైతిక విద్యాబోధన చెయ్యాలని, దేశవ్యాప్త సర్వే ద్వారా మాదక ద్రవ్యాల వినిమయం స్థాయిపై ఆరు మాసాల్లోగా నిర్దిష్ట సమాచార నిధిని సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రతి జిల్లాకో వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటు డ్రగ్స్‌ బారిన పడ్డ పిల్లల్ని ఆదుకోవడానికి ఉద్దేశించినది కాగా, సమగ్ర జాతీయ కార్యాచరణ సూచన మాదక ద్రవ్య సరఫరాదారుల కూసాలు కదిలించడాన్ని లక్షిస్తోంది. పంజాబ్‌ పోలీసు బలగంలో సగం మంది డ్రగ్స్‌ వ్యసనపరులయ్యారన్న వార్తాకథనాలు అంతర్గత భద్రతకే సవాళ్లు రువ్వుతున్న వేళ- బహుముఖ కార్యాచరణను మరే మాత్రం ఉపేక్షించే వీలు లేదు. ఉమ్మడి పోరాటంతోనే మాదక ఉగ్రవాదాన్ని మట్టుబెట్టగలమన్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వపరంగా ఆ సమర వ్యూహాన్ని తానే నిర్దేశించాలి. వచ్చే ఏడాది జనవరినాటికి- ఉగ్రవాద కదలికల్ని పసిగట్టే జాతీయ నిఘా సమాచార నిధి (నాట్‌గ్రిడ్‌) సేవలు అందుబాటులో కొస్తాయంటున్న నేపథ్యంలో, మాదక శక్తుల పీచమణచడానికీ దాన్ని ఎక్కుపెట్టాలి. మాదక మారణ హోమంలో రేపటితరం సమిధలు కాకుండా కాచుకోవడం ప్రభుత్వాల విధి!


Posted on 23-09-2019