Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఉపాధి అవకాశాలకు లోగిళ్లు

* రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం

పర్యటనలు మనకు గొప్ప పాఠాలు చెబుతాయి. సహనాన్ని పెంచుతాయి. ఇతర ప్రదేశాలు చూసినప్పుడు మనసు వికసిస్తుంది. ప్రపంచంలోని అనేక సమస్యలకు పర్యాటకం పరిష్కారాల్నీ చూపగలదు. ప్రాచీనకాలంలో మనిషి ఒక ప్రాంతానికే పరిమితమయ్యేవాడు. ప్రయాణ సాధనాల లభ్యత పెరగడం, ప్రపంచీకరణవల్ల కొత్త ప్రదేశాల సందర్శన రివాజుగా మారింది. ప్రయాణం లేకుండా పర్యాటకం లేదు. అది ఒక పరిశ్రమలా మారి, ప్రపంచమంతా విస్తరించింది. ఆయా ప్రాంతాల వింతలు, విడ్డూరాలు, భాషలు, రుచులు, ప్రకృతి అందాలు, చారిత్రక స్థలాలు, పుణ్యక్షేత్రాలు... ఇలా ఎన్నో విశేషాలను చూడటానికి చేసే ప్రయాణాలే పర్యాటకంగా గుర్తింపు పొందుతున్నాయి.

బహుముఖ ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పదిశాతం ఆదాయాన్ని సమకూరుస్తోంది. అంతకుమించి ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. విస్తరిస్తున్న పర్యాటకాన్ని క్రమపద్ధతిలో నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ దేశాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది. వ్యాపార నీతినియమాలను నిర్దేశిస్తోంది. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌ కేంద్రంగా 158 దేశాలకు సభ్యత్వం గల ఈ సంస్థ 1980 నుంచి పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 27న నిర్వహిస్తోంది. ఏటా ఒకదేశం ఆతిథ్య దేశంగా ఉంటోంది. ఈ సంవత్సరం భారత్‌ ప్రపంచ పర్యాటక దినోత్సవ సమారోహానికి వేదికగా నిలుస్తోంది. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌ మూడు రోజుల అంతర్జాతీయ సమ్మేళనానికి సిద్ధమవుతోంది. పర్యాటక రంగం దేశానికి ఎంత ముఖ్యమో, వ్యక్తికీ అంతే అవసరం. పర్యటనల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయి. అన్ని భాషల్లో విస్తరిస్తున్న యాత్రాసాహిత్యం ప్రజల్లో పర్యాటకం పట్ల ఆసక్తి పెంచుతోంది. అందువల్లే ఆర్థిక వ్యవస్థలో పర్యాటకరంగ ఆదాయాన్ని అనేక దేశాలు గణనీయంగా పెంచుకుంటున్నాయి. ఈ ఏడు దేశ పర్యాటకశాఖ బడ్జెట్‌ మొత్తం రూ.2,189 కోట్లు. ఇందులో మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.1,378 కోట్లు కేటాయించారు. ప్రచారానికి, ప్రకటనలకు రూ.575 కోట్లు ప్రత్యేకించారు. 2018లో ‘ఇండియా టూరిజం మార్ట్‌’ను నిర్వహించారు. 2019లోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యాటక సంస్థలకు వ్యాపార అవకాశాలను వివరిస్తున్నారు. దీనివల్ల దేశ పర్యాటకంలో కొత్త అవకాశాలు అందివస్తాయి. అంతర్జాతీయ క్రీడలైన గోల్ఫ్‌, పోలో వంటివాటికి మనదేశంలో అపార అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ‘హెరిటేజ్‌ స్పోర్ట్స్‌’ విదేశీయులను బాగా ఆకర్షిస్తాయి. ‘హెలిపోర్ట్‌ టూరిజం’ పేరిట దేశంలో రహదారులు లేనిచోట పర్యాటకాన్ని పెంచే దిశగా కేంద్రం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హెలికాప్టర్‌ ద్వారా మారుమూల ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్తారు. ప్రస్తుతం సిక్కిమ్‌లో ఈ ప్రయోగం ప్రారంభమైంది. ‘కారవాన్‌’ టూరిజానికీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇళ్ల మాదిరిగా ఉన్న వాహనాల్లో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో ఆగుతూ వెళ్తుంటారు. ఈ పర్యాటకం ఐరోపా, అమెరికాల్లో ఎక్కువ. మనదేశంలోనూ దీని విస్తృతికి గల అవకాశాలను పరిశీలించాలి. గ్రామీణ పర్యాటకంలో 150కి పైగా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో పుత్తూరు, కర్ణాటకలో హంపి దగ్గర ఆనెగొంది గ్రామీణ పర్యాటకానికి ఉదాహరణలు.

నిరంతర పర్యాటకం (సస్టైనబుల్‌ టూరిజం) నుంచి ప్రభుత్వాల దృష్టి బాధ్యతాయుత పర్యాటకం వైపు మళ్ళుతోంది. పర్యాటకుడు ఒక ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడి పర్యావరణ ఆర్థిక సామాజిక స్థితిగతులపై సానుకూల ప్రభావం ఉంటుంది. అది అనునిత్యం కొనసాగితే నిరంతర పర్యాటకం అవుతుంది. బాధ్యతాయుతమైన పర్యాటకం (రెస్పాన్సిబుల్‌ టూరిజం) ఆయా రంగాలపై సానుకూల ప్రభావం కలిగిస్తూనే స్థానిక ప్రజానీకానికి ఇతోధిక లాభం కలిగించేదై ఉండాలి. ఇందులో పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో స్థానికులతో కలిసి కొన్ని రోజులు ఉంటారు. స్థానికుల జీవనానికి అది ఆర్థికంగానూ ఆసరా అవుతుంది. 2002లోనే బాధ్యతాయుత పర్యాటకాన్ని నిర్వచించారు. ఇది ‘కేప్‌టౌన్‌ డిక్లరేషన్‌’గా సుపరిచితం. వైద్యం, ఇంజినీరింగ్‌లా పర్యాటకమూ శాఖోపశాఖలుగా విడిపోయింది. సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా అనేక రంగాలు ఇందులో చేరాయి. ఆలయాలను సందర్శించడం మత పర్యాటకం కిందకు వస్తుంది. సాహసం, వైద్యం, వారసత్వం, ప్రకృతి వంటి పర్యాటక రంగాలూ విస్తరిస్తున్నాయి. యుద్ధ స్థలాలు, చారిత్రక కారాగారాలు, సుడిగాలుల సందర్శనలు ‘బ్లాక్‌టూరిజం’గా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి.

పర్యాటక రంగంలో ఏ ప్రాంత విశిష్టత ఆ ప్రాంతానిదే. ఆయా చారిత్రక కట్టడాల వయసునుబట్టి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉత్తరాదిలో అధిక ఆదాయాన్ని సమకూర్చే కట్టడాలు ఎక్కువగా మధ్యయుగపు మొఘల్‌కాలం నాటివే. ప్రాచీనకాలపు బౌద్ధ శిథిలాలు, కట్టడాలను ప్రపంచ యాత్రికులు సందర్శిస్తున్నా దాదాపు అదే కాలానికి చెందిన బౌద్ధ నిర్మాణాలు దక్షిణ భారతంలో ఆదరణకు నోచుకోక శిథిలమవుతున్నాయి. వీటికిచ్చే నిధులూ తక్కువే. ఉత్తర కర్ణాటకలో బాదామి, ఐహోలు, పట్టడకల్‌ 1500 ఏళ్ల క్రితంనాటి సంస్కృతీ సౌరభాలను నేటికీ వెదజల్లుతూనే ఉన్నాయి. అయిదారు శతాబ్దాల క్రితంనాటి విజయనగర చరిత్ర హంపి శిథిలాల్లో సజీవంగా ఉంది. వీటి గురించి ఇతర దేశాల్లోగాని, ఉత్తర భారతంలోగాని అంతగా ప్రచారం ఉండదు. పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం ఉత్తర, దక్షిణ, మధ్య, తూర్పు, పడమర విభాగాలుగా విభజించింది. ఉత్తరాదిలో పర్యాటకానికి ఉన్న ఆదరణ దక్షిణాదికి లేదనే చెప్పాలి. ఈ రెండు ప్రాంతాల పట్ల కేంద్రం దుర్విచక్షణ పాటిస్తోందనడానికి అనేక దాఖలాలున్నాయి. భారత పురావస్తు శాఖ సైతం భారత్‌ను 29 సర్కిళ్లుగా విభజించింది. వీటిలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నవి అయిదే. ఆంధ్రప్రదేశ్‌ కోసం అమరావతి సర్కిల్‌ 2016లో ప్రారంభమైనా నిధులు, ప్రోత్సాహం లేక కునారిల్లుతోంది. హైదరాబాద్‌ సర్కిల్‌కు ఇచ్చే బడ్జెట్‌ 2015 నుంచి 2018కి రూ.10 కోట్ల నుంచి మూడున్నర కోట్ల రూపాయలకు కోసుకుపోయింది. చెన్నై సర్కిల్‌దీ ఇదే పరిస్థితి. స్థానిక ప్రభుత్వాల ఉదాసీనత దక్షిణాదిలో పర్యాటకం పెరగకపోవడానికి ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రాష్ట్రప్రభుత్వ సచివాలయానికి కూతవేటు దూరంలో కాకతీయుల స్తంభశాసనం ఏకశిలగా గంభీరంగా ఉంటుంది. దానికి నాలుగువైపులా కాకతీయుల రాజశాసనాలున్నాయి. వాటిచుట్టూ ఇళ్లు కట్టేశారు. ఆ శాసనాన్ని ఆనుకొని మరుగుదొడ్లు కట్టిఉన్నాయి. ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపు పొందిన ప్రదేశాలు భారత్‌లో 37 ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేనికీ ఈ గుర్తింపు దక్కలేదు. వరంగల్‌లోని స్వయంభూ ఆలయం, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం యునెస్కో వారసత్వ సంపదలో భాగం కావడానికి ప్రయత్నిస్తున్నాయి. అమరావతి స్థూపశిథిలాలను చేరడానికి అనేక సమస్యలు అడ్డుగా ఉన్నాయి. వందకు పైగా ఉన్న బౌద్ధ చారిత్రక స్థలాలు ఆదరణకు నోచుకోవడం లేదు. వీటిని అభివృద్ధిపరచి విజయవాడ, విశాఖ విమానాశ్రయాలనుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపితే శ్రీలంకను సందర్శించే వేలమంది విదేశీ యాత్రికులు దక్షిణ భారత్‌కూ విచ్చేస్తారు. దేశంలోని 17 గొప్ప స్థలాలను అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం సానుకూల పరిణామం. దేశంలోని అన్ని తెగల సంస్కృతిని డిజిటల్‌ పద్ధతిలో సేకరించి, నిక్షిప్తం చేయనున్నారు. గ్రామీణ కళాకారులకు కొత్తగా వంద కళాకేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి ఉత్పత్తులను అంతర్జాతీయ విపణికి సంధానించడం వంటి ఆలోచనలూ సాగుతున్నాయి. రామాయణ సర్య్కూట్‌ పేరుతో అయోధ్య నుంచి రామేశ్వరం వరకు వివిధ ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం. భవిష్యత్తులో మహాభారత్‌ సర్క్యూట్‌ సైతం రూపుదిద్దుకోవచ్చు.

ప్రోత్సాహకాలతోనే ముందడుగు
భారత్‌లో పర్యాటక రంగాన్ని 1966లో స్థాపితమైన ఐటీడీసీ (ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నిర్వహిస్తోంది. రాష్ట్రాల పర్యాటక సంస్థలు, రైల్వేటూరిజం వంటివి పెద్దసంఖ్యలో యాత్రికులకు సేవలందిస్తున్నాయి. ఆయా సేవలు అందుకుంటున్న పర్యాటకులు అంతర్జాలంలో పొందుపరుస్తున్న అనుభవాల సారం పర్యాటకరంగం తీరుతెన్నులపై ఆందోళన కలిగిస్తోంది. నాసి రకం సేవలపట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తీకరిస్తున్నారు. ఈ విషయంలో సత్వర దిద్దుబాటు చర్యలు ఎంతో అవసరం. మరోవైపు పురావస్తు విభాగం చారిత్రక శిథిలాల పరిరక్షణ బాధ్యతలను ప్రభుత్వేతర సంస్థలకు కట్టబెడుతోంది. దిల్లీ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను నిరుడు దాల్మియా సంస్థకు అప్పగించారు. 17వ శతాబ్దంలో మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన రాజధానిని ఆగ్రా నుంచి దిల్లీకి మార్చినప్పుడు కట్టించిన ఎర్రకోట భారత సార్వభౌమత్వానికి ప్రతీక. సిపాయిల తిరుగుబాటు నుంచి నేటి ప్రధాని ఉపన్యాసాల వరకు ఎన్నింటికో అది వేదిక. దాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వహించడం కుదరదని రూ.25 కోట్లకు ప్రైవేటు నిర్వహణకు కట్టబెట్టడంతో మిగతా చారిత్రక కట్టడాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. కట్టడాలనే సరిగ్గా నిర్వహించలేకపోతే ఇక స్మార్ట్‌సిటీల మాటేమిటి? నగరాల నిర్వహణ అధ్వానంగా ఉంది. విశ్వనగరంగా చెప్పుకొనే హైదరాబాదు ఒక్క వర్షానికే అతలాకుతలమవుతోంది. ఇలాంటి ప్రాథమిక అంశాలపై దిద్దుబాటు లేకుండా పర్యాటకం ఎలా వన్నెలీనుతుంది? పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రాబోయే అయిదేళ్లలో ఇతర రంగాలకన్నా పర్యాటకమే ఎక్కువ ఉద్యోగావకాశాలను వేగంగా కల్పించగలదని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. మనదేశంలో ఎక్కువ ఉద్యోగావకాశాలు ఈ రంగంలో లభించాలంటే చేయాల్సింది ఎంతో ఉంది. ఇటీవలి దాకా వస్తుసేవల పన్ను అధిక వడ్డింపు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపింది. హోటల్‌ గదులపై వస్తుసేవల పన్ను తగ్గింపు గుడ్డిలో మెల్ల. ప్రపంచ పర్యాటక దినోత్సవ ప్రారంభానికి వేదికైన భారత్‌లో ఈ సంవత్సరం ప్రభుత్వం చొరవగా తీసుకునే నిర్ణయాలపైనే పర్యాటక రంగ భవిష్యత్తు, ఉద్యోగ కల్పన అవకాశాలు ఆధారపడి ఉన్నాయన్నది నిర్వివాదం!

- డాక్టర్‌ పి.వి. రంగనాయకులు
Posted on 26-09-2019