Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ఇంకెన్నాళ్లీ పతకాల దాహార్తి?

ఖతార్‌ రాజధాని దోహా వేదికగా ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ మహా సంగ్రామం నిన్న ఘనంగా ఆరంభమైంది. ఒలింపిక్స్‌ తరవాత అంతటి విశేష క్రీడాదరణ కలిగినవిగా ప్రతీతమైన ఈ పోటీల్లో దేశదేశాల నుంచి దాదాపు రెండు వేలమంది అథ్లెట్ల పాటవ ప్రదర్శనలు పది రోజులపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా అసంఖ్యాక ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. 2022 సంవత్సరంలో ‘ఫిఫా’ (అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య) విశ్వకప్‌ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న ఖతార్‌- విపరీత ఉక్కబోత వాతావరణంలో ప్రస్తుత హోరాహోరీని ఆహ్లాదభరితంగా మలచడానికి చేపట్టిన సన్నాహకాలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 2003 సంవత్సరం నుంచి అద్భుత ప్రావీణ్యంతో 11 స్వర్ణాలు కొల్లగొట్టి ప్రపంచ అథ్లెటిక్స్‌పై తనదైన ముద్ర వేసిన ఉసేన్‌ బోల్ట్‌ లేకుండా జరుగుతున్న మొదటి పోటీలివి. ఆ జమైకా పరుగుల వీరుడి వారసులుగా వంద మీటర్ల రేసులో క్రిస్టియన్‌ కోల్మన్‌, 200 మీటర్ల పందెంలో నోవా లైలిస్‌ మెరుపులీననున్నారన్న అంచనాలు ఇప్పటికే హోరెత్తుతున్నాయి. ట్రిపుల్‌ జంప్‌లో టేలర్‌, పోల్‌వాల్ట్‌లో శామ్‌ కెండ్రిక్స్‌, లాంగ్‌జంప్‌లో క్యూబాకు చెందిన జువాన్‌ మైగల్‌ ఎకెవారియా ప్రభృతులు అద్భుతాలు ఆవిష్కరించనున్నారన్న కథనాలు మోతెక్కుతున్నాయి. ఆ జాబితాల్లో మన అథ్లెట్ల పేర్లెక్కడా కానరావడం లేదు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా, స్ప్రింటర్‌ హిమాదాస్‌, తేజస్విన్‌ శంకర్‌, అరోకియా రాజీవ్‌ల గైర్హాజరుతో దోహాలో అడుగిడటానికి ముందే భారత శిబిరం డీలాపడింది. ఇటీవలి ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ (ఫిన్లాండ్‌) మహిళల 400 మీటర్ల రేసులో పసిడి చేజిక్కించుకున్న హిమాదాస్‌ ఈ పోటీల కోసం ఐరోపాలో ప్రత్యేక శిక్షణ పొందిన దరిమిలా వెన్నునొప్పితో వైదొలగడం భారత్‌ పతకాల వేటను గట్టిదెబ్బ తీసింది. ద్యుతీచంద్‌, జిన్సన్‌, తేజీందర్‌లపై పెట్టుకున్న ఆశల్ని వారెంత మేరకు నిలబెట్టగలరో చూడాలి!

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ బరిలో భారత్‌ చతికిలపాటు రెండేళ్ల క్రితం లండన్‌, అంతకుముందు బీజింగ్‌, 2013లో మాస్కోలకే పరిమితం కాలేదు. పదహారేళ్ల క్రితం దక్షిణ కొరియా, బుసాన్‌లో 6.7 మీటర్ల దూరం దూకి అంజూ బాబీ జార్జ్‌ లాంగ్‌జంప్‌లో కాంస్యం గెలిచిన దరిమిలా, మరే భారతీయులూ ఈ స్థాయి క్రీడల్లో మరో పతకానికి చేరువ కాలేకపోయారు! ఆసియా అథ్లెటిక్స్‌ పోటీల్లో భారత్‌ రికార్డు మెరుగ్గా ఉందన్నమాట వాస్తవం. రెండేళ్ల క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ ఆతిథ్యమిచ్చిన ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పతకాల జాబితాలో చైనాను వెనక్కినెట్టిన ఇండియా అగ్రస్థానానికి ఎగబాకడం సంచలనం సృష్టించింది. అప్పట్లో 12 స్వర్ణాలు సహా 29 పతకాలు గెలుపొందిన భారత అథ్లెట్లు నవశకారంభానికి దారిదీపాలుగా క్రీడామంత్రిత్వ శాఖ, వివిధ సంఘాలు ఆకాశానికి ఎత్తేసినా- లోగుట్టు వేరు. ఆ ఏడాది లండన్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం సన్నాహక వ్యూహాల్లో భాగంగా చైనా, ఖతార్‌, బహ్రెయిన్‌, జపాన్‌ వంటివి తలమునకలై తమ అగ్రశ్రేణి అథ్లెట్లను నిరంతర శిక్షణలో నిమగ్నం చేయడం- ఇండియాకు అయాచిత వరమైంది. పటిష్ఠ జట్లు పాల్గోనిచోట్ల సత్తా చాటామని మురిసిపోయి, అత్యధునాతన సదుపాయాలతో గరిష్ఠ శిక్షణలో రాటుతేలిన పోటీదారుల సరసన వెలాతెలాపోవడం- నూట ముప్ఫై కోట్లకు పైబడిన జనాభాకు ప్రాతినిధ్యం వహించే భారతావనికి ఏమంత గౌరవం? మునుపెన్నడూ లేనంతగా 27మంది సభ్యులతో దోహా తరలివెళ్ళిన మన జట్టు- పతకాలు సంపాదించడంకన్నా వ్యక్తిగత రికార్డుల మెరుగుదల, 2020నాటి టోక్యో ఒలింపిక్స్‌కు రిలే బృందాల అర్హత సాధనలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందన్న విశ్లేషణలు... సగటు క్రీడాభిమానిని దిగ్భ్రాంతపరచేవే!

కెన్యా ప్రస్తుత జనాభా సుమారు అయిదు కోట్ల 25 లక్షలు. జమైకా జనసంఖ్య 30 లక్షలలోపు. అవి కేవలం రెండే క్రీడాంశాలు ఎంచుకొని ఒలింపిక్స్‌లో వరసగా 100, 78 పతకాల్ని సాధించాయని లోగడ విశ్లేషించిన ‘నీతి ఆయోగ్‌’- ఇండియా సైతం ఏ పది విభాగాలకో పరిమితమై క్రీడల్లో దిగ్గజ శక్తిగా ఎదగాలని పిలుపిచ్చింది. యథార్థానికి అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, ఈతల్లో దేశవ్యాప్తంగా 15 వందల దాకా మెరికల్ని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన వ్యూహాలు దస్త్రాల్లోనే పోగుపడి ఉన్నాయంటే- ఆ అలసత్వానికి ఎవరిని తప్పుపట్టాలి? 2024 ఒలింపిక్స్‌లో కనీసం 50 పతకాలు భారత్‌ ఖాతాలో జమపడాలన్న నిర్దేశాలు వినసొంపుగా ఉన్నా- వేదిక ఏది, ప్రత్యర్థులు ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా ఆత్మవిశ్వాసంతో నెగ్గుకొచ్చేలా ఔత్సాహికుల్ని తీర్చిదిద్దే పటిష్ఠ వ్యవస్థ నేటికీ ఎండమావినే తలపిస్తోంది. జూనియర్‌ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న ఎందరో సీనియర్‌ విభాగంలో నిలదొక్కుకుని రాణించలేకపోతున్నారంటూ, అంజూ బాబీ జార్జ్‌ వంటివారు సూటిగా తప్పుపట్టినా- ఏళ్ల తరబడి సరైన దిద్దుబాటు చర్యలు కొరవడుతున్నాయి. అభ్యర్థుల సహజ ప్రతిభ, సన్నద్ధతల ప్రాతిపదికన ఏయే క్రీడాంశాల్లో పదునుపెట్టాలో నిర్ణయించి, ఆపై ప్రపంచస్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు ఒనగూడేలా ప్రణాళికాబద్ధ కార్యాచరణ పట్టాలకు ఎక్కాలి. అమెరికా ప్రతి 30 లక్షలమంది జనాభాకు ఒకటి, బ్రిటన్‌ 10 లక్షల జనసంఖ్యకు ఒకటి చొప్పున అంతర్జాతీయ పతకాలు సాధిస్తుండగా- రియో ఒలింపిక్స్‌లో 65 కోట్ల పౌరులకు ఒకటి వంతున ఇండియా సాధించగలిగింది కేవలం రెండే పతకాలు! ఆటల్ని పాఠ్యాంశాల్లో అంతర్భాగం చేసి, క్రీడా వికాసోద్ధరణకు మేలిమి మౌలిక సదుపాయాల్ని విస్తృతపరచి, భావి ఒలింపియన్లను విద్యాప్రాంగణాల నుంచి ఆవిర్భవింపజేసే వాతావరణ పరికల్పనే- భారత్‌ పతకాల దాహార్తి తీర్చగలిగేది!


Posted on 28-09-2019