Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా

* ఆచితూచి విస్తరణ

అమెరికా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటినుంచో ప్రైవేటు రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. భారతీయ రైల్వే కూడా తన 174 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా ఊపనుంది. అక్టోబరు అయిదు నుంచి దిల్లీ-లఖ్‌నవూ మార్గంలో ప్రైవేటు రైలు తేజస్‌ రాకపోకలు ప్రారంభిస్తుంది. ఒకరకంగా ఇది పేరుకే ప్రైవేటు రైలు. దాన్ని నిజంగా నిర్వహించేది భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన ఇండియన్‌ రైల్వేస్‌ కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) మాత్రమే. సమీప భవిష్యత్తులో ముంబయి-అహ్మదాబాద్‌ తేజస్‌ రైలు కూడా ఐఆర్‌సీటీసీలోనే నడవనుంది. ఈ రెండు తేజస్‌ రైళ్లను నిర్వహిస్తున్నందుకు రైల్వేశాఖకు ఐఆర్‌సీటీసీ వార్షిక లీజు చెల్లిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రయోగం మంచిచెడ్డలను పరిశీలించాక క్రమంగా కొన్ని కీలక రూట్లలో ప్రైవేటు రైళ్లను అనుమతించాలని రైల్వేబోర్డు యోచిస్తోంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళిక ముసాయిదాను సిద్ధం చేసుకుంది.

రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదని కార్మిక సంఘాలకు భరోసా ఇస్తున్న రైల్వే శాఖ, ఇప్పటికైతే ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి (పీపీపీ) పెద్దపీట వేస్తోంది. ఈ ప్రాతిపదికపై మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరంలో పునరభివృద్ధి చేసిన హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ ఈ ఏడాది డిసెంబరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. పీపీపీ పద్ధతిలో రైల్వేశాఖ, బన్సల్‌ గ్రూప్‌ కలిసి రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని ఓ విమానాశ్రయ నమూనాలో నిర్మిస్తున్నాయి. దాని చుట్టూ వాణిజ్యాభివృద్ధికి రూ.350 కోట్లు ఖర్చు చేస్తారు. జర్మనీలోని హైడెల్‌బర్గ్‌ నగర రైల్వేస్టేషన్‌ తరహాలో నిర్మిస్తున్న హబీబ్‌గంజ్‌ స్టేషన్‌ ఎన్డీయే ప్రభుత్వానికి అత్యంత ప్రీతిపాత్ర ప్రాజెక్టు. గాంధీనగర్‌, సూరత్‌, చండీగఢ్‌, ఆనంద్‌ విహార్‌ (దిల్లీ), బలైప్పనహళ్లి (కర్ణాటక) రైల్వేస్టేషన్లను కూడా పీపీపీ పద్ధతిలో ప్రపంచశ్రేణి రైల్వేస్టేషన్లుగా పునరభివృద్ది చేయదలచారు. ప్రైవేటు సంస్థల వల్ల అత్యాధునిక సాంకేతికత, 21వ శతాబ్ది రైలింజన్లు, సౌకర్యవంతమైన బోగీలు, ప్రయాణికులు, సరకుల శీఘ్ర రవాణాకు కొత్త ఉపాయాలు అందివస్తాయని రైల్వేబోర్డు భావిస్తోంది. 2024కల్లా 150 ప్రైవేటు రైళ్లను పట్టాలపైకి అనుమతించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి 100 రోజుల ప్రణాళిక కింద 24 రూట్లలో ప్రైవేటు రైళ్లను అనుమతించాలని రైల్వే శాఖ తీర్మానించింది. వాటిలో 14 రూట్లలో ఇంటర్‌ సిటీ సర్వీసులు, 10 రూట్లలో దూరప్రాంత రైళ్లు, నాలుగు మార్గాల్లో సబర్బన్‌ సేవలను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని ప్రతిపాదించింది. దూర ప్రాంత సర్వీసులలో సికింద్రాబాద్‌-దిల్లీ సర్వీసూ ఉంటుంది. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లలో ఒకటి సికింద్రాబాద్‌-విజయవాడల మధ్య నడుస్తుంది. ప్రైవేటు సబర్బన్‌ రైళ్లలో ఒకటి సికింద్రాబాద్‌ శివార్లలో నడుస్తుంది. ఈ మూడు రకాల సర్వీసులకు ఆపరేటర్లను బిడ్డింగ్‌ పద్ధతిలో ఎంపిక చేస్తామని రైల్వేబోర్డు వర్గాలు తెలిపాయి. రైల్వేశాఖ 100 రోజుల ప్రణాళిక కింద దిల్లీ-హౌరా, దిల్లీ-ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల వేగాన్ని 160 కిలోమీటర్లకు పెంచాలనే ప్రతిపాదనా ఉంది. మేకిన్‌ ఇండియా కింద రైల్వేశాఖ సొంతంగా తయారు చేసి నడుపుతున్న ‘వందే భారత్‌’ రైలు ఇప్పటికే గంటకు 160 కి.మీ.ల వేగం అందుకొంది. కూత పెట్టనున్న తేజస్‌ రైలు ప్రైవేటు బిడ్డర్లు రంగంలోకి దిగే ముందే ఐఆర్‌సీటీసీ తేజస్‌ రైలును ఉరకలెత్తించనుంది. అక్టోబరు అయిదున దిల్లీ-లఖ్‌నవూల మధ్య పరుగు ప్రారంభించే ఈ రైలు ఛార్జీలు ఇదే రూటులో విమాన ఛార్జీలకన్నా సగానికి సగం తక్కువగా ఉంటాయి. అదే సమయంలో విమానాల్లో మాదిరిగా రద్దీని బట్టి ఛార్జీలు మారతాయి. అప్పటికీ విమాన ఛార్జీలకన్నా తేజస్‌ ఛార్జీలే తక్కువగా ఉంటాయి.

శతాబ్ది రైళ్ల మాదిరిగా నడిచే తేజస్‌లో వీఐపీలతో సహా వేరెవరికీ ఛార్జీల్లో రాయితీ ఇవ్వరు. తేజస్‌ రైళ్లలో ఎల్‌ఈడీ టీవీలు, కాల్‌ బటన్లు, ఆటోమేటిక్‌ తలుపులు, సీసీ టీవీ కెమెరాలు, మెత్తని కుర్చీల వంటి హంగులు ఏర్పాటుచేస్తున్నారు. రైల్వేశాఖ 2024కల్లా ప్రైవేటు ఆపరేటర్ల నుంచి రూ.16,000 కోట్ల పెట్టుబడులను ఆశిస్తోంది.

ప్రైవేటు కంపెనీలు ఇప్పటికే కొన్ని రూట్లలో సరకుల కంటైనర్‌ రైళ్లను నడుపుతున్నాయి. ప్రయాణికుల రైళ్లనూ నడిపే అవకాశం వాటికి ఇవ్వడానికి రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రైవేటు కంపెనీలు తమ సొంత డ్రైవర్లను నియమించవచ్చు కానీ, వారికి ధ్రువీకరణ పత్రం ఇచ్చేది రైల్వేలే. ప్రైవేటు ఆపరేటర్లు రైల్వే ప్లాట్‌ఫారాలను, సిగ్నళ్లు, పట్టాలు, ఇతర మౌలిక వసతులను ఉపయోగించుకున్నందుకు రైల్వేశాఖకు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. స్వదేశీ, విదేశీ కంపెనీలు ప్రైవేటు రైళ్ల నిర్వహణకు బిడ్లు సమర్పిస్తాయని అంచనా. టాటా, అదానీ, లార్సన్‌-టూబ్రో వంటి స్వదేశీ సంస్థలు, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, బ్రెజిల్‌ కంపెనీలతో కలిసి రంగంలో దిగే అవకాశాలు లేకపోలేదు. దిల్లీ-కోల్‌కతా, దిల్లీ-ముంబయిల మధ్య శీఘ్ర రవాణాకు నిర్మిస్తున్న ప్రత్యేక నడవాలు (డెడికేటెడ్‌ ఫ్రెయిట్‌ కారిడార్లు-డీఎఫ్సీ) 2021 డిసెంబరుకల్లా అందుబాటులోకి రానున్నాయి. దాంతో ప్రస్తుత మార్గాల్లో సాగుతున్న ప్రయాణికులు, సరకుల రవాణాలో 90 శాతం డీఎఫ్సీలకు మళ్లుతుంది. ఈ కారిడార్లలో సరకుల రైళ్ల వేగం ప్రస్తుతం గంటకు 40 కిలోమీటర్లే. రేపు డీఎఫ్సీలపై రోజుకు 120 రైళ్లు గంటకు 70-80 కి.మీ.ల వేగంతో తిరుగుతాయి. వందే భారత్‌, రాజధాని వంటి రైళ్లు 160 కి.మీ.ల వేగం అందుకోనున్నాయి. దీనివల్ల ట్రాక్‌లపై మరిన్ని రైళ్లు తిరిగే వెసులుబాటు ఏర్పడుతుంది. 2024కల్లా అధిక వేగ రైళ్లను తట్టుకునేలా రైల్వే ట్రాక్‌లను తీర్చిదిద్దాల్సి ఉంది. అందుకు కావలసిన నిధులు రైల్వేశాఖ వద్ద లేనందువల్ల ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలని తలపెట్టింది. ఈ లక్ష్యంతోనే ప్రైవేటు సంస్థలకు 150 రూట్లను ఇవ్వజూపుతోంది. నేడు రైల్వే శాఖ నిర్వహిస్తున్న 13,542 ప్రయాణీకుల రైళ్లలో ఇవి సముద్రంలో నీటిబొట్టంత. అయితే, అత్యంత లాభసాటి మార్గాలను ప్రైవేటు ఆపరేటర్లకు కేటాయిస్తే రైల్వే ఆదాయానికి పెద్ద బొర్రె పడటం ఖాయం. కాబట్టి ప్రభుత్వం, రైల్వేశాఖ ఏ నిర్ణయమైనా దూరదృష్టితో తీసుకోవాలి.


- ఆర్య
Posted on 28-09-2019