Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పరిశుభ్రతే ప్రథమ కర్తవ్యం

* మహాత్ముడి కలలకు రూపం స్వచ్ఛభారతం

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడిని భరతజాతి ఘనంగా స్మరించుకుంటోంది. భారత స్వాతంత్య్రోద్యమ యోధుడిగా చరిత్రపై చెరగని ముద్ర వేసిన గాంధీజీ, మరెన్నో అంశాల్లో తన దార్శనికతను మనకు అందించి వెళ్లారు. పరిశుభ్రత, స్వచ్ఛత అంశాల్లో ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రస్తుత కాలానికీ వర్తించేవే. భారత్‌ ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యపై గాంధీజీ భావనలు లోతైన అంతరదృష్టిని ప్రసరిస్తాయి. ఈ క్రమంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై గాంధీజీ బోధనలు, అనుభవాలపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆయన దార్శనికతను ప్రేరణగా పుణికిపుచ్చుకొని దేశంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టారు. ప్రారంభం నాటి నుంచే గణనీయ పురోగతి బాటలో సాగుతున్న స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి గాంధీజీ భావనలు అందించిన స్ఫూర్తి, ప్రేరణలను విశ్లేషించుకోవాల్సిన తరుణమిది! విజయవంతమైన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రసంగంలో తాజాగా స్పష్టీకరించారు.

వ్యక్తి బాధ్యత
దేశంలో శుభ్రత భావనను వ్యాప్తిచేయడంలో గాంధీజీ మార్గదర్శకులనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిశుభ్రత, అంటరానితనం, స్వపరిపాలనల మధ్య గల సంబంధాల్ని ఆయన గట్టిగా చాటారు. ప్రతి ఒక్కరిలోనూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నారని ఓ సందర్భంలో ప్రకటించారు. పరిశుభ్రత వ్యక్తిగత బాధ్యత అన్న అంశాన్నే కాకుండా, అంటరానితనాన్నీ తొలగించాలనే ఆయన తృష్ణను ఆ ప్రకటన ప్రస్ఫుటీకరిస్తుంది. గాంధీజీ వట్టిమాటలకే పరిమితమయ్యే మనిషి కాదు. ఏదైనా చేతల్లో చేసి చూపే అలవాటు ఆయన సొంతం. దేశంలో పరిశుభ్రతను ప్రోత్సహించే దిశగా ఆయన చేపట్టిన పనులెన్నింటికో ప్రత్యక్ష ఉదాహరణలున్నాయి. పార్టీ వాలంటీర్లు ‘భంగీ’ బృందాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా ఊడ్చేవారిని ఈ పేరుతో పిలుస్తుంటారు. వీరంతా సమాజంలోని నిమ్నవర్గాలకు చెందినవారు. గాంధీజీ పిలుపుతో దేశవ్యాప్తంగా శుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అగ్రవర్ణాల ప్రజలు ముందుకొచ్చారు. పారిశుద్ధ్య బృందాల్లో చేరారు. పరిశుభ్రతపై మహాత్ముడి చిత్తశుద్ధికి, స్ఫూర్తిమంతమైన నాయకత్వానికి ఈ ఉదంతమే నిదర్శనం. సఫాయి పనిలో నిమగ్నమైన కార్మికుల పట్ల సమాజంలో నెలకొన్న చిన్నచూపును ఆయన పారదోలారు. ఈ విషయంలో ఆయన దార్శనికత స్వతంత్ర భారతంలో అంటరానితనాన్ని తుదముట్టించేందుకు మార్గదర్శకంగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమ సమయంలోనే గాంధీజీలో పరిశుభ్రతకు సంబంధించిన ఆలోచనలకు బీజం పడింది. ఆ సమయంలో భారతీయులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించరనే నెపంతో వారిని వేరుగా ఉంచుతూ దక్షిణాఫ్రికాలోని శ్వేత జాతీయులు సృష్టించిన ప్రతికూల భావనల్ని పారదోలడంపైనే గాంధీజీ ప్రధానంగా దృష్టి సారించారు. విస్తృతంగా వ్యాప్తి చెందిన ఇలాంటి భావనల్ని నిరసిస్తూ గాంధీజీ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తే ఐరోపా వాసులతో సమానంగా భారతీయులకూ పరిశుభ్రతను పాటించగల సామర్థ్యం ఉందని ఆ లేఖలో విస్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో నివసించే భారతీయుల్లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు అలుపెరగకుండా శ్రమించారు. భారత్‌కు వచ్చిన తరవాతా అదే కృషిని కొనసాగించారు. ఇంటిలోని ముందుగది లాగే మరుగుదొడ్డీ పరిశుభ్రంగా ఉండాలంటూ మద్రాస్‌లో చేసిన ఒక ప్రసంగంలో స్పష్టీకరించారు. భారతీయులు అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరిశుభ్రతను, వ్యక్తిగత శుభ్రతను పాటించడం చాలా ముఖ్యమని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. అంటరానితనాన్ని, భారత్‌పై పాశ్చాత్యుల్లో నెలకొన్న అభిప్రాయాల్ని పారదోలేందుకు ఇది అవసరమని భావించేవారు. తరవాతి కాలంలో గాంధీజీలో ఈ భావన మరింత ప్రగాఢంగా మారింది. ముఖ్యంగా 1920ల్లో సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రస్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న సమయంలో బలపడింది. పరిశుభ్రత, స్వపరిపాలనల మధ్య గట్టి సంబంధం ఉందంటూ ఆయన పదేపదే ఎలుగెత్తి చాటారు. ‘మన అపరిశుభ్రత’ అనే తన వ్యాసంలో పరిశుభ్రంగా, ధైర్యంగా ఉండే ప్రజల ద్వారానే స్వరాజ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమంపై ప్రచారం ద్వారా స్వేచ్ఛాయుత, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేయవచ్చని ఆయన విశ్వసించారు. అంటరానితనం, పరిశుభ్రత భావనలను స్వాతంత్య్రం, స్వరాజ్యం అంశాలతో అనుసంధానించడం ద్వారా చేతులతో వ్యర్థాల్ని ఎత్తివేసే దుస్థితిని పరిహరించి, కార్మికుల జీవితాలను మెరుగుపరచవచ్చని గాంధీజీ చాటిచెప్పారు. సదరు పరిస్థితుల కారణంగా వారు ఎదుర్కొంటున్న అంటరానితనాన్నీ అందరి ముందుంచారు. భారత్‌ కేవలం వలస పాలన నుంచి బయటపడటం మాత్రమే కాకుండా, స్వచ్ఛభారత్‌గా ఏర్పడాలని గాంధీజీ కలలుగన్నారు. తమ పొట్టకూటి కోసం చేసే వృత్తిని ఎత్తిచూపుతూ తోటి దేశీయులపై సామాజిక దుర్విచక్షణ చూపని దేశంగా ఏర్పడాలని ఆకాంక్షించారు. భారత్‌ స్వాతంత్య్రం సాధించాక గాంధీజీ ఎక్కువకాలం జీవించకపోవడం, తరవాత ఏర్పడిన ప్రభుత్వాలేవీ పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో విధాన స్థాయిలో దృష్టి సారించకపోవడం దేశానికి నష్టదాయకంగా పరిణమించాయి.

వడివడిగా అడుగులు
సుదీర్ఘకాలంపాటు విధానపరమైన నిష్క్రియాపరత్వం ఫలితంగా పారిశుద్ధ్య ప్రమాణాల్లో భారత్‌ కింది స్థాయికి దిగజారింది. 2011 జనగణన ప్రకారం భారత్‌లోని 24.67 కోట్ల గృహాలకుగాను 53.1 శాతం గృహాల ఆవరణల్లో మరుగుదొడ్లు లేవని తేలింది. వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే సామూహిక మరుగుదొడ్లను ఉపయోగించుకొంటున్నట్లు వెల్లడైంది. మిగతావారంతా బహిరంగ మలవిసర్జనకు వెళ్లే అలవాటునే కొనసాగిస్తున్నట్లు నిర్ధారణైంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థలో ఇది అభిలషణీయ పరిణామం కాదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించింది. ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఫలితంగా భారతదేశ చరిత్రలోనే అత్యంత ఆకాంక్షాపూరితమైన పరిశుభ్రత కార్యక్రమానికి బీజం పడింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్‌ రెండున ప్రధాని మోదీ స్వయంగా చీపురుపట్టి ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబానికీ పారిశుద్ధ్య సౌకర్యాల్ని కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ సౌకర్యాల్లో మరుగుదొడ్లు, ఘన ద్రవ వ్యర్థాల నిర్మూలన వ్యవస్థ, గ్రామాల్లో పరిశుభ్రత, తగినంత సురక్షిత తాగునీటి సరఫరా వంటివన్నీ ఈ కార్యక్రమంలో భాగంగా అందించాలని కోరుకున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకొనే 2019 సంవత్సరం నాటికి బహిరంగ మలవిసర్జనకు అంతం పలకాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 10 కోట్ల గృహాల్లో మరుగుదొడ్లు నిర్మితమయ్యాయి. పారిశుద్ధ్యపరంగా గణనీయ పురోగతి చోటుచేసుకుంది. బహిరంగ మలవిసర్జనకు వెళ్లే అలవాటూ బాగా తగ్గింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్లో మార్పు సాధించినందుకు అమెరికా పర్యటన సందర్భంగా బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రధాని మోదీని పురస్కారంతో గౌరవించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రపంచంలోని ఇతర దేశాలకూ ఆదర్శంగా నిలుస్తుందని ఫౌండేషన్‌ కితాబిచ్చింది.

స్వచ్ఛభారత్‌ మిషన్‌ గణనీయ స్థాయిలో విజయాలు సాధించినా గాంధీజీ కన్న కలల్ని సాకారం చేసే విషయంలో పలు సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్రధానంగా చేతులతో వ్యర్థాల్ని ఎత్తిపోసే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింతగా దృష్టి సారించి- అలాంటి అవసరం తలెత్తని రూపంలో మరుగుదొడ్లను నిర్మించి, నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. స్వచ్ఛభారత్‌ ఉద్యమంలో భాగంగా నిధుల వినియోగం, ఉత్పాదకతలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాల్సి ఉంది. గడువుకన్నా ముందుగానే పరిశుభ్ర భారత్‌ను సాధించే క్రమంలో కేటాయించిన నిధుల్ని పనికొచ్చే రీతిలో వినియోగించి, ఆలస్యాన్ని పరిహరించి, అవసరమైన పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మరుగుదొడ్ల వాడకం విషయంలో ఇప్పటికీ కొంతమందిలో నెలకొన్న సామాజిక మూఢనమ్మకాల్ని పారదోలాలి. చైతన్య కార్యక్రమాల ద్వారా అవగాహనను పెంచడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఈ దిశగా నెలకొన్న లోపాల్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలి. ప్రభుత్వ కృషికి పౌర సమాజం నుంచీ తిరుగులేని సహకారం అందాలి. అప్పుడే మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛభారతం ఆవిష్కృతమవుతుంది!

గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరయ్యేందుకు ఒకసారి కోల్‌కతా వెళ్ళారు. కాంగ్రెస్‌ శిబిరం వద్ద పారిశుద్ధ్య పరిస్థితులు భయంకరంగా ఉండటం గమనించారు. చెత్తనంతా శుభ్రం చేయాల్సిందిగా అక్కడున్న వాలంటీర్లను కోరగా, అది ఊడ్చేవారి పని అని అంటూ వారు ప్రత్యుత్తరమిచ్చారు. గాంధీజీ వెంటనే కదిలారు. పాశ్చాత్య శైలి దుస్తులతోనే చీపురు చేతపట్టారు. అక్కడి పరిసరాలన్నింటినీ శుభ్రం చేసేసి, సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ శ్రేణుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.


Posted on 28-09-2019