Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

స్థానిక సంస్థలు ప్రజాస్వామ్య దీపికలు

* గాంధీజీ గ్రామ స్వరాజ్య భావన

మహాత్మాగాంధీ మనకు అందించిన గొప్ప వరం- అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడం! విభిన్న కులాలు, భాషలు, విశ్వాసాలు, సంస్కృతులు, మతాలకు చెందిన ప్రజలందరినీ ఓ జాతిగా ఏకం చేశారు. ఒక లక్ష్యాన్ని ముందుంచారు. గుర్తింపు కల్పించారు. భారతదేశం నుంచి ఆంగ్లేయులు ఎప్పటికైనా వెళ్లిపోక తప్పదని ఆయన గ్రహించారు. 1916 ఫిబ్రవరి నాలుగున బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ, ఇష్టపూర్వకంగాగాని, విధిలేని పరిస్థితుల్లోగాని ఆంగ్లేయులు నిష్క్రమించక తప్పదని గాంధీ వ్యాఖ్యానించారు. బ్రిటిష్‌ పాలకులు స్వాతంత్య్రం ఇచ్చేసి, భారత్‌ వదిలి వెళ్లిపోవడమే గాంధీజీ ప్రధాన ఉద్దేశం కాదు. మనకు స్వపరిపాలన సామర్థ్యం ఎంతమేర ఉందనేదే అప్పట్లో ఆయన ఆలోచన. 1916 ప్రారంభంలో ప్రతి భారతీయుడూ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్న వేళ గాంధీజీ ఓ మాట అడిగారు. మన దేవాలయాలే శుభ్రతకు నమూనాలుగా లేవు... మన స్వపరిపాలన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దేవాలయాలు పవిత్రతకు, పరిశుభ్రతకు, శాంతికి నిలయాలుగా మారతాయా అని అడిగారు. నిజమైన స్వపరిపాలన అంటే హక్కులతోపాటు బాధ్యతలపైనా అవగాహన కలిగి ఉండటమేనన్నది గాంధీజీ భావన. పౌరులు, ప్రభుత్వం మధ్య; పన్నులు, సేవల మధ్య సంబంధంపై గాఢమైన అవగాహన ఉండటం అవసరమని ఆయన విశ్వసించారు. అందువల్లే గాంధీజీ సదా స్థానిక ప్రభుత్వాల గురించే మాట్లాడుతుండేవారు. ఆ రోజుల్లో దేశంలో 90 శాతం గ్రామీణ ప్రాంతమే కావడంతో గ్రామస్వరాజ్య భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

స్థానిక ప్రభుత్వాలు అత్యుత్తమ ప్రజాస్వామిక పాఠశాలలు. స్థానిక ప్రభుత్వం మాత్రమే రోజూ ప్రజలకు చేరువగా ఉంటూ అధికారాలను నిర్వర్తించగలదు. ప్రజలు సైతం స్థానిక ప్రభుత్వాల నిర్ణయాలు, నిష్క్రియాపరత్వాల వల్ల తమ జీవితాలపై పడే ప్రభావాలను అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల తమ ఓటుకు, దాని ఫలితానికి మధ్య సంబంధం ప్రజలకు సులువుగా బోధపడుతుంది. స్థానిక స్థాయిలో ఒకవేళ ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నా, తెలివిలేని నేతల్ని ఎంచుకున్నా- వాటి ఫలితాన్ని వారే చవిచూస్తారు. ఓటుహక్కును సద్వినియోగం చేసుకోకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి స్వయంగా బోధపడుతుంది. స్థానిక స్థాయిలో తాము కట్టిన పన్నుల సొమ్ము ఎక్కడికి వెళ్తోందో కూడా వారికి తెలిసి వస్తుంది. స్థానిక నాయకత్వం తీసుకునే నిర్ణయాల వల్ల వనరుల కేటాయింపు, తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతోందనేది అర్థమవుతుంది. స్థానికంగా అధికారగణం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుంది. తప్పు జరిగితే... ప్రజలు వ్యక్తిగతంగా లేదా సమష్టిగా ప్రశ్నించి పరిస్థితుల్ని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రభుత్వంలో విధులు, బాధ్యతల సమ్మిళితత్వం కారణంగా జవాబుదారీతనం ఎవరిదో ప్రజలకు తెలుస్తుంటుంది. ఈ కారణంగానే మహాత్మాగాంధీ అధికార వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్య భావనను ప్రోత్సహించేవారు. గాంధీజీ ఆశీస్సులతో 1920ల్లో మన జాతీయ నేతల్లో చాలామంది స్థానిక ప్రభుత్వాలకు నేతృత్వం వహించారు. ప్రభుత్వంలో తమ నైపుణ్యాల్ని మెరుగుపరచుకున్నారు. కలకత్తాలో చిత్తరంజన్‌దాస్‌, సుభాష్‌ చంద్రబోస్‌, పట్నాలో రాజేంద్రప్రసాద్‌, అహ్మదాబాద్‌లో వల్లభాయ్‌పటేల్‌, అలహాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ... వీరంతా స్థానిక ప్రభుత్వాల్ని అద్భుతంగా నిర్వహించినవారే. రాజమండ్రిలో ప్రకాశం పంతులు, సేలమ్‌లో సి.రాజగోపాలచారి స్థానిక ప్రభుత్వాలపై తమదైన ముద్ర వేశారు.

పౌరుల సంక్షేమమే ప్రాథమిక హితం
పౌరులు, వారి కుటుంబం కేంద్రకంగానే దేశం ఉండాలనే భావనను గాంధీజీ విశ్వసించేవారు. పౌరుల సంక్షేమమే దేశ ప్రాథమిక హితంగా ఉండాలని భావించారు. దిల్లీలో కేంద్ర ప్రభుత్వం రూపంలో సమాఖ్య ప్రభుత్వం ఉండటాన్ని ఆయన ఎన్నడూ యోచించలేదు. ఆయన ఉద్దేశంలో అధికారం అనేది పైస్థాయి నుంచి కిందికి వచ్చేది కాదు. పౌరులే కేంద్రకంగా అధికార విస్తరణ జరగాలని భావించేవారు. దేశం, స్వపరిపాలన విషయంలో ఆయన ఆలోచనలు 19వ శతాబ్దంలోని క్యాథలిక్‌ సామాజిక తత్వంలోని అనుబంధ (సబ్సిడరీ) సూత్రాలకు దగ్గరగా ఉండేవి. వాటిని తరవాత జర్మన్‌ రాజ్యాంగంలోనూ చేర్చారు. ప్రస్తుత ఐరోపా సమాఖ్య సాధారణ న్యాయసూత్రాల్లోనూ అవి భాగమయ్యాయి. రాజకీయాలకు, పాలనకు స్థానిక ప్రభుత్వాలే ప్రధాన పీఠమనే ముఖ్య సూత్రంపైనే అమెరికా పౌరసమాజం పునాది నిర్మితమైంది. అనుబంధ సూత్ర నియమావళికి పొడిగింపుగానే అమెరికా రాజ్యాంగంలో రాష్ట్రాల హక్కుల నియమాల్ని చేర్చారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆంగ్ల నిఘంటువు ప్రకారం సబ్సిడరీ సూత్రానికి అర్థం.. ‘ఒక కేంద్ర ప్రాధికార సంస్థకు అనుబంధ విధులు మాత్రమే ఉండాలి. స్థానిక స్థాయిలో నిర్వర్తించలేని విధులను మాత్రమే అది నిర్వర్తించాలి’. మరోమాటలో చెప్పాలంటే- కింది అంచెల్లో ఉండే ప్రభుత్వం నుంచి పైస్థాయుల్లోని ప్రభుత్వ వ్యవస్థకు అధికారం అప్పగిస్తారు. పౌరులు, కుటుంబం, సమాజం అవసరాల నుంచే అధికార విస్తరణ సాగాలి. పౌరులు, సమాజం అధికారాలే ప్రాథమికం. అవి అధికార వ్యవస్థలో పైస్థాయి నుంచి ఉత్పన్నమయ్యేవి కావు. గాంధీ విశ్వసించిన గ్రామస్వరాజ్య భావన ఈ అనుబంధ సూత్ర ఉద్దేశాలకు చక్కగా సరిపోతుంది. అది మన చారిత్రక భావనలకూ అనుగుణంగా ఉంది.

అయిదు వేల ఏళ్లనాటి హరప్పా నాగరికత నుంచి సింధులోయ నాగరికత వరకు స్థానిక స్వపరిపాలన విధానాలు అమలయ్యేవని తెలుస్తోంది. ఉత్తరమేరూరు శాసనం ప్రకారం పదో శతాబ్దంలోని చోళుల కాలంలో గ్రామస్థాయిలో అత్యంత వ్యవస్థీకృత పద్ధతిలో స్థానిక పాలన సాగింది. బ్రిటిష్‌ పాలనలోనూ పురపాలక సంస్థలు స్వయంపాలనతో శక్తిమంతంగా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నిర్ణయాధికారంలో జిల్లా బోర్డులు సైతం శక్తిమంతమైన పాత్ర పోషించేవి. అయిదు వేల సంవత్సరాల చరిత్రలో స్థానిక ప్రభుత్వాల పాత్రను పరిశీలిస్తే, స్వతంత్ర భారతంలోనే అత్యధిక స్థాయిలో కేంద్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది. మన రాజ్యాంగం మానవత్వంతో కూడిన ఉదార పత్రం.

అధికార వికేంద్రీకరణతో పరిమిత స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు ఏర్పడాలని గాంధీజీ అభిలషించారు. తద్వారా ప్రజలు తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటారని భావించారు. కాని కులప్రీతి, అవినీతికి అడ్డాలుగా మారిన పంచాయతీలకు అధికారాల్ని బదిలీ చేసే విషయంలో అంబేడ్కర్‌ ఆలోచన పూర్తిగా భిన్నం. ఇరువురి వాదనల్లోనూ బలముంది. కేంద్రీకరణ, రాజ్య నియంత్రణ భావనలే గాంధీజీ వలస పాలన వ్యతిరేకతలో కీలకంగా నిలిచాయి. అగ్రకుల పెద్దల అధికార ఏకస్వామ్యం వంటివి కులవ్యవస్థ, పుట్టుక నుంచే వ్యవస్థీకృతమైన అసమానత్వం న్యాయబద్ధమైన భయాందోళనల్ని లేవనెత్తాయి. గాంధీజీ, అంబేడ్కర్‌ల పరస్పర వ్యతిరేక అభిప్రాయాల మధ్య సయోధ్య కుదర్చడంలో మన జాతి నిర్మాతల వైఫల్యం ప్రజాస్వామిక భారత్‌కు చాలా చేటు తలపెట్టినట్లు తేలింది. ఒక సమాజంలో కేంద్రీకరణ ఫలితంగా పౌర భావన, ఓటు పరిణామాలు, పన్నులు, సేవల మధ్య సంబంధాల్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఓటు కొనుగోలు చేసే క్రమంలో ప్రజాస్వామ్యం క్షీణ దిశగా నడిచింది. ప్రభుత్వ ప్రాథమిక విధుల్ని పణంగా పెట్టి తాయిలాల పంపిణీ సంస్కృతి పెచ్చరిల్లింది. కులాలు ఇతర అంశాల పేరిట చీలికలు తెచ్చి, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు సేకరించే అలవాటు అధికమైంది. ప్రజాస్వామిక పాఠశాలలుగా వెలగాల్సిన స్థానిక ప్రభుత్వాలు స్వీయపాలన, నిర్ణయాధికారంపై అవసరమైన నైపుణ్యాల్ని సంతరించుకోలేకపోతున్నాయి. ఫలితంగా నిరంతర మెరుగుదల, స్వీయదిద్దుబాటు వ్యవస్థ లేని స్థితిలో ప్రజాస్వామ్యం- ఓటింగ్‌, నిరసనలకే పరిమితమైపోతోంది.

కేంద్రీకృత వ్యవస్థతో నష్టాలు
కేంద్రీకృత వ్యవస్థలో తప్పులు దొర్లితే అవి దేశం పాలిట శాపాలవుతాయి. నవకల్పనలు, కొత్త ఆలోచనల అమలు క్లిష్టతరమవుతుంది. వికేంద్రీకృత వ్యవస్థలో పొరపాట్ల పర్యవసానం స్థానిక ప్రభుత్వానికే పరిమితమవుతాయి. నవకల్పనలు, కొత్త ఆలోచనలు స్థానిక ప్రభుత్వాలకూ విస్తరిస్తాయి. పౌరులు ప్రభుత్వంలో భాగస్వాములవుతారు. ప్రజల జీవితాలు గణనీయంగా మెరుగవుతాయి. అధికారాల బదిలీ, స్వీయపాలన ప్రయోజనాలు ప్రజలకు దక్కుతాయనేందుకు స్వయంపాలిత పాడి సహకార సంఘాల అద్భుత విజయాలే ప్రత్యక్ష సాక్ష్యం. మహారాష్ట్ర, గుజరాత్‌, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నాయకత్వం, స్థానిక ప్రభుత్వ నేతల నవకల్పనల కారణంగా పాఠశాల విద్య, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగాల్లోనూ విజయగాథలు నమోదయ్యాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే అధికార వికేంద్రీకరణ విజయం సాధిస్తుందనేందుకు చిన్న తరహా ఎత్తిపోతల ప్రాజెక్టులను విజయవంతంగా, వేగంగా అమలు చేసేందుకు స్థానిక ప్రజల్ని సమీకరించిన ఉదంతంలో, స్వయంపాలక పారిశ్రామిక స్థానిక ప్రాధికార సంస్థల ఏర్పాటులో నా అనుభవాలే ప్రత్యక్ష ఉదాహరణ.

ఒక దేశంగా మనం గాంధీజీ, అంబేడ్కర్‌ ఆదర్శాలను సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉంది. శక్తిమంతమైన, స్థానిక ప్రభుత్వాల్ని నిర్మిస్తే అవి ప్రజలకు సాధికారత కల్పిస్తాయి. కులాల అడ్డుగోడల్ని కూలదోసే అవకాశం ఉంది. దళితులు, వెనకబడిన వర్గాలు, మహిళలకు సాధికారత కల్పించేందుకు స్థానిక ప్రభుత్వాల్లో ఇప్పటికే మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. వీటికి అదనంగా 20 వేల నుంచి 25 వేలదాకా జనాభాతో కొన్ని గ్రామాలను పంచాయతీ సమూహాలుగా మార్చగలిగితే సంప్రదాయ కుల వ్యవస్థను బలహీనపరచే అవకాశం కలుగుతుంది. ప్రజాస్వామిక ఓటు శక్తితో అణగారిన వర్గాలకు విముక్తి కల్పించే వీలు దక్కుతుంది. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 25 శాతాన్ని పాఠశాల విద్య, ప్రాథమిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వంటి అవసరాలకు బదిలీ చేస్తే ప్రజలు తమ జీవితాల్ని మెరుగుదిద్దుకునే పద్ధతుల్ని వేగంగా నేర్చుకోగలుగుతారు. అధికార దుర్వినియోగాన్ని వేగంగా గుర్తించి బాధ్యులు శిక్షిస్తారు. పౌరసేవలకు హామీని కల్పిస్తారు. నిర్దిష్ట కాలవ్యవధితో సేవలు అందించే శక్తిమంతమైన స్వతంత్ర స్థానిక అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థ ఉంటే జవాబుదారీతనం ఇనుమడిస్తుంది. రాష్ట్రం, కేంద్రం రాజ్యాంగం పరిధిలో తమకు దఖలుపడిన విధుల్ని నిర్వర్తించడం కొనసాగిస్తాయి. ఈ నమూనాలో గాంధీజీ ఆదర్శాలను, అంబేడ్కర్‌ జాగ్రత్తల్ని సమ్మిళితం చేయొచ్ఛు ప్రజల జీవితాల్ని జవాబుదారీతనంతో స్థానిక పాలన పద్ధతిలో మెరుగుపరచవచ్ఛు తద్వారా ప్రజలు స్వయంపాలన కళను అందిపుచ్చుకొంటారు. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మహాత్మాగాంధీ కలలుగన్న సిసలైన ‘స్వరాజ్‌’ సిద్ధిస్తుంది!


Posted on 30-09-2019