Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ముప్పు ముంపులో హిమాలయాలు

* విపత్తుల కేంద్రంగా ఉత్తరాఖండ్‌
హిమాలయాలు ఈ మధ్య తరచూ భయపెడుతున్నాయి. మంచుకొండల్లో విపత్తు ఎప్పుడు ఎటువైపునుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అభద్రతకు, అనిశ్చితికి విచ్చలవిడిగా నిర్మిస్తున్న జలవిద్యుత్తు ప్రాజెక్టులే కారణం. ఉత్తరాఖండ్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదించిన, ఇప్పటికే పూర్తయిన జలవిద్యుత్తు ప్రాజెక్టులు (హెచ్‌ఈపీ) మొత్తంగా 700 వరకు ఉన్నాయి. హెచ్‌ఈపీల పేరిట ఇప్పటికే వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని, వ్యవసాయ క్షేత్రాలను నాశనం చేసేశారు. పర్వతాల సహజ భౌగోళికతను విచ్ఛిన్నం చేయడం, రిజర్వాయర్లలో భారీ పరిమాణంలో నీటిని నిల్వ ఉంచడం వంటి చర్యల ద్వారా హిమాలయ సానువుల్లో భూకంప ప్రమాదం ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఆ ప్రాంతంలో కొండచరియలు పెద్దయెత్తున విరిగిపడుతున్నాయి. మరోవంక హెచ్‌ఈపీల నిర్మాణంవల్ల వేల సంఖ్యలో ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి తలో దిక్కు తరలిపోవాల్సిన దురవస్థ నెలకొంది. అన్నింటికన్నా పెద్ద సమస్య ఇది!

విచ్చలవిడి ప్రాజెక్టులతో చిక్కు

ఎక్కడికక్కడ డ్యాములు నిర్మించడంతో గంగానది ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది. డ్యాముల మధ్యలో నది బాగా కుంచించుకుపోతోంది. పర్యావరణ ఉద్యమకారుడు డాక్టర్‌ జీడీ అగర్వాల్‌ గంగానదిని కాపాడటానికి ఎడతెరిపి లేకుండా కృషిచేస్తున్నారు. ఒకప్పుడు ఐఐటీలో ఆచార్యుడిగా పనిచేసిన ఈయన ప్రస్తుతం స్వామి గ్యాన్‌ స్వరూప్‌ సనంద్‌గా పేరు మార్చుకున్నారు. భాగీరథీ, అలకనంద సంగమించి గంగానదిగా మారుతున్నచోట, గతంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నారు. 82ఏళ్ల వయసులో సుదీర్ఘకాలం ఆయన చేసిన దీక్షకు దిగివచ్చిన నాటి యూపీఏ ప్రభుత్వం, గోముఖి నుంచి ఉత్తర్‌కాశి మధ్య ఉన్న వంద కిలోమీటర్ల పొడవైన నది (4,179 చదరపు కిలోమీటర్లు) ప్రాంతాన్ని పర్యావరణ రక్షిత ప్రాంతం(ఈఏఎస్‌జెడ్‌)గా తీర్మానించింది. దాని ప్రకారం ఆ పరిధిలో ఎలాంటి డ్యాములు, జలవిద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదు. ఈ 'నోటిఫికేషన్‌' జారీ అయిన ఆరు నెలలకే ఉత్తరాఖండ్‌ ప్రాంతం చరిత్రలోనే కనీవినీ ఎరుగనంతటి పెద్ద ఉత్పాతం ఎదుర్కొంది. ఆ విపత్తు వేలమందిని పొట్టనపెట్టుకుంది. లక్షలమందిని నిరాశ్రయులుగా మార్చింది. వందల సంఖ్యలో జలవిద్యుత్తు ప్రాజెక్టుల కోసం పర్యావరణాన్ని చిందరవందర చేసిన పర్యవసానం విపత్తు తీవ్రతను పెంచింది. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో గట్టిగానే స్పందించింది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ నివేదిక వెలువడే దాకా నిర్మాణంలో ఉన్న వివిధ డ్యాముల పనులను ఎక్కడికక్కడ నిలిపివేయాలని, కొత్తవాటి గురించి ఆలోచించవద్దని ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన విపత్తు మహోగ్రరూపం దాల్చడానికి జలవిద్యుత్తు ప్రాజెక్టులే కారణమని నిపుణుల కమిటీ నివేదిక తేల్చడంతో- కొత్తవాటి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం 23 జలవిద్యుత్తు ప్రాజెక్టులను తక్షణం నిలిపివేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమర్పించిన నివేదికలో డాక్టర్‌ రవి చోప్రా ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ విశదీకరించింది.

గోముఖి-ఉత్తర్‌కాశి మధ్య భాగాన్ని పర్యావరణ రక్షిత ప్రాంతం(ఈఎస్‌జీ)గా తీర్మానించడం, నిపుణుల కమిటీ నివేదిక సమర్పించడం, సుప్రీంకోర్టు ఆదేశాలు వంటివన్నీ జరిగి ఇప్పటికి రెండేళ్లకు పైనే అయింది. విజయ్‌ బహుగుణ స్థానంలో 2014 ఫిబ్రవరిలో హరీష్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విపత్తు ముంచెత్తిన తరవాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో వైఫల్యం, ఈఎస్‌జీ నోటిఫికేషన్‌ నేపథ్యంలో ప్రజానుకూల అభివృద్ధి ప్రణాళికను రూపొందించలేకపోవడం వంటివి విజయ్‌ బహుగుణ పదవీచ్యుతికి కారణమయ్యాయి. ఈఎస్‌జీ నోటిఫికేన్‌ను అమలులో పెడితే తమ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోతుందేమోనన్న భయంతో గోముఖి-ఉత్తర్‌కాశి మధ్యభాగంలో ఉన్న 88 గ్రామాల ప్రజలు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చారు. జలవిద్యుత్తు ప్రాజెక్టులవల్లే అభివృద్ధి సాకారమవుతుందనుకోవడం సరికాదు. ఉత్తర్‌కాశి జిల్లాలో పాలమనేరి, లొహారీ నాగ్‌లపాల వంటి జలవిద్యుత్తు ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. కానీ, ఆ జిల్లా రాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి మిగిలిన రాష్ట్రంతో పోలిస్తే బాగా తక్కువగా ఉంది. ప్రజలకు ఈ విషయాన్ని విడమరచి చెప్పడంలో విజయ్‌ బహుగుణ సర్కారు దారుణంగా విఫలమైంది. ఈఎస్‌జీ నోటిఫికేషన్‌ నేపథ్యంలో 480మెగావాట్ల పాలమనేరి డ్యామ్‌ను, 381 మెగావాట్ల బైరొంగటి విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన 600మెగావాట్ల లొహరి నాగ్‌లపల జలవిద్యుత్తు ప్రాజెక్టుతోపాటు గంగానదిపై అనేక ఇతర హెచ్‌ఈపీల నిర్మాణాన్నీ కేంద్రసర్కారు ఆపివేసింది. హెచ్‌ఈపీల వల్ల హిమాలయ సానువుల్లో పెను విపత్తు ముంచుకొస్తోందని స్వయంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తేటతెల్లం చేసిన నేపథ్యంలో- ఈ నిర్మాణాలను నిలిపివేయడం సమంజసం, సహేతుకం! వీటివల్ల గంగా-భాగీరథి, అలకనంద నదీ పరివాహక ప్రాంతాలు కోసుకుపోవడంతోపాటు, ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతం అంతకంతకూ తగ్గిపోతోందని స్పష్టమైన నివేదికలున్నాయి. కొండచరియలు పెద్దయెత్తున విరుచుకుపడి, పర్యావరణం అల్లకల్లోలమవుతుందని నిపుణులు మొదటినుంచీ హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈఎస్‌జీ నోటిఫికేషన్‌ను కచ్చితంగా అమలు చేసేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సానుకూల ధోరణితో ముందడుగు వేయాల్సి ఉంది.

పర్యావరణ సమతుల్యతే రక్ష

పరిరక్షించడంతోపాటు, స్థానిక ప్రజల జీవికకు భరోసా ఇచ్చేందుకు ఈఎస్‌జీ అమలు అత్యంత కీలకం. భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో నెలకొన్న గ్రామాలను పరిరక్షించుకునే పద్ధతులను ఈఎస్‌జీ నోటిఫికేషన్‌లో బ్రహ్మాండంగా వివరించారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాల్సిన సందర్భమిది. ప్లాస్టిక ్‌ పునశ్శుద్ధి ప్లాంటు ఏర్పాటుతోపాటు; వర్షపు నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ అనుకూల పరిశ్రమల స్థాపన, సూక్ష్మ జలవిద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు, సౌర విద్యుత్తు వంటివాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేయడంలో గ్రామ పంచాయతీలు, మహిళలు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. నదుల సహజ ప్రవాహాన్ని, నదీ సంగమ స్థలాల సహజత్వాన్ని పరిరక్షించడం; జలపాతాలు, దేవాలయాలు, చారిత్రక ప్రాంతాల ప్రాశస్త్యాన్ని కాపాడుకోవాల్సిన తీరుతెన్నులను ఈఎస్‌జీ నోటిఫికేషన్‌లో వివరించారు. అయితే, ఇందులో అభివృద్ధి పనులను నిలిపివేయాలని ఎక్కడా చెప్పలేదు. గంగోత్రి జాతీయ రహదారి నిర్మాణం, గ్రామీణ రహదారుల బాగుసేత వంటివాటికి ఈ నోటిఫికేషన్‌ పెద్దపీట వేసింది. ఈ విషయాలను వాటంగా విస్మరించిన కొందరు రాజకీయ నాయకులు 2014, డిసెంబరు 18న- ఈఎస్‌జీ రెండో వార్షికంలోకి అడుగుమోపిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్తర్‌కాశీలో పెద్దయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. పర్యావరణాన్ని నాశనం చేయకుండా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడంపై సహేతుక చర్చ జరగాల్సిన తరుణమిది.

(ర‌చ‌యిత - రాకేశ్‌ అగర్వాల్‌)
Posted on 30-10-2015