Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

మానవాళికి మార్గదర్శకాలు

* సత్యాగ్రహమే స్ఫూర్తిగా...

దండెత్తి వచ్చేవాడికి దాసోహమనడం అలవాటులేని భారతజాతి స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ అడుగుపెట్టిన తరవాత సత్యాగ్రహాన్నే తన రణ నినాదంగా మార్చుకుంది. 1857 తొలి స్వాతంత్య్ర ఉద్యమం నుంచి దాదాపు 60 ఏళ్ల పాటు సాగిన స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్‌వారితో ఆయుధమే మాట్లాడింది. మహాత్ముడి ఆగమనంతోనే వలసపాలనపై పోరాట పంథా మారింది. అహింసకు మించిన ఆయుధం లేదని మనస్ఫూర్తిగా నమ్మిన గాంధీజీ- సత్యాన్నే బలంగా, బలగంగా మార్చుకుని స్వాతంత్య్రాన్ని సాధించడమేగాక మానవాళికీ నూతన ఆలోచన ధారను పరిచయం చేశారు. జాతుల స్వేచ్ఛా సాధనకు సత్యాగ్రహ సారథి చూపిన మార్గం- రక్తపాత రహిత విప్లవం! దేశంలో స్వాతంత్య్ర పోరాటం హింసాత్మకంగా జరుగుతున్న సమయంలోనే- మహాత్ముడు దక్షిణాఫ్రికాలో వర్ణపరమైన దుర్విచక్షణకు వ్యతిరేకంగా అహింసా ఉద్యమం నడిపి విజయం సాధించారు. ప్రజాబాహుళ్యం మద్దతు చూరగొనేందుకు సత్యాగ్రహమే సరైన సాధనమని గ్రహించారు. 1915లో దేశానికి తిరిగివచ్చి వలసపాలకులపై ఉద్యమ శంఖం పూరించారు. 1917లో బిహార్‌లోని చంపారన్‌లో తొలిసారిగా సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. అహింసాయుత ఉద్యమ ఫలితాలను దేశ ప్రజలకు తొలిసారిగా తేటపరచిన సందర్భమది. ఆ తరవాత మౌలానా సోదరులు షౌకత్‌, మహ్మద్‌ అలీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ముస్లిములను కూడగట్టుకొని ఖిలాఫత్‌ ఉద్యమం సాగించారు.

1920లో స్థాపించిన గుజరాత్‌ విద్యాపీఠ్‌ విశ్వవిద్యాలయాన్ని గాంధీజీ సత్యాగ్రహులకు శిక్షణా కేంద్రంగా మార్చారు. కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం అనే రెండు పరస్పర విరుద్ధ భావజాలాలు ప్రపంచమంతటా విస్తరించిన వేళ భిన్న పంథాలో ఆయన సత్యాగ్రహం నినదించారు. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారం చేస్తుందని నమ్మి సత్యాగ్రహంతో అలుపెరగని పోరాటం చేశారు. బానిస బంధనాల నుంచి విముక్తి కావాలన్న కోట్లాది జనానికి దిక్సూచిగా మారారు.

దళితుల అభ్యుదయానికి బాట
అంటరానితనాన్ని హిందూ మతానికి ఓ మాయని మచ్చగా గాంధీజీ భావించారు. వేదాలు, పురాతన గ్రంథాల్లో అంటరానితనం గురించి ఎక్కడ ఉందో చెప్పాలని సంస్కృత పండితులకు ఆయన సవాలు విసిరారు. ఒకవేళ అంటరానితనాన్ని వేదాలు, పురాణాలు సమర్థిస్తే వాటిని తాను వ్యతిరేకిస్తాననీ విస్పష్టంగా తేల్చి చెప్పారాయన. మరో జన్మంటూ ఉంటే హరిజనులైన తల్లిదండ్రుల ఇంట్లో బాలికగా పుడతానని మహాత్ముడు ఎన్నోసార్లు చెప్పారు. ఆవుల మృతదేహాలను పారవేసేవారిని, పారిశుద్ధ్య కార్మికులనూ అంటరానివారిగా భావించడం దారుణమన్నది ఆయన నమ్మిక.

అంటరానితనాన్ని తొలగించేందుకు ఆయన కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు, హరిజనులను పెళ్లి చేసుకుంటే- అలాంటి ఉత్సవాలకే తాను హాజరవుతాననీ చెప్పారు. ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతీ భాషల్లో తన నేతృత్వంలో నడిచిన పత్రికలకు హరిజన్‌, హరిజన్‌ బంధు, హరిజన్‌ సేవక్‌ అనే పేర్లు పెట్టారు.

జైలునుంచి తిరిగి వచ్చాక 1933నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఆయన హరిజన్‌ యాత్ర చేశారు. ఎలాంటి షరతులు లేకుండా దళితులు హిందూ దేవాలయాల్లోకి స్వేచ్ఛగా వెళ్లాలని ప్రచారం చేశారు. ఆ పిలుపునకు మొట్టమొదట స్పందించినవారు ప్రముఖ పారిశ్రామికవేత్త జమ్నలాల్‌ బజాజ్‌. దళితులకోసం వార్దాలోని దేవాలయం తలుపులు తెరిచారు. అనంతరం కేరళలో ట్రావెన్‌కోర్‌ మహారాజా దేవాలయాలలోకి దళితులను అనుమతించారు. కేరళలోని వైకోంలో దేవాలయాలకు వెళ్లే దారుల్లో దళితులపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా జరిగిన సత్యాగ్రహ ఉద్యమానికీ మహాత్ముడు పూర్తి మద్దతునిచ్చారు. అంటరానితనాన్ని రూపుమాపే క్రమంలో చట్టాలతోపాటు ప్రజల మద్దతూ అవసరమని ఆయన బలంగా నమ్మారు.

అహింసే ఆయుధం... సత్యమే దైవం
సమున్నత లక్ష్యాలు, వాటి సాధనకు అనుసరించిన పంథాయే బక్కపలచటి బాపూజీని జాతి దిక్సూచిగా మార్చాయి. చేసే పనుల్లోనే కాదు చివరికి ఆలోచనల్లో తప్పు దొర్లడాన్నీ ఆయన తీవ్రంగా పరిగణించేవారు. ప్రపంచం మన తప్పుల్ని గమనించే లోపు- మనమే వాటిని ఒప్పుకోవాలి అంటారాయన. ఒకసారి దక్షిణాఫ్రికాలోని ఫినిక్స్‌ ఆశ్రమంలో ఏదో తప్పు చేసినందుకు శిక్షగా ఒక పూట భోజనం చేయకుండా, ఉప్పు వినియోగించకుండా ఉన్నారు. ఇలాంటివే గాంధీని ఆమరణ నిరాహారదీక్షలకు సిద్ధం చేశాయి. ఎప్పుడైనా స్వతంత్ర సంగ్రామంలో హింస చెలరేగినా, సమాజంలో మతోన్మాదాలు, వర్గ పోరాటాలు పెచ్చరిల్లినా వాటిపై సత్యాగ్రహమనే వజ్రాయుధాన్ని ప్రయోగించేవారు గాంధీ. స్వీయ సమీక్ష ఆయన తన వ్యక్తిత్వాన్ని సానపెట్టేందుకు అనుసరించిన విధానం. తర్కాన్నీ, విశ్వాసాలనూ ఆయన సమాతరంగా ఒకే స్థాయిలో గౌరవించేవారు. ఎప్పుడూ తర్కబద్ధమైన ఆలోచనలనే ఆహ్వానించిన బాపూజీని మించిన మతవిశ్వాసి కూడా లేరు. వేదాంతం, యోగాభ్యాసం గురించి ఎవరు చెప్పినా శ్రద్ధగా వినేవారాయన. ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందని నమ్మేవారు గాంధీజీ. సత్యాన్ని దైవంగా భావించే గాంధీ- అహింసతోనే దాన్ని అందుకోగలమని తేల్చిచెప్పారు. విలువలు లేని ఆర్థిక శాస్త్రాన్ని, మానవత్వం కొరవడిన రాజకీయాలను ఆయన ప్రమాదకరంగా పరిగణించారు. చదువు, అంతస్తు, రంగు, కులం, మతం, వర్గాలను బట్టి కాకుండా వ్యక్తిత్వాలను బట్టి మనుషులను అర్థం చేసుకోవాలని చెప్పడంతోపాటు ఆచరించి చూపారు కాబట్టే- గాంధీజీ జీవితం నేడు ఒక సందేశంగా మారింది.

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
స్వాతంత్య్ర సమర సేనానిగానే కాకుండా అపూర్వమైన మానవతావాదిగానూ మహాత్ముడు చిరస్మరణీయులు. 20 ఏళ్లపాటు గాంధీజీ సంపాదన కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అక్కడ నల్లజాతీయుల పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన- న్యాయవాద వృత్తిని పక్కనపెట్టి అహింసాయుత పోరాటాల్లో నిమగ్నమయ్యారు. ఆ ఉద్యమాలే కొన్ని మార్పులతో సత్యాగ్రహంగా మారాయి. సత్యం, అహింసలను పోరాట సాధనాలుగానే కాకుండా జీవన తత్వంగానూ మలచుకున్నారాయన. సత్యాగ్రహాన్ని పాటించేవారికి గాంధీజీ కొన్ని విలువైన, కఠిన సూచనలు చేశారు. సత్యాగ్రహమంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదు. ప్రత్యర్థిని శిక్షించడం కాదు. అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో బాధల్ని స్వచ్ఛందంగా భరించాలి. ప్రత్యర్థి హృదయాలను కదిలించేందుకు అదే సమర్థమైన మార్గమని ఆయన నమ్మారు. అహింసాయుత పోరాట పథంలో తాను చెప్పిన విధానాలే అంతిమం కాదని, వాటికి కాలానుగుణంగా మార్పు చేర్పులు చేయవచ్చనీ ఆయన స్పష్టం చేశారు. గాంధీజీ నేతృత్వంలో పోరాటాల్లో కఠిన సత్యాగ్రహ నియమాలు పాటించడంవల్ల- ప్రజలూ క్రమశిక్షణకు అలవాటుపడ్డారు. కేరళలో బలవంతపు వ్యవసాయానికి వ్యతిరేకంగా చంపారన్‌ ఉద్యమం జరిగింది. వ్యాంకో సత్యాగ్రహం- దళితుల కోసం దేవాలయ తలుపులు తెరిచింది. బార్దోలి ఉద్యమం ద్వారా భూమి శిస్తు రద్దు చేశారు. ప్రాంతీయ సమస్యలకు పరిష్కారాలు చూపిన ఆ ఉద్యమాలు- స్వాతంత్య్ర సంగ్రామం అనే అంతిమ లక్ష్యానికి దారులు చూపాయి.

జాతిపితగా దిశానిర్దేశం
సాధారణంగా స్వాతంత్య్రానంతరం ఏర్పడిన కొత్తదేశానికి తొలి అధ్యక్షుడిని జాతిపితగా పిలుస్తారు. కానీ, మహాత్మాగాంధీ ఎలాంటి అధికార పదవినీ చేపట్టలేదు, అయినా ఆయన ఈ దేశానికి జాతిపితగా మారారు. అది ప్రభుత్వమో, రాజ్యమో ఇచ్చిన బిరుదం కాదు- ప్రజావాహిని హృదయంలోంచి ఉప్పొంగిన భావన. బాపూని భారత జాతిపితగా తొలిసారి అభివర్ణించింది నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌! మతం, భాషల ఆధారంగా కాకుండా జాతీయత పునాదులపై నిర్మితమైన దేశం భారత్‌! ఆ జాతీయ భావనను భారత్‌లో పాదుకొల్పడంలో గాంధీజీ వ్యక్తిత్వం కనిపిస్తుంది. భిన్నత్వాల మధ్య వారధి ఆయన. వివిధ భాషలు, విభిన్న ప్రాంతాలు, వ్యక్తుల మధ్య జాతీయతను ప్రేరేపించి సమస్త జనావళినీ భావోద్వేగ ఐక్యత రేఖపై నిలిపిన ఘనత గాంధీజీదే! సామాన్య ప్రజల మధ్య బలమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరిచారాయన. గాంధీజీ చేసిన ప్రతి పని ప్రజల్లో ఐక్యతను పెంచింది. ఒక కేసు విషయంలో అలహాబాద్‌ ప్రత్యేక కోర్టు మహాత్ముడి పేరు, చిరునామా, వృత్తి వివరాలు కోరగా- తాను రైతునని, నేత కార్మికుడినని బదులిచ్చారాయన. ఆ ఒక్క మాటతో లక్షల సంఖ్యలోని రైతు, నేతన్నల హృదయాల్లో ఆయన చిరస్థానం సంపాదించారు. ఆయనే చరఖా తిప్పి నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు తయారు చేసుకునేవారు. సబర్మతి, సేవాగ్రామ్‌ ఆశ్రమాల్లో మరుగుదొడ్లు కడిగేవారు. మతం, కులం, భాష, లింగ భేదాలకు అతీతంగా అందరినీ ఒక్కటిచేసే అనేక ఉద్యమాలకు ఊపిరులూదారు కాబట్టే గాంధీజీ భారతావనికి మహాత్ముడయ్యారు.


- నచికేత దేశాయ్‌
(రచయిత- ప్రముఖ పాత్రికేయులు)
Posted on 01-10-2019