Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

వాహన చట్టానికి రాష్ట్రాల బ్రేకులు

* అమలుతీరుపై జనాగ్రహ ఫలితం

రహదారి నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఒడిశాలో ఓ ఆటోవాలా నెత్తిన రూ.40 వేల జరిమానా పిడుగు పడింది. రాజస్థాన్‌లో ఓ లారీ డ్రైవరుకు ఏకంగా లక్ష రూపాయలు వడ్డించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలు తరచూ ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ సవరించిన మోటారు వాహనాల(ఎంవీ) చట్టం అమలు పర్యవసానాలు. ఈ చట్టంలో ఉల్లంఘనలకు జరిమానాలు భారీగా ఉండటంతో ప్రజల నుంచి ఆగ్రహావేశాలూ వ్యక్తమయ్యాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని సొంత నగరం రాజ్‌కోట్‌లో రాత్రికి రాత్రే నిరసన పోస్టర్లు వెలిశాయి. ఆ రాష్ట్రంలోని వడోదరలో ఓ మోటారు సైక్లిస్టు అవసరమైన పత్రాల నకళ్లన్నింటినీ తన హెల్మెట్‌కు అతికించుకుని కొత్త తరహాలో నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల ఆగ్రహానికి లోనవుతున్న వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలూ పెరుగుతున్నాయి. నిబంధనలు పాటించాల్సిన పోలీసులే హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న చిత్రాలు పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రజల్లో గూడుకట్టుకున్న నిరసనలో భాగంగా వీటిని చూడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చట్టంలోని కొన్ని కఠినతరమైన శిక్షార్హ నిబంధనల్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చేస్తున్నాయి. ఈ వ్యవహారం వెనక ప్రజల కోపాగ్నిని చల్లార్చే ప్రక్రియతోపాటు ఇతరత్రా అంశాలూ తోడవుతున్నాయి.

గుజరాత్‌ నుంచే ప్రతిఘటన
మోటారు వాహనాల (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆగస్టు తొమ్మిదిన ఆమోద ముద్ర వేశారు. రహదారులను సురక్షితంగా మార్చాలని, అవినీతిని తగ్గించాలని, సాంకేతికతను ఉపయోగించాలని... తద్వారా దేశ రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో 30 ఏళ్లనాటి చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. బిల్లును 2016లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టగా, 2017లో లోక్‌సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో ఆమోదం పొందలేక పోయింది. తిరిగి ఈ ఏడాది ప్రవేశపెట్టారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రులతోపాటు, ఇతర స్థాయీసంఘాలతో చర్చించిన తరవాత బిల్లులో సవరణల్ని చేర్చారు. మోదీ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న ఆధిక్యం కారణంగా ఈ చట్టం ఆమోదం నల్లేరుపై నడకేనని భావించారు. చట్టం అమలులోకి రావడానికి కొన్ని రోజుల ముందు ఊహించని రీతిలో తొలి శరాఘాతం ఎదురైంది. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం, అత్యంత శక్తిమంతమైన అధికార పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి సొంతగడ్డ గుజరాతే ఈ చట్టం అమలును నిలువరించి, ఇందులోని శిక్షార్హ నిబంధనల్ని నీరుగార్చడం గమనార్హం. ఆ వెంటనే ఇతర భాజపా పాలిత రాష్ట్రాలూ ఇదే మార్గాన్ని అనుసరించాయి. జరిమానాలను తరవాతి దశలో తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తుగా భారీ స్థాయిలో నిర్ణయించినట్లు భాజపా వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి అసలు సంగతి తెలియదనుకోవాలి. ఎందుకంటే, భారీగా పెరిగిన జరిమానాలను ఆయన గట్టిగా సమర్థించుకుంటున్నారు. గడ్కరీ తొలి నుంచీ ఈ చట్టం ఆవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 55 శాతం ప్రమాదాలు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారివల్లే జరుగుతున్నాయని, చట్టమంటే భయం లేకపోవడమే ప్రస్తుత స్థితికి కారణమనేది ఆయన వాదన. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే ముందు తగిన స్థాయిలో సంప్రతింపులు జరిగాయని, ఆ తరవాతే కేంద్ర మంత్రివర్గం, పార్లమెంట్‌ ఆమోదాలు లభించాయని స్పష్టీకరించారు. గుజరాత్‌ రవాణా మంత్రి ఆర్‌సీ ఫర్దూ మాత్రం ఈ నిబంధనలపై పలు ఆక్షేపణలు లేవనెత్తారు. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం, ప్రభుత్వ పత్రాలు పొందడం కష్టంగా ఉందని, హెల్మెట్ల కొరతా వేధిస్తోందంటూ రకరకాల కారణాలు చూపారు. ఇలా కొత్త చట్టానికి వ్యతిరేకత వ్యక్తమైనా గడ్కరీ గట్టిగానే నిలబడ్డారు. ఆందోళనలకు భయపడబోనన్నారు. గుజరాత్‌ సీఎం రూపాని మాత్రం దీంతో ఏకీభవించలేదు. ముందుగా జరిమానా నిబంధనల్ని నీరుగార్చారు. ఆపై ఉత్తరాఖండ్‌, గోవా, కర్ణాటకల నుంచీ ఇదే తరహా అభిప్రాయాలు వినిపించాయి. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాయి. జరిమానాల్ని తగ్గించడంలో, చట్టం అమలులో వెనకంజ వేసినవాటిలో గుజరాత్‌ ముందుంది. సంబంధిత అంశాల్ని చర్చించేందుకు ఇతర రాష్ట్రాల మంత్రులతో సమావేశాల్ని సైతం నిర్వహించింది. మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేపట్టేందుకు 2016 నుంచి రవాణా అభివృద్ధి కమిటీ అయిదు సమావేశాల్ని నిర్వహించినా, అందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాలేదు. తీరా అమలుకు వచ్చేసరికి పలు రాష్ట్రాలు వెనక్కు తగ్గడం గమనార్హం. కొత్త చట్టంపై నిరసన వ్యక్తంచేయాలని గుజరాత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రజలకు పిలుపిచ్చింది.

కొత్త చట్టం విషయంలో భాజపా అంతర్గత రాజకీయాల పరిస్థితి ఎలాగున్నా, అధిక జరిమానాలు మాత్రం ప్రజల్లో అసంతృప్తికి దారి తీశాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతుండటంతో కొత్త నిబంధనలు సెప్టెంబరు ఒకటి నుంచి కాకుండా, 16 నుంచి అమలులోకి వస్తాయని గుజరాత్‌ సీఎం ప్రకటించారు. తరవాత తగ్గించిన జరిమానా వివరాలను వెల్లడించారు. చట్టంలో నిర్దేశించిన కనిష్ఠ పరిమితిని సైతం దాటిపోయి, జరిమానాల్ని మార్చేయడం గమనార్హం. తమ అత్యున్నత స్థాయి నేతలైన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాల ఆమోదం లేకుండా రూపాని ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని అనుకోలేం. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి మార్పులు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలు తగ్గించుకునేందుకు అంగీకరించని కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీనిపై న్యాయశాఖ అభిప్రాయం కోరింది. ఏదైనా చట్టంలోని నిబంధనపై కేంద్ర, రాష్ట్రాల మధ్య వైరుద్ధ్యం ఏర్పడితే, అది ఉమ్మడి జాబితాలోని అంశమైతే కేంద్ర చట్టమే వర్తిస్తుందని రాజ్యాంగంలోని అధికరణ 254 చెబుతోంది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 200 ప్రకారం 24 సెక్షన్లపై జరిమానాలు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. గుజరాత్‌ తదితర రాష్ట్రాలు వీటిని తమకు అనుగుణంగా మార్చుకున్నాయి.

భయం పెరగాల్సిందేనా?
రహదారులపై ప్రమాదాల రూపంలో ముంచుకొస్తున్న మృత్యువును నిలువరించాలంటే చోదకులకు భయం ఉండాలన్న బలమైన వాదన ఉంది. వర్షకాలంలో రహదారులు దెబ్బతిని గుంతలు తేలిన పరిస్థితుల్లో ఇలాంటి చట్టాన్ని అమలు చేయడానికిది సరైన సమయం కాదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ఈ తరహా చట్టాలు అమలు చేస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. గుంతలు పడిన రహదారులు, కలుషిత తాగునీరు, రహదారులపై అడ్డదిడ్డంగా పశుసంచారం, విద్యుత్‌ కోతలు, సరఫరాలో హెచ్చుతగ్గులతో గృహోపకరణాలు పాడవడం, కాలిబాటల్ని వర్తకులు ఆక్రమించడం వంటి విషయాల్లో స్పందించని అధికారులపై ఇదే తరహాలో జరిమానాలు, చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవైపు భారీస్థాయిలో పన్నులు నడ్డి విరగ్గొడుతుండగా, మరోవైపు ప్రభుత్వం, అధికారులు సర్కారీ సొమ్ము విషయంలో తీవ్రస్థాయి దుబారాలకు పాల్పడుతుండటంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదేస్థాయిల ప్రభుత్వ యంత్రాంగం నుంచీ జవాబుదారీతనాన్ని వారు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో గుంతలు పడిన రహదారులన్నింటికీ మరమ్మతులు పూర్తి చేసిన తరవాతే కొత్త నిబంధనల్ని అమలు చేస్తామని గోవా ప్రభుత్వం హామీ ఇచ్చింది. తగ్గించిన జరిమానాలతో చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక ఉన్నాయి. మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదు. గోవా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌లు చట్టం అమలును తాత్కాలికంగా నిలుపుదల చేశాయి. చట్టం అమలుకు ముందు వాహన చోదకుల్లో అవగాహన పెంచడం, రహదారుల మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నాయి.

- ఆర్‌కే మిశ్రా
(రచయిత- ప్రముఖ పాత్రికేయులు)
Posted on 03-10-2019