Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పైపై మెరుగులు... ప్రమాణాలకు నీళ్లు

* కఠిన శిక్షలతోనే కల్తీల కట్టడి

వెంటాడే పాపం వెయ్యేళ్లయినా వదలదన్నట్లు... కల్మషం ఎరగని జంతువులిచ్చే పాలనూ కల్తీ చేసిన ఓ వ్యాపారి ఎన్నేళ్లు గింజుకున్నా శిక్ష తప్పలేదు. చేసింది పెద్ద తప్పే కాదన్నట్లు- పాలలో నీళ్లు కలపడమూ ఓ పాపమేనా! దీనికీ శిక్ష వేస్తారా! అన్నట్లుగా ఆ వ్యాపారి 24 ఏళ్లుగా కింది నుంచి పైదాకా అన్ని కోర్టుల మెట్లూ ఎక్కి దిగారు. ఎక్కడా ఉపశమనం దక్కలేదు. ఆఖరుకు సర్వోన్నత న్యాయస్థానం సైతం- చేసిన నేరానికి శిక్ష తప్పదని ముఖం మీదే చెప్పేసింది. ఆహార కల్తీ నిరోధక చట్టానికి సంబంధించిన ఉదంతాల్లో కొద్దిపాటి తేడాల్నీ ఉపేక్షించబోమంది. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం కనికరం చూపేది లేదంది. ఆరు నెలల శిక్షను ఖరారు చేసింది.

పాతికేళ్లనాటి ఈ కేసు మూలాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. 1995 నవంబరులో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి అమ్మిన పాలపై ఫిర్యాదులు రావడంతో ప్రయోగశాలలో పరీక్షించి చూశారు. కొవ్వు కేవలం 4.6 శాతమే ఉండగా, కొవ్వేతర ఘన పదార్థం (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌) 7.7 శాతంగా తేలింది. చట్ట ప్రకారం ఇది 8.5 శాతంగా ఉండాలి. కేసు కోర్టుకెక్కింది. కింది కోర్టు రాజ్‌కుమార్‌ను దోషిగా తేల్చింది. దీనికి అతను ససేమిరా అన్నారు. పై కోర్టులకు వెళ్లి తేల్చుకుంటానన్నారు. సెషన్స్‌ కోర్టు, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఆఖరి యత్నంగా సర్వోన్నత న్యాయస్థానం గడప ఎక్కారు. అక్కడా అదే సమాధానం ఎదురైంది. జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పింది. పాలలో వెన్న తదితర పదార్థాలు వీసమెత్తు తగ్గినా వదిలేది లేదని స్పష్టం చేసింది. చట్టంలో ఒకసారి ప్రమాణాలు నిర్దేశించిన తరవాత వాటిని పాటించాల్సిందేనని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని అధికరణం 142 కింద శిక్ష తగ్గించేందుకూ అనుమతించబోమంది.

కృత్రిమ పాలతో కష్టాలు
రెండు దశాబ్దాలుగా పాల ఉత్పత్తిలో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. దేశంలో ఏటా 18.786 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. గడచిన అయిదేళ్లలోనే ఉత్పత్తి అయిదుకోట్ల టన్నులు పెరిగింది. ఒకవైపు ఇలాంటి గణాంకాలు కళ్లు చెదిరేలా కనిపిస్తుండగా- కల్తీ లెక్కలూ అంతేస్థాయిలో గుండెలు అదిరేలా ఉంటున్నాయి. దేశంలో 68 శాతానికిపైగా పాలు కల్తీమయమని ఓ సర్వే తేల్చింది. దేశంలో అమ్ముతున్న పాలు, పాల ఉత్పత్తుల్లో 68.7 శాతం నిర్దేశిత ప్రమాణాల మేరకు లేవంటూ స్వయంగా భారత జంతు సంక్షేమ బోర్డు సభ్యులు మోహన్‌సింగ్‌ అహ్లూవాలియా వాపోయారు. రాజధాని దిల్లీలో 2018 జనవరి నుంచి 2019 ఏప్రిల్‌ మధ్య సుమారు 477 నమూనాల్ని పరీక్షించగా, అవన్నీ ప్రమాణాల మేరకు లేవని మరో అధ్యయనం గుర్తించింది. దేశవ్యాప్తంగా 2018 మే నుంచి 6,432 పాల నమూనాల్ని పరీక్షించగా 39 శాతం నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినికుమార్‌ చౌబే ఇటీవలే పేర్కొన్నారు. 9.9 శాతం నమూనాల్లో మోతాదుకు మించి హానికారక పదార్థాలు ఉండటంతో అవి సురక్షితం కాదని తేలిందని చావు కబురు చల్లగా చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, చంబల్‌ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఏర్పాటైన కృత్రిమ పాల కర్మాగారాలు వెలుగు చూడటమూ నిర్ఘాంత పరిచేదే. పంజాబ్‌ పాలకల్తీకి చిరునామాలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యూరియా, డిటర్జెంట్లు, కాస్టిక్‌ సోడా, బ్లీచింగ్‌ పౌడర్‌, గ్లూకోజ్‌, వైట్‌పెయింట్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌, సోడియం కార్బొనేట్‌ ఫార్మలిన్‌, అమ్మోనియం సల్ఫేట్‌, చక్కెర, ఉప్పు, కొవ్వు, గంజి వంటివన్నీ కలిపి కృత్రిమ పాలను తయారుచేసి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. పాలలో ఇలాంటి రసాయనాల్ని ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేలుచేసే సూక్ష్మజీవుల వృద్ధిని అణచి వేస్తాయని చెబుతున్నారు. ఇది మధుమేహ బాధితులకూ ప్రమాదకరమని తేలింది. పాలలో డిటర్జెంట్లు కలవడంవల్ల ఆహారం విషపూరితం కావడంతోపాటు, జీర్ణకోశ సమస్యలూ తలెత్తుతాయి. ఆల్కలైన్‌ అధిక స్థాయిలో ఉంటే శరీర కణజాలం దెబ్బ తింటుంది. గుండె సమస్యలూ తలెత్తుతాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ ముప్పు, మరణానికీ దారితీసే ప్రమాదం ఉంది.

కేంద్రమంత్రికీ తప్పని ఇక్కట్లు
నిత్యం మన చుట్టూ ఇలాంటి కల్తీ బాగోతాలకు లెక్కేలేదు. పురుగు మందులు చల్లిన ఆకుకూరలు, కూరగాయలు, రసాయనాల్లో ముంచితీసిన పండ్లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. నూనెలు, పసుపు, కారం, టీ పొడి, చక్కెర, బియ్యం, గోధుమ పిండి.. ఒక్కటేమిటి తినే ప్రతి పదార్థం కల్తీలో మునిగితేలుతోంది. వంటిళ్లు కల్తీ గోదాములవుతున్నాయి. ఈ మధ్య ఏకంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ ఇంట్లోనే ఈ తరహా ఉదంతం బయటపడ్డాక- సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయించకమానదు. దిల్లీలోని ఖరీదైన ఖాన్‌మార్కెట్‌ నుంచి కొనుక్కెళ్లిన ఆపిల్‌ పండ్లు కడిగినకొద్దీ మిలమిలా మెరుస్తూ, మరింత తాజాగా నవనవలాడుతుంటే అనుమానం వచ్చి నిశితంగా పరీక్షించారు. పొరలు పొరలుగా మైనంపూత బయటపడింది. మంత్రివర్యులు అధికారులపై హూంకరించడం, వారంతా పొలోమని మార్కెట్‌పై పడి దాడులు, తనిఖీలు చేయడం, కేసులు పెట్టేయడం అన్నీ ఆగమేఘాలపై జరిగిపోయాయి. తరవాత అంతా మామూలే. రెండ్రోజుల్లో వేడి దిగిపోయింది. మైనం పూసిన ఆపిల్‌ పండ్లు దిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని గల్లీలదాకా విచ్చలవిడిగా అమ్ముడవుతూనే ఉన్నాయి.

పండగ సీజన్‌లో ఆహారంలో ముఖ్యంగా మిఠాయిల్లో కల్తీ రాజ్యమేలుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అధికారులు మిఠాయి దుకాణాలపై దాడులు జరుపుతూనే ఉన్నారు. కల్తీ వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో దీపావళి పర్వదినాల్ని పురస్కరించుకుని ఈ నెలాఖరుదాకా ఆహార కల్తీపై ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కల్తీకి లక్ష్యంగా మారే- నెయ్యి, వంటనూనె, పనీర్‌, రంగులు, మసాలాలు, డ్రైఫ్రూట్స్‌ వంటి వాటిపై నిఘాపెట్టారు. ఇలాంటి సమయంలో వంటనూనె కల్తీ తీవ్రత పెరిగే అవకాశమూ ఉంది. ఒకసారి మరిగించి ఉపయోగించిన నూనెను, ఆ తరవాత మరో రెండుసార్లకు మించి వాడకూడదు. అంతకుమించి వాడితే అది చెడు కొలెస్ట్రాల్‌గా పేర్కొనే ట్రాన్స్‌ఫ్యాట్‌గా మారుతుంది. ఇలాంటి వ్యర్థనూనెను కేవలం బయోడీజిల్‌ తయారీ వంటి అవసరాలకే వాడుకోవాలి. మరిగించిన నూనె నాణ్యతను గుర్తించే ప్రత్యేక మీటర్లు కొన్ని రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉన్నాయి. వంటనూనెను పరిమితికి మించి ఉపయోగిస్తే, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు దారితీసే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. దేశంలో ట్రాన్స్‌ఫ్యాట్‌ కారణంగా ఏటా 50 వేల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చెబుతోంది. ముఖ్యంగా మార్కెట్‌ నుంచి తెచ్చుకుని తినే ఆహార పదార్థాల్లోనే చెడుకొవ్వు ఎక్కువగా ఉంటోందని న్యూఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి హెచ్చరిక గంటలు పదేపదే మోగుతున్నా పట్టించుకునే వారేరీ! ప్రస్తుతం దేశంలో ట్రాన్స్‌ఫ్యాట్‌ వినియోగం అయిదు శాతంగా ఉంది. దీనిని 2023 నాటికి రెండు శాతానికి తగ్గించి, క్రమంగా పారదోలాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అదెప్పటికి సాధ్యమవుతుందనేది అనుమానమే! ఈ విషయంలో కెనడా, అర్జెంటీనా పూర్తిస్థాయిలో విజయం సాధించాయి. వంటనూనెను పలుమార్లు మరిగించి ఉపయోగించే వ్యాపారులకు లక్ష రూపాయలదాకా అపరాధ రుసుము విధించే అవకాశాన్ని ఆహార భద్రత ప్రమాణాల చట్టం కల్పిస్తున్నా- నమూనాలు సేకరించి ప్రయోగశాలల్లో నిర్ధరించి, శిక్షలు పడేలా చేసే యంత్రాంగం ఎక్కడుందనే ప్రశ్నకు జవాబు లేదు.

ప్రభుత్వాల చొరవతోనే అడ్డుకట్ట
తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయం ఉంటేనే కేటుగాళ్లు కొంతయినా వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిశగా అడుగేయక తప్పదు. ఆహార కల్తీకి పాల్పడే వారికి విధించే జరిమానాల్ని పది రెట్లు పెంచనున్నట్లు ఇటీవల తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొనడం ప్రస్తావనార్హం. జరిమానాలు వందల రూపాయల్లోనే ఉండటంవల్ల ఆహార కల్తీని నిరోధించడం అధికారులకు తలనొప్పిగా మారిందని వాపోయారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సైతం ఇదే తరహాలో స్పందించింది. కల్తీకి పాల్పడే వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం బెయిల్‌కు వీల్లేని నేరంగా, గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే దిశగా కదిలింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రతిపాదించిన సవరణల ప్రకారం- ఆహార కల్తీకి పాల్పడే వారికి జీవిత ఖైదు, పది లక్షల రూపాయల వరకూ జరిమానా పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇలాంటి కఠిన చర్యల్ని ప్రతిపాదించింది. పాలను కల్తీచేసే కేటుగాళ్లవల్ల రైతులకు చెడ్డ పేరు వస్తోందని కేంద్ర పాడి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఆవేదన చెందడం గమనార్హం. అసలు నేరగాళ్లు జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన ఘంటాపథంగా చెప్పారు. పాలకల్తీకి అడ్డుకట్ట వేసేందుకు జైలుశిక్షతోపాటు కఠిన చట్టాలు అవసరమని అంగీకరించారు. పాడి పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతమున్న నాణ్యత ప్రమాణాల్ని ప్రభుత్వం సమీక్షిస్తుందని, పశుదాణా పరిశ్రమ నియంత్రణపైనా దృష్టి పెడతామన్నారు. కల్తీ నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బీఐఎస్‌లు ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేయనంతకాలం మనం ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడలేమని, ఎగుమతులూ చేయలేమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బాధ్యుల ఆవేదనలు, ఆశయ ప్రకటనలూ ఎలా ఉన్నా- ఆచరణలో అడుగు ముందుకు పడనంతకాలం కల్తీ భూతం ప్రజారోగ్యాన్ని కబళిస్తూనే ఉంటుంది.

- దరెగోని శ్రీనివాస్‌
Posted on 11-10-2019