Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

భరోసా లేక బాధలు

* రైతులకు మేలుచేయని రుణమాఫీ

దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడోచోట అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరస కరవులు, వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి వారిని గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయని, రైతుల ఇబ్బందులను తీర్చలేవని ఆర్థిక నిపుణులు మొదటినుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ పథకాలతో భవిష్యత్తులో రుణాలు తిరిగి చెల్లించే పద్ధతి బలహీనమవుతుందని, ఆయా రాష్ట్రాల ఆర్థికస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇలాంటి నిర్ణయాలపై ప్రభుత్వాలు సమీక్షించుకోవాలని పలు నివేదికలు పేర్కొన్నాయి. భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ అంతర్గత కార్య బృందం (ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌-ఐడబ్ల్యూజీ) తాజా నివేదిక సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రుణమాఫీ పథకాలకు ప్రభుత్వాలు దూరంగా ఉండాలని ఆర్‌బీఐకి సిఫార్సు చేసింది.

వీపీసింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభమైన రుణమాఫీ పథకంతో రైతులకు ఉపశమనం కలిగింది. అదే తరహాలో యూపీఏ ప్రభుత్వం 2008లో రుణమాఫీని ప్రకటించింది. ఇందుకోసం దాదాపు 52 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. లోటు వర్షపాతం, తక్కువ దిగుబడి వంటిి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే మార్గాల వైపు దృష్టి సారించకుండా ఎన్నికల ముందు ప్రకటించే పథకాల వల్ల రైతులకు ఒరిగేదేమీలేదన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

రుణమాఫీ పథకానికి రైతుల సానుకూల స్పందనను గమనించిన రాష్ట్ర ప్రభుత్వాలు అదే దారిని అనుసరిస్తున్నాయి. 2014-15 నుంచి రాష్ట్రాలు రుణమాఫీని ప్రకటించడం మొదలుపెట్టాయి. కొన్ని సందర్భాల్లో వాటి అమలుకు తీవ్రంగా కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1990, 2008లలో కేంద్రప్రభుత్వం, ఆ తరవాత 2014 నుంచి 10 రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాలు ఎన్నికల ముందే రుణమాఫీని ప్రకటించడం గమనార్హం.

ఆర్‌బీఐ సమాచారం ప్రకారం 2018 డిసెంబరు నాటికి 10 రాష్ట్రాలు ఇచ్చిన రుణమాఫీ హామీల విలువ సుమారు రూ.2.36 లక్షల కోట్లు. అయితే ఇందులో రూ.1.49 లక్షల కోట్లు మాత్రమే ఆయా రాష్ట్రాలు తమ బడ్జెట్లలో కేటాయించాయి. ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండు రుణమాఫీ పథకాల కంటే ఎక్కువ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ రూ.17 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని 2014లో ప్రకటించాయి. వీటిలో 2018 నాటికి తెలంగాణ రూ.14,410 కోట్లు కేటాయించి, ఎన్నికల ముందు వరకు దాదాపు 85 శాతం పూర్తి చేసింది (ఈ బడ్జెట్‌లో తెలంగాణ సర్కారు రుణమాఫీ కోసం మళ్ళీ ఆరువేల వేల కోట్ల రూపాయలు కేటాయించింది). గత సంవత్సరం రుణమాఫీతో పాటు పెట్టుబడి సాయం పేరుతో ‘రైతుబంధు’ పథకాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.11,850 కోట్లు మాత్రమే కేటాయించింది. హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయింది (ఆంధ్రప్రదేశ్‌ 2018-19 బడ్జెట్‌లో రూ.880 కోట్లు కేటాయించింది).

రుణమాఫీ ఆయా రాష్ట్రాలపై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని రిజర్వ్‌బ్యాంక్‌ అంతర్గత కార్య బృందం (ఇంటర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌-ఐడబ్ల్యూజీ) ఎత్తిచూపింది. ఇందుకు కావాల్సిన మొత్తాన్ని రాష్ట్రాలు అప్పుగా తీసుకురావాలి. లేదా మూలధన వ్యయాన్ని తగ్గించుకోవాలి. ఇది వ్యవసాయంలో శాశ్వత ప్రాతిపదికన జరిగే అభివృద్ధి పనులమీదే కాకుండా, ఇతర రంగాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ప్రకటించే పథకాలు రైతులకు ఉపశమనం కలిగించవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వీటివల్ల సక్రమంగా తిరిగి చెల్లించే వారు సైతం చెల్లింపులు ఆపివేసి రుణమాఫీ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు 8.4 శాతం ఉన్నాయి. రుణమాఫీ వల్ల ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. రుణమాఫీ పథకాన్ని ప్రకటించని రాష్ట్రాల రైతుల నుంచి సైతం డిమాండ్లు వస్తున్న సంగతి తెలిసిందే.

నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన మోడల్‌ ల్యాండ్‌ లీజింగ్‌, ఆంధ్రప్రదేశ్‌ లైసెన్స్‌ పొందిన సాగుదారుల చట్టాలను పరిశీలించాలని ఐడబ్ల్యూజీ రాష్ట్రాలకు సూచించింది. జాతీయస్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలను అద్దెరూపంలో ఇచ్చే మొబైల్‌ యాప్‌ల వంటి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. అతి తక్కువ వడ్డీకే రుణాలు పొందేందుకు వీలుగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేయడం అవసరం. ప్రస్తుతం దేశంలో సాగుభూమి కలిగిన సుమారు 14.5 కోట్ల రైతు కుటుంబాల్లో కేవలం 6.62 కోట్ల కుటుంబాలకే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్నాయి. అర్హులందరికీ వీటిని అందేలా చూడటం కీలకం. దేశవ్యాప్తంగా రైతులు, పంటలకు సంబంధించిన కేంద్రీకృత సమాచారాన్ని రూపొందించాలి. కౌలు సంస్కరణలు అమలు చేయాలి. దేశవ్యాప్తంగా దాదాపు 10 శాతం వ్యవసాయ భూమిని కౌలుదారులు సాగు చేస్తున్నట్లు అంచనా. భూమి డిజిటలైజేషన్‌ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. చైనా తరహాలో దీర్ఘకాలం భూమిని కౌలుకు తీసుకునే పద్ధతి, సాంకేతిక పరిజ్ఞానం, నూతన వ్యవసాయ పనిముట్ల వినియోగం, అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల వాడకం, పంటలకు కనీస మద్దతు ధర...వంటి అంశాలను ప్రభుత్వాలు పరిశీలించాలి. పంటలబీమా, ఆదాయ మద్దతు పథకాల అమలులో లోటుపాట్లను పరిహరించడం ముఖ్యం. రాయితీ విధానాల ప్రభావాన్ని అంచనా వేసి, తదనుగుణంగా భవిష్యత్‌ ప్రణాళికలను రచించాలి. అప్పుడే అన్నదాతకు ఒకింత ఉపశమనం కలుగుతుంది!


- అనిల్‌ కుమార్‌ లోడి
Posted on 11-10-2019