Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

చదువులకు చెద వదిలితేనే...

భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యారంగాన్ని పరిపుష్టీకరించాల్సి ఉందని విశ్వవిద్యాలయ సంఘాధ్యక్షులుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సూచించి ఏడు దశాబ్దాలైంది. నెల రోజుల క్రితం టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వెలువరించిన ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో తొలి మూడొందల మేలిమి యూనివర్సిటీల్లో భారతావని నుంచి ఏ ఒక్కటీ లేకపోవడం- సర్వేపల్లి వారి మాటకు ఏపాటి విలువ దక్కిందో వెల్లడిస్తోంది! పనికొచ్చే చదువులకోసం వ్యయప్రయాసల్ని లెక్కచేయకుండా రెక్కలు కట్టుకొని విదేశాలకు తరలిపోతున్న విద్యార్థుల సంఖ్యాపరంగా ఇండియా రెండోస్థానంలో ఉంది. విదేశీ చదువుల కోసం భారతీయ విద్యార్థులు 2017-18లో వెచ్చించింది 280 కోట్ల డాలర్లు (దాదాపు రూ.20 వేలకోట్లు) అని సర్కారీ గణాంకాలే చాటుతున్నాయి. అదే ఇండియాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల వ్యయీకరణ 2015-16లో 55 కోట్ల 70 లక్షల డాలర్లు ఉండగా, 2017-18 నాటికది 47 కోట్ల 90 లక్షల డాలర్లకు పడిపోయింది. విదేశీ చదువరుల గమ్యస్థలిగా 26వ స్థానంలో ఉన్న ఇండియాలో ఉన్నతవిద్య స్థాయీప్రమాణాల్ని ఇనుమడింప చేసి- 2023 నుంచి ఏటా రెండు లక్షల మందిని ఆకట్టుకొనే ప్రణాళికకు నీతిఆయోగ్‌ సానపడుతోంది. ప్రత్యేక ఆర్థిక మండలి తరహాలో బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, పుణె, చండీగఢ్‌, సిక్కిమ్‌లలో ప్రత్యేక విద్యామండళ్ల ఏర్పాటు ద్వారా లక్ష్యసాధనకు కసరత్తులు చేస్తోంది. దేశంలో ఇప్పుడున్న 46 వేలమంది విదేశీ విద్యార్థుల్లో 60 శాతానికి పైగా దక్షిణాసియా దేశాలవారేనని, స్వల్పకాలిక కోర్సుల కోసం వస్తున్న విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా ఇంజినీరింగ్‌, మేనేజిమెంట్‌ చదువులకు యోగా, సంగీతం, ఇతర కళలను మేళవించి మంచి ఫలితాలు సాధించగల వీలుందని నీతిఆయోగ్‌ అభిప్రాయపడుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో పుణెలో నిర్వహించే విస్తృత మేధామథనంలో- ఉన్నత విద్యకు ఇండియాను గమ్యస్థానంగా మార్చే ప్రణాళికకు తుదిరూపు ఇస్తామంటున్నారు. ఏడు దశాబ్దాల అనుభవసారం- పూచింది ఒకెత్తు, కాచింది ఒకెత్తు

విశ్వవిద్యాలయాలంటే, ఆలోచనల్ని సృజించి వాటికి ఊతమిచ్చి, ఆపై అవి ఎదిగి రెక్క తొడుక్కోవడానికి దోహదపడేవని ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌ కమిటీ నిర్వచించింది. నేడు నోబెల్‌ పురస్కార గ్రహీతల్ని తయారుచేసే కార్ఖానాలుగా వాసికెక్కిన ఎన్నో విదేశీ విశ్వవిద్యాలయాలు కన్ను తెరవక ముందే తక్షశిల, నలంద, సారనాథ్‌, అమరావతి, బెనారస్‌, ఉజ్జయినీ గురుపీఠాల ఖ్యాతి ఖండాంతరాల నుంచి పరిశోధకుల్ని, విద్యార్థుల్ని సూదంటురాయిలా ఆకర్షించేది. ఆ వైభవోజ్జ్వల గతాన్ని సంస్మరించి మురుసు కోవడమేగాని, ఉన్నత విద్యారంగ సమగ్ర వికాసానికి వడివడిగా అడుగులు పడుతున్నదెక్కడ? పిరమిడ్‌ తరహాలో దేశీయ విద్యారంగం సువ్యవస్థితమై, దిగువన అందరికీ విద్యాగంధం అందిస్తూ, పై అంచెలకు చేరేకొద్దీ జాతి ప్రగతి చోదక శక్తుల నిర్మాణమే ధ్యేయంగా విశ్వవిద్యాలయాలు సముజ్జ్వల దీపశిఖలు కావాలంటూ జాతీయ విజ్ఞాన సంఘం విపుల సూచనలందించి పద్నాలుగేళ్లు అవుతోంది! ఆ దిశగా కార్యాచరణ అప్పుడే పట్టాలకెక్కి ఉంటే- మేధావలసల నిరోధం, విదేశీ చదువరుల కార్యక్షేత్రం అనే జంటలక్ష్యాల ఉట్టిని ఇండియా ఈపాటికే కొట్టగలిగి ఉండేది! కేంద్రంలో నాలుగు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించిన ‘భారత్‌లో చదువు’ (స్టడీ ఇన్‌ ఇండియా) పథకాన్ని ప్రాథమికంగా 30 భాగస్వామ్య దేశాలకు విస్తరించి, రుసుముల్లో భారీ రాయితీలతో విద్యార్థుల్ని ఆకట్టుకోవాలని మోదీ సర్కారు మొన్న ఏప్రిల్‌లో సంకల్పించింది. చదువుల్లో నాణ్యత నేతిబీర చందమైతే ప్రయోజనం నాస్తి. ప్రపంచ స్థాయి సంస్థల రూపకల్పన కోసమంటూ ఇటీవల కేంద్ర బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయింపు ద్వారా వాస్తవికంగా ఒనగూడే ప్రయోజనం ఏపాటి?

ఇండియాలో 757 విశ్వవిద్యాలయాలు, 38 వేల పైచిలుకు కాలేజీలు, 11,922 విద్యాసంస్థలు ఉన్నా కేవలం వంద యూనివర్సిటీలు ఏవో కొన్ని విద్యాసంస్థలే విదేశీ విద్యార్థుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇండియాలో చదువుతున్నవారిలో నేపాలీలు (24.9 శాతం), అఫ్గాన్‌ జాతీయులు (9.5 శాతం), సుడాన్‌ (4.8), భూటాన్‌వాసులు (4.3), నైజీరియన్లు (నాలుగు శాతం) ఉండటాన్నిబట్టే దేశీయ విద్యా ప్రమాణాల స్థాయి బోధపడుతుంది! చదువుల నాణ్యత మెరుగుదల, సమ్మిళిత కార్యక్రమం (ఎక్విప్‌) పేరిట కేంద్రంలోని ఉన్నత విద్యావిభాగం- అయిదేళ్ల దార్శనిక ప్రణాళికను రూపొందించింది. పది లక్ష్యాలను నిర్దేశించి, పది కీలకాంశాలపై వేర్వేరు నిపుణుల కమిటీలతో నివేదికలు రాబట్టి వండివార్చిన ఆ ప్రణాళిక అమలుకు అయిదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయీకరించాలంటున్నారు. మొత్తం విద్యారంగంపై ఏటా చైనా 56,500 కోట్ల డాలర్లు, ఉన్నత విద్య మీద 14,500 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంటే, ఇండియా పెడుతున్న ఖర్చు మొత్తంమీద 1,250 కోట్ల డాలర్లు; ఉన్నత చదువుల మీద 450 కోట్ల డాలర్లు మాత్రమే! పేరెన్నికగన్న విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో అనుబంధ ప్రాంగణాలు నెలకొల్పేందుకు యూపీఏ రెండో జమానాలో తెచ్చిన బిల్లు కొరగాకుండా పోయింది. ఆ బిల్లు విషయంలో పంథా మార్చుకొన్న ఎన్‌డీఏ సర్కారు- ప్రపంచ ర్యాంకుల్లో తొలి రెండొందల స్థానాల్లో ఉన్న విద్యాసంస్థలు తమ శాఖల్ని ఇండియాలో నెలకొల్పడానికి వీలుగా కొత్త చట్టం తీసుకురానున్నట్లు జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ప్రకటించింది. ప్రతి పౌరుణ్నీ సమర్థ మానవ వనరుగా తీర్చిదిద్దే పరుసవేది- అన్ని స్థాయుల్లోనూ నాణ్యమైన చదువే. ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లున్న విద్యారంగ సమూల క్షాళన జరగనిదే ఎంతటి ప్రగతి లక్ష్యాలైనా ఎండమావులే!


Posted on 14-10-2019