Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సారథి గంగూలీ

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి సారథిగా ఈనెల 23నుంచి సౌరవ్‌ గంగూలీ శకారంభానికి రంగం సిద్ధమైంది. అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి తదితర పదవులకూ బరిలో పోటీదారులెవరూ లేకుండాపోవడం గంగూలీ బృందం ‘ఏకగ్రీవ’ విజయానికి బాటలుపరచింది. జాతీయ క్రికెట్‌ జట్టునుంచి వైదొలగిన పదకొండేళ్ల తరవాత బీసీసీఐ అధ్యక్ష హోదాలో ‘దాదా’ ఆడనున్న కీలక రెండో ఇన్నింగ్స్‌పై సర్వత్రా అమితాసక్తి వ్యక్తమవుతోంది. ఏనాడో అరవై అయిదు సంవత్సరాల క్రితం ఆ పదవిని విజ్జీ (విజయనగర మహారాజు) చేపట్టిన దరిమిలా భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఒకరు బీసీసీఐ పగ్గాలు అందుకొంటున్నది మళ్ళీ ఇప్పుడే! పందొమ్మిదేళ్లనాడు గంగూలీకి జట్టు సారథ్య బాధ్యతలు దఖలుపడిందీ సంక్షుభిత సమయంలోనే! అప్పట్లో హాన్సీ క్రానే ఉదంతం నేపథ్యంలో రచ్చకెక్కిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం, క్రికెట్‌ భవితవ్యంపైనే తీవ్ర శంకలు లేవనెత్తి అసంఖ్యాక అభిమానుల్ని ఎంతగానో కలచివేసింది. భారత క్రికెట్‌ పాలన పగ్గాలు స్వీకరిస్తున్న ప్రస్తుత దశా ఆందోళనకరమేనని, బీసీసీఐ ప్రతిష్ఠ దెబ్బతినిపోయి ఉందన్న గంగూలీ- సరైన దిద్దుబాటు చర్యలతో బోర్డుకు తిరిగి పునర్‌వైభవం సంతరింపజేస్తామంటున్నాడు. నూతన నిబంధనల మేరకు, గంగూలీ పదవీకాలం పదినెలల్లోనే ముగిసిపోనుంది. ఏ పాలనాధికారీ వరసగా ఆరేళ్లకుమించి కొనసాగరాదన్న ‘తప్పనిసరి విరామం’ నిబంధన, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తదితరాలపై అసంతృప్తిని దాచుకోని గంగూలీ- బోర్డు నియమావళిలో సంస్కరణలకు గట్టిగా ఓటేసే సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి.

నాలుగు రోజుల క్రితం వరకు బీసీసీఐ అధ్యక్ష రేసులో ఎక్కడా పేరే వినిపించని గంగూలీ, ఉన్నట్టుండి దేశంలోని అన్ని క్రికెట్‌ సంఘాలకూ ఆమోదయోగ్యుడైన అభ్యర్థిగా అవతరించడంలో- తెరవెనక ఎన్నో అంశాలు పనిచేశాయి. సుమారు పదిహేనేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం, జగ్‌మోహన్‌ దాల్మియా సన్నిహితుడిగా బెంగాల్‌ క్రికెట్‌ సంఘం పాలన వ్యవహారాల్లో రాటుదేలడం- గంగూలీ సహజ బలాలు. ఈసారి కాబోయే సారథి బ్రిజేశ్‌ పటేల్‌ అన్న అంచనాలు వెలుగు చూసిన కొన్ని గంటల వ్యవధిలోనే సమీకరణలు మారిపోయాయి. తొలుత భిన్నగళం వినిపించిన శ్రీనివాసన్‌తోపాటు క్రికెట్‌ రాజకీయాల్లో తలపండిపోయిన నిరంజన్‌ షా, రాజీవ్‌ శుక్లా ప్రభృతులూ ఒక్క మాటకు కట్టుబడేసరికి- పోటీ అన్నదే లేకుండాపోయింది. గంగూలీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా, కేంద్ర సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తమ్ముడు అరుణ్‌ సింగ్‌ ధుమాల్‌ ఎంపిక నల్లేరుపై బండి నడకైంది! ఏకగ్రీవంగా ఎన్నికైతేనేం అధ్యక్ష పదవీ బాధ్యతలను సమర్థంగా నిభాయించడం గడ్డు సవాలేనంటున్న గంగూలీ- ప్రథమ శ్రేణి (ఫస్ట్‌ క్లాస్‌) క్రికెటర్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామనడం ఇప్పటికే పలువురి మన్ననలందుకుంటోంది. నాలుగేళ్లుగా మండలి ఎదుర్కొంటున్న మర్యాదా సంక్షోభాన్ని రూపుమాపి ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్‌ సమితి)లో మళ్ళీ బీసీసీఐ మాట చెల్లుబాటయ్యేలా చేస్తామని గంగూలీ చెబుతున్నాడు. సుప్రీంకోర్టు నిర్దేశించిన అసలు అజెండా వేరే. జస్టిస్‌ లోథా కమిటీ సిఫార్సుల అమలులో విఫలమైన కారణంగా 2017 జనవరిలో సర్వోన్నత న్యాయస్థానం బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకుర్‌పై వేటువేసింది. అటువంటి దిగ్భ్రాంతకర ఘట్టం పునరావృతం కాకుండా గంగూలీ ఏ మేరకు ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.

యావత్‌ ప్రపంచంలో అత్యంత శక్తిసంపన్న క్రీడాసంస్థగా పేరొందిన బీసీసీఐని చాకచక్యంగా నడిపించడం ఎంత కష్టతరమో గంగూలీకి ఇప్పుడెవరూ కొత్తగా చెప్పనక్కర్లేదు. దాదాపు పద్నాలుగేళ్లనాడు దాల్మియా కోటల్ని కుమ్మి కూలగొట్టి బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని శరద్‌ పవార్‌ కైవసం చేసుకున్నాక- గంగూలీకి అనుకూలురైన ముగ్గురు సెలెక్టర్లపై వేటుపడటం, అత్యున్నత స్థాయిలో కుర్చీలాటలకు అద్దం పట్టింది. వ్యక్తుల యోగ్యత, వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠల సంగతి గాలికొదిలేసి అలా ఇష్టారాజ్యంగా చలాయించుకోవడంలో కాకలు తీరిన బీసీసీఐ తీరుతెన్నులపై న్యాయపాలిక మూడేళ్ల క్రితం ఘాటుగా స్పందించింది. దేశంలో క్రికెట్‌ అభివృద్ధికి అది నికరంగా చేసిందేమీ లేదని ఈసడించింది. ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) అవకతవక బాగోతాలు పెను కలకలం రేకెత్తించాక- క్రీడాకారులు, బుకీలు, జట్టు యజమానులు, బెట్టింగ్‌ సిండికేట్ల ‘క్రియాశీల పాత్ర’ను ముద్గల్‌ కమిటీ తూర్పారపట్టింది. ఆ దుస్థితిపై కలత చెందిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, లోథా కమిటీ విప్లవాత్మక ప్రతిపాదనల్ని క్రోడీకరించింది. వాటిని పూర్తిగా అంగీకరిస్తామంటూనే బీసీసీఐ ఎన్నో పిల్లిమొగ్గలు వేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ‘మర్యాదస్తుల క్రీడ’ ప్రతిష్ఠా పునరుద్ధరణ జరిగి తీరాల్సిందేనన్న ‘సుప్రీం’ అభిమతానికి, సీనియర్లు తెరమరుగై కొత్తగా ప్రత్యక్షమైన వారి వారసుల ‘సంస్కరణాభిలాష’కు పొంతన కుదరడం లేదు. రాష్ట్రస్థాయి సమాఖ్యలు, వివిధ క్రికెట్‌ పాలన నిర్వాహక సంఘాల కూర్పు పరికిస్తే- క్రికెట్‌ స్ఫూర్తిని నిలబెట్టడంకన్నా కొందరు వ్యక్తుల ప్రయోజనాలకే గొడుగుపట్టిన వైనం సుస్పష్టమవుతోంది. కోట్లాది అభిమానులు ప్రాణప్రదంగా ఆరాధించే క్రికెట్‌ను సాంతం ప్రక్షాళించడంలో ఎక్కడా అపశ్రుతులు దొర్లకుండా కాచుకోవడం బీసీసీఐ మౌలిక బాధ్యత. ఆ సంస్థ సారథిగా గంగూలీ పనితీరు సర్వోన్నత న్యాయస్థానాన్ని మెప్పించే స్థాయిలో ఉంటుందా అన్నదే క్లిష్టమైన ప్రశ్న!


Posted on 16-10-2019