Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పథకం మందగమనం

* ఇంటింటా సౌర విద్యుత్‌

ఇళ్ళ పైకప్పు మీద సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్థిరమైన విధానపర నిర్ణయం తీసుకుంటే రానున్న కొన్నేళ్లలో భారత్‌లో లక్షలాది ఉద్యోగాలను సృష్టించవచ్చనడంలో సందేహం లేదు. ఈ విధానం మొదలైన తొలి ఆరు నెలల్లోనే పైకప్పు సౌర విద్యుత్‌ రంగంలో అంచనా వేస్తున్న ఉద్యోగాల్లో 20 శాతం నియామకాలు జరిగే అవకాశం ఉంది. పైకప్పు సౌర విద్యుత్‌ (సోలార్‌ రూఫ్‌ టాప్‌-ఎస్‌ఆర్‌టీ) రంగం భారత్‌లో విస్తరించేందుకు ఎంతో అనుకూల వాతావరణం ఉంది. ఆచరణాత్మక విధానాలే అవసరం. భారీగా పైకప్పు సౌర విద్యుత్‌ యూనిట్లను నెలకొల్పేలా ప్రజలను ప్రోత్సహించడంలో జర్మనీ ప్రభుత్వం విజయం సాధించింది. సౌర ఫలకాల నిర్వహణ, సరఫరా పర్యవేక్షణలను ఉచితంగా అందించడంతో మధ్యతరగతి వర్గం నుంచి విశేషాదరణ లభించింది. లక్షలాది ప్రజలు పైకప్పు సౌర విద్యుత్తుపట్ల ఆకర్షితులయ్యారు. దరిమిలా ఎనిమిదేళ్లలో ఆటోమొబైల్‌ రంగంలోకన్నా అధికంగా సౌర విద్యుత్‌ రంగంలో ఉద్యోగాల కల్పన జరిగింది. జర్మనీతో పోలిస్తే భారత్‌లో సూర్యరశ్మి చాలా తీక్షణంగా, ఎక్కువ కాలం ఉంటుంది. ఇక్కడున్న ఇళ్ళ సంఖ్యా ఎక్కువే. పైకప్పు అనువుగా లేని ఇళ్లకైనా, ఒక స్తంభం ఏర్పాటు చేసుకుని సౌర ఫలకాలను అమర్చుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఆర్‌టీ ద్వారా 2022నాటికి 40 గిగావాట్ల విద్యుదుత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొంది. కానీ, 2018 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 2,158 మెగావాట్ల సామర్థ్యంగల పైకప్పు సౌర యూనిట్లు మాత్రమే ఏర్పాటు కావడం నిర్దేశిత లక్ష్యం దిశగా మందగమనాన్ని సూచిస్తోంది. వినియోగదారుల్లో సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వం వినూత్నమైన, ఆచరణాత్మక విధానాలను అనుసరించకపోవడం, డిస్కమ్‌ల నుంచి మద్దతు లేకపోవడం, అధికార యంత్రాంగపరంగా లోపాలు ఎస్‌ఆర్‌టీ విస్తృతికి దేశంలో ఆటంకాలవుతున్నాయి. ఎస్‌ఆర్‌టీలో 70 శాతం వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసమే ఏర్పాటయ్యాయి. గృహావసరాల కోసం ఏర్పాటైనవి తక్కువ. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, దిల్లీ రాష్ట్రాల్లో ఎస్‌ఆర్‌టీ వ్యవస్థ చెప్పుకోదగిన స్థాయిలో విస్తరించింది. దిల్లీ మినహా మిగతా రాష్ట్రాలు పారిశ్రామిక రంగం పురోగమనంలో ఉండటమే ఇందుకు కారణం. ఎస్‌ఆర్‌టీకి పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యం ఇవ్వడానికి ఆర్థికపరమైన అంశాలూ దోహదం చేస్తున్నాయి. సంప్రదాయ విద్యుత్‌కంటే సౌర విద్యుత్‌ ఎంతో చవక. సౌరవిద్యుత్‌ వినియోగదారులు అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండదు. వీరికి పునరుత్పాదక ఇంధన సేవా సంస్థ (రెస్కో) మద్దతూ ఉంటుంది. వినియోగదారు ప్రాంగణంలో ఈ యూనిట్‌ను స్థాపించి, విద్యుత్‌ను విక్రయించడంలో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటారు. దీనివల్ల పదేపదే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం పెద్దగా ఉండదు. పెద్ద నగరాల్లో కాలుష్యకారక డీజిల్‌ జనరేటర్ల స్థానంలో ఎస్‌ఆర్‌టీలను వినియోగించుకోవచ్చు. డిస్కమ్‌ల ద్వారా సరఫరా అవుతున్న విద్యుత్‌ రుసుములు క్రమేపీ పెరుగుతుండటం, సౌర విద్యుత్‌ ఛార్జీలు తగ్గుతుండటం- పైకప్పు సౌరవిద్యుత్‌ ఆకర్షణీయతకు ప్రధాన కారణం.

పైకప్పు సౌర విద్యుత్తుకు ఆదరణ ఇనుమడించాలంటే, గృహావసరాల పరంగా వినియోగ విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. దరఖాస్తుల ఆమోదం, రాయితీల పంపిణీ, బ్యాంకు రుణాల మంజూరు వంటివి సులభతరం కావాలి. ఎస్‌ఆర్‌టీ యూనిట్ల పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం రాయితీ విధానంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో 70 శాతం, మిగతా రాష్ట్రాల్లో 30 శాతం చొప్పున రాయితీలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాకారానికి మొత్తం రూ.2.80 లక్షల కోట్ల విలువైన యూనిట్ల స్థాపన జరగాలి. కానీ, చాలామంది వద్ద పెట్టుబడులకు అవసరమైన నిధులు ఉండటం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో వ్యయానికి విముఖత వ్యక్తమవుతోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలవల్ల ఎస్‌ఆర్‌టీ వ్యవస్థ అనుకున్నంతగా విస్తరించడంలేదు. రుణ లభ్యతను అందుబాటులోకి తెచ్చేందుకు కొన్నేళ్లుగా కేంద్రం చర్యలు తీసుకుంది. పైకప్పు సౌర విద్యుత్‌ రంగాన్ని రుణాలిచ్చేందుకు ప్రాధాన్యతారంగంగా రిజర్వు బ్యాంకూ గుర్తించింది. ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు ఎస్‌ఆర్‌టీ వ్యవస్థను తమ గృహ రుణాల విభాగం కిందికి చేర్చాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలూ ఎస్‌ఆర్‌టీ వ్యవస్థకు రాయితీ రుణాలిస్తున్నాయి. అయినా, ఈ రుణాలు 2017 నాటికి రూ.10 వేల కోట్లుగా ఉన్నాయి. లక్ష్య సాధనకు అవసరమైన మొత్తంలో ఇది నాలుగు శాతంకన్నా తక్కువే.

గృహాలు, పంపిణీ సంస్థలు, డిస్కమ్‌లకు బహుళ ప్రయోజనాలను అందించే ఎస్‌ఆర్‌టీ వ్యవస్థను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది పర్యావరణ హితకరం. డీజిల్‌ జనరేటర్ల కంటే ఖర్చు తక్కువ. నిరంతర సరఫరా సాధ్యపడుతుంది. గ్రిడ్‌ నిర్వహణా మెరుగ్గా ఉంటుంది. గ్రిడ్‌ ఆధారిత సౌర విద్యుదుత్పత్తి లక్ష్యం 100 గిగావాట్లు కాగా, అందులో పైకప్పు సౌర విద్యుత్తు వాటా 40 గిగావాట్లు. గ్రిడ్‌ ఆధారిత సౌర యూనిట్లతో పోలిస్తే పైకప్పు సౌర ఫలకాల ఏర్పాటుకు భూమి అవసరం ఉండదు. అదనపు సరఫరా సామర్థ్యం అవసరం లేదు. దీంతో సరఫరా, పంపిణీ నష్టాలు ఉండవు. అంటే, కనీసం 30 శాతం విద్యుత్‌ ఆదా అయినట్లే. సౌర విద్యుత్‌ నిబంధనలు, అనుమతులను సులభతరం చేయడం, ఆన్‌లైన్‌ ప్రక్రియను ప్రవేశపెట్టడంవంటి చర్యలు పైకప్పు సౌరవిద్యుత్‌ పురోగమనానికి సహకరిస్తాయి. సౌర ఫలకాల ధరలు దిగివస్తుండటంతో ప్రజల్లో ఆసక్తి అధికమవుతోంది. దీన్ని అవకాశంగా భావించిన కేంద్రం అనుమతుల మంజూరుకు సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది. ద్వైపాక్షిక, బహుళపాక్షిక ఏజెన్సీల ద్వారా ప్రత్యేక శిక్షణనూ ఇప్పిస్తోంది. ఈ తరహా చర్యల ద్వారా పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహిక వినియోగదారులను ఉత్సాహపరచవచ్చు. అప్పుడే 2022 నాటికి భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్య సాధనకూ మార్గం సుగమమవుతుంది.


- సౌమ్య
Posted on 16-10-2019