Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

భద్రత ఎండమావేనా?

'బాలల సంక్షేమం, హక్కుల గురించి మాట్లాడని దేశాలు లేవు. వాటిని పట్టించుకొని చర్యలు చేపట్టే దేశాలూ ఎక్కడా కనిపించవు' అని మూడు దశాబ్దాల క్రితమే షీలాబార్సే ఆవేదన వ్యక్తపరిచారు. మానవహక్కుల ఉద్యమకారిణిగా ప్రసిద్ధురాలైన ఆమె, భారత్‌ సహా వివిధ ప్రపంచదేశాల్లో పిల్లల హృదయవిదారక స్థితిగతులపై అప్పట్లోనే తీవ్రంగా స్పందించారు. 'ప్రభుత్వాలే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంటే, బాలబాలికలకు ఇక దిక్కెవరు? పదహారేళ్లయినా నిండని 1400మంది బిడ్డల్ని అక్రమంగా నిర్బంధించారు. అదేమని ప్రశ్నిస్తే, కారణాలు చెప్పకుండా తప్పించుకొంటున్నారు' అని నిరసిస్తూ కేంద్రప్రభుత్వంతో పాటు, ఆనాటి ఇరవైనాలుగు రాష్ట్రప్రభుత్వాలపైనా సర్వోన్నత న్యాయస్థానంలో ఆమె పిటిషన్‌ వేశారు. ఆ దరఖాస్తు, దానిపై సుప్రీంకోర్టు ప్రతిస్పందనల తీరు, అది దేశవిదేశాల్లో కలిగించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇంత జరిగినా, ప్రభుత్వాల వ్యవహార సరళిలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ లేదు. బాలల హక్కులు కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని సంరక్షణ సంఘాలు, క్రియాశీలక స్వచ్ఛంద సేవాసంస్థలు, సమకాలీన పరిస్థితుల అధ్యయన బృందాలు ఏళ్లతరబడి మొత్తుకుంటున్నా ఫలితం అంతంతమాత్రమే. భారత్‌లో బాలల ఉత్సవం ముగిసిన వారం రోజుల లోపే, నేడు విశ్వవ్యాప్త (యూనివర్సల్‌) బాలల దినోత్సవం వచ్చేసింది. పేరుకే ఉత్సవాలు తప్ప- ఆ ఉత్సాహం బాలల్లో, ఉత్తేజం ప్రభుత్వాల్లో కనిపించడం లేదంటే, లోపం ఎక్కడున్నట్లు?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

బాలల విద్యావికాసం, సామాజిక రక్షణలకే ఏ ప్రభుత్వమైనా పెద్దపీట వేయాలి. ఆ మేరకు ప్రణాళిక, ఆచరణ ఉండాలని పదిహేనేళ్ల క్రితం ప్రపంచ సదస్సులో 164 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆ నిర్ణయాల అమలు తీరును గత మే నెలలో దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ వేదికగా ఏర్పాటైన మహాసభ సమీక్షించింది. అంతకుముందే ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వెల్లడించిన నివేదిక ప్రకారం- ప్రాథమిక పాఠశాలల్లోని పాతికకోట్లమంది పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు. నిరుడు 'భారత జాతీయ విశ్వవిద్యాలయం ప్రణాళిక- పరిపాలన విభాగం' నిర్వహించిన అధ్యయనంలో, దేశంలోని ఏడులక్షల అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు లేవని తేలింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి దాదాపు ఆరేళ్లు కావస్తున్నా, వాటి ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రాథమిక విద్యకు గడచిన దశాబ్దకాలంలో రూ.5,86,085కోట్లు ఖర్చుచేశామని చెబుతున్నా, దేశానికి ఒనగూరిందేమిటో పాలకులకే ఎరుక! ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి- తెలంగాణలోని 13వేల ప్రైవేట్‌ బడుల్లో 31లక్షలమంది, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 12వేల పాఠశాలల్లో 26లక్షలమంది పిల్లలున్నారు. ఆయా బడులపై ప్రభుత్వాల పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన మొత్తం రూ.16వేల కోట్లు. విద్యా సంవత్సరంలో ఇప్పటికే సగం పూర్తికావస్తున్నా, అనేకమంది బడిపిల్లలకు కనీసం ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీ అయినా పూర్తికాలేదు. అదే రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో చదివేవారి సంఖ్య 2014-'15లో దాదాపు లక్షాపాతికవేలకు తగ్గింది. 'విశ్వనగరం'గా పేర్కొంటున్న హైదరాబాద్‌లో లక్షమందికిపైగా చిన్నారులు చదువులకు దూరంగా ఉన్నారు. నానారకాల చాకిరితో బాలకార్మికులుగా మిగిలినవారు ఆ నగరంలోనే 15వేలమంది ఉన్నట్లు అంచనా. రెండు రాష్ట్రాల్లోనూ- అనాథలైన, తప్పిపోయిన, సంఘవ్యతిరేక శక్తుల చేతికి చిక్కిన, బాల నేరగాళ్లుగా మారినవారు ఎందరెందరో! శారీరక, లైంగిక, మానసిక హింసకు గురై గుండెలవిసేలా రోదిస్తున్న చిన్నారులు అనేకమంది. ఇళ్లు, పాఠశాలలు, వసతిగృహాలు, పని ప్రదేశాలు... ఆఖరికి సంరక్షణ కేంద్రాల్లోనూ పలువురు హింస, దౌర్జన్యాలకు గురవుతున్నారు

పిల్లల్ని శారీరక హింసకు గురిచేస్తే మూడేళ్ల కారాగారవాస శిక్ష విధించాలంటూ, నిరుడు చట్టసవరణ చేశారు. కేవలం చట్టాల రూపకల్పన, సవరణ, సంస్కరణల దశతోనే ప్రభుత్వాల బాధ్యత తీరినట్లు కాదు. వాటి సక్రమ, సత్వర అమలుతోనే బాలలకు రక్షణ చేకూరుతుందని హక్కుల సంఘాలు గళమెత్తి నినదిస్తున్నాయి. అక్రమంగా పిల్లల్ని దత్తత తీసుకోవడం, వారిని యాచకులుగా మార్చడం, నేరాలు చేయించడం, తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగించడం, ఎవరైనా నేరగాళ్లు దొరక్కపోతే ఆ కేసుల్ని పిల్లలపై బనాయించడం, చట్టవిరుద్ధంగా నిర్బంధించడం... హక్కుల అణచివేతలేనని అవి చాటి చెబుతున్నాయి. లైంగిక హింసకు గురై తల్లడిల్లే బాలికలను పోలీసులు ఆ కూపాల నుంచి విముక్తం చేసినా, అనంతర సంరక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బాల కార్మికుల మాదిరే ఆ ఆడపిల్లలకు చదువు, ఉపాధి, పునరావాసం, సామాజిక రక్షణ వంటి కీలక అంశాలను తెలుగు రాష్ట్రాలతో పాటు; బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్‌లు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పరస్పరం సమాచార మార్పిడి, ఉమ్మడిగా కార్యాచరణ పట్ల అనేక సందర్భాల్లో ఉదాసీనత చూపుతున్నాయి. భద్రత పొందడం బాలల ప్రథమ హక్కు, అది కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అయినా- ఇంటా బయటా కూడా పిల్లలకు భద్రత కరవైందని హైదరాబాద్‌లోని మొన్నటి ఉదంతం స్పష్టీకరిస్తోంది. ఒక బడిలో పర్యవేక్షణ లోపం, సంబంధిత ప్రభుత్వశాఖ అలసత్వం- నాలుగేళ్ల పసిబిడ్డ ఉసురుతీశాయి. బడి గోడ- లిఫ్టు మధ్య ఖాళీ ప్రదేశంలో తల ఇరుక్కుపోయి, దాదాపు అరగంటపాటు నరకయాతనపాలై ఆ చిన్నారి ప్రాణాలు వదిలిన ఘటన బండరాయినైనా ద్రవింపజేసేదే! అందుకే బాలల హక్కుల కమిషన్‌ తనకు తానుగా (సుమోటో) కేసు విచారణ చేపట్టింది. పిల్లల ఆరోగ్యపరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే! పోషకాహారం, పరిశుభ్రమైన నీరు, కాలుష్యరహిత పరిసరాలు, ఆరోగ్యకర వాతావరణాన్ని పాలకులే కల్పించాలి. మోత బరువుగా మార్చకుండా బాల్యాన్ని పరిరక్షించాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఎక్కువగా ఉంది.

మాటలు కాదు, చేతలు కావాలి

కొన్ని దేశాలు బాలల హక్కులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. నార్వే, స్వీడన్‌లలో వీధిబాలలు అరుదుగా కనిపిస్తారు. అక్కడి ప్రభుత్వాధికారులు సంరక్షణ కేంద్రా(రెస్క్యూ హోం)లకు తరలించి, సంరక్షకుల ద్వారా ఆలనాపాలనా చూస్తారు. ఆ పిల్లల విద్య, వైద్యం, ఆహారం, భద్రత వంటి అన్ని అవసరాలనూ తీరుస్తారు.అమెరికాలోని బాల నేరస్థుల సంస్కరణశాలలు- వారి చదువు, ఉపాధి పట్ల శ్రద్ధ వహిస్తాయి. శిక్ష కంటే మార్పుతేవడంపైనే అక్కడి ప్రభుత్వం చూపు సారిస్తోంది. దుబాయి వంటి గల్ఫ్‌దేశాల్లో ఉచిత నిర్బంధ విద్య కారణంగా, బాల కార్మికుల సమస్య తీవ్రత కనిపించదు. బాలలు ముఖ్యంగా విద్యార్థుల్లో నేరసంబంధ ఆలోచనలు తలెత్తకుండా, పలు ఆసియా దేశాలు విలువలతో కూడిన విద్యాబోధనను విస్తృతం చేస్తున్నాయి. అవి ఉత్తమ ఫలితాలనిస్తున్నాయని- బ్యూరో ఆఫ్‌ జస్టిస్‌ స్టాటిస్టిక్స్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌(ఎన్‌సీఈఎస్‌) గణాంకాలతో సహా వివరించాయి. ఐరాసలోని బాలల సంక్షేమ అధ్యయన విభాగం ఇటీవల వ్యాఖ్యానించినట్లు 'హాయిగా బతికేందుకు బాలల్లో ప్రతి ఒక్కరికీ హక్కుంది'. ఆ హక్కును తాను పరిరక్షిస్తూ, మరెవ్వరూ కాలరాయకుండా చూస్తూ ముందుకు సాగినప్పుడే అది ప్రజాప్రభుత్వమవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులన్న స్పృహ, స్ఫూర్తి ఆచరణలో కనిపించినప్పుడే- ఈ ఉత్సవాలకు అర్ధం, పరమార్థం!.

(ర‌చ‌యిత - సుధామాధురి)
Posted on 20-11-2015