Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

తీరానికి తూట్లు... దేశానికి పాట్లు

* సీఆర్‌జడ్‌నిబంధనలు - పరిమితులు

భారత సముద్ర తీరం మరోసారి అందరి దృష్టిలో పడింది. తీరప్రాంత క్రమబద్ధీకరణ (సీఆర్‌జడ్‌) అంశం పెద్దయెత్తున చర్చనీయాంశంగా మారింది. కేరళ తీరం వెంబడి వెలసిన అక్రమ నిర్మాణాలపై 2019 సెప్టెంబరులో కూల్చివేత ఆయుధాల్ని ప్రయోగించడంతో ఈ అంశం ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఇది మరోసారి అందరి దృష్టిని ఆకర్షించేందుకు మహారాష్ట్ర ఎన్నికలు కారణం కావడం విశేషం. ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఈ నెల 14న పలు ప్రాజెక్టులు ప్రకటించారు. అందులో ఒకటి వివాదంలో చిక్కి చర్చలకు ఎక్కింది. పర్యావరణపరంగా సున్నితమైన ముంబయి ఉప్పు క్షేత్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద పేదలకోసం ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించడమే ఇప్పుడు వివాదాస్పద అంశంగా మారింది. సీఎం ప్రకటనను మిత్రపక్షం శివసేన వ్యతిరేకిస్తుండగా, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చితే, ముంబయివ్యాప్తంగా వ్యాపించి ఉన్న 5,300 ఎకరాల ఉప్పు క్షేత్రాల్లో 1,781 ఎకరాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు గేట్లెత్తినట్లే! ఉప్పు క్షేత్రాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు అవకాశం కల్పించడం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందనేది వారి భయం. ఆ ప్రతిపాదన వెనక ఉన్న రాజకీయ ఉద్దేశాలు, వాటి ప్రభావాలూ చర్చనీయాంశాలే అయినా అదంతా వేరే సమస్య. ప్రస్తుతమిక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే, ఎవరూ పెద్దగా దృష్టి సారించని, అత్యంత కీలకమైన సీఆర్‌జడ్‌ అంశాన్ని ఈ ఉదంతం వెలుగులోకి తీసుకొచ్చింది. సీఆర్‌జడ్‌కు సంబంధించిన ప్రాజెక్టులపై నిపుణుల మదింపు కమిటీ 226వ సమావేశం సైతం ఎల్లుండి (అక్టోబరు 23) జరగనుండటంతో ఆ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సీఆర్‌జడ్‌ను, దానికి సంబంధించిన అంశాలను అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ముమ్మరిస్తున్న సమస్యలు
భారత్‌లోని తీరప్రాంత జిల్లాల్లో సుమారు 17.1 కోట్ల మంది జీవిస్తున్నారు. దేశ జనాభాలో ఇది 14 శాతానికి సమానం. మరోవైపు గడచిన రెండు దశాబ్దాల్లో 45 శాతం తీరం కోతకు గురైంది. తీరం వెంట ప్రకృతి విపత్తులు దేశానికి సుమారు అయిదు లక్షల కోట్ల రూపాయల నష్టం కలిగించాయి. తీరం వెంబడి నివసించే జనాభాను, అక్కడుండే సమస్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఆర్థిక, పర్యావరణపరమైన కార్యకలాపాలను నియంత్రించాల్సిందే. ఇందుకు సీఆర్‌జడ్‌ల అవసరం ఎంతో ఉంది. సముద్రం సమీపంలో ఉండే సున్నితమైన ఆవరణ వ్యవస్థల్ని పరిరక్షించే నిమిత్తం, పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కింద సీఆర్‌జడ్‌ నిబంధనల్ని తప్పనిసరి చేశారు. ఇవి తీరం వెంబడి సాగే మానవ, పారిశ్రామిక కార్యకలాపాల్ని నియంత్రిస్తాయి. తీరప్రాంతంలోని నిర్దిష్ట దూరం వరకు కొత్త పరిశ్రమల ఏర్పాటు, భారీ నిర్మాణాలు, గనుల తవ్వకం, ప్రమాదకరమైన పదార్థాల నిల్వ, పారవేత వంటి కార్యకలాపాల్ని నిరోధిస్తాయి. వీటి ప్రకారం- ‘హై టైడ్‌ లైన్‌ (హెచ్‌టీఎల్‌)’గా వ్యవహరించే- సముద్రంలో ఎత్తయిన అలలు భూమిపైకి విస్తరించే ప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు ఉండే ప్రాంతాన్ని నియంత్రిత ప్రాంతంగా గుర్తించారు. తీరంనుంచి స్థానిక జనాభా ఉండే దూరం, పర్యావరణపర ప్రభావం, సదరు నిర్దేశిత ప్రాంతంలో అభయారణ్యంగాగానీ, వన్యమృగ రక్షిత ప్రాంతంగాగానీ ప్రకటించారా వంటి విభిన్న అంశాలపై ఆధారపడి సంబంధిత నియంత్రణలు అమలవుతాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2019 జనవరి 18న నోటిఫై చేసిన సీఆర్‌జడ్‌, 2019 నిబంధనలు అంతకుముందు 2011లో రూపొందించిన నిబంధనల స్థానంలో అమల్లోకి వచ్చాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్‌-3 కింద వీటిని చేర్చారు. భూతాపం కారణంగా సముద్ర మట్టాలు పెరగడం వంటి ప్రకృతి విపత్తులను పరిగణనలోకి తీసుకుంటూ, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని రూపొందించారు. సముద్ర, తీర ప్రాంతాల్లోని పర్యావరణాన్ని పరిరక్షించడం, సంరక్షించడం, మత్స్యకారులు, ఇతర వర్గాలకు జీవనోపాధి భద్రతను కల్పించడం ఈ నిబంధనల ప్రధానోద్దేశం.

పాత సీఆర్‌జడ్‌ నిబంధనల స్థానంలో కొత్తవాటిని చేర్చినప్పుడు కొన్ని పట్టించుకోదగిన అంశాలు ఉన్నాయి. వీటిని విధాన రూపకర్తలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీఆర్‌జడ్‌లకు సంబంధించి, తాజా నిబంధనల్లో సీఆర్‌జడ్‌-3 (గ్రామీణ) ప్రాంతాల విభాగాన్ని సీఆర్‌జడ్‌-3ఎ, సీఆర్‌జడ్‌-3బిలుగా విభజించారు. సీఆర్‌జడ్‌-3ఎ విభాగం గ్రామీణ ప్రాంతంలోని జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాలకు వర్తిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి చదరపు కిలోమీటరుకు 2,161 మంది జనాభా ఉండే ప్రాంతం దీని పరిధిలోకి వస్తుంది. ఇందులో హెచ్‌టీఎల్‌ ప్రాంతంనుంచి 50 మీటర్ల పరిధి వరకూ వర్తించేలా అభివృద్ధి కార్యకలాపాలకు అనుమతిలేని ప్రాంతంగా (ఎన్‌డీజడ్‌)గా నిర్ణయిస్తారు. మరోవైపు సీఆర్‌జడ్‌-3బి విభాగంలో నుంచి 200 మీటర్ల వరకు ఎన్‌డీజడ్‌గా గుర్తిస్తారు. ఇక్కడ జనాభా కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి నిబంధనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే తీర ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు నివాసాలను అనుమతించడం వల్ల ప్రకృతి విపత్తులకు లోనయ్యే ప్రమాదం ఉందన్న సంగతి గుర్తించాలి. ఈ క్రమంలో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఇది మత్స్యకారులకు సంబంధించిన సమస్య. 12 నాటికల్‌ మైళ్ల వరకు ఉండే తీర జలాల ప్రాంతం సీఆర్‌జడ్‌-4 పరిధిలోకి వస్తుంది. ఇది చిన్న తరహా మత్స్యకారులకు కీలకమైన చేపలు పట్టే ప్రాంతం. తాజా సీఆర్‌జడ్‌ నిబంధనలు- నౌకాశ్రయాలు, ఓడరేవులు, రహదారులు, శుద్ధి చేసిన మలినాలు, ప్రమాదకరమైన పదార్థాల విడుదల, స్మారక కేంద్రాల నిర్మాణాలు వంటివి చేపట్టేందుకు భూమి పునరుద్ధరణకు అనుమతి ఇస్తున్నాయి. ఇవన్నీ చేపలు పట్టే కార్యకలాపాలకు అంతరాయం కలిగించేవే. మన దేశంలో 1.2 కోట్ల మంది చేపలు పట్టడాన్నే జీవనోపాధిగా ఎంచుకుని, ఆ వృత్తిపైనే ఆధారపడి ఉన్నారన్న సంగతి మరవరాదు. కొత్త నిబంధనల వల్ల స్థానిక వర్గాల జీవితాల్ని, వారి జీవనోపాధిపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో సమస్య పర్యావరణ పర్యాటకానికి సంబంధించినది. సీఆర్‌జడ్‌-1ఏగా గుర్తించిన పర్యావరణపరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో కొత్త సీఆర్‌జడ్‌ నిబంధనలు మడ అడవుల్లో నడక, వృక్షాలపై గుడిసెలు, ప్రకృతి బాటలు తదితర పర్యావరణ పర్యాటక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలు ఉద్యోగ అవకాశాల్ని, ఆదాయ కల్పనను పెంచుతున్నా వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు, నియంత్రణలో పెట్టేందుకు, శాస్త్రీయ పద్ధతిలో సంస్థాపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమన్న సంగతి గుర్తుంచుకోవాలి. అప్పుడే, భారత తీరంలో పర్యావరణపరంగా సున్నితమైన పగడపు దిబ్బలు, మడ అడవులు, ఇసుకతిన్నెల్ని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుంది.

పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట
నిబంధనలు ఏవైనా, ఎలాగున్నా వాటి అమలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లాల్సిన అవసరం ఉంటుంది. సీఆర్‌జడ్‌ నిబంధనల్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. ఇందుకోసం అవి తీర ప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికల్నీ రూపొందించాల్సి ఉంటుంది. అవి కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇందుకోసం- కేంద్ర, రాష్ట్రాలు రాజకీయ విభేదాల్ని, ఇతరత్రా ప్రయోజనాల్ని పక్కనపెట్టి, చక్కని సమన్వయం, సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. సురక్షితమైన, పరిశుభ్రమైన, సుసంపన్న భారత తీర రేఖను సుసాధ్యం చేయాలనే మహాలక్ష్యాన్ని సాధించేందుకు ఏకరీతిన సాగాలి. ఆర్థికాభివృద్ధి అనేది ఏదో స్థాయిలో తగిన మూల్యం చెల్లించుకుంటేనే సాధ్యమవుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఆర్థికపరమైన అభ్యున్నతి కోసం ఎంతమేర పర్యావరణ సమతౌల్యాన్ని మనం త్యాగం చేస్తామన్నదే ఇక్కడ కీలకం. ఎంత సమతౌల్యం ఉంటే అంత సుస్థిరత, అభివృద్ధి సాధ్యమవుతుంది.

చట్టంనీరుగారిన క్రమం...
1991 - తీరప్రాంత క్రమబద్ధీకరణ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌-సీఆర్‌జడ్‌)పై ప్రకటన (నోటిఫికేషన్‌) జారీ.
1992 - పర్యాటక రంగ లాబీ ఒత్తిడితో నియంత్రణల పునఃపరిశీలనకు వోహ్రా కమిటీని ఏర్పాటు చేసిన పర్యావరణ మంత్రిత్వ శాఖ.
1994 - సముద్రంలో ఎత్తయిన అలలు భూమిపైకి విస్తరించే భాగం (హై టైడ్‌ లైన్‌-హెచ్‌టీఎల్‌) నుంచి వంద మీటర్ల దాకా ఉండే అభివృద్ధి కార్యకలాపాల్ని నిరోధించే ప్రాంతాన్ని 50 మీటర్లకే కుదిస్తూ సవరణలు తీసుకొచ్చారు. దీనివల్ల తీరం వెంబడి నిర్మాణాలకు తలుపులు తెరచినట్లయింది.
1997 - సీఆర్‌జడ్‌-3లో 200 మీటర్ల పరిధిలో నివాస గృహాల నిర్మాణానికి సల్దాన్హా కమిటీ(2) సిఫార్సు చేసింది.
2001 - అణుశక్తి విభాగం గొట్టం ద్వారా మార్గాల్ని వేసే ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేందుకు ప్రకటనను సవరించారు.
2002 - సీఆర్‌జడ్‌లో కాలుష్యరహిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివృద్ధి కార్యకలాపాల్ని అనుమతించని ‘ఎన్‌డీజడ్‌’లలో సైతం అరుదైన ఖనిజాల తవ్వకానికి అవకాశం కల్పించేందుకు సవరణ తెచ్చారు.
2003 - రూ.5 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు పర్యావరణ శాఖ అనుమతుల్ని తప్పనిసరి చేస్తూ సవరించారు. సీఆర్‌జడ్‌-1 పరిధిలో సముద్ర మార్గాల నిర్మాణం, వ్యర్థాల యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన సవరణలు కూడా ఇందులో ఉన్నాయి.
2011 - పర్యావరణ మంత్రిత్వశాఖ సీఆర్‌జడ్‌ ప్రకటన 2011ను జారీచేసింది.
2012 - సీఆర్‌జడ్‌ నిబంధనల్ని ఉల్లంఘించిన ప్రాజెక్టులు సైతం కొనసాగేలా పర్యావరణ శాఖ ఉత్తర్వుల జారీ.
2014 - పర్యాటకం, పట్టణీకరణ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని సీఆర్‌జడ్‌ 2011 నిబంధనల్ని సవరించాలంటూ కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర విన్నవించాయి.
2015 - పర్యావరణపరంగా సున్నితమైన సీఆర్‌జడ్‌-2 ప్రాంతంలో రిసార్టులు, హోటళ్ళకు అనుమతించాలని శైలేష్‌నాయక్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఓడరేవులు, నౌకాశ్రయాలు తదితరాల కోసం భూమి పునరుద్ధరణకు అనుమతించింది.
2018 - సీఆర్‌జడ్‌ ముసాయిదా ప్రకటన విడుదలైంది.
* గత 27 ఏళ్ల వ్యవధిలో సీఆర్‌జడ్‌ ప్రకటన 34 సార్లు సవరణకు లోనైంది. అది- తీరాన్ని పరిరక్షించేందుకు కాదు, అభివృద్ధి కార్యకలాపాలకు అవకాశం కల్పించేందుకు! పలు సవరణల ఫలితంగా- తీరానికి చేరువలోనే హోటళ్ళు, రిసార్టులు, తాత్కాలిక పర్యాటక సౌకర్యాల్ని నిర్మించేందుకు అవకాశం కలిగింది.


Posted on 21-10-2019