Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

నేరన్యాయానికి జవజీవాలు?

డెబ్భై రెండేళ్ల క్రితమే పరాయి పాలన గతించినా, వాళ్ల పీడనకు ప్రాతిపదికలుగా నిలిచిన కర్కశ చట్టాలు నిక్షేపంగా వర్ధిల్లుతున్న దేశం మనది. ప్రభువులు- బానిసలు అన్న భావజాలంతో బ్రిటిషర్లు ఏనాడో 1860లో రూపొందించిన భారతీయ శిక్షాస్మృతిని సాంతం ప్రక్షాళించాల్సి ఉందన్న సంకల్పంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ- ఐపీసీలో వివిధ సెక్షన్ల సవరణపై అన్ని రాష్ట్రాల సలహాలు కోరుతూ లేఖలు రాసింది. ఐపీసీతో పాటు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సాకల్య సంస్కరణను లక్షించి న్యాయ నిపుణులతో రెండు కమిటీలనూ కొలువుతీర్చింది. వలస పాలకుల ప్రయోజనాల పరిరక్షణే ఏకైక అజెండాగా నాటి చట్టాలు, పోలీసు వ్యవస్థల కూర్పు జరిగినా, నేడు ప్రజల పరిరక్షణే పోలీసుల విధ్యుక్త ధర్మమైనందున ఖాకీల పనిపోకడలను ప్రభావితం చేసే చట్టాలూ అందుకు అనుగుణంగా రూపాంతరం చెందాలనడంలో మరోమాట లేదు. క్రిమినల్‌ కేసుల్లో శిక్షల శాతం అధ్వానంగా ఉండటాన్ని మొన్న ఆగస్టు చివరి వారంలో సూటిగా ప్రస్తావించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా- ఏడేళ్లు ఆపైన శిక్షలు పడే నేరాల్లో ఫోరెన్సిక్‌ సాక్ష్యాధారాల్ని తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. నిందితులపై దండనీతి, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి ప్రాచీన పద్ధతుల్ని విడనాడి దర్యాప్తులో శాస్త్రీయ నైపుణ్యాల వినియోగం పెరగాలంటూ, అప్పుడే పురాతన చట్టాల సంస్కరణ సంకల్పాన్నీ ప్రకటించారు. 1860నాటి ఐపీసీ, 1872నాటి సాక్ష్యాధార చట్టాన్ని భారీగా ప్రక్షాళించాల్సిన అవసరంపై ఎందరెందరో నిపుణులు ఎంతో కాలంగా మొత్తుకొంటూనే ఉన్నారు. 1973లో నేరశిక్షా స్మృతిని గణనీయంగా సవరించినప్పటికీ మౌలిక లోటుపాట్లు అలానే ఉన్నాయన్న విమర్శల్నీ తోసిపుచ్చే వీల్లేదు. ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలనకు తీరైన అర్థతాత్పర్యాలు చెప్పగలిగేలా, కాలంచెల్లిన వాటికి కొరత, మానవ హక్కులకు ఎత్తుపీట వేసి, చట్టం ముందు అందరూ సమానమేనన్న రాజ్యాంగ ధర్మసూక్ష్మానికి మన్నన దక్కేలా సమగ్ర సంస్కరణలు వడివడిగా రావాలిప్పుడు!

‘చట్టబద్ధంగా వివాద పరిష్కారానికి దాదాపు మూడు దశాబ్దాలు నిరీక్షించాల్సి ఉంటుందని మనం పౌరులకు సూచిస్తే, చట్టవ్యతిరేక పద్ధతుల్లో దాన్ని సాధించుకొమ్మని అతణ్ని ప్రోత్సహించినట్లు, బలవంతం చేసినట్లు కాదా?’ అని ‘సుప్రీం’ న్యాయమూర్తిగా జస్టిస్‌ థామస్‌ సూటిగా ప్రశ్నించారు. దేశీయంగా నేరన్యాయ వ్యవస్థ కుప్పకూలడానికి పుణ్యం కట్టుకొంటున్న ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధారాల చట్టాల సంస్కరణకు ప్రధానిగా వాజ్‌పేయీ గట్టిగా ప్రతిపాదించారు. ఘోర నేరాలకు పాల్పడ్డవాళ్లూ బోరవిరుచుకు తిరుగుతుంటే, చిన్నాచితకా కేసుల్లో చిక్కినవాళ్లు విచారణ ఖైదీలుగా చీకటి కొట్టాల్లోనే పొగచూరిపోతున్న అమానుషం- చట్టబద్ధ పాలన ఇంపుసొంపుల్ని కళ్లకు కడుతోంది! ఆహార పదార్థాలు, మందుల కల్తీ, అక్రమ నిల్వలు, ప్రజాధనం స్వాహాలకు పాల్పడినవాళ్లకు నేరానికి తగ్గ శిక్షలు చట్టంలో లేవని లోగడ సంతానం కమిటీ ఆక్షేపించింది. మరీచికగా మారిన న్యాయం కోసం సామాన్యులు అలమటిస్తుంటే, కోర్టు సెలవు రోజుల్లోనూ గొప్పవాళ్లకు హుటాహుటిన దక్కుతున్న ఉపశమనం శిక్షాస్మృతిలోని అవకరాలకు అద్దంపడుతోంది. కాలంచెల్లినవంటూ లోగడే 1,458 చట్టాలకు చెల్లుకొట్టిన మోదీ ప్రభుత్వం, మొన్న జులైలో మరో 58 శాసనాలకు చరమగీతం పాడింది. ప్రభుత్వ వ్యతిరేకతను కర్కశంగా అణచివేయడమే లక్ష్యంగా బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన రాజద్రోహం, పరువు నష్టం వంటి చట్టాలు నేటికీ కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసభాజనం చేస్తున్నాయి. రాజద్రోహ శాసనాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వమే ఏనాడో రద్దు చేసినా ఇక్కడది నిక్షేపంగా అమలులో ఉండటం, పరువు నష్టం వంటి చట్టాలు సంకుచిత రాజకీయ నేతలకు ప్రతీకార పాచికలుగా అక్కరకొస్తుండటం ఆలోచనాపరుల్ని కలచివేస్తోంది. నేరన్యాయ వ్యవస్థను పునరుజ్జీవింపచేసే మహాక్రతువు నిష్ఠగా, సామాన్యుల చట్టబద్ధ హక్కులకు భరోసా ఇచ్చేదిగా సాగి సత్వరం పట్టాలకెక్కాలి!

ఇండియాలో నేరన్యాయ వ్యవస్థ సర్వభ్రష్టమై సామాన్య పౌరులకు ప్రాణసంకటంగా మారిందనేందుకు గట్టి రుజువులెన్నో పోగుపడ్డాయి. 2017 ఏప్రిల్‌ నుంచి 2018 ఫిబ్రవరి దాకా సగటున రోజుకు అయిదుగురి వంతున 1,674మంది అభాగ్యులు కస్టడీలో కడతేరిపోయారని గణాంకాలు చాటుతున్నాయి. నిరుడు ఆ సంఖ్య మరింత పెరిగి 1,966కు చేరింది. ‘దండం దశగుణం భవేత్‌’ అన్నదే ఖాకీలకు కూసువిద్యగా మారి పోలీసు ఠాణాల్లో బక్క ప్రాణాల్ని బలిగొంటుంటే, క్రిమినల్‌ నేరాల్లో శిక్షల రేటు 40శాతం దగ్గరే తారట్లాడుతున్న తీరు నిశ్చేష్టపరుస్తోంది. అసోం, బిహార్‌, ఒడిశాల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవాళ్లలో 90శాతం నిక్షేపంగా బయటపడుతుంటే, తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతానికే శిక్షలుపడుతున్నట్లు నేరగణాంకాల బ్యూరో కడపటి నివేదిక వెల్లడించింది. రానురాను అవ్యవస్థ మరింతగా ఊడలు దిగింది. న్యాయవిచారణ పద్ధతుల్ని సరళీకరించి, న్యాయపాలిక- ప్రాసిక్యూషన్‌-పోలీసు విభాగాల మధ్య సమన్వయం సాధించి, చౌకగా శీఘ్రతరంగా శ్రమదమాదుల్లేని విధంగా వ్యవస్థను సంస్కరించి, సామాన్యుడి విశ్వాసాన్ని పునరుద్ధరించడమే తమపై మోపిన బాధ్యత అంటూ జస్టిస్‌ మలీమత్‌ కమిటీ 2003లో సవివర సూచనలు అందించింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధార చట్టాల్ని కాలానుగుణంగా తిరగరాయాల్సిన అవసరంపైనా తర్కించిన కమిటీ విపుల సిఫార్సులు పదహారేళ్లుగా అటకెక్కాయి. నిందితుల వైపే మొగ్గుతున్న ప్రస్తుత వ్యవస్థ నేరబాధితులకు న్యాయం అందించడంపై సరిగ్గా దృష్టి సారించడం లేదంటూ జస్టిస్‌ మలీమత్‌ కమిటీ చేసిన సిఫార్సులు- తాజా అధ్యయన బృందాలకు కరదీపికలు కావాలి. నేరగాళ్లకు సత్వర శిక్షలు, న్యాయార్థులకు శీఘ్రతర సాంత్వనలే లక్ష్యంగా కొత్త కసరత్తు తేజరిల్లాలి!


Posted on 22-10-2019