Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

పంజరంలో పౌర స్వేచ్ఛ

* ముసురుకొన్న మీమాంసలెన్నో?

ఇరవై రెండు నెలల కింద అంటే 2018 జనవరి 12న అప్పటి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు నలుగురు కలిసి అపూర్వమైన రీతిలో పత్రికా సమావేశం నిర్వహించి న్యాయవ్యవస్థలో, ముఖ్యంగా సుప్రీంకోర్టులో అంతా సవ్యంగా లేదని ఆవేదన వ్యక్తీకరించారు. న్యాయవ్యవస్థపట్ల జనంలో విశ్వాసాన్ని పాదుకొల్పాలని భావించిన నాటి న్యాయమూర్తుల్లో ఒకరైన రంజన్‌ గొగోయ్‌ హయాములో వారు వ్యక్తంచేసిన ఆందోళనను నివారించడానికి ప్రయత్నం కచ్చితంగా జరుగుతుందనుకోవడం అత్యాశ కాదు. ఇటీవలి పరిణామాలు ఈ లక్ష్యసాధన సవ్యంగా జరగడం లేదన్న అనుమానాలకు తావిస్తున్నాయి. 2017 డిసెంబర్‌ 31న పుణెలో ఎల్గార్‌ పరిషత్తు నిర్వహించిన కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిమాణాల (భీమా కోరేగావ్‌ కేసు) నేపథ్యంలో అరెస్టయిన పౌరహక్కుల నాయకుడు గౌతం నవలఖా- తన మీద దాఖలైన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)ను రద్దు చేయాలని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ఆ మేరకు ఆయన నివేదనను బొంబాయి హైకోర్టు ఆమోదించకపోవడంతో నవలఖా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తెలియని కారణాలు
నవలఖా అర్జీ సెప్టెంబర్‌ 30న విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌, న్యాయమూర్తులు ఎస్‌.ఎ.బోబ్డే, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బెంచి ఈ పిటిషన్‌ను విచారించాల్సింది. అయితే ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తాను లేని బెంచికి విచారణ బాధ్యత అప్పగించాలని ఉత్తర్వు జారీ చేశారు. అందుకు కారణాలను ప్రధాన న్యాయమూర్తి వివరించలేదు కానీ అయోధ్య కేసు విచారణలో తలమునకలై ఉన్నందువల్ల సమయాభావం కారణంగా నవలఖా కేసు విచారణ నుంచి గొగోయ్‌ వైదొలిగారన్న వార్తలు మాత్రం వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ ఆదేశం మేరకు ఈ నెల ఒకటో తేదీన నవలఖా కేసు న్యాయమూర్తులు ఎన్‌.వి.రమణ, ఆర్‌.సుభాష్‌ రెడ్డి, బి.ఆర్‌.గవాయ్‌తో కూడిన బెంచి ముందుకు విచారణకు వచ్చింది. న్యాయమూర్తి గవాయ్‌ కేసు విచారణ నుంచి తప్పుకొన్నారు. బెంచిలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులూ వైదొలిగారన్న వార్తలు వచ్చాయి. అంటే నలుగురు న్యాయమూర్తులు తప్పుకొన్నట్లు! తరవాత మూడోసారి న్యాయమూర్తి రవీంద్ర భట్‌తో కూడిన మూడో బెంచి ఏర్పాటైంది. న్యాయమూర్తి రవీంద్ర భట్‌ కూడా అక్టోబర్‌ మూడో తేదీన విచారణ నుంచి తప్పుకొన్నారు. దాంతో అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించడానికి నిరాకరించినట్లయింది. అయితే తప్పుకొన్నది అయిదుగురు కాదు, ముగ్గురేనని... న్యాయమూర్తులు ఎన్‌.వి.రమణ, ఆర్‌.సుభాష్‌ రెడ్డి తప్పుకోలేదన్న వివరణ వచ్చింది. తప్పుకొన్న న్యాయమూర్తులు అయిదుగురా, ముగ్గురా అన్న సంఖ్య ప్రధానం కాదు- వారు వైదొలగిన తీరు, అందుకు కారణాలు చెప్పకపోవడం అనుమానాలకు దారితీసే అవకాశం ఉంది. వ్యక్తిస్వేచ్ఛకు సంబంధించిన కేసును విచారించడానికి న్యాయమూర్తులు సిద్ధపడకపోవడం ఆశ్చర్యకరం.

కేసు విచారణ నుంచి తప్పుకోవడాన్ని నిర్దేశించే ప్రత్యేక నిబంధనలేవీ లేకపోయినా న్యాయమూర్తులు కొన్ని ఆనవాయితీలు పాటిస్తున్నారు. తాము న్యాయవాదిగా ఉన్న సమయంలో- తాజా కేసులో భాగస్వాములైనవారి పక్షాన అంతకుముందెప్పుడైనా వాదించి ఉంటే న్యాయమూర్తిగా వారికి సంబంధించిన కేసు తమ ఎదుటకు వస్తే; లేదా తమకు బాగా సన్నిహితులో, తెలిసినవారో అయిఉంటే; ఆ కేసుకు సంబంధించి గతంలో సలహా ఇచ్చి ఉంటే- న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోవడం ఆనవాయితీ. న్యాయమూర్తులనియామక బిల్లుపై కేసు విచారణ నుంచి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్‌ ఆర్‌.దవే తప్పుకొన్నారు. ఎందుకంటే ఆయన కొలీజియం సభ్యుడిగా ఉండేవారు. కానీ కొలీజియం సభ్యుడిగా ఉన్నా మరో న్యాయమూర్తి జె.ఎస్‌.కేహార్‌ మాత్రం ఈ కేసు విచారణ నుంచి తప్పుకోలేదు. అస్సామ్‌లో ప్రత్యేక ట్రిబ్యునళ్లు ‘విదేశీయులు’గా ప్రకటించినవారిని నిర్బంధించిన జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని, వారిని విడుదల చేయాలని ఆదేశించాలని సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన బెంచిలో న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ కూడా ఉండేవారు. గోగోయ్‌ అస్సామ్‌కు చెందినవారు. ఆయన పేరు కూడా జాతీయ పౌరుల జాబితాలో చేరుతుంది కనక ఆయన ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని హర్ష్‌ మందర్‌ కోరినా రంజన్‌ గొగోయ్‌ అంగీకరించలేదు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన ఎం.ఎన్‌.వెంకటాచలయ్య విచారణ నుంచి న్యాయమూర్తులు తప్పుకోవడానికి 1987లో రంజిత్‌ ఠాకూర్‌ కేసులో ‘తప్పుకోవడం’ అంటే ఏమిటో విడమర్చారు. తప్పుకోవడానికి న్యాయమూర్తి అభిప్రాయం, చూపే కారణాలకన్నా కేసులో ఉన్న ఏ పక్షానికి అనుమానం కలగకుండా ఉండటానికి ఆ పక్షాలతో ఏ సంబంధం ఉన్నా తప్పుకోవాలని సూచించారు. ఈ నిర్ణయం అంతస్సారం న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి న్యాయమూర్తులకు పరిమితమైన వ్యవహారం కాదని, స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజలహక్కు అని స్పష్టం అవుతోంది. న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టేటప్పుడు రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్లో పొందుపరచినట్లుగా రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షిస్తామని ప్రమాణం చేస్తారు. అందుకు అనుగుణంగా న్యాయమూర్తులు వ్యవహరించడం ప్రజలకు న్యాయవ్యవస్థ మీద విశ్వాసం ఉండటానికే తప్ప- న్యాయమూర్తుల అవసరం కోసం కాదు. న్యాయవ్యవస్థకు స్వేచ్ఛ అంటే వ్యక్తిగతంగా న్యాయమూర్తులకు స్వేచ్ఛ ఉండటం కాదు. న్యాయనిర్ణేతలు నిర్భయంగా, నిరపేక్షంగా వ్యవహరించడం న్యాయవ్యవస్థ నిష్పాక్షికతకు, నిజాయతీగా మెలగడానికే.

సందేహాలకు అతీతంగా...
అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తినప్పుడు ఆ రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు బెంచీలో భాగస్వాములు కాకూడదన్న ఉదాత్త సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ప్రెస్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ప్రెస్‌ కౌన్సిల్‌లో దైనిక్‌ జాగరణ్‌ పత్రికకు సంబంధించిన వ్యవహారం పరిశీలించాల్సి వచ్చినప్పుడు నిరాకరించారు. తాను అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నప్పుడు దైనిక్‌ జాగరణ్‌ కేసులో వాదించాను కనక ఈ పరిశీలనలో భాగస్వామిగా ఉండనన్నారు. గౌతం నవలఖా కేసులో విచారణ నుంచి తప్పుకొన్న న్యాయమూర్తులు తమ నిర్ణయానికి కారణాలు చెప్పలేదు. ‘న్యాయం జరగడమే కాదు, జరిగినట్లూ కనిపించాలి’ అన్నది నానుడి. ఈ దృక్పథంతో చూస్తే తప్పుకొన్న న్యాయమూర్తులు అందుకు కారణాలు చెప్పి ఉంటే న్యాయం జరగడమేకాక జరిగినట్లూ కనిపించడానికి అవకాశం ఉండేది. న్యాయమూర్తుల నడవడిక న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసానికి ఎలా విఘాతం కలిగిస్తుందో గమనించకుండా న్యాయమూర్తులు నవలఖా కేసులో ఎందుకు తప్పుకొన్నారో కారణం చెప్పకపోవడం న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా లేదేమో అనుకోవడానికి దోహదం చేస్తుంది. భారత న్యాయవ్యవస్థ చాలా శక్తిమంతమైందే కాక క్రియాశీలమైంది. నవలఖా కేసు రాజ్యాంగం పూచీపడే వ్యక్తి స్వేచ్ఛకు, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించింది కనక సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూడటం సహజం. కారణాలు చెప్పకుండా న్యాయమూర్తులు తప్పుకోవడం న్యాయవ్యవస్థ మీద కనిపించని సంకెళ్లున్నాయేమోనన్న ఆందోళనకు చోటివ్వచ్చు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వర్గం నుంచి, చట్టసభల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి తలెత్తినా అది నిస్సందేహంగా తీవ్రాందోళనకరం!


- ఆర్వీ రామారావ్‌
Posted on 23-10-2019