Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సైబర్‌ నేరగాళ్ల ఉరవడి

ఆధునిక ప్రపంచంలో సమాచార సాంకేతిక విప్లవం ధగధగల మాటున నక్కిన చీకటి కోణం- సైబర్‌ నేరం. అంతర్జాలమే కార్యస్థలిగా రెచ్చిపోతున్న ప్రచ్ఛన్న శత్రువుల నుంచి నిరంతర దాడుల ముప్పు పొంచి ఉందన్నది నిష్ఠుర సత్యం. భారత్‌లో సైబర్‌ దాడుల మూలాలు అమెరికా, ఐరోపా, బ్రెజిల్‌, టర్కీ, చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో ఉన్నట్లు నాలుగైదేళ్ల క్రితం ‘అసోచామ్‌’ (భారత వాణిజ్య పారిశ్రామిక మండలి) వెల్లడించడం పెను సంచలనం సృష్టించింది. అనంతర కాలంలో సైబర్‌ నేరగాళ్ల బరితెగింపు ఇంతలంతలైంది. తాజాగా వెలుగుచూసిన జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికాంశాలు దేశంలో సైబర్‌ నేరాల ఉద్ధృతిని ధ్రువీకరిస్తున్నాయి. 2015 సంవత్సరంలో 11,592గా నమోదైన సైబర్‌ నేరాల సంఖ్య మరుసటి ఏడాది 12,317కు విస్తరించి, 2017లో 21,796కు ఎగబాకింది. అంటే, ఒక్క ఏడాదిలోనే ఎకాయెకి 77 శాతం వృద్ధి! ప్రస్తుత సంవత్సరంలోనూ అంతర్జాల నేరాలు జోరెత్తుతున్నాయని, అలా దాడులకు గురైన దేశాల జాబితాలో ఇండియాదే ప్రథమ స్థానమని ‘సుబెక్స్‌’ అధ్యయనం ఇటీవలే చాటింది. సైబర్‌ నేరాల తీవ్రత బెంగళూరు, ముంబయి, జైపూర్‌లలో అధికమని నేరగణాంకాల బ్యూరో చెబుతుండగా- ఆ వరసలో దిల్లీ సైతం ప్రధాన బాధిత నగరాల్లో ఒకటని ఈ మధ్యనే వెల్లడైంది. రాష్ట్రాలవారీగా గణిస్తే యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే ఒక్క ఏడాది వ్యవధిలో సైబర్‌ నేరాలు దాదాపు రెండింతలయ్యాయి. తరతమ భేదాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అదే కథ. సైబర్‌ మోసాలు ఇంచుమించు మూడింతలైన కర్ణాటకలో 2017 సంవత్సరం మొత్తానికి ఒక్కటంటే ఒక్క కేసులోనూ దోష నిర్ధారణ కాలేదు! డిజిటల్‌ సాంకేతికతకు విశేష ప్రాధాన్యం దక్కాలంటున్న ప్రజాప్రభుత్వాలు ఆన్‌లైన్‌ లావాదేవీల విశ్వసనీయతను పరిరక్షించడంలో, ఘరానా చోరుల భరతం పట్టడంలో విఫలమవుతుండటం- సైబరాసురులకు కోరలు, కొమ్ములు మొలిపిస్తోంది!

రకరకాల వస్తూత్పాదనల కొనుగోళ్లు, వివిధ బిల్లుల చెల్లింపులు, సినిమా మొదలు బస్సు, రైలు, విమాన టికెట్ల బుకింగ్‌ వరకు ఏదైనా ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా జరుగుతోందిప్పుడు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్నకొద్దీ ఖాతాదారుల్ని బురిడీ కొట్టించి సొమ్ముకాజేసే కుయుక్తుల్లో మోసగాళ్లెందరో రాటుతేలుతున్నారు. చీటింగ్‌ బాగోతాలు, ఆన్‌లైన్‌ మోసాల కట్టడిలో వ్యవస్థాగత లోటుపాట్లే వాళ్లకు అయాచిత వరాలవుతున్నాయి. ఎలెక్ట్రానిక్‌ గుర్తింపు కార్డు ద్వారా ఎన్నో సేవలందిస్తూ ఎస్తోనియా లాంటి చిన్నదేశం, దశాబ్దాలుగా సాంకేతిక పాలనలో ఆరితేరిన బ్రిటన్‌ వంటివి విజ్ఞాన ఆధారిత సమాజానికి వేగుచుక్కలై భాసిస్తున్నాయి. ఆ ఒరవడిలోనే ‘డిజిటల్‌ ఇండియా’కు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు, జాతీయ సైబర్‌ భద్రత విధానాన్నీ ప్రత్యేకంగా కొలువుతీర్చారు. కార్యాచరణ బాధ్యతను వేర్వేరు విభాగాలకు సంస్థలకు కట్టబెట్టడంతో, వాటి మధ్య అర్థవంతమైన సమన్వయం కొరవడి- తక్షణ స్పందన ఎండమావిని తలపిస్తోంది. పార్లమెంటరీ స్థాయీసంఘం సూటిగా తప్పుపట్టిన తరవాతా బండి గాడిన పడనేలేదని, రాష్ట్రాలవారీగా సైబర్‌ నేరగాళ్ల విజృంభణ రుజువుచేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు ఎరవేసి చరవాణుల్ని చెరపట్టి వ్యక్తిగత సమాచారాన్ని క్షణాల్లో చోరీచేయడమే లక్ష్యంగా ఈ ఒక్క ఏడాదే 27వేల మాల్‌వేర్‌ (ద్రోహచింతన గల) యాప్స్‌ కొత్తగా పుట్టుకొచ్చాయని అంచనా. అమాయకులపై ప్రలోభాల వల విసిరి సైబర్‌ నేరగాళ్లు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడి- అసంఖ్యాకుల్ని తీవ్ర అభద్రతాభావంలోకి నెట్టేస్తోంది. ‘కంప్యూటరీకరణ చిలవలు పలవలు వేసుకుపోతున్న తరుణంలో యాక్సెస్‌ కంట్రోల్‌ వ్యవస్థల పరిరక్షణ, భద్రతాపరమైన విధినిషేధాల ఆవశ్యకత’ను రిజర్వ్‌బ్యాంక్‌ డిప్యూటీ గవర్నరుగా ఎస్‌.పి.తల్వార్‌ ఏనాడో ఉద్బోధించారు. అందుకు సరైన మన్నన కరవైన కారణంగానే, సైబర్‌ నేరాలు పట్టపగ్గాల్లేకుండా విక్రమిస్తున్నాయి.

పోనుపోను డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలు, నెట్‌ బ్యాంకింగ్‌ నేరాలు ఇంతలంతలు కావడం దేశీయంగా సైబర్‌ భద్రతనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటువంటి ఉత్పాతాన్ని ముందుగానే ఊహించిన ఇజ్రాయెల్‌ 2002 నుంచే ఆర్థిక ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సకల విధాల సన్నద్ధమైంది. అంతర్జాల నయా యుద్ధక్షేత్రంలో చొరబాటుదారుల భరతం పట్టేందుకు చైనా మూడేళ్ల క్రితమే పది లక్షల మంది సుశిక్షితుల్ని మోహరించింది. రెండేళ్ల క్రితం పటిష్ఠ సైబర్‌ భద్రత చట్టాన్ని రూపొందించి నేరగాళ్లను హడలెత్తిస్తోంది. కీలక మౌలిక వ్యవస్థల సంరక్షణకు 2013 ఫిబ్రవరిలో కార్యనిర్వాహక ఆదేశాలు వెలువరించిన అమెరికా, సైబర్‌ భద్రత నిమిత్తం జపాన్‌తో చేతులు కలిపింది. దేశీయంగా సైబర్‌ దాడుల బారిన పడకుండా సమాచారాన్ని భద్రపరచడం కోసం రెండు తెలుగు రాష్ట్రాలూ బ్లాక్‌చైన్‌ సాంకేతికత వైపు మొగ్గుచూపడం తెలిసిందే. సైబర్‌ భద్రతలో నెదర్లాండ్స్‌, తెలంగాణ సహకరించుకోనున్నాయంటున్నారు. సరికొత్తగా తమిళనాడు 40 సైబర్‌ పోలీస్‌ స్టేషన్లు, ఆరు సైబర్‌ ప్రయోగశాలలు నెలకొల్పాలని సంకల్పించింది. ఈ-కామర్స్‌, బిట్‌కాయిన్‌ వంటి డిజిటల్‌ కరెన్సీ, క్రెడిట్‌ కార్డులు, ఈ-వ్యాలెట్లకు సంబంధించి వివిధ ఆన్‌లైన్‌ మోసాల పరిశోధన నిమిత్తం యూపీ పోలీసులు ప్రత్యేక సైబర్‌ నేరవిభాగాన్ని కొలువుతీర్చారు. రాష్ట్రాలు, దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం సాకారమైతేనే గాని సైబర్‌ నేరవిచారణ చురుకందుకోదని కర్ణాటక అనుభవం ఎలుగెత్తుతోంది. నేరాల సంఖ్య, నష్ట పరిమాణం విస్తరిస్తూపోతున్నా రాష్ట్రాలు వేటికవి సొంత వ్యూహాలకు పరిమితం కావడం అసంబద్ధం. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా పేరొందిన భారతావనిలో రాష్ట్రాల తోడ్పాటును కూడగట్టి సైబర్‌ నేరగాళ్లకు కట్టుదిట్టంగా ఉచ్చుబిగించే పకడ్బందీ కార్యాచరణను పట్టాలకు ఎక్కించడంలో కేంద్రం మరేమాత్రం జాగుచేసినా తప్పదు తీవ్రానర్థం!


Posted on 24-10-2019