Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

ప్రోత్సాహకాల వలకే పెద్దచేపలు

* ఆక్వా రంగంలో భారత్‌కు అవకాశాలు

దేశంలో మత్స్యరంగం కొన్ని దశాబ్దాలుగా స్థిరమైన వృద్ధి సాధిస్తోంది. రహదారుల వ్యవస్థ సైతం సరిగ్గా లేని సమయంలో మంచినీటి చేపల పెంపకం మొదలైంది. ఔత్సాహిక రైతులు, పారిశ్రామికవేత్తలు, మొదటితరం శాస్త్రవేత్తలు ఈ రంగంలో చేసిన కృషి ఎనలేనిది. ప్రభుత్వ ప్రోత్సాహకాలూ వీటికి తోడయ్యాయి. దశాబ్దాలపాటు ఎంతోమంది చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు పరీవాహక ప్రాంతంలో... దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువ విస్తీర్ణంలో మంచినీటి చేపల పెంపకం సాగుతోంది. వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలతో పోలిస్తే ఒక హెక్టారుకు 25, అంతకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఇదొక్కటే. మత్స్య పరిశ్రమ స్థిరపడినా సమస్యలు లేకపోలేదు. గిట్టుబాటు ధర లేక మార్కెటింగ్‌ ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. శీతల గిడ్డంగుల సదుపాయాలు అంతంత మాత్రమే. ఐస్‌ కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి లోపాలతో ఏటా కనీసం 10 శాతం మేర ఉత్పత్తి వృథా అవుతోంది.

నాణ్యమైన విత్తనం ముఖ్యం
చేపలు, రొయ్యల సాగులో నాణ్యమైన విత్తనానిదే ముఖ్యపాత్ర. విత్తన చట్టానికి రూపకల్పన చేసినా, అమలులో అలసత్వం వల్ల పెద్దగా ప్రయోజనం నెరవేరలేదు. ఈ రంగంలో మొదటి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని గతంలో గుంటూరు జిల్లా తెనాలిలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అప్పుడు మొత్తం మత్స్యశాఖ జీతభత్యాలు ఈ కేంద్రం ఆదాయం నుంచే సమకూరేవని చెబుతారు. ఈ రంగంలోకి ప్రైవేటు వ్యక్తుల ప్రవేశం జరగడంతో గత రెండు దశాబ్దాల్లో పశ్చిమ్‌ బంగను సైతం అధిగమించి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. చేపపిల్ల ధరలో పెరుగుదల మాత్రం పెద్దగా లేదు. తుంగభద్ర జలాశయంలో కర్ణాటక భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. అక్కడ లక్ష చేపగుడ్లను వెయ్యి రూపాయలకు అమ్ముతుండగా, ఏపీ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాదంపూడి కేంద్రంలో రూ.200కు అమ్ముతున్నారు. కర్ణాటక మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఏటా 30-40 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఏ వ్యాపారంలో అయినా లాభాలు వస్తేనే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారు.

ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాల్లోనే చేపపిల్ల అధిక మొత్తంలో ఉత్పత్తవుతోంది. ఒకటి- గంగా పరీవాహక ప్రాంతమైన పశ్చిమ్‌ బంగ. రెండోది- కృష్ణా, గోదావరి పరీవాహక పరిధిలోని కొల్లేరు ప్రాంతం. ఈ రెండుచోట్లా ఉత్పత్తయిన మొత్తం చేపపిల్లల్లో 40 నుంచి 80 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇంత భారీయెత్తున వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నా, కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా దేశవాళీ రకాలైన బొచ్చె, రాగండి, మోసు సంతానోత్పత్తి ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జరుగుతుంది. మొదటిసారి ఏప్రిల్‌-మే నెలల్లో, మళ్ళీ జులై-సెప్టెంబరు మాసాల్లో. సంతానోత్పత్తికి వినియోగించే చేపల (బ్రూడ్‌ స్టాక్‌)ను కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య పెంచాలి. అప్పుడే నాణ్యమైన గుడ్ల ఉత్పత్తి వల్ల ఫలదీకరణ శాతం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన పిల్ల వస్తుంది. నాణ్యమైన మాంసకృత్తులు అధిక మోతాదులో ఉన్న ఆహారాన్ని మేతగా అందించాలి. ఎప్పటికప్పుడు తాజా నీరు, కనీసం ఒక అడుగు మేర మారుస్తుండాలి. అప్పుడే తల్లి చేపలు ఆరోగ్యంగా ఉండి, నాణ్యమైన చేప విత్తనం అందుబాటులోకి వస్తుంది. ఒకవైపు, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ 2007నాటి తన మార్గదర్శకాల్లో 100 మిల్లీమీటర్ల పరిమాణం ధర రూపాయిగా నిర్ణయించి, 2014లో రూ.2.50గా సవరించింది. అదీ పూర్తిగా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), కేంద్ర మంచినీటి మత్స్య పరిశ్రమ సంస్థ (సీఐఎఫ్‌ఏ) సలహాలు, సూచనల మేరకే. ప్రస్తుతం లీజులు, మేత ఖర్చులు, రోజువారీ కూలీల భత్యం ఇతర ఖర్చులు అనేక రెట్లు పెరిగినా, ఆంధ్రప్రదేశ్‌ మత్స్యశాఖ మాత్రం 1999లో నిర్ణయించిన ధరల ప్రకారమే ప్రభుత్వ చేప పిల్లల కేంద్రాల్లో విక్రయాలు చేపడుతోంది.

మత్స్య సాగు రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. మొదటగా గోదావరిలో జలాల అందుబాటునుబట్టి వరి నారుమడికి నీరు వదిలేటప్పుడే చేపపిల్ల ఉత్పత్తి కేంద్రాలకు, నర్సరీ చెరువులకూ సాగునీరు అందిస్తే విత్తనం సకాలంలో చేతికి వస్తుంది. పశ్చిమ్‌ బంగలో ఈ పద్ధతిలోనే సాగుచేసి నాణ్యమైన ఉత్పత్తి సాధిస్తున్నారు. ఉత్పత్తిలో మనది అగ్రస్థానమైనా నాణ్యత, గిరాకీలో పశ్చిమ్‌ బంగ విత్తనానికే ప్రాధాన్యత దక్కుతోంది. మత్స్య సంపద నిల్వ ఉండదు కాబట్టి, గిరాకీ లేకపోయినా, అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర లేదా ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. రెండోది, ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండే పంచాయతీ, నీటిపారుదల శాఖ చెరువులను బ్రూడ్‌ స్టాక్‌ సొసైటీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో, కొత్తగా నియమించిన గ్రామ మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో చేపపిల్లల్ని ఉత్పత్తిదారులకు అందుబాటులో ఉంచితే నాణ్యమైన పిల్ల ఉత్పత్తి సాధ్యపడుతుంది. మూడోది... చేప పిల్ల కేంద్రం నుంచి కొనుగోలు చేసిన సరకుకు రసీదు, మత్స్యశాఖ నుంచి ధ్రువపత్రం ఇవ్వాలి. చేపపిల్ల ఏయే ప్రదేశాల్లో అందుబాటులో ఉందో స్థానిక మాధ్యమాలు, వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తే రైతులకు ప్రయోజనకరం.

ప్రస్తుతం మత్స్యరంగాన్ని ఇబ్బంది పెడుతున్న మరో సమస్య నాణ్యమైన సాంకేతిక సేవలు అందకపోవడం. ముఖ్యంగా చేపపిల్ల నాణ్యతా ప్రమాణాలు చూసే పరీక్ష కేంద్రాల కొరత, మేత నాణ్యత, నీటి పరీక్షలు, తగు శాస్త్ర సాంకేతిక సలహాలు ఇచ్చే నిపుణుల కొరత అధికంగా ఉంది. సరైన అర్హతలు ఉండేవారికన్నా, చేపల చెరువుల్లో పని చేసిన అనుభవమున్న సిబ్బందే నిపుణులుగా చలామణీ అవుతున్నారు. శిక్షణ పొందినవారితో మొబైల్‌ ల్యాబొరేటరీ వసతిని అందుబాటులోకి తెస్తే చాలావరకు సమస్య తీరుతుంది. గ్రామ మత్స్య అభివృద్ధి అధికారుల్లో మత్స్య లేదా అనుబంధ చదువులు చదివినవారికి అవసరమైన శిక్షణ ఇచ్చి, సేవలు అందించేలా చూస్తే, పెట్టిన ప్రతి రూపాయికి మూడింతల ఆదాయం వస్తుంది.

మార్కెటింగ్‌ కీలకం
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 90 శాతం బయటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తరవాత మత్స్యశాఖ క్రియాశీలకంగా మారింది. నీలి విప్లవంలో తనదైన ముద్ర వేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చేపల స్థానిక తలసరి వినియోగం మాత్రం తక్కువగా ఉంది. దానికి ముఖ్య కారణం చేపల విపణి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది అపరిశుభ్రత, దుర్గంధం, ఈగలు ముసిరే ఉత్పత్తులు. చేపలోని ముల్లు గుచ్చుకుంటుందనే భయంతో పిల్లలు వీటిని తినేందుకు ఆసక్తి చూపరు. పట్టణాలు, నగరాల్లోని ముఖ్య కూడళ్లలో మత్స్య సంఘాలు, ఔత్సాహిక యువత, వికలాంగులతో పరిశుభ్రమైన వాతావరణంలో దుకాణాలను ఏర్పాటు చేయిస్తే, ఇతర మాంస ఉత్పత్తుల్లాగే చేపల విక్రయాలకూ గిరాకీ పెరుగుతుంది. కొన్ని రకాల చేపల్లో ముల్లును తొలగించి అమ్మేలా చూడాలి. ప్రస్తుతం స్థానిక వినియోగం ఇనుమడించాలంటే, విపణితో అనుసంధానమే ముఖ్య అవరోధం. స్థానిక మార్కెట్లలో వినియోగదారుల అవసరాలకు తగిన ఏర్పాట్లు లేవు. పరిశుభ్ర వాతావరణం, చేపల్ని అవసరమైన రీతిలో, అడిగిన పద్ధతిలో శుభ్రంచేసి, కోసి ఇచ్చే నైపుణ్యం కలిగిన వ్యక్తుల కొరత కారణంగా ఆదరణ అంతంతమాత్రంగా ఉంటోంది. మహానగరాలు, నగరాల్లో ప్రజలు బయటి ఆహారానికి మొగ్గు చూపుతుంటారు. వండిన ఆహారాన్ని ఇంటి వద్దకే తెప్పించుకునే ధోరణీ పెరిగింది. ఇలాంటి పరిస్థితిని అవకాశంగా మలచుకోవాలి. స్థానిక మత్స్యసంఘాలకు, వండిన ఆహారాన్ని ఇంటికే సరఫరా చేసే సంస్థలకు మధ్య ఒప్పందం కుదిర్చి, ‘క్లౌడ్‌ కిచెన్‌’ పద్ధతిలో సంప్రదాయ చేపల వంటకాల్ని సరఫరా చేస్తే, ఇరువర్గాలకూ ప్రయోజనకరం. తరచూ ‘ఫుడ్‌ ఫెస్టివల్స్‌’ ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాల్ని సృష్టించవచ్చు!

తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరం
రైతులు ప్రస్తుతం దేశవాళీ రకాలైన బొచ్చె, రాగండి, మోసు లేదా విదేశీ రకాలైన పంగసిస్‌, తిలపియా రకాలను సాగు చేస్తున్నారు. కొత్తగా కొరమీను, మెత్తల సాగు లాభదాయకంగా ఉంది. చేపలు, రొయ్యల సాగును ప్రోత్సహించేలా ప్రత్యేక నిధి కేటాయించి, రాయితీలు ఇస్తే నాణ్యమైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మంచినీటి వనరుల్లో నీలకంఠ రొయ్య పిల్లను మత్స్యకారులకు అందుబాటులో ఉంచి, చేప పిల్లతోపాటు దాన్నీ ఉచితంగా పంపిణీ చేస్తే వారికి ఆహార భద్రతతో పాటు ఆర్థిక భద్రతా సమకూరుతుంది. పదేళ్లలో ఎన్నడూలేని విధంగా అన్ని మంచినీటి వనరులూ సమృద్ధిగా ఉన్నాయి. ఆ నీటిని పంటలకే కాకుండా, మత్స్య సాగుకూ వినియోగిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆదాయం, సామాన్యుడికి పోషకాహారం, మత్స్యకారులకు ఉపాధి లభిస్తాయి.


- కరణం గంగాధర్‌
(రచయిత- ఆక్వా రంగ నిపుణులు)
Posted on 29-10-2019