Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

గాడిన పడని నగరీకరణ

జన విస్ఫోటం, బస్తీలకు వలసలు ఆగకుండా కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ప్రపంచ దేశాలెన్నో ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్య- ప్రణాళికాబద్ధ నగరీకరణ. 2030 సంవత్సరం నాటికి దేశ జనాభాలో 40శాతం, 2050నాటికి 50శాతం పట్టణాల్లోనే నివసిస్తారన్నది కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ స్వయంగా చెప్పిన లెక్క. పట్టణాలు, నగరాలే భావి భారత భాగ్య ప్రదాయినులన్న విశ్వాసంతో మోదీ ప్రభుత్వం సుమారు నాలుగేళ్ల క్రితం ఏక కాలంలో మూడు ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. అందులో రెండు- ఆకర్షణీయ నగరాలు, అమృత్‌ (అటల్‌ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన యోజన)ల మలి అంచె బహుశా వచ్చే ఏడాది పట్టాలకు ఎక్కనుందని సంబంధిత శాఖామాత్యులు చెబుతున్నారు. వాస్తవానికి, ఆకర్షణీయ నగరాల ఎంపిక 2016 జనవరిలో మొదలై అంచెలవారీగా ఈ ఏడాది వరకు విస్తరించింది. ఎంపికైంది లగాయతు అయిదేళ్ల కాలావధిని నిర్దేశించిన దృష్ట్యా కనీసం ఇంకో నాలుగేళ్లకుగాని ఆకర్షణీయ నగరాల అవతరణ కసరత్తు ఒక కొలిక్కి రాకపోవచ్చు. వచ్చే డిసెంబరుకల్లా వంద స్మార్ట్‌ సిటీల పథకానికి సంబంధించిన పనుల్లో 50శాతం మేర పూర్తి కావచ్చునని అమాత్యులు ఆశాభావం వెలిబుచ్చుతున్నారు! ‘అమృత్‌’ కింద 500 పట్టణాల అభివృద్ధికి రూ.50వేల కోట్లు వ్యయీకరిస్తామన్న హామీ నిలబెట్టుకోవాల్సి ఉన్న కేంద్ర ప్రభుత్వం- లక్ష్యసాధనకు చాలా దూరాన నిలిచిందని అధ్యయనాలు చాటుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ్‌ బంగ, గుజరాత్‌, ఏపీ, కేరళల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నా- బిహార్‌, అసోమ్‌ లాంటిచోట్ల పనుల అమలు చతికిలపడింది. వాటి ప్రస్తావనే లేకుండా మలి అంచె విస్తరణ ప్రతిపాదన- పట్టణ భారతం రూపురేఖలు ఏ మేరకు మారతాయన్న సందేహాలను లేవనెత్తుతోంది!

జీవన పోరాటంలో డస్సిపోతున్న పౌరులకు మేలిమి ఆరోగ్య వసతులు, తగినన్ని ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవడానికి పట్టణీకరణ దోహదపడాలి. అందుకు కట్టుబాటు చాటుతూ ఆ మేరకు సౌకర్యవంతమైన స్థితిగతులు ఏర్పరచడమే లక్ష్యమంటూ- అమృత్‌, అందరికీ గృహయోజన, ఆకర్షణీయ నగరాల పథకాలతో పట్టణ భారతం రూపురేఖలే మార్చేస్తామని కేంద్రం లోగడ ధీమాగా ప్రకటించింది. ‘అమృత్‌’ కింద ఎంపిక చేసిన పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, హరితావరణం నెలకొల్పాలన్నది బృహత్‌ లక్ష్యం. ఏపీలో అధికారం చేతులు మారిన దరిమిలా, అమృత్‌ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు మొండిచెయ్యి చూపింది. పట్టణాల్లో ఈ-పరిపాలన, వరద నీటి కాల్వల నిర్మాణం, మురికివాడల్లో వసతుల పరికల్పన మందకొడిన సాగుతున్న వివిధ రాష్ట్రాల క్షేత్రస్థాయి స్థితిగతులు యోజన స్ఫూర్తి ఎలా నీరుకారుతోందో కళ్లకు కడుతున్నాయి! వంద ఆకర్షణీయ నగరాల్లో స్వచ్ఛ జలాల నిరంతర పంపిణీ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, ఐటీ అనుసంధానం తదితరాలు తథ్యమన్న హామీ- అప్పట్లో ఎన్నో ఆశల్ని మోసులెత్తించింది. డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛభారత్‌ పథకాలతో అనుసంధానం ద్వారా పట్టణ పాలన పనిపోకడలు గుణాత్మకంగా మారిపోగలవని నాడు ప్రధాని మోదీ అభిలషించారు. 2018 మార్చి మాసాంతానికి కేటాయింపుల్లో నికరంగా ఖర్చయిన నిధులు రెండు శాతంలోపేనన్న పార్లమెంటరీ స్థాయీసంఘం నిర్ధారణ, అమలులో నిర్లక్ష్యం ఎంతగా మేటవేసిందో నిగ్గుతేల్చింది. తొలి అంచెలో ఎంపికైన 20 ఆకర్షణీయ నగరాలూ నిరుడు డిసెంబరు నాటికి 50 శాతం నిధులే వెచ్చించగలిగాయి. ఏ నగరాన్నీ పూర్తిగా కాకుండా స్వల్ప వైశాల్యాన్నే స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసి పనులు చేపట్టడం, ఖర్చుకు తగిన ఫలితాలు కానరాకపోవడం పట్ల విమర్శలు తోసిపుచ్చలేనివి. నగర వాసానికి తమదైన విస్తృతార్థం చెబుతున్న విదేశాల అనుభవాలను, దేశీయంగా ఇన్నేళ్ల లోటుపాట్లను కూలంకషంగా సమీక్షించి కేంద్రం ముందడుగు వేయాల్సిన తరుణమిది.

ప్రజావసరాలకు దీటుగా మౌలిక వసతులు, గృహసదుపాయం, ప్రజారవాణా, విద్య, వైద్యం, ఆధునిక సమాచార సాంకేతిక సేవలు... సమున్నత జీవన ప్రమాణాలకు చెదరని చిరునామాలుగా భాసిస్తాయి. అనేక ఐరోపా నగరాల ప్రణాళికాబద్ధ విస్తరణలో పొంగులు వారుతున్న వాస్తవిక స్పృహే అది. సౌభాగ్య నగరాలుగా విశ్వఖ్యాతి పొందడంలో జ్యూరిచ్‌, ఆక్లాండ్‌, మ్యూనిక్‌, కోపెన్‌హేగన్‌ వంటివి ఏళ్ల తరబడి పోటీపడుతున్నాయి. పటిష్ఠ రవాణా వ్యవస్థ ఆర్థికాభివృద్ధిలో ఎంతటి కీలక భూమిక పోషించగలదో సింగపూర్‌ లాంటివి సోదాహరణంగా తెలియజెబుతున్నాయి. అత్యంత పరిశుభ్ర వాతావరణానికి ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌ ప్రభృత దేశాలు మారుపేరై నిలుస్తున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడ దేశవ్యాప్తంగా మూడొంతులకు పైగా పట్టణాలు, నగరాల్లో వాయు కాలుష్య ఉద్ధృతి పౌరుల ఆయుర్దాయాన్ని మూడేళ్ల వరకు తెగ్గోస్తూ హడలెత్తిస్తోంది. దీపావళి బాణసంచా కాలుష్యంతో యావత్‌ ఉత్తరభారతావనీ ఉక్కిరిబిక్కిరి కావడం, వాన కురిస్తే వరద ముంపు, అడుగడుగునా గుంతలతో జనవాహిని విలవిల్లాడటం- ఇక్కడి నగరాలు నరకప్రాయమనడానికి ప్రబల దృష్టాంతాలు. అరకొర చికిత్స, అక్కడక్కడ మెరుగులద్దడం వల్ల పట్టణ భారతం తేటపడదు. 180 దేశాల పర్యావరణ సూచీలో చివరి వరసకు పరిమితమైన ఇండియా- పరిశుభ్రమైన గాలి, నేల, నీరు, సమర్థ రవాణాకు భరోసా ఇచ్చే ప్రణాళికలు దేశార్థికాన్నే తేజరిల్లజేయగలవన్న స్పృహతో నగరాల స్థాయిని ఇనుమడింపజేయాలి. గ్రామాలు స్వయంపోషకాలై వర్ధిల్లేలా జీవనాధార పరిశ్రమలు, సేద్య రంగ పరిపుష్టీకరణలతో పాటు; ప్రతి నగరవాసీ ఆరోగ్యంగా స్వల్పవ్యవధిలో పని ప్రదేశానికి చేరే ఏర్పాట్లు సాకారమయ్యేలా ప్రభుత్వాలు కాచుకోవాలి. అలా నగరీకరణ కొత్తపుంతలు తొక్కితేనే భారత ప్రగతి ఆకర్షణీయమయ్యేది!


Posted on 30-10-2019