Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సమాచార స్వేచ్ఛపై ఎత్తిన కత్తి!

ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ప్రజలందరికీ మంచి చేస్తామంటూ అధికార పగ్గాలు చేపట్టేది ఏ పార్టీ అయినా- పాలన క్రతువులో తప్పొప్పుల్ని ఎత్తిచూపుతూ సద్విమర్శలతో పౌరుల అవగాహన స్థాయిని పెంచుతూ స్వీయ కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించే ప్రసార మాధ్యమాలే ప్రజాస్వామ్యానికి జీవనాడి! అప్రియ సత్యాలను సహించలేని నైజం పాలకుల్లో పాదుకొన్న ప్రతిచోటా సామ దాన భేద దండోపాయాలతో మీడియా మెడలు వంచాలనుకొనే ధోరణి ఎన్నో ఏళ్లుగా ఊడలు దిగి విస్తరిస్తూనే ఉంది. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పత్రికలు, టీవీ ఛానెళ్లు నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా- సంబంధిత ప్రచురణకర్తలు, సంపాదకులపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా సర్కారీ శాఖల కార్యదర్శులకే కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా జీఓ జారీచేసింది. ‘నిరాధార కథనాలు వెలుగుచూస్తే, ఆయా కార్యదర్శులు ఖండనలివ్వాలి... పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా ఫిర్యాదులు చేసి కేసులు పెట్టాలి’- అన్నది వివాదాస్పద జీఓ సారాంశం. పుష్కర కాలం క్రితం ముఖ్యమంత్రిగా వైఎస్‌ అధ్యక్షతన జరిగిన ‘మీడియా వాచ్‌’ సమావేశంలో తీసుకొన్న నిర్ణయం అనుసారం తెచ్చిన 938 నెంబరు ఉత్తర్వే తాజా ఆదేశానికి మూలాధారం. ప్రభుత్వానికి, పత్రికలకు, ప్రజలకు వారధి కావాల్సిన సమాచార విభాగానికి ప్రాసిక్యూషన్‌ కోరలు తొడిగి, నచ్చని వార్తలు ప్రచురించే పత్రికలపై కేసులు పెట్టే అధికారాన్ని కట్టబెట్టిన నాటి ఉత్తర్వును ఉపసంహరిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. నాటి ప్రభుత్వం అటకెక్కించిన 938 ఉత్తర్వును వెలికితీసి, సమాచార విభాగానికి కట్టబెట్టిన బాధ్యతను ఆయా శాఖల కార్యదర్శులకు వికేంద్రీకరించి- పరువు నష్టం కేసుల ద్వారా ప్రసార మాధ్యమాల స్వేచ్ఛకు శృంఖలాలు బిగించేందుకు ఏపీ సర్కారు సమాయత్తమైంది. ఏవేవి తప్పుడు, నిరాధార వార్తలన్నది నిర్ణయించేది వారే. నచ్చని మీడియాపై కేసుల కత్తి ఝళిపించేదీ వారే! ఏపీ సర్కారు తెచ్చిన జీఓ- జనస్వామ్య కలాలకు, వ్యధార్త జీవుల పక్షాన ఎలుగెత్తే గళాలకు ఉరి బిగించనుంది!

భావ ప్రకటన స్వేచ్ఛకు విధించగల సహేతుక ఆంక్షలు ఏమిటో రాజ్యాంగంలోని 19(2) అధికరణలో కొలువుతీరాయి. దేశసమగ్రత, సార్వభౌమత్వం, దేశభద్రత, విదేశాలతో మైత్రీబంధాలు, శాంతిభద్రతలు, కోర్టు ధిక్కారం, నైతిక వర్తన, పరువు నష్టం, నేరానికి పురిగొల్పడం వంటివాటిలో వ్యక్తి స్వేచ్ఛను ప్రభుత్వం హేతుబద్ధంగా నియంత్రించగల వీలుంది. బాధ్యతాయుత ప్రసార మాధ్యమాలకూ అవి లక్ష్మణ రేఖలే. మీడియా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పూర్తిగా అనుమతించాలని, వార్తను కొంత తప్పుగా ఇచ్చినంత మాత్రాన ప్రసార మాధ్యమాలపై పరువు నష్టం అస్త్రం ప్రయోగించాల్సిన పని లేదని నిరుడు జనవరిలో సుప్రీంకోర్టు హితవు పలికింది. విపక్షాలుగా ఉన్నప్పుడు పత్రికల వార్తాకథనాల్నే పదునైన విమర్శనాస్త్రాలుగా మలచి పాలకపార్టీ మీద పైచేయి సాధించే నేతలు, తాము అధికారానికి వచ్చాక క్షేత్రస్థాయి వాస్తవాల్ని మీడియా వెల్లడిస్తే వాటిని జీర్ణించుకోలేకపోవడమే- ప్రసార మాధ్యమాలపై పాలకుల కన్నెర్రకు ప్రధాన కారణమవుతోంది. ‘పత్రికలు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానం చెయ్యగలిగినప్పుడే (ఒక్కోసారి అవి పరిస్థితుల్ని తప్పుగా చిత్రించినప్పటికీ) పత్రికా స్వాతంత్య్రానికి నిజంగా గౌరవం దక్కినట్లు’- అని తీర్మానించారు మహాత్మా గాంధీ. జాతిపిత 150వ జయంత్యుత్సవాల్ని ఘనంగా జరుపుకొన్న దేశంలో- ఇందిర కాలం నుంచే పాత్రికేయానికి సంకెళ్లు వేసే పెడపోకడలు పొటమరిస్తూ వచ్చాయి. తమ ఆస్తిహక్కుకు భంగం కలుగుతుందనో, పరువు పోతుందనో చెప్పి పత్రికల్లో వాస్తవాలు వెల్లడి కాకుండా నిలువరించే హక్కు ఎవరికీ లేదని ఎనభయ్యో దశకంలోనే బాంబే హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌కే పరేఖ్‌ ఇచ్చిన తీర్పు చిరస్మరణీయమైనది. ఒకనాడు బిహార్‌ ముఖ్యమంత్రిగా జగన్నాథ్‌ మిశ్రా నుంచి రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లో వసుంధర రాజె దాకా ఎందరో రాజ్యాంగబద్ధ భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాసే కుయత్నాలకు తెగించినవారే. ఆ తరహా దురహంకారాలకు నిలువనీడ లేదన్నది చరిత్ర నేర్పుతున్న గుణపాఠమే!

మనకు నచ్చనిదాన్ని అనుమతించడంలోనే పౌరస్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం ఇమిడి ఉన్నాయన్నది తొలి ప్రధాని పండిత నెహ్రూ మాట! ‘న్యాయస్థానాలన్నీ భావ ప్రకటన స్వేచ్ఛకు గొడుగు పట్టాలి. దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని, చర్యల్ని తోసిపుచ్చడం వాటి విధి’ అని సుప్రీంకోర్టు మూడున్నర దశాబ్దాల క్రితమే స్పష్టీకరించింది. మీడియాను చెరపట్టదలచిన రాజీవ్‌ జమానా నాటి పరువు నష్టం బిల్లు, మన్మోహన్‌ సర్కారు తీసుకురాదలచిన ‘కంటెంట్‌ కోడ్‌’లతో పాటు నిరుడు కేంద్రం ప్రతిపాదించిన పాత్రికేయుల గుర్తింపు మార్గదర్శకాలకూ పురిట్లోనే సంధి కొట్టింది. దుర్నిరీక్ష్య మెజారిటీతో దేశ రాజధాని దిల్లీ గద్దెనెక్కిన కేజ్రీవాల్‌ 2015 మే నెలలో- ‘ఆప్‌’ను ఖతం చేసే కుట్ర పత్రికా, ప్రసార మాధ్యమాల్లో పెద్దయెత్తున సాగుతోందంటూ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. మీడియాలో వచ్చే వార్తలు, ప్రసారమయ్యే కథనాలు ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఎవరికైనా పరువు నష్టం కలిగిస్తే, న్యాయ సలహా మేరకు కేసులు వేసేలా జీఓ వెలువరించారు. సమాచార స్వేచ్ఛపైనే కత్తిదూసిన ఆ ఆదేశాల అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు- కేజ్రీవాల్‌ ద్వంద్వ వైఖరిని తప్పుపట్టింది. నాలుగు పరువు నష్టం కేసుల్ని ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌- పరువు నష్టాన్ని క్రిమినల్‌ నేరంగా గుర్తిస్తున్న చట్టాల రాజ్యాంగబద్ధతనే సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆయనే కేసులంటూ మీడియాపై ఒంటికాలి మీద పోవడం ఏమిటన్న ‘సుప్రీం’ ప్రశ్నకు జవాబు లేదు! సమాచార స్వేచ్ఛ- ప్రసార మాధ్యమాలతోపాటు పౌరులందరి హక్కు. దాన్ని తొక్కిపట్టే యత్నాలను జాగృత జనవాహిని ఉపేక్షించకూడదు!


Posted on 01-11-2019