Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

సరికొత్తగా స్వచ్ఛభారత్‌!

* సుంకం విధింపుతో పెరిగిన బాధ్యత


ఆరోగ్యవంతమైన జనజీవనానికి పరిసరాల పరిశుభ్రత దగ్గరి దారి! చుట్టూ ఉన్న గాలి, నీరు, భూ వాతావరణాన్ని ఎన్నడూ లేని స్థాయిలో నిర్లక్ష్యం చేయడంవల్లే దేశంలో నేడు పరిస్థితి పూర్తిగా దిగజారింది. దేశ ప్రజల మెరుగైన జీవనాన్ని లక్షించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరుడు అక్టోబరు రెండున గాంధీ జయంతినాడు ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్‌' ఒడుదొడుకుల మధ్య ప్రస్థానం సాగిస్తోంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు ఘనవ్యర్థాల నిర్వహణకు నేటికీ తగిన కార్యాచరణ రూపొందించుకోలేదని, అవి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా రోజుకు 1.44లక్షల మెట్రిక్‌ టన్నుల ఘనవ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. కేవలం 39వేల మెట్రిక్‌ టన్నుల మేరకే శుద్ధి జరుగుతోంది. 6200కోట్ల లీటర్ల మురుగునీరు బయటకు వస్తుండగా, 2,327.70కోట్ల లీటర్ల శుద్ధి సామర్థ్యమే ఉన్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించడం మన వెనకబాటును బయటపెడుతోంది. ఇప్పటివరకు వసూలు చేస్తున్న సేవాపన్నుకు అదనంగా స్వచ్ఛ భారత్‌ సుంకాన్నీ జతచేర్చడంతో ఆ మేరకు ఏదో ఒకస్థాయిలో వివిధ సేవలకు సంబంధించి సామాన్యుడిపై భారం పడనుంది. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై మరింత పెరిగింది. స్వచ్ఛభారత్‌ సుంకం విధింపు నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణపై ప్రజల్లో అంచనాలు పెరుగుతాయి. దాన్ని పక్కాగా పట్టాలకు ఎక్కించడానికి తగిన మౌలిక వసతులు ఏ రాష్ట్రం వద్దా లేవు. ఈ పరిస్థితుల్లో సుంకం విధించి చేతులు దులుపుకోకుండా- అత్యంత జాగ్రత్తగా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

అనర్థాలెన్నో...

వ్యర్థాల పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నగరాల్లోని చెత్తను తీసుకెళ్లి గ్రామాల పక్కన, మురికివాడల సమీపంలో పడేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతాల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. చర్మ, నేత్ర సమస్యలు; శ్వాసకోశ వ్యాధులు, అతిసారా, టైఫాయిడ్‌, కలరా, మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా వంటివి విస్తరిస్తున్నాయి. 2000లో కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటుచేసుకున్న ఉదంతం గుణపాఠంగా తీసుకోవాల్సి ఉంది. అప్పట్లో వ్యర్థాలను నగరానికి 22కి.మీ. దూరంలోని విలప్పిల్‌సాలా గ్రామానికి తరలించేవారు. అప్పటివరకు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ హాయిగా బతుకుతున్న గ్రామస్తులు క్రమేణా అస్వస్థత బారిన పడ్డారు. మొదటి నెలలోనే శ్వాసకోశ వ్యాధులు వారిని చుట్టుముట్టాయి. గ్రామం నుంచి ఆసుపత్రులకు వెళ్లే రోగుల సంఖ్య 10రెట్లు పెరిగింది. కలుషిత నీటి కారణంగా ఈతకు వెళ్లేవారుచర్మవ్యాధుల బారినపడ్డారు. ఈగలు, దోమలవల్ల గ్రామస్తుల ఇళ్లకు బంధువులు రావడమే మానేశారు. దాంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు నిరాహారదీక్షకు ఉపక్రమించడంతో అధికారులు వ్యర్థాలను శుద్ధిచేసే కర్మాగారం ఏర్పాటుచేశారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి- వ్యర్థాలను వదిలించుకోగల నేర్పరితనమే ఇప్పుడు కావాల్సింది. వ్యర్థాల్లో జీవవ్యర్థాలు ప్రమాదకరమైనవి. ఆసుపత్రులు ఉన్న ప్రాంతాల్లో ఇవి పెద్దయెత్తున జమపడుతున్నాయి. శరీర భాగాలు, సిరంజీలు, సెలైన్‌ సీసాలు, దూది, కాలంచెల్లిన మందులు వంటివి ప్రమాదకర జీవవ్యర్థాలు. నిబంధనల ప్రకారం వాటిని నల్లని కవరులో చుట్టి సంబంధిత వాహనాల్లో వేయాలి. కానీ, వీటిని పురపాలక సంఘాల చెత్తకుండీల్లో పడేస్తున్నారు. సెలైన్‌ సీసాలను, వాడిన ఇంజెక్షన్లను చెత్త సేకరించేవారు, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నట్లూ ఆరోపణలు ఉన్నాయి.

ప్రపంచ జనాభాలో 18శాతం వాటా కలిగిన భారత్‌లో వ్యర్థాల నిర్వహణపట్ల కొంతైనా శ్రద్ధ లేకపోవడం దారుణం. దీనివల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గాలి, నీరు కలుషితమవుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు ప్రబలుతున్నాయి. పదేళ్ల వ్యవధిలో దేశ పట్టణ జనాభా 37.7కోట్ల మేర పెరిగింది. అమెరికా జనసంఖ్యకు ఇది సమానం. పట్టణ జనాభా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణలో దీటైన చర్యలు చేపట్టకపోతే అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశంలో 2001లో తలసరి వ్యర్థాల ఉత్పత్తి 440గ్రాములు. 2011నాటికి అది 500గ్రాములకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల్లో 70నుంచి 90శాతం మేర సేకరిస్తున్నారు. చిన్న పట్టణాల్లో అది 50శాతమే. బహిరంగ మైదానాల్లోనే 91శాతం వ్యర్థాలు పూడ్చిపెడుతున్నారు. మరో రెండు శాతాన్ని సేకరించకుండా తగలబెడుతున్నారు. సేకరించిన చెత్తలో 10శాతాన్ని బహిరంగంగానే దహనం చేస్తున్నారు. ఇలాంటి చర్యలవల్ల ముంబయి నగరంలో ఏటా 22వేల టన్నుల ప్రమాదకర కాలుష్య కారకాలు వాతావరణంలోకి ప్రవేశిస్తున్నట్లు అంచనా. వ్యర్థాల అజమాయిషీలో ప్రపంచ దేశాలు భారత్‌కంటే ఎంతో ముందున్నాయి. ఆయా దేశాల విజయాలను భారత్‌ ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది.

స్విట్జర్లాండ్‌: వ్యర్థాలవల్ల, పరిశ్రమలవల్ల 1985నాటికి ఆ దేశంలో 40వేలకుపైగా ప్రాంతాలు కాలుష్యం బారినపడ్డాయి. ఆ రకంగా వాటిల్లిన మొత్తం నష్టం అయిదు బిలియన్ల స్విస్‌ ఫ్రాంకులుగా అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం, ప్రజలు ఒక్కతాటి మీదకు వచ్చారు. వ్యర్థాల్లో పునరుత్పత్తికి పనికివచ్చే వాటిని వేరుచేసి, మిగిలినవాటిని వెన్వెంటనే పూడ్చివేయడం ప్రారంభించారు. 2000నాటికి ఆ పద్ధతికీ స్వస్తి పలికారు. సాంకేతికతను తెరపైకి తెచ్చారు. కాగితం, అట్టపెట్టల్లో 91శాతం; గాజు వస్తువుల్లో 94శాతం; సీసాల్లో 81శాతం, 'టిన్‌' సంబంధిత వ్యర్థాల్లో 84శాతం, అల్యూమినియం క్యాన్లలో 91శాతం, బ్యాటరీల్లో 71శాతాన్ని 2001నాటికి పునరుపయోగించుకోగల స్థితికి చేరుకున్నారు. పునరుత్పత్తి కుదరని వ్యర్థాలు, హాని చేసే సేంద్రియ పదార్థాలను తగ్గించారు. లోహాలను కరగని పదార్థాలుగా మార్చి చాలావరకు కాలుష్యాన్ని అరికట్టారు.

చైనా: వస్తువులను ప్యాకింగ్‌ చేయడం తగ్గించారు. కంటైనర్ల ద్వారా భద్రపరచి విక్రయించడం మొదలెట్టారు. ప్యాకింగ్‌ సంస్థలే ఆయా పదార్థాలను తిరిగి తీసుకునే ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాణ సంబంధ వ్యర్థాలతో 122కి.మీ. పొడవైన ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించారు. కిలోమీటరుకు 46,700టన్నుల చొప్పున మొత్తం 57లక్షల టన్నుల వ్యర్థాలు వాడారు. వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా 4.7కోట్ల డాలర్లు, 34లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, 32వేల టన్నుల బొగ్గు ఆదా చేశారు. వాస్తవానికి అవే వ్యర్థాలను పూడ్చడానికి 200 హెక్టార్ల ప్రదేశం అవసరమని అంచనా!

ఇంగ్లాండ్‌: ఏటా 6.14లక్షల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో వస్త్ర సంబంధమైనవి 3.58లక్షల టన్నులున్నట్లు అంచనా. ఆ వ్యర్థాలను పునర్వినియోగానికి తెచ్చి 14.33కోట్ల పౌండ్ల మేర నిధుల్ని ప్రభుత్వం ఆదా చేసుకోగలిగింది.

సింగపూర్‌: స్థానిక సంస్థలనుంచి వ్యర్థాలు సేకరించి, నిల్వ చేయడం ద్వారా కాలుష్య దుష్ప్రభావాలను నివారిస్తున్నారు. జీవ సంబంధ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి అత్యంత వేడిమి వద్ద బూడిద చేస్తున్నారు. వ్యర్థాలను వినియోగించి నిర్మాణ రంగానికి ఉపయోగపడే వస్తుసామగ్రిని తయారుచేస్తున్నారు. విద్యుత్‌ కేంద్రాల్లో సైతం వ్యర్థాలను విరివిగా వినియోగిస్తున్నారు.

సక్రమ అజమాయిషీ కీలకం

వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నవారికే వాటి నిర్వహణను అప్పగిస్తే ఫలితం ఉంటుంది. వస్తువుల అనవసర వాడకం తగ్గించాలి. పునర్వినియోగానికి పనికివచ్చే వాటిని వేరు చేసుకుని, మిగిలినవాటిలో పునరుత్పత్తి చేయగలిగినవి గుర్తించి వినియోగిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయమూ సమకూరుతుంది. ఎంతోమందికి ఉపాధీ లభిస్తుంది. దేశంలో వ్యర్థాల్లోని వివిధ రకాలను వేరు చేయకపోవడంవల్ల శుద్ధి కర్మాగారాలు మూతబడుతున్నాయి. దేశంలోని పురపాలక సంఘాలు సేకరిస్తున్న వ్యర్థాల్లో తేమ ఎక్కువ, శక్తి తక్కువ. అన్ని వ్యర్థాలూ శుద్ధికి పనికిరావు. ఒక టన్ను ఆహార వ్యర్థాలనుంచి 67లీటర్ల పెట్రోలు లేదా 50లీటర్ల డీజిల్‌కు సమాన శక్తి కలిగిన బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఇందుకు ఆహార పదార్థాల్లో రొట్టె, బిస్కట్లు, కేకులు, పండ్లు, కూరగాయాలు, టీ, కాఫీ సంబంధమైనవి, బియ్యం పిండి, గుడ్డు, గుడ్డు పెంకు, చిన్న ఎముకలు, చేప, కోడి, పేలాలు, తీపి పదార్థాలు, చాకొలెట్‌, పూలు, ఆకులకు సంబంధించిన వ్యర్థాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ, దేశంలోని పురపాలక వ్యర్థాల్లో ఇలాంటివి అతి తక్కువ. కేంద్ర కాలుష్య బోర్డు (2012-13) సమర్పించిన నివేదిక ప్రకారం దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల నుంచి 440మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. మరోవంక మూడు లక్షల హెక్టార్ల భూమికి సాగునీటిని అందించవచ్చు. రసాయన ఎరువుల వాడకాన్నీ 30శాతం మేర తగ్గించవచ్చు.
ఐక్యరాజ్య సమితి 'ప్రొక్యూర్‌మెంట్‌' విభాగం 2012నాటి అంచనాల ప్రకారం 2050నాటికి అభివృద్ధి చెందిన దేశాల్లో 86శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 64శాతం ప్రజలు పట్టణాల్లో నివసించనున్నారు. ప్రపంచ బ్యాంకు (2012) అంచనా ప్రకారం భవిష్యత్తులో నగరాల బడ్జెట్లో వ్యర్థాల నిర్వహణకయ్యే ఖర్చు ప్రథమస్థానంలో ఉండనుంది. జనాభా విషయంలో అగ్రస్థానాల్లో ఉన్న భారత్‌ ఈ కీలకాంశాలను దృష్టిలో ఉంచుకొని మెలగాలి. వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తున్న దేశాల విజయగాథలనుంచి స్థానిక పరిస్థితులకు అనువైన పద్ధతులు ఎంపిక చేసుకోవాలి. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌(ఏఎస్‌ఎంఈ) సంస్థ ఆధ్వర్యంలో ఘనవ్యర్థాలను మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసే పద్ధతి కనిపెట్టారు. ఈ పద్ధతిని వారు 'వ్యర్థం నుంచి శక్తి ఉత్పత్తి' (వేస్ట్‌ టు ఎనర్జీ) అని పిలుస్తున్నారు. దాని ద్వారా హరిత వాయువుల ఉద్గారాన్ని, శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చునన్నది అధ్యయన సారాంశం. ఈ పద్ధతి ద్వారా 2.90కోట్ల టన్నుల వ్యర్థాలను వినియోగించి అమెరికా ఏటా 2.3గిగావాట్ల విద్యుత్తు రాబడుతోంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మనదేశం సైతం నూతన సాంకేతిక విజ్ఞానం సాయంతో పురోగమించాల్సి ఉంది.

- ఆచార్య పొదిల శంక‌ర‌పిచ్చయ్య (భూవిజ్ఞాన శాస్త్ర నిపుణులు)
Posted on 22-11-2015