Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఇతరాలు

దోమను గెలవలేమా?

* గట్టి చర్యలతోనే వ్యాధుల కట్టడి

ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వాల బాధ్యత అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్నాయని పలుమార్లు తేటతెల్లమైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డెంగీ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దోమలద్వారా సంక్రమించే వ్యాధులను నివారించే, నియంత్రించే చర్యలు ఆశించినంతగా లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం- డెంగీ వ్యాధి తీవ్రతకు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకారం దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం అక్టోబరు నాటికి దాదాపు 67 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ దాదాపు ఎనిమిది వేల కేసులతో దేశంలో రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 12 వేల కేసులతో కర్ణాటక మొదటిస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దాదాపు మూడువేల కేసులు నమోదయ్యాయి. వాహకాల ద్వారా జనించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమం జాతీయ స్థాయిలో (నేషనల్‌ వెక్టార్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం) ఉన్నప్పటికీ దాని ఫలితాలు మాత్రం ఆశించినంతగా కనిపించడం లేదనేది సుస్పష్టం. అధికారుల నిర్లక్ష్యధోరణి, పారిశుద్ధ్య నిర్వహణలో వైఫల్యం, ప్రజల్లో అవగాహన కొరవడటం ఈ వ్యాధుల విస్తృతికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌తోపాటు, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఫిలిప్పైన్స్‌, పాకిస్థాన్‌ తదితర దేశాల్లో డెంగీ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రపంచదేశాల మధ్య తగ్గిన ప్రయాణ సమయం, పెరిగిన వాణిజ్య సంబంధాలతో పాటు వ్యాధులను వ్యాప్తిచేసే వైరస్‌లూ అత్యంత వేగంగా దేశాల సరిహద్దులు దాటుతున్నాయి. ఈ తరహాలోనే డెంగీ, జికా, చికున్‌గన్యా, ఎల్లో ఫీవర్‌ వంటి వాహక జనిత వ్యాధులు ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్నాయి. వాతావరణ మార్పులతో అనుకూల ఉష్ణోగ్రతల కారణంగా ఈ వ్యాధులు ఏటా పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. 1970కి ముందు కేవలం తొమ్మిది దేశాల్లో ఉన్న డెంగీ తీవ్రత ఇప్పుడు వందకు పైగా దేశాలకు వ్యాపించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. మనదేశంలో 1960 దశకంలోనే డెంగీ బయటపడినా, రెండు దశాబ్దాలుగా మరింత విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా సంక్రమిస్తున్న వ్యాధుల్లో డెంగీ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మొదటి పది వ్యాధుల్లో డెంగీ కూడా చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చరించింది.

అత్యంత వేగంగా వ్యాప్తిచెందే ఇన్‌ఫ్లుయంజా, ఎబోలా, జికా, సార్స్‌లను నియంత్రించడం చాలా కష్టమైన పని. ‘మహమ్మారి’గా వ్యవహరించే స్పానిష్‌ ఫ్లూ బారినపడి 1918లో ప్రపంచవ్యాప్తంగా అయిదు కోట్ల మంది మరణించడం తెలిసిందే. అలాంటి ఘటన ప్రస్తుతం పునరావృతమైతే నష్టం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. యావత్‌ ప్రపంచానికి వైరస్‌ల ముప్పు ఉందని 15 మంది అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సన్నద్ధత నిర్వాహక మండలి (గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ మానిటరింగ్‌ బోర్డ్‌- జీపీఎమ్‌బీ) ‘ది వరల్డ్‌ ఎట్‌ రిస్క్‌’ పేరుతో ఈ మధ్యే విడుదల చేసిన నివేదికా స్పష్టీకరిస్తోంది. కొత్తగా వెలుగులోకొస్తున్న వ్యాధికారక వైరస్‌లు కొన్నైతే, మరికొన్ని గతంలోనివే తిరిగి బయటపడుతున్నాయి. ఈ అంటువ్యాధుల ప్రభావంతో మరణాలు సంభవించడంతోపాటు, ఆయా దేశాల పర్యాటక, వాణిజ్య, ఆర్థిక వ్యవస్థలూ కుంటుపరుస్తోంది. ముఖ్యంగా పేద దేశాల ఆరోగ్యవ్యవస్థలు కుప్పకూలే అవకాశం ఉంది.

డెంగీ జ్వరాలకు కచ్చితమైన చికిత్స లేకపోవడం ఒక సమస్య. ఆ వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్లు లేకపోవడం మరో లోపం. వ్యాక్సిన్ల కోసం విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ఆశించిన స్థాయిలో లేని కారణంగా వీటి బారినపడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందని నిపుణుల అభిప్రాయం. వైరస్‌ల పరిస్థితి ఇలాగే కొనసాగితే 2080 నాటికి 100 కోట్ల మంది జికా, డెంగీ, చికున్‌గన్యా, ఎల్లో ఫీవర్‌ల బారినపడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన మోర్గాన్‌ స్టాన్లీ అనే బహుళజాతి సంస్థ అంచనా వేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వ్యాక్సిన్ల పరిశోధనల్లో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. వ్యాక్సిన్‌ తయారీకి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. భారత్‌, నార్వే దేశాలు, బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌, ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌తోపాటు పలు భాగస్వామ్య పక్షాలతో ‘అంటువ్యాధి సన్నద్ధత ఆవిష్కరణల సంకీర్ణ కూటమి’ (కొలీషన్‌ ఫర్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ - సీఈపీఐ) 2017లో ఏర్పడింది. అంటువ్యాధులపై పోరులో భాగంగా టీకాల అభివృద్ధి కోసం ఈ కూటమి కృషి చేస్తోంది.

డెంగీపై దండయాత్ర చేసిన శ్రీలంక ఈమధ్య కాస్త అరికట్టగలిగింది. పోలియో, మశూచి వంటి మహమ్మారులనే తరిమికొట్టగలిగిన మన దేశంలో డెంగీని ఎదుర్కోవడం అసాధ్యమేమీ కాదు. ప్రభుత్వాల చిత్తశుద్ధి, ప్రజా చైతన్యం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వీటిని నిరోధించవచ్చనేది నిపుణుల అభిప్రాయం. వ్యాధికారకాలను నియంత్రించగలిగే ప్రధాన మార్గం పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల ఉత్పత్తి స్థావరాలను గుర్తించి వాటిని నాశనం చేయడం ద్వారా వీటి తీవ్రతను సగానికి తగ్గించవచ్చు. వ్యాధికారక దోమలపై యుద్ధం ప్రకటించి జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పకడ్బందీ చర్యలతో సాధ్యమైనంత వరకు నియంత్రిస్తూ కట్టడి చేయడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం!


- అనిల్‌ కుమార్‌ లోడి
Posted on 01-11-2019